Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
13 యెహోవా, ఎన్నాళ్లు నన్ను మరచిపోతావు?
నీవు నన్ను శాశ్వతంగా మరచిపోతావా?
నీవు నన్ను స్వీకరించకుండా ఎన్నాళ్లు నిరాకరిస్తావు?
2 నీవు ఒకవేళ నన్ను మరచిపోయావేమోనని ఇంకెన్నాళ్లు నేను తలంచాలి?
ఇంకెన్నాళ్లు నేను నా హృదయంలో దుఃఖ అనుభూతిని పొందాలి?
ఇంకెన్నాళ్లు నా శత్రువు నా మీద విజయాలు సాధిస్తాడు?
3 నా దేవా, యెహోవా, నన్ను చూడుము. నా ప్రశ్నలకు జవాబిమ్ము.
నన్ను ఆ జవాబు తెలుసుకోనిమ్ము. లేదా నేను చనిపోతాను!
4 అప్పుడు నా శత్రువు, “నేనే వానిని ఓడించాను” అనవచ్చు.
నేను అంతం అయ్యానని నా శత్రువు సంతోషిస్తాడు.
5 యెహోవా, నాకు సహాయం చేయుటకు నీ ప్రేమనే నేను నమ్ముకొన్నాను.
నీవు నన్ను రక్షించి, నన్ను ఆనందింపజేశావు.
6 యెహోవా నాకు మేలైన కార్యాలు చేశాడు.
కనుక నేను యెహోవాకు ఒక ఆనందగీతం పాడుతాను.
దానియేలు దర్శనం-పొట్టేలుమరియు మేకపోతు
8 బెల్షస్సరు రాజుగా ఉన్న మూడవ సంవత్సరంలో, నాకు ఈ దర్శనము కలిగింది. ఇది మొదటి దర్శనానికి తర్వాత వచ్చింది. 2 ఆ దర్శనంలో నేను షూషనులో ఉన్నట్లు చూశాను. ఏలాం రాష్ట్రంలో షూషను ఒక రాజధాని నగరం. నేను ఊలయి నది ప్రక్క నిలబడి ఉన్నాను. 3 నా కన్నులెత్తి ఊలయి నదికి ప్రక్కగా ఒక పొట్టేలు నిలబడి ఉండడం చూశాను. ఆ పొట్టేలుకి రెండు పొడుగాటి కొమ్ములున్నాయి. కాని ఒకటి మరొకదాని కంటె పొడుగైనది. పొడుగాటి కొమ్ము తర్వాత పుట్టింది. 4 ఆ కొమ్ములతో పొట్టేలు పడమరకి, ఉత్తరానికి, దక్షిణానికి పరుగెత్తడం చూశాను. ఏ మృగమూ పొట్టేలుని ఎదిరించలేక పోయింది. మరియు ఎవ్వరూ దీనినుండి ఇతర జంతువుల్ని కాపాడలేక పోయారు. ఆ పొట్టేలు చేయదలచిందంతా చేస్తూంది. అందువల్ల పొట్టేలు చాలా శక్తివంత మయింది.
5 నేను ఆ పొట్టేలు గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఒక మేకపోతు పడమరనుండి రావడం చూశాను. అది భూమి అంతటా చుట్టి వచ్చింది. దాని కాళ్లు భూమిని కూడా తాకలేదు. ఈ మేకపోతుకు ఒక పెద్ద కొమ్ము దాని కళ్ల మధ్యన ఉంది.
6 ఆ మేకపోతు ఊలయి నదికి ప్రక్కగా నిలబడివున్న రెండు కొమ్ములు గల పొట్టేలు వద్దకు వచ్చింది. మేకపోతు చాలా కోపంగా ఉంది. 7 మేకపోతు పొట్టేలువైపు పరుగెత్తి చాలా కోపంతో కలబడి పొట్టేలు రెండు కొమ్ముల్ని విరుగ కొట్టింది. మేకపోతును పొట్టేలు ఎదిరించలేకపోయింది. మేకపోతు పొట్టేలుని నేలకు పడవేసి దాన్ని త్రొక్కివేసింది. ఆ మేకపోతునుండి పొట్టేలుని కాపాడగలిగినవారెవ్వరూ లేకపోయిరి.
8 అందువల్ల మేకపోతు చాలా బలంగా పెరిగింది. కాని అది శక్తివంతంగా వున్నప్పుడు, దాని పెద్ద కొమ్ము విరిగిపోయింది. తర్వాత ఆ పెద్ద కొమ్ము స్థానంలో నాలుగు వేరే కొమ్ములు మొలిచాయి. ఆ నాలుగు కొమ్ములు ఆకాశపు నాలుగు దిక్కులలో పెరిగాయి.
9 తర్వాత ఆ నాలుగు కొమ్ములలో ఒకదానినుండి ఒక చిన్న కొమ్ము పెరిగి బాగా పెద్దదయింది. అది దక్షిణ దిక్కుగా, తూర్పు దిక్కుగా, సుందర దేశం దిక్కుగా పెరిగింది. 10 ఆ చిన్నకొమ్ము బాగా పెద్దదయి ఆకాశాన్ని అంటేంత వరకు పెరిగింది. అది నక్షత్రాల్ని కూడా క్రిందికి త్రోసి కాళ్ల క్రింద త్రొక్కి వేసింది. 11 ఆ చిన్న కొమ్ము బాగా గర్వించి ఆ నక్షత్రాల సైన్యాధిపతికి ఎదురు తిరిగింది. అది పరిపాలకుని అనుదిన బల్యర్పణాన్ని ఆపివేసి. ఆయన ఆలయాన్ని పడగొట్టింది. 12 తిరుగుబాటు జరిగినందున (పరిశుద్ధుల) సైన్యం మరియు అనుదిన బలి దాని వశం చేయ బడ్డాయి. సత్యం నేలకు అణచి వేయబడింది. చేసిన ప్రతి దానిలో అది బాగా అభివృద్ధి చెందింది.
13 అంతట ఒక పరిశుద్ధుడు మాట్లాడటం విన్నాను. ఇంకొక పరిశుద్ధుడు మొదటి వానిని ఇలా అడిగాడు: “ఈ దర్శనం నెరవేరటానికి ఎంత కాలం పడుతుంది? అనుదిన బలిని గూర్చిన దర్శనం, నాశనం కలిగించు తిరుగుబాటు, పరిశుద్ధ స్థలం మరియు పరిశుద్ధుల సైన్యం కాళ్ల క్రింద త్రొక్కబడటం ఇవన్నియు నెరవేరటానికి ఎంతకాలము పడుతుంది?”
14 అతడు నాతో ఇలా అన్నాడు: “దానికి రెండువేల మూడువందల రోజులు పడతాయి. అప్పుడు పవిత్ర స్థలం తిరిగి పరిశుద్ధం చేయబడుతుంది.”
దైవకుమారున్నుండి వెళ్ళిపోకండి
26 సత్యాన్ని గురించి జ్ఞానం సంపాదించిన తర్వాత కూడా, మనం కావాలని పాపాలు చేస్తూ ఉంటే, యిక అర్పించటానికి మన దగ్గర బలి ఎక్కడుంది? 27 తీర్పు జరుగుతుందనే భయము, దేవుని శత్రువుల్ని కాల్చివేసే మంటలు రానున్నాయనే భయము మాత్రమే మిగిలిపోతాయి. 28 మోషే నియమాల్ని ఉల్లంఘించినవానిపై యిద్దరు లేక ముగ్గురు చెప్పిన సాక్ష్యాలతో దయ చూపకుండా మరణ శిక్ష విధించేవాళ్ళు. 29 మరి దేవుని కుమారుణ్ణి కాళ్ళ క్రింద త్రొక్కినవాణ్ణి, తనను పవిత్రం చేసిన ఒడంబడిక రక్తాన్ని అపవిత్రంగా పరిగణించేవాణ్ణి, అనుగ్రహించే ఆత్మను అవమాన పరిచేవాణ్ణి, యింకెంత కఠినంగా శిక్షించాలో మీరే ఊహించండి. 30 “పగ తీర్చుకోవలసిన పని నాది, తిరిగి చెల్లించేవాణ్ణి నేను” అని అన్నవాడు, “ప్రభువు తన ప్రజలపై తీర్పు చెపుతాడు”(A) అని అన్నవాడు ఎవరో మనకు తెలుసు. 31 సజీవంగా ఉన్న దేవుని చేతుల్లో పాపాత్ములు చిక్కుకోవటమనేది భయానకమైన విషయము.
© 1997 Bible League International