Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: వాయిద్యాలతో. ఆసాపు స్తుతి కీర్తన.
76 యూదాలో ప్రజలు దేవుని ఎరుగుదురు.
దేవుని నామం నిజంగా గొప్పదని ఇశ్రాయేలుకు తెలుసు.
2 దేవుని ఆలయం షాలేములో[a] ఉంది.
దేవుని గృహం సీయోను కొండ మీద ఉంది.
3 అక్కడ విల్లులను, బాణాలను కేడెములను,
కత్తులను ఇతర యుద్ధ ఆయుధాలను దేవుడు విరుగగొట్టాడు.
4 దేవా, నీవు నీ శత్రువులను ఓడించిన ఆ కొండల నుండి
తిరిగి వస్తూండగా నీవు ఎంతో మహిమతో ఉన్నావు.
5 ఆ సైనికులు చాలా బలం కలవారని తలంచారు. కాని యిప్పుడు వారు చచ్చి పొలాల్లో పడి ఉన్నారు.
వారికి ఉన్నదంతా వారి శరీరాల నుండి దోచుకోబడింది.
బలవంతులైన ఆ సైనికులలో ఒక్కరు కూడా వారిని కాపాడుకోలేకపోయారు.
6 యాకోబు దేవుడు ఆ సైనికులను గద్దించాడు.
రథాలు, గుర్రాలుగల ఆ సైన్యం చచ్చిపడింది.
7 దేవా, నీవు భీకరుడవు.
నీవు కోపంగా ఉన్నప్పుడు ఏ మనిషీ నీకు విరోధంగా నిలువలేడు.
8-9 యెహోవా న్యాయమూర్తిగా నిలిచి తన నిర్ణయాన్ని ప్రకటించాడు.
దేశంలోని దీన ప్రజలను దేవుడు రక్షించాడు.
పరలోకం నుండి ఆయన తీర్మానం ఇచ్చాడు.
భూమి అంతా భయంతో నిశ్శబ్దం ఆయ్యింది.
10 దేవా, నీవు దుర్మార్గులను శిక్షించినప్పుడు ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
నీవు నీ కోపం చూపిస్తావు. బ్రతికి ఉన్నవారు మరింత బలంగలవారు అవుతారు.
11 ప్రజలారా! మీ దేవుడైన యెహోవాకు మీరు వాగ్దానాలు చేశారు.
ఇప్పుడు మీరు వాగ్దానం చేసినదాన్ని ఆయనకు ఇవ్వండి.
అన్ని చోట్లనుండీ ప్రజలు
తాము భయపడే దేవునికి కానుకలు తెస్తారు.
12 దేవుడు మహా నాయకులను ఓడిస్తాడు.
భూలోక రాజులందరూ ఆయనకు భయపడుతారు.
ఈజిప్టు శాశ్వతంగా బలహీనమవుతుంది
20 చెరకి కొనిపోబడిన పదకొండవ సంవత్సరం మొదటి నెల (ఏప్రిల్) ఏడవ రోజున యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: 21 “నరపుత్రుడా, ఈజిప్టు రాజైన ఫరో చేతిని (శక్తిని) నేను విరిచివేశాను. ఆ చేతికి ఎవ్వరూ కట్టు కట్టలేరు. అది నయం కాదు. ఆ చేయి మళ్లీ కత్తి పట్టే బలాన్ని పుంజుకోలేదు.”
22 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “నేను ఈజిప్టు రాజైన ఫరోకు విరోధిని. అతని మంచి చేతిని, గతంలో విరిగిన అవిటి చేతిని, రెండింటినీ నేను విరుగగొడతాను. అతని చేతి నుండి కత్తి జారి క్రిందపడేలా చేస్తాను. 23 ఈజిప్టువారిని వివిధ దేశాలకు చెదరగొడతాను. 24 బబులోను రాజు చేతులను నేను బలపర్చుతాను. నా కత్తిని అతని చేతిలో ఉంచుతాను. కాని ఫరో చేతులను నేను విరుగ గొడతాను. అప్పుడు ఫరో మరణించుతాడు. వేదన పడేలా బాధపడతాడు. 25 ఆ విధంగా బబులోను రాజు చేతులను బలపర్చి, ఫరో రాజు చేతులను నేను బలహీన పర్చుతాను. నేనే యెహోవానని వారప్పుడు తెలుసుకుంటారు.
“నేను నా కత్తిని బబులోను రాజు చేతిలో ఉంచుతాను. అతడా కత్తిని ఈజిప్టు రాజ్యం మీదికి విసురుతాడు. 26 నేను ఈజిప్టువారిని వివిధ దేశాలకు తరిమివేస్తాను. అప్పడు నేను యెహోవానని వారు తెలుసుకొంటారు.”
లోకముపై జయము
25 “నేను యింతవరకూ ఉపమానాలతో మాట్లాడుతూ వచ్చాను. కాని యిలాంటి భాష ఉపయోగించకుండా నేను స్పష్టంగా మాట్లాడే సమయం వస్తోంది. అప్పుడు నేను మీకు తండ్రిని గురించి స్పష్టంగా చెబుతాను. 26 ఆ రోజు మీరు నా పేరిట తండ్రిని అడుగుతారు. మీ పక్షాన నేను తండ్రిని అడుగుతున్నానని అనటం లేదు. 27 నేను తండ్రి నుండి వచ్చానని మీరు నమ్మారు. మీకు నా పట్ల ప్రేమ ఉంది. కనుక తండ్రికి స్వయంగా మీ పట్ల ప్రేమ ఉంది. 28 నేను తండ్రి నుండి ఈ ప్రపంచంలోకి వచ్చాను. ఇప్పుడు నేనీ ప్రపంచాన్ని వదిలి తండ్రి దగ్గరకు వెళ్తున్నాను.”
29 శిష్యులు, “ఇప్పుడు మీరు ఉపమానాల ద్వారా కాకుండా స్పష్టంగా మాట్లాడుతున్నారు. 30 మీకు అన్నీ తెలుసునని మేము ఇప్పుడు గ్రహించాము. ఎవరునూ మీకు ప్రశ్న వేయవలసిన అవసరం లేదు. అందువల్ల మీరు దేవుని నుండి వచ్చారని విశ్వసిస్తున్నాము” అని అన్నారు.
31 యేసు, “చివరకు నమ్ముతున్నారన్న మాట! 32 మీరు నన్ను ఒంటరిగా ఒదిలి మీమీ యిండ్లకు వెళ్ళే సమయం రానున్నది. ఇప్పుడే వచ్చింది. నా తండ్రి నాతో ఉన్నాడు. కనుక నేను ఒంటరిగా ఉండను.
33 “నా ద్వారా మీకు శాంతి కలగాలని యివన్నీ మీకు చెప్పాను. ఈ ప్రపంచంలో మీకు కష్టాలు కలుగుతాయి. కాని ధైర్యంగా ఉండండి. నేను ప్రపంచాన్ని జయించాను” అని అన్నాడు.
© 1997 Bible League International