Revised Common Lectionary (Complementary)
దావీదుకు అభిమాన కావ్యము.
16 దేవా నేను నీమీద ఆధారపడ్డాను గనుక నన్ను కాపాడుము.
2 “యెహోవా, నీవు నా యజమానివి
నాకు గల ప్రతి మంచిది నీ నుండి నాకు లభిస్తుంది”
అని నేను యెహోవాతో చెప్పాను.
3 మీరు ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధుల గురించి కూడా చెప్పారు,
“వారు నాకు గోప్పవారు, వారే నన్ను సంతోషపెట్టువారు.”
4 కాని ఇతర దేవుళ్లను పూజించుటకు పరుగులెత్తే మనుష్యులకు అధిక బాధ కలుగుతుంది.
ఆ దేవతలకు వారు ఇచ్చే రక్తపు అర్పణల్లో నేను భాగం పంచుకోను.
ఆ దేవతల పేర్లు కూడ నేను పలుకను.
5 నా భాగం, నా పాత్ర యెహోవా దగ్గర్నుండి మాత్రమే వస్తుంది.
యెహోవా, నీవే నన్ను బలపరచావు.
యెహోవా, నీవే నా వంతు నాకు ఇమ్ము.
6 నా వంతు చాలా అద్భుతమయింది.
నా స్వాస్థ్యము చాలా అందమయింది.
7 యెహోవా నాకు చక్కగా నేర్పించాడు. కనుక నేను ఆయనను స్తుతిస్తాను.
రాత్రియందు, నా అంతరంగపు లోతుల్లోనుండి ఉపదేశములు వచ్చాయి.
8 నేను ఎల్లప్పుడూ యెహోవాను నా యెదుట ఉంచుకొంటాను.
ఎందుకనగా ఆయన నా కుడి ప్రక్కన వున్నాడు.
నేను ఎన్నడూ కదల్చబడను. ఆయన కుడిప్రక్కను నేను ఎన్నడూ విడువను.
9 కనుక నా ఆత్మ, నా హృదయము ఎంతో సంతోషంగా ఉన్నాయి.
నా శరీరం కూడ క్షేమంగా బ్రతుకుతుంది.
10 ఎందుకంటే, యెహోవా, నీవు నా అత్మను చావు స్థలంలో విడిచిపెట్టవు గనుక.
నీ పరిశుద్ధుడిని సమాధిలో కుళ్లిపోనీయవు.
11 సరైన జీవిత విధానాన్ని నీవు నాకు నేర్పిస్తావు.
యెహోవా, నీతో ఉండటమే నాకు సంపూర్ణ సంతోషం కలిగిస్తుంది.
నీ కుడిప్రక్కన ఉండటం నాకు శాశ్వత సంతోషం కలిగిస్తుంది.
4 నెబుకద్నెజరు అను నేను నా అంతఃపురాన ఉన్నాను. నేను సుఖంగా సంతోషంగా ఉన్నాను. 5 అప్పుడు నన్ను భయంగొలిపే కల ఒకటి వచ్చింది. నేను నా పడకమీద ఉన్నాను. నా మనస్సులోని ఆలోచనలు నన్ను భయపెట్టాయి. 6 అందువల్ల బబులోనులోని వివేకవంతులందరినీ నావద్దకు తీసుకు రమ్మని ఆజ్ఞ ఇచ్చాను. ఎందుకంటే వారు నా కలయొక్క అర్థం చెప్పగలరని. 7 ఇంద్రజాలికులు, కల్దీయులు వచ్చారు. రాగానే వారితో కల వృత్తాంతం చెప్పాను. కాని దాని అర్థమేమిటో వారు చెప్పలేకపోయారు. 8 చివరికి దానియేలు వచ్చాడు. (నా దేవుని గౌరవించే నిమిత్తం నేను దానియేలుకు బెల్తెషాజరు అని పేరుపెడితిని. పరిశుద్ధ దేవుళ్ళ ఆత్మ[a] అతనిలో వుంది.) నా కల గురించి దానియేలుతో చెప్పాను. 9 నేను ఈ విధంగా చెప్పాను: “బెల్తెషాజరూ! ఇంద్రజాలికులందరిలో నీవు చాలా ముఖ్యుడివి. పరిశుద్ధ దేవుళ్ళ ఆత్మ నీలో ఉన్నట్లు నాకు తెలుసు. ఏ రహస్యమూ తెలుసుకోవడం నీకు కష్టం కాదు. ఇది నేను కన్నకల. దాని అర్థమేమిటో చెప్పు. 10 నేను నా పడక మీద ఉండగా ఈ దర్శనం నేను చూశాను. నా యెదుట భూమి మధ్యలో ఒక వృక్షం ఉంది. అది చాలా ఎత్తైనది. 11 ఆ చెట్టు ఏపుగా దృఢంగా పెరిగింది. ఆ చెట్టు పైభాగం ఆకాశాన్ని అంటిందా అన్నట్లుంది. భూమిమీద ఎక్కడినుంచయినా ఆ చెట్టుని చూడవచ్చు. 12 ఆ చెట్టు ఆకులు చాలా అందమైనవి. దాని మీద చాలా పళ్లు ఉన్నాయి. అవి అందరికీ ఆహారంగా ఉన్నాయి. భూజంతువులకు చెట్టుక్రింద నీడ లభించింది. దాని కొమ్మలలో పక్షులు ఉన్నాయి. ప్రతీ జీవి ఆ చెట్టునుండి పోషించబడింది.
13 “నేను నా పడక మీదనే పడుకొని, నా దర్శనంలో కావలివానివలె పరలోకంనుంచి ఒక పవిత్రుడు క్రిందికి రావడం చూశాను. 14 అతను చాలా బిగ్గరగా మాట్లాడాడు. ‘చెట్టును నరికి వేయండి. చెట్టుకొమ్మల్ని నరికి వేయండి. దాని ఆకుల్ని, దాని పండ్లని త్రుంచి పారవేయండి. చెట్టుకిందవున్న జంతువుల్ని తోలివేయండి. దాని కొమ్మలమీద వున్న పక్షుల్ని ఎగిరి పోనివ్వండి. 15 కాని దాని మొద్దును వేళ్లతోసహా భూమిలోనే ఉండనివ్వండి. దాని చుట్టూ ఇనుము, కంచు కలిసిన ఒక బద్దీ వేయండి. చెట్టుమొద్దు, వ్రేళ్లు పొలంలో పెరిగే గడ్డి మధ్యలో భూమిలోనే ఉండనివ్వండి. మంచుచేత దాన్ని తడవనివ్వండి. 16 ఇక మీదట అతను మనిషిలా ఆలోచించడు. అతనికి జంతువుల బుద్ధి వస్తుంది. ఏడు కాలాలు (సంవత్సరాలు) అలా గడుస్తాయి’ అని అతను చెప్పాడు.
17 “కావలి దూత ద్వారా ఈ ఆజ్ఞ జారీ అయింది. పరిశుద్ధుల ద్వారా నిర్ణయం జరిగింది. ఇది అంతం వరకు ఉంటుంది. మహోన్నతుడైన దేవుడు మనుష్యుల రాజ్యాలను పరిపాలిస్తున్నాడని భూమిమీద నివసించే మనుష్యులందరు తెలుసుకొనేందుకు వీలవుతుంది. ఆయనకు నచ్చిన ఎవరికైనా దేవుడు ఆ రాజ్యాలను ఇచ్చి వేస్తాడు. ఆ రాజ్యాలను పాలించేందుకు వినయ విధేయతలుగల వారిని దేవుడు ఎన్నుకుంటాడు!
18 “ఇదే నెబుకద్నెజరు రాజునైన నేను కన్నకల. ఇప్పుడు, బెల్తెషాజరూ (దానియేలూ)! ఈ కల అర్థం చెప్పు. నా రాజ్యంలోని వివేకవంతు లెవ్వరూ నాకు ఆ కల అర్థం చెప్పలేరు. కాని బెల్తెషాజరూ, నీవు ఆ కల గురించి చెప్పగలవు. ఎందుకంటే నీలో పరిశుద్ధ దేవతల ఆత్మవుంది.”
తిమోతికి చెప్పిన ఉపదేశము
11 కాని నీవు విశ్వాసివి. కనుక వీటికి దూరంగా ఉండు. నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, సహనాన్ని, వినయాన్ని అలవరచుకో. 12 నీ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి బాగా పోరాటం సాగించు. అనంత జీవితాన్ని సంపాదించు. దీని కోసమే దేవుడు నిన్ను పిలిచాడు. నీవు అనేకుల సమక్షంలో ఆ గొప్ప సత్యాన్ని అంగీకరించావు. 13 అన్నిటికీ ప్రాణం పోసే దేవుని పేరిట, పొంతి పిలాతు సమక్షంలో అదే గొప్ప సత్యాన్ని అంగీకరించిన యేసు క్రీస్తు పేరిట నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. 14 మన యేసు క్రీస్తు ప్రభువు వచ్చేదాక ఈ ఆజ్ఞను పాటించు. దాన్ని పాటించటంలో ఏ మచ్చా రానీయకుండా, ఏ అపకీర్తీ రానివ్వకుండా చూడు. 15 “మన పాలకుడు,” రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునైయున్నాడు. సర్వాధిపతి అయిన దేవుడు తగిన సమయం రాగానే యేసు క్రీస్తును పంపుతాడు. 16 మనం సమీపించలేని వెలుగులో ఉండే అమరుడైన దేవుడాయన. దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదు, మరి ఎవ్వరూ చూడలేరు. ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక! ఆయన శక్తి తరగకుండా ఉండుగాక! అమేన్.
17 ధనవంతులు గర్వించరాదనీ, క్షణికమైన ధనాన్ని నమ్మకూడదనీ, వాళ్ళతో చెప్పుదానికి మారుగా మన ఆనందానికి అన్నీ సమకూర్చే దేవుణ్ణి నమ్ముమని ఆజ్ఞాపించు. 18 సత్కార్యాలు చేస్తూ సత్ ప్రవర్తన కలిగి అవసరమైనవాటిని యితర్లతో ఔదార్యముగా పంచుకుంటూ ఉండుమని ఆజ్ఞాపించు. 19 ఈ విధంగా ఆత్మీయతలో ఐశ్వర్యాన్ని సంపాదిస్తే అది భవిష్యత్తుకు చక్కటి పునాది వేస్తుంది. తద్వారా నిజమైన జీవితం పొందకల్గుతారు.
20 తిమోతీ, నీకు అప్పగింపబడిన సత్యాన్ని జాగ్రత్తగా కాపాడు. ఆత్మీయతలేని చర్చలకు దూరంగా ఉండు. జ్ఞానంగా చెప్పబడే వ్యతిరేక సిద్ధాంతాలకు దూరంగా ఉండు. 21 కొందరు ఈ వ్యతిరేక సిద్ధాంతాలు బోధించారు. ఇలా చేసిన వాళ్ళు, మనము విశ్వసిస్తున్న సత్యాలను వదిలి తప్పు దారి పట్టారు.
దైవానుగ్రహం మీకు తోడుగా ఉండుగాక!
© 1997 Bible League International