Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 94

94 యెహోవా, నీవు మనుష్యులను శిక్షించే దేవుడవు.
    నీవు వచ్చి మనుష్యులకు శిక్ష తెచ్చే దేవుడవు.
నీవు భూలోకమంతటికీ న్యాయమూర్తివి.
    గర్విష్ఠులకు రావలసిన శిక్షతో వారిని శిక్షించుము.
యెహోవా, దుర్మార్గులు ఎన్నాళ్లవరకు తమ సరదా అనుభవిస్తారు?
    యెహోవా, ఇంకెన్నాళ్లు?
ఆ నేరస్థులు వారు చేసిన చెడు విషయాలను గూర్చి
    ఇంకెన్నాళ్లు అతిశయిస్తారు?
యెహోవా, ఆ మనుష్యులు నీ ప్రజలను బాధించారు.
    నీ ప్రజలు శ్రమపడునట్లు వారు చేసారు.
మా దేశంలో నివసించే విధవరాండ్రను, పరదేశస్థులను ఆ దుర్మార్గులు చంపుతారు.
    తల్లిదండ్రులు లేని పిల్లలను వారు చంపుతారు.
వారు ఆ చెడు కార్యాలు చేయటం యెహోవా చూడటం లేదని వారు చెబతారు.
    జరుగుతున్న విషయాలను ఇశ్రాయేలీయుల దేవుడు గ్రహించడం లేదని వారు చెబుతారు.

దుర్మార్గులారా, మీరు బుద్ధిలేనివారు.
    మీరు మీ పాఠం ఇంకెప్పుడు నేర్చుకొంటారు?
దుర్మార్గులారా, మీరు అవివేకులు
    మీరు గ్రహించుటకు ప్రయత్నం చేయాలి.
దేవుడు మన చెవులను చేశాడు.
    కనుక తప్పని సరిగా ఆయనకు చెవులు ఉంటాయి. జరిగే విషయాలను ఆయన వినగలడు.
దేవుడు మన కళ్లను చేశాడు. కనుక తప్పనిసరిగా ఆయనకు కళ్లు ఉంటాయి.
    జరుగుతున్న సంగతులను ఆయన చూడగలడు.
10 ఆ ప్రజలను దేవుడే క్రమశిక్షణలో ఉంచుతాడు.
    ప్రజలు చేయవలసిన వాటిని దేవుడే వారికి నేర్పిస్తాడు.
11 ప్రజలు తలచే విషయాలు దేవునికి తెలుసు.
    ప్రజలు గాలి వీచినట్లుగా ఉంటారని దేవునికి తెలుసు.

12 యెహోవా శిక్షించినవాడు సంతోషంగా ఉంటాడు.
    సరియైన జీవిత విధానాన్ని దేవుడు అతనికి నేర్పిస్తాడు.
13 దేవా, ఆ మనిషికి కష్టాలు వచ్చినప్పుడు అతడు మౌనంగా ఉండుటకు నీవు సహాయం చేస్తావు.
    దుర్మార్గులు వారి సమాధిలో పాతిపెట్టబడేంత వరకు అతడు నెమ్మదిగా ఉండుటకు నీవు అతనికి సహాయం చేస్తావు.
14 యెహోవా తన ప్రజలను విడిచిపెట్టడు.
    సహాయం చేయకుండా ఆయన తన ప్రజలను విడిచిపెట్టడు.
15 న్యాయాన్ని తోడుకొని ధర్మం తిరిగి వస్తుంది.
    అప్పుడు మనుష్యులు మంచివాళ్లుగా, నిజాయితీగల వాళ్లుగా ఉంటారు.

16 దుర్మార్గులకు విరోధంగా పోరాడుటకు ఏ మనిషి నాకు సహాయం చేయలేదు.
    చెడు కార్యాలు చేసే వారికి విరోధంగా పోరాడుటకు నాతో ఎవ్వరూ నిలువలేదు.
17 యెహోవా నాకు సహాయం చేసి ఉండకపోతే
    నేను వెంటనే మరణ నిశ్శబ్దంలో నివసించే వాడిని.
18 నేను పడిపోవుటకు సిద్ధంగా ఉన్నట్టు నాకు తెలుసు.
    కాని యెహోవా తన అనుచరుని బలపరిచాడు.
19 నేను చాలా చింతించి తల్లడిల్లిపోయాను.
    కాని యెహోవా, నీవు నన్ను ఆదరించి సంతోషింప చేశావు.

20 దేవా, వక్ర న్యాయవాదులకు నీవు సహాయం చేయవు.
    ఆ చెడ్డ న్యాయవాదులు ప్రజల జీవితాలను దుర్భరం చేయటానికే న్నాయచట్టాన్ని ఉపయోగిస్తారు.
21 ఆ న్యాయమూర్తులు మంచి మనుష్యులపై పడుతున్నారు.
    అమాయక ప్రజలు దోషులని చెప్పి వారిని చంపుతారు.
22 అయితే పర్వతం మీద ఎత్తయిన నా క్షేమ స్థానం యెహోవాయే.
    నా దుర్గమైన దేవుడు నా క్షేమస్థానం.
23 ఆ దుర్మార్గపు న్యాయవాదులు చేసిన చెడు పనులకోసం దేవుడు వారిని శిక్షిస్తాడు.
    వారు పాపం చేశారు గనుక దేవుడు వారిని నాశనం చేస్తాడు.
    మన యెహోవా దేవుడు ఆ దుర్మార్గపు న్యాయవాదులను నాశనం చేస్తాడు.

రూతు 3:14-4:6

14 అందుచేత తెల్లారేవరకు రూతు అతని కాళ్ల దగ్గరే పడుకొంది. తెల్లవారుఝామునే ఒకరినొకరు గుర్తించే పాటి వెలగు రాకముందే ఆమె లేచివెళ్లి పోయింది.

“రాత్రి నీవు నా దగ్గరకు ఇక్కడికి వచ్చిన సంగతి రహస్యముగానే ఉంచుదాము” అన్నాడు బోయజు ఆమెతో. 15 “నీ దుప్పటి నా దగ్గరకు తీసుకురా, దాన్ని తెరచి పట్టుకో” అన్నాడు బోయజు.

అందుచేత రూతు తన దుప్పటి తెరచి పట్టుకుంది. ఆమె అత్తగారైన నయోమికి కానుకగా ఒక తూమెడు యవలు కోలిచి ఇచ్చాడు బోయజు. ఆ దుప్పటిని మూట కట్టి ఆమె భుజంమీద పెట్టి, బోయజు ఊళ్లోకి వెళ్లిపోయాడు.

16 రూతు తన ఆత్త నయోమి ఇంటికి వెళ్లిపోయింది. నయోమి (గుమ్మం దగ్గరకు వెళ్లి) “ఎవరది” అని అడిగింది.

(రూతు ఇంట్లోకి వెళ్లి) తనకోసము బోయజు చేసిందంతా చెప్పింది. 17 “నీకు కానుకగా ఇమ్మని బోయజు ఈ యవలు నాకు ఇచ్చాడు. నీ కోసము కానుక తీసుకుపోకుండా నేను ఇంటికి వెళ్లకూడదన్నాడు బోయజు” అని చెప్పింది రూతు.

18 “నా కుమారీ, ఏమి జరుగుతుందో తెలిసేంతవరకు నెమ్మదిగా ఉండు. బోయజు మాత్రం ఏమిచేయాలో అది చేసేంతవరకు ఊరుకోడు. ఏమి జరిగేదీ ఈరోజు గడవక ముందే మనము వింటాము.” అన్నది నయోమి.

బోయజు మరియు మరో బంధువు

పట్టణ ద్వారము దగ్గర ప్రజలు సమావేశమయ్యే చోటికి బోయజు వెళ్లాడు. బోయజు చెప్పిన దగ్గర బంధువు అటుపైపు వచ్చేంతవరకు బోయజు అక్కడే కూర్చున్నాడు. “మిత్రమా, ఇలా రా! ఇక్కడ కూర్చో” అని బోయజు అతడిని పిల్చాడు.

తర్వాత బోయజు కొందరు సాక్షులను పదిమంది పెద్దలను సమావేశ పర్చాడు. వాళ్లను, “అక్కడ కూర్చో” మని చెప్పినప్పుడు వాళ్లు కూర్చున్నారు.

అప్పుడు నయోమి దగ్గరి బంధువుతో బోయజు మాట్లాడాడు. “నయోమి మోయాబు దేశమునుండి తిరిగి వచ్చేసింది. మన బంధువు ఎలీమెలెకు భూమిని ఆమె అమ్మేస్తుంది. ఈ ఊరి ప్రజలయెదుట, నా వాళ్ల పెద్దలయెదుట ఈ విషయం నీతో చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఈ భూమిని నీవు విడిపించాలనుకుంటే నీవు కొనుక్కో. ఆ భూమిని విడిపించడం నీకు ఇష్టము లేకపోతే నాకు చెప్పు, ఆ భూమిని విడిపించాల్సిన బాధ్యత నీ తర్వాత నాదే అని నాకు తెలుసు. ఆ భూమిని నీవు తిరిగి కొనకపోతే, నేను కోంటాను” అంటూ బోయజు ఆ దగ్గరి బంధువుతో చెప్పాడు.

“నయోమి దగ్గరనుండి నీవు ఆ భూమిని కొంటే, చనిపోయినవాని భార్య మోయాబు స్త్రీ నీదే అవుతుంది (రూతుకు సంతానం కలిగినప్పుడు ఆ సంతానానికి ఆ భూమి చెందుతుంది) ఆ విధంగా ఆ భూమి చనిపోయినవాని కుటుంబానికే చెంది ఉంటుంది” అన్నాడు.

ఆ దగ్గరి బంధువు జవాబుగా అన్నాడు: “నేను ఆ భూమిని కొనలేను. ఆ భూమి నాకు చెందాల్సిందే, కాని నేను దాన్ని కొనలేను. ఒకవేళ నేను దాన్ని కొనాల్సివస్తే, నా సొంత భూమిని పోగొట్టుకోవాల్సి వస్తుందేమో. అందుచేత నీవు ఆ భూమిని కొనవచ్చు.”

1 తిమోతికి 5:9-16

ఒకే పురుషుణ్ణి పెండ్లాడి అరవై ఏండ్లు దాటి ఉంటే తప్ప ఆమె పేరు వితంతువుల జాబితాలో చేర్చరాదు. 10 అంతేకాక, సత్కార్యాలు చేసే స్త్రీయని ఆమెకు మంచి పేరుండాలి. పిల్లల్ని సక్రమంగా పెంచటం, అతిథి సత్కారాలు చెయ్యటం, పవిత్రుల కాళ్ళు కడగటం, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చెయ్యటంలాంటి గుణాలు ఆమెలో ఉండాలి. తన జీవితాన్ని యిలాంటి మంచి పనులు చెయ్యటానికి అంకితం చేసిన స్త్రీగా ఉండాలి.

11 చిన్న వయస్సుగల వితంతువుల్ని ఈ జాబితాలో చేర్చవద్దు. వాళ్ళ వాంఛలు క్రీస్తు పట్ల వాళ్ళకున్న భక్తిని మించిపోయినప్పుడు, వాళ్ళు మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకొంటారు. 12 తద్వారా తమ మొదటి ప్రమాణాన్ని ఉల్లంఘిస్తారు. ఇలా చెయ్యటంవల్ల వాళ్ళకు శిక్ష లభిస్తుంది. 13 పైగా వాళ్ళు వ్యర్థంగా కాలయాపన చెయ్యటానికి, ఇంటింటికి తిరగటానికి అలవాటు పడిపోతారు. వాళ్ళిలా కాలయాపన చెయ్యటమే కాకుండా, యితర్ల విషయాల్లో జోక్యం కలిగించుకోవటానికి అలవాటుపడ్తారు. వాళ్ళకు మౌనంగా ఉండటం చేతకాదు. 14 అందువల్ల చిన్న వయస్సులో ఉన్న వితంతువులు పెళ్ళి చేసుకొని పిల్లల్ని కని, తమ యిండ్లను చూసుకోవాలి. ఇది నా సలహా. అప్పుడు వాళ్ళను నిందించడానికి యితర్లకు ఆస్కారము ఉండదు. 15 నిజానికి కొందరు సాతాన్ను అనుసరించటానికి యిదివరకే తిరిగి వెళ్ళారు.

16 క్రీస్తును విశ్వసించే స్త్రీ,[a] తన కుటుంబంలో వితంతువులున్నట్లైతే, వాళ్ళకు సహాయం చేయాలి. సంఘంపై ఆ భారం వేయరాదు. అప్పుడు క్రీస్తు సంఘం నిజంగా ఆసరాలేని వితంతువులకు సహాయం చేయకల్గుతుంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International