Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
13 యెహోవా, ఎన్నాళ్లు నన్ను మరచిపోతావు?
నీవు నన్ను శాశ్వతంగా మరచిపోతావా?
నీవు నన్ను స్వీకరించకుండా ఎన్నాళ్లు నిరాకరిస్తావు?
2 నీవు ఒకవేళ నన్ను మరచిపోయావేమోనని ఇంకెన్నాళ్లు నేను తలంచాలి?
ఇంకెన్నాళ్లు నేను నా హృదయంలో దుఃఖ అనుభూతిని పొందాలి?
ఇంకెన్నాళ్లు నా శత్రువు నా మీద విజయాలు సాధిస్తాడు?
3 నా దేవా, యెహోవా, నన్ను చూడుము. నా ప్రశ్నలకు జవాబిమ్ము.
నన్ను ఆ జవాబు తెలుసుకోనిమ్ము. లేదా నేను చనిపోతాను!
4 అప్పుడు నా శత్రువు, “నేనే వానిని ఓడించాను” అనవచ్చు.
నేను అంతం అయ్యానని నా శత్రువు సంతోషిస్తాడు.
5 యెహోవా, నాకు సహాయం చేయుటకు నీ ప్రేమనే నేను నమ్ముకొన్నాను.
నీవు నన్ను రక్షించి, నన్ను ఆనందింపజేశావు.
6 యెహోవా నాకు మేలైన కార్యాలు చేశాడు.
కనుక నేను యెహోవాకు ఒక ఆనందగీతం పాడుతాను.
యూదా చుట్టునున్న దేశాల గూర్చిన దర్శనాలు
12 ఇశ్రాయేలును గురించి యెహోవానుండి వచ్చిన విషాద వార్త. యెహోవా ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు. ఆయన మానవుని ఆత్మను అతనిలో పొందుపర్చాడు. యెహోవా ఈ విషయాలు చెప్పాడు: 2 “చూడండి, నేను యెరూషలేమును దాని చుట్టూ ఉన్న దేశాలకు ఒక విషపు గిన్నెలా చేస్తాను. దేశాలు వచ్చి, ఆ నగరంపై దాడి చేస్తాయి. యూదా అంతా బోనులో చిక్కుతుంది. 3 కాని నేను యెరూషలేమును ఒక బరువైన బండలా చేస్తాను. దానిని తీసుకోడానికి ఎవరైనా ప్రయత్నిస్తే అది అతనినే గాయపర్చుతుంది. ఆ ప్రజలు నిజంగా నరకబడతారు, గీకబడతారు. కాని భూమిపైగల దేశాలన్నీ కలిసి యెరూషలేము మీద యుద్ధానికి వస్తాయి. 4 కాని ఆ సమయంలో నేను గుర్రాన్ని బెదర గొడతాను. దాని మీద స్వారీ చేసే సైనికునికి భయం పుట్టిస్తాను. శత్రు గుర్రాలన్నీ గుడ్డివై పోయేలా చేస్తాను. కాని నా కండ్లు తెరవబడి ఉంటాయి. నేను యూదా వంశాన్ని కనిపెడుతూ ఉంటాను. 5 యూదా వంశ నాయకులు ప్రజలను ప్రోత్సహిస్తారు. వారు, ‘సర్వశక్తిమంతుడైన యెహోవా మీ దేవుడు, ఆయన మనల్ని బలవంతులుగా చేస్తాడు’ అని అంటారు. 6 ఆ సమయంలో యూదా నాయకులను అరణ్యంలో చెలరేగిన అగ్నిలా నేను చేస్తాను. అగ్ని ఎండు గడ్డిని దగ్ధం చేసినట్లు, వారు తమ శత్రువులను నాశనం చేస్తారు. చుట్టూవున్న వారి శత్రువులను వారు నాశనం చేస్తారు. యెరూషలేము ప్రజలు మళ్లీ తీరికగా కూర్చుని విశ్రాంతి తీసుకుంటారు.”
7 యెరూషలేము ప్రజలు మిక్కిలి గొప్పలు చెప్పుకోకుండా చేయటానికి, యెహోవా యూదా ప్రజలను ముందుగా రక్షిస్తాడు. యూదాలో వున్న ప్రజలకంటె తాము గొప్పవారమని దావీదు వంశంవారు, యెరూషలేములో వుంటున్న ఇతర ప్రజలు గొప్పలు చెప్పుకోలేరు. 8 కాని యెరూషలేము ప్రజలను యెహోవా రక్షిస్తాడు. ఏమీ చేతగానివాడు సహితం దావీదులా గొప్ప సైనికుడవుతాడు. దావీదు వంశంలోని మనుష్యులు దేవుళ్లవలె వుంటారు. ప్రజలను నడిపించే యెహోవా దూతలా వుంటారు.
9 యెహోవా చెపుతున్నాడు: “ఆ సమయంలో యెరూషలేముపై యుద్ధానికి వచ్చిన దేశాలను నేను నాశనం చేస్తాను. 10 దావీదు వంశాన్ని, యెరూషలేములో నివసిస్తున్న ప్రజలను దయాదాక్షిణ్య స్వభావంతో నింపివేస్తాను. వారు నన్ను పొడిచారు. అలాంటి నా సహాయం కొరకే వారు ఎదురు చూస్తారు. వారు చాలా విచారిస్తారు. తన ఏకైక కుమారుడు చనిపోయినవాడు విలపించేలా, తన మొదటి కుమారుడు చని పోయినవాడు విలపించేలా వారు దుఃఖిస్తారు. 11 యెరూషలేములో గొప్ప దుఃఖ సమయం ఉంటుంది. అది మెగిద్దోను లోయలో హదద్రిమ్మోను మరణంపట్ల ప్రజల దుఃఖంలా వుంటుంది. 12 ప్రతి ఒక్క కుటుంబం విడిగా దుఃఖిస్తుంది. దావీదు కుటుంబంలోని పురుషులు విడిగా దుఃఖిస్తారు. వారి భార్యలు విడిగా వారికి వారే దుఃఖిస్తారు. నాతాను కుటుంబంలోని పురుషులు ప్రత్యేకంగా విలపిస్తారు. వారి భార్యలు విడిగా దుఃఖిస్తారు. 13 లేవి కుటుంబంలోని పురుషులు విడిగా విచారిస్తారు. వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు. షిమ్యోను (షిమీ) కుటుంబంలోని పురుషులు విడిగా విలపిస్తారు. వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు. 14 ఇదే మాదిరి అన్ని వంశాలలోనూ జరుగుతుంది. పురుషులు, స్త్రీలు విడి విడిగా దుఃఖిస్తారు.”
13 కాని, ఆ సమయంలో దావీదు కుటుంబానికి, యెరూషలేములో నివసిస్తున్న ప్రజలకొరకు ఒక నీటి జల తీయబడుతుంది. ఆ జలం వారి పాపాలను కడిగి, వారిని పవిత్రులుగా చేయటానికి ఉద్దేశించబడుతుంది.
9 “మీరు జాగ్రత్తగా ఉండండి. కొందరు మనుష్యులు మిమ్మల్ని మహాసభలకు అప్పగిస్తారు. సమాజ మందిరాల్లో మీరు కొరడా దెబ్బలు తినవలసి వస్తుంది. నా కారణంగా మీరు రాజ్యాధికారుల ముందు, రాజుల ముందు నిలుచొని సాక్ష్యం చెప్పవలసి వస్తుంది. 10 మొదట మీరు అన్ని దేశాలకు సువార్త తప్పక ప్రకటించాలి. 11 మిమ్మల్ని బంధించి విచారణ జరపటానికి తీసుకు వెళ్తారు. అప్పుడు మీరు ఏం మాట్లాడాలో అని చింతించకండి. ఆ సమయంలో మీకు తోచింది మాట్లాడండి. ఎందుకంటే, అప్పుడు మాట్లాడేది మీరు కాదు. పవిత్రాత్మ మీ ద్వారా మాట్లాడుతాడు.
12 “సోదరులు ఒకరికొకరు ద్రోహం చేసుకొని, ఒకరి మరణానికి ఒకరు కారకులౌతారు. అదే విధంగా తండ్రి తన కుమారుని యొక్క మరణానికి కారకుడౌతాడు. పిల్లలు తమ తల్లిదండ్రులకు ఎదురు తిరిగి వాళ్ళ మరణానికి కారకులౌతారు. 13 నా కారణంగా ప్రజలందరూ మిమ్మల్ని ఏవగించుకొంటారు. కాని చివరిదాకా పట్టుదలతో ఉన్న వాణ్ణి దేవుడు రక్షిస్తాడు.
14 “నాశనం కలిగించేది, అసహ్యమైనది, తనది కాని స్థానంలో నిలుచొని ఉండటం మీకు కనిపిస్తే[a] యూదయలో ఉన్నవాళ్ళు కొండల మీదికి పారిపొండి. 15 ఇంటి మిద్దె మీద ఉన్న వాళ్ళు క్రిందికి దిగి తమ వస్తువులు తెచ్చుకోవటానికి తమ యిళ్ళలోకి వెళ్ళరాదు. 16 పొలాల్లో పని చేస్తున్న వాళ్ళు తమ దుస్తులు తెచ్చుకోవటానికి యిళ్ళకు వెళ్ళరాదు.
17 “గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఆ రోజులు ఎంత దుర్భరంగా ఉంటాయో కదా! 18 ఈ సంఘటన చలికాలంలో సంభవించకూడదని ప్రార్థించండి. 19 ప్రపంచంలో ఇదివరకు ఎన్నడూ, అంటే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన నాటినుండి ఈనాటి వరకూ సంభవించని దుర్భరమైన కష్టాలు ఆ రోజుల్లో సంభవిస్తాయి. అలాంటి కష్టాలు యిక ముందు కూడా ఎన్నడూ కలగవు. 20 కాని దేవుడు ఆ రోజుల సంఖ్య తక్కువ చేసాడు. లేకపోయినట్లయితే ఎవ్వరూ బ్రతికేవాళ్ళు కాదు. తానెన్నుకున్న తన ప్రజల కోసం ఆ రోజుల సంఖ్యను తగ్గించాడు.
21 “ఆ రోజుల్లో మీలో ఎవరైనా ‘ఇదిగో! క్రీస్తు యిక్కడ ఉన్నాడని’ కాని, ‘అదిగో అక్కడున్నాడని’ కాని అంటే నమ్మకండి. 22 దొంగ క్రీస్తులు, దొంగ ప్రవక్తలు వచ్చి అద్భుతాలు, మహత్యాలు చేసి ఐనంతవరకు దేవుడు ఎన్నుకొన్న వాళ్ళను మోసం చెయ్యాలని చూస్తారు. 23 అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండాలని, అన్ని విషయాలు మీకు ముందే చెబుతున్నాను.
© 1997 Bible League International