Revised Common Lectionary (Complementary)
దావీదుకు అభిమాన కావ్యము.
16 దేవా నేను నీమీద ఆధారపడ్డాను గనుక నన్ను కాపాడుము.
2 “యెహోవా, నీవు నా యజమానివి
నాకు గల ప్రతి మంచిది నీ నుండి నాకు లభిస్తుంది”
అని నేను యెహోవాతో చెప్పాను.
3 మీరు ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధుల గురించి కూడా చెప్పారు,
“వారు నాకు గోప్పవారు, వారే నన్ను సంతోషపెట్టువారు.”
4 కాని ఇతర దేవుళ్లను పూజించుటకు పరుగులెత్తే మనుష్యులకు అధిక బాధ కలుగుతుంది.
ఆ దేవతలకు వారు ఇచ్చే రక్తపు అర్పణల్లో నేను భాగం పంచుకోను.
ఆ దేవతల పేర్లు కూడ నేను పలుకను.
5 నా భాగం, నా పాత్ర యెహోవా దగ్గర్నుండి మాత్రమే వస్తుంది.
యెహోవా, నీవే నన్ను బలపరచావు.
యెహోవా, నీవే నా వంతు నాకు ఇమ్ము.
6 నా వంతు చాలా అద్భుతమయింది.
నా స్వాస్థ్యము చాలా అందమయింది.
7 యెహోవా నాకు చక్కగా నేర్పించాడు. కనుక నేను ఆయనను స్తుతిస్తాను.
రాత్రియందు, నా అంతరంగపు లోతుల్లోనుండి ఉపదేశములు వచ్చాయి.
8 నేను ఎల్లప్పుడూ యెహోవాను నా యెదుట ఉంచుకొంటాను.
ఎందుకనగా ఆయన నా కుడి ప్రక్కన వున్నాడు.
నేను ఎన్నడూ కదల్చబడను. ఆయన కుడిప్రక్కను నేను ఎన్నడూ విడువను.
9 కనుక నా ఆత్మ, నా హృదయము ఎంతో సంతోషంగా ఉన్నాయి.
నా శరీరం కూడ క్షేమంగా బ్రతుకుతుంది.
10 ఎందుకంటే, యెహోవా, నీవు నా అత్మను చావు స్థలంలో విడిచిపెట్టవు గనుక.
నీ పరిశుద్ధుడిని సమాధిలో కుళ్లిపోనీయవు.
11 సరైన జీవిత విధానాన్ని నీవు నాకు నేర్పిస్తావు.
యెహోవా, నీతో ఉండటమే నాకు సంపూర్ణ సంతోషం కలిగిస్తుంది.
నీ కుడిప్రక్కన ఉండటం నాకు శాశ్వత సంతోషం కలిగిస్తుంది.
19 తర్వాత దానియేలు (బెల్తెషాజరు) కొంచెంసేపు చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆలోచిస్తున్న విషయాలు అతన్ని కలత పరచాయి. అందువల్ల రాజు, “బెల్తెషాజరూ (దానియేలూ)! ఆ కలగాని, ఆ కలయొక్క అర్థంగాని, నిన్ను కలత చెందనీయకుండును గాక” అని చెప్పాడు.
తర్వాత బెల్తెషాజరు (దానియేలు) రాజుతో ఇలా అన్నాడు: “నా రాజా! ఆ కల నీ విరోధులకు జరుగునుగాక! నీ శత్రువులకు ఆ కలయొక్క అర్థము నెరవేరును గాక! 20-21 కలలో నీవొక వృక్షాన్ని చూశావు. అది ఏపుగా దృఢంగా పెరిగింది. దాని పైభాగం ఆకాశాన్ని అంటినట్లుగా ఉంది. భూమిమీద ఎక్కడినుంచియైనా దానిని చూడవచ్చు. దాని ఆకులు అందంగా ఉన్నాయి. ఫలసమృద్ధి కూడా ఉంది. ఆ పళ్లు ప్రతివారికీ సమృద్థిగా ఆహారం సమకూర్చాయి. అది అడవి మృగాలకు ఆశ్రయం. దాని కొమ్మలేమో పక్షుల నివాసస్థానం. అలాంటి వృక్షమే నీవు చూసింది. 22 రాజా, నీవే ఆ వృక్షానివి. నీవు మహా శక్తిమంతుడవయ్యావు. ఆకాశాన్ని అంటిన ఉన్నత వృక్షంవంటి వాడవు నీవు. నీ అధికారం భూమిమీద దూర భాగాలకు కూడా వ్యాపించింది.”
23 “రాజా, పరలోకంనుంచి ఒక పవిత్ర కావలి దేవదూత క్రిందికి రావడం నీవు చూశావు. అతడు ఇలా అన్నాడు: ‘చెట్టుని నరికివేయి; నాశనం చేయిము. ఇనుము, కంచు బద్దీతో కట్టబడి, పొలంలోని గడ్డిమధ్య నాటబడిన ఆ మొద్దును వ్రేళ్ళతోసహా భూమిలోనే విడిచిపెట్టు. ఏడు కాలాలు (సంవత్సరాలు) అతను మంచుకు తడుస్తూ మృగంవలె జీవిస్తాడు.’
24 “రాజా, కలయొక్క అర్థం ఇదే. మహోన్నతుడైన దేవుడు ఇవి జరుగుతాయని నా రాజువైన నీకు ఆజ్ఞాపించాడు. 25 నెబుకద్నెజరు రాజా, నీ ప్రజలనుంచి దూరంగా నీవు తరుమబడతావు. భూజంతువుల మధ్య నీవు నివసిస్తావు. ఎద్దువలె నీవు పచ్చిక తింటావు. నీవు మంచుచేత తడుస్తావు. అలా ఏడు కాలాలు (సంవత్సరాలు) గడిచి పోతాయి. అప్పుడు నీవీపాఠం నేర్చుకుంటావు-మహోన్నతుడైన దేవుడు మనుష్యుల రాజ్యాలను పరిపాలిస్తున్నాడనీ, తనకు నచ్చిన ఎవనికైనా రాజ్యాలను ఇచ్చివేస్తాడనీ నీవు తెలుసుకుంటావు.
26 “చెట్టు మొద్దును, వ్రేళ్లను నేలలోనే ఉంచుము అని ఇవ్వబడిన ఆజ్ఞకు అర్థమిది: మహోన్నతుడైన ఆ దేవుడే మనుష్యుల రాజ్యాలను పరిపాలిస్తున్నాడన్న విషయం నీవు తెలుసుకున్నప్పుడు, నీ రాజ్యం నీకు ఇవ్వబడుతుంది. 27 అందువల్ల, రాజా, నా సలహాను స్వీకరించుము. పాపం చేయడం ఆపివేయి. సరియైనదేదో అదే జరిగించు. చెడు విషయాలు చేయడం ఆపివేయి. బీదవారిపట్ల దయగలిగి ఉండుము. అప్పుడు నీవు క్రమంగా విజయాన్ని పొందగలవు.”
క్రీస్తు వల్ల సంపూర్ణమైన జీవితం
6 మీరు యేసు క్రీస్తును ప్రభువుగా స్వీకరించినట్లే ఆయనలో ఐక్యమై జీవించండి. 7 మీ వేర్లు ఆయనలో నాటి, ఆయనలో అభివృద్ధి చెందుతూ జీవించండి. మీకు ఉపదేశించిన విధంగా సంపూర్ణమైన విశ్వాసంతో ఉండండి. మీ కృతజ్ఞత పొంగిపోవాలి.
8 మోసంతో, పనికిరాని తత్వజ్ఞానంతో మిమ్మల్ని ఎవ్వరూ బంధించకుండా జాగ్రత్త పడండి. వాళ్ళ తత్వజ్ఞానానికి మూలం క్రీస్తు కాదు. దానికి మానవుని సాంప్రదాయాలు, అతని నైజంవల్ల కలిగిన నియమాలు కారణం. 9 ఎందుకంటే, దేవుని ప్రకృతి క్రీస్తులో సంపూర్ణంగా మానవ రూపంతో జీవిస్తోంది. 10 మీరు ఆయనలో ఐక్యత పొందారు. కనుక మీకు ఆ సంపూర్ణత లభించింది. క్రీస్తు అన్ని శక్తులకూ, అన్ని అధికారాలకూ అధిపతి.
11 ఆయనతో మీకు కలిగిన ఐక్యతవల్ల మీరు సున్నతి పొందారు. ఈ సున్నతి మానవులు చేసింది కాదు. ఇది క్రీస్తు స్వయంగా చేసిన సున్నతి. పాపాలతో కూడుకొన్న ఈ దేహం నుండి విముక్తి పొందటమే ఈ సున్నతి. 12 మీరు బాప్తిస్మము పొందటంవల్ల క్రీస్తులో సమాధి పొందారు. క్రీస్తును బ్రతికించిన దేవుని శక్తి పట్ల మీకున్న విశ్వాసం వలన మిమ్మల్ని కూడా దేవుడు ఆయనతో సహా బ్రతికించాడు. అంటే బాప్తిస్మము వల్ల యిది కూడా సంభవించింది. 13 మీరు చేసిన పాపాలవల్ల, పాపాలతో కూడుకొన్న ఈ దేహం నుండి స్వేచ్ఛ పొందకుండా మీరు గతంలో ఆత్మీయంగా మరణించారు. కాని దేవుడు మీ పాపాలన్నిటినీ క్షమించి, క్రీస్తుతో సహా మిమ్మల్ని బ్రతికించాడు. 14 ఆ పద్ధతులను గురించి, నియమాలను గురించి మనం వ్రాత మూలంగా అంగీకరించిన పత్రాన్ని, అది మనకు వ్యతిరేకంగా ఉంది కనుక, ఆయన దానిని తీసుకెళ్ళి మేకులతో సిలువకు కొట్టాడు. 15 అధికారాలను, శక్తుల్ని పనికి రాకుండా చేసి వాటిని బహిరంగంగా హేళన చేసి, సిలువతో వాటిపై విజయం సాధించాడు.
© 1997 Bible League International