Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: వాయిద్యాలతో. ఆసాపు స్తుతి కీర్తన.
76 యూదాలో ప్రజలు దేవుని ఎరుగుదురు.
దేవుని నామం నిజంగా గొప్పదని ఇశ్రాయేలుకు తెలుసు.
2 దేవుని ఆలయం షాలేములో[a] ఉంది.
దేవుని గృహం సీయోను కొండ మీద ఉంది.
3 అక్కడ విల్లులను, బాణాలను కేడెములను,
కత్తులను ఇతర యుద్ధ ఆయుధాలను దేవుడు విరుగగొట్టాడు.
4 దేవా, నీవు నీ శత్రువులను ఓడించిన ఆ కొండల నుండి
తిరిగి వస్తూండగా నీవు ఎంతో మహిమతో ఉన్నావు.
5 ఆ సైనికులు చాలా బలం కలవారని తలంచారు. కాని యిప్పుడు వారు చచ్చి పొలాల్లో పడి ఉన్నారు.
వారికి ఉన్నదంతా వారి శరీరాల నుండి దోచుకోబడింది.
బలవంతులైన ఆ సైనికులలో ఒక్కరు కూడా వారిని కాపాడుకోలేకపోయారు.
6 యాకోబు దేవుడు ఆ సైనికులను గద్దించాడు.
రథాలు, గుర్రాలుగల ఆ సైన్యం చచ్చిపడింది.
7 దేవా, నీవు భీకరుడవు.
నీవు కోపంగా ఉన్నప్పుడు ఏ మనిషీ నీకు విరోధంగా నిలువలేడు.
8-9 యెహోవా న్యాయమూర్తిగా నిలిచి తన నిర్ణయాన్ని ప్రకటించాడు.
దేశంలోని దీన ప్రజలను దేవుడు రక్షించాడు.
పరలోకం నుండి ఆయన తీర్మానం ఇచ్చాడు.
భూమి అంతా భయంతో నిశ్శబ్దం ఆయ్యింది.
10 దేవా, నీవు దుర్మార్గులను శిక్షించినప్పుడు ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
నీవు నీ కోపం చూపిస్తావు. బ్రతికి ఉన్నవారు మరింత బలంగలవారు అవుతారు.
11 ప్రజలారా! మీ దేవుడైన యెహోవాకు మీరు వాగ్దానాలు చేశారు.
ఇప్పుడు మీరు వాగ్దానం చేసినదాన్ని ఆయనకు ఇవ్వండి.
అన్ని చోట్లనుండీ ప్రజలు
తాము భయపడే దేవునికి కానుకలు తెస్తారు.
12 దేవుడు మహా నాయకులను ఓడిస్తాడు.
భూలోక రాజులందరూ ఆయనకు భయపడుతారు.
ఈజిప్టుకు వ్యతిరేకంగా వర్తమానం
29 దేశం నుండి వెళ్లగొట్టబడిన పదవ సంవత్సరం, పదవనెల (జనవరి) పన్నెండవరోజున నా ప్రభువైన యెహోవా మాట నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: 2 “నరపుత్రుడా, ఈజిప్టు రాజైన ఫరోవైపు చూడు. నా తరపున నీవు అతనికి (ఈజిప్టుకు) వ్యతిరేకంగా మాట్లాడుము. 3 నీవు ఈ విధముగా మాట్లాడుము, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
“‘ఈజిప్టు రాజువైన ఫరో, నేను నీకు విరోధిని.
నీవు నైలునదీ తీరాన పడివున్న ఒక పెద్ద క్రూర జంతువువి.
“ఈ నది నాది! ఈ నదిని నేను ఏర్పాటు చేశాను!”
అని నీవు చెప్పుకొనుచున్నావు.
4-5 “‘కాని నేను నీ దవడలకు గాలం వేస్తాను.
నైలునదిలోని చేపలు నీ చర్మపు పొలుసులను అంటుకుంటాయి.
పిమ్మట నిన్ను, నీ చేపలను నదిలోనుంచి లాగి నేలమీదికి ఈడ్చుతాను.
నీవు నేలమీద పడతావు.
నిన్నెవ్వరూ లేవనెత్తటం గాని,
పాతిపెట్టడం గాని, చేయరు.
నేను నిన్ను అడవి జంతువులకు, పక్షులకు వదిలివేస్తాను.
నీవు వాటికి ఆహారమవుతావు.
6 ఈజిప్టు నివసిస్తున్న ప్రజలంతా నేనే
యెహోవానని అప్పుడు తెలుసుకుంటారు!
“‘నేనీ పనులు ఎందుకు చేయాలి?
ఇశ్రాయేలు ప్రజలు తమ సహాయం కొరకు ఈజిప్టు మీద ఆధారపడ్డారు.
కాని ఈజిప్టు రెల్లు గడ్డిలా బలహీనమైనది.
7 ఇశ్రాయేలు ప్రజలు తమ సహాయం కొరకు ఈజిప్టు మీద ఆధారపడ్డారు.
కాని ఈజిప్టువారి చేతులకు, భుజాలకు తూట్లు పొడిచింది.
వారు సహాయం కొరకు నీ మీద ఆధారపడ్డారు.
కాని నీవు వారి నడుము విరుగగొట్టి, మెలిపెట్టావు.’”
8 కావున నా ప్రభువైన యెహోవా, ఈ విషయాలు చెపుతున్నాడు:
“నేను నీ మీదికి కత్తిని రప్పిస్తున్నాను.
నేను నీ ప్రజలందరినీ, పశువులనూ నాశనం చేస్తాను.
9 ఈజిప్టు నిర్మానుష్యమై నాశనమవుతుంది.
అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.”
దేవుడు ఇలా చెప్పాడు: “నేనెందుకీ పనులు చేయాలి? ‘ఈ నది నాది. ఈ నదిని నేను ఏర్పాటు చేశాను’ అని నీవు చెప్పుకున్నందువల్ల! నేను ఆ పనులు చేయదలిచాను. 10 కావున నేను (దేవుడు) నీకు వ్యతిరేకిని. అనేకంగా ఉన్న నైలు నదీ శాఖలకు నేను విరోధిని. నేను ఈజిప్టును పూర్తిగా నాశనం చేస్తాను. మిగ్దోలునుండి ఆశ్వన్ (సెవేనే) వరకు, మరియు ఇథియోపియ (కూషు) సరిహద్దు వరకు గల నగరాలన్నీ నిర్మానుష్యమై పోతాయి. 11 మనుష్యుడే గాని, జంతువే గాని ఈజిప్టు దేశం గుండా వెళ్లరు. 12 పాడుబడ్డ దేశాల మధ్యలో ఈజిప్టు దేశాన్ని పాడుబడ్డ నగరాల మధ్యలో దాని నగరాన్ని పాడుగా చేస్తాను. అది నలభై సంవత్సరాలు పాడుగా ఉంటుంది. ఈజిప్టు వారిని జనాల మధ్యలోనికి తోలివేసి చెదరగొడతాను. చెదరగొట్టిన దేశాల్లో నేను వారిని పరాయి వారినిగా చేస్తాను.”
ఏడవ బూర
15 ఏడవ దేవదూత తన బూర ఊదాడు. పరలోకం నుండి అనేక స్వరాలు యిలా బిగ్గరగా అనటం వినిపించింది:
“ప్రపంచం మన ప్రభువు రాజ్యంగా మారింది. ఆయన క్రీస్తు రాజ్యంగా మారింది.
ఆయన చిరకాలం రాజ్యం చేస్తాడు.”
16 దేవుని సమక్షంలో సింహాసనాలపై కూర్చొన్న యిరువది నాలుగు మంది పెద్దలు సాష్టాంగపడ్డారు. 17 వాళ్ళు దేవుణ్ణి పూజిస్తూ ఈ విధంగా అన్నారు:
“ప్రభూ! సర్వశక్తివంతుడవైన దైవమా!
నీవు ప్రస్తుతం ఉన్నావు, గతంలో ఉన్నావు.
నీ గొప్ప శక్తిని ఉపయోగించి మళ్ళీ పాలించటం మొదలుపెట్టావు.
కనుక నీకు మా కృతజ్ఞతలు!
18 దేశాలు ఆగ్రహం చెందాయి.
ఇప్పుడు నీకు ఆగ్రహం వచ్చింది.
చనిపోయినవాళ్ళపై తీర్పు చెప్పే సమయం వచ్చింది.
నీ సేవకులైన ప్రవక్తలకు ప్రతిఫలం యిచ్చే సమయం వచ్చింది.
నీ పవిత్రులకు, నీ నామాన్ని గౌరవించేవాళ్ళకు,
సామాన్యులకు, పెద్దలకు,
అందరికి ప్రతిఫలం యిచ్చే కాలం వచ్చింది.
భూమిని నాశనం చేసేవాళ్ళను నాశనం చేసే కాలం వచ్చింది.”
19 అప్పుడు పరలోకంలో ఉన్న దేవుని మందిరం తెరువబడింది. ఆ మందిరంలో ఉన్న ఆయన పరిశుద్ధమైన ఒడంబడిక మందసం కనిపించింది. అప్పుడు మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపము, పెద్ద వడగండ్ల వాన వచ్చాయి.
© 1997 Bible League International