Revised Common Lectionary (Complementary)
146 యెహోవాను స్తుతించండి!
నా ప్రాణమా! యెహోవాను స్తుతించు!
2 నా జీవిత కాలమంతా నేను యెహోవాను స్తుతిస్తాను.
నా జీవిత కాలమంతా నేను ఆయనకు స్తుతులు పాడుతాను.
3 సహాయం కోసం మీ నాయకుల మీద ఆధారపడవద్దు.
మనుష్యులు నిన్ను రక్షించలేరు గనుక మనుష్యులను నమ్ముకోవద్దు.
4 మనుష్యులు చనిపోయి, పాతిపెట్టబడతారు.
అప్పుడు నీకు సహాయం చేసేందుకు వారు వేసిన పథకాలన్నీ పోయినట్టే.
5 సహాయం కోసం దేవుణ్ణి అడిగేవారు చాలా సంతోషంగా ఉంటారు.
ఆ మనుష్యులు వారి దేవుడైన యెహోవా మీద ఆధారపడతారు.
6 భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు.
సముద్రాన్నీ, అందులో ఉన్న సమస్తాన్నీ యెహోవా చేశాడు.
యెహోవా వాటిని శాశ్వతంగా కాపాడుతాడు.
7 అణచివేయబడిన ప్రజలకు యెహోవా సరియైన సహాయం చేస్తాడు.
ఆకలితో ఉన్న ప్రజలకు దేవుడు ఆహారం ఇస్తాడు.
చెరలోవున్న ప్రజలను యెహోవా విడుదల చేస్తాడు.
8 గుడ్డివారు మరల చూచుటకు యెహోవా సహాయం చేస్తాడు.
కష్టంలో ఉన్న ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు.
మంచి మనుష్యులను యెహోవా ప్రేమిస్తాడు.
9 మన దేశంలో నివసిస్తున్న పరాయి వాళ్లను యెహోవా కాపాడుతాడు.
విధవరాండ్రు, అనాథల విషయమై యెహోవా శ్రద్ధ తీసికొంటాడు.
అయితే దుర్మార్గుల పథకాలను యెహోవా నాశనం చేస్తాడు.
10 యెహోవా శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను.
సీయోనూ, నీ దేవుడు శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను.
యెహోవాను స్తుతించండి!
అప్పులు రద్దు చేసే ప్రత్యేక సంవత్సరం
15 “ప్రతి ఏడు సంవత్సరాల అంతంలో, మీరు అప్పులన్నీ రద్దుచేయాలి. 2 మీరు మీ అప్పులను రద్దు చేయాల్సిన పద్ధతి యిది; మరో ఇశ్రాయేలు మనిషికి అప్పు యిచ్చిన ప్రతి ఇశ్రాయేలు వ్యక్తీ తన అప్పును రద్దుచేయాలి. ఆతడు ఒక సోదరుణ్ణి (ఇశ్రాయేలీయుని) అప్పు తిరిగి చెల్లించమని అడగ కూడదు. ఎందుకంటే ఆ సంవత్సంరలో అప్పులన్నీ రద్దు అయిపొయాయని యెహోవా ప్రకటించాడు గనుక. 3 ఒక విదేశీయుడ్ని మీరు తిరిగి చెల్లించమని అడగవచ్చు. కానీ మరో ఇశ్రాయేలు మనిషి చెల్లించాల్సిన ఏ బాకీనైనా మీరు రద్దుచేయాలి. 4 ఆయితే మీ మధ్య బీద ప్రజలు ఎవరూ ఉండరు. ఎందుకంటే మీరు నివసించుటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో యెహోవా మిమ్మల్ని ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తాడు. 5 మీరు మీ దేవుడైన యెహోవాకు పూర్తిగా విధేయులైతేనే ఇది జరుగుతుంది. ఈ వేళ నేను మీకు చెప్పిన ప్రతి ఆజ్ఞకూ మీరు జాగ్రత్తగా విధేయులు కావాలి. 6 మీ దేవుడైన యెహోవా మీకు చేసిన వాగ్దానం ప్రకారం ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మరియు మీరు అనేక రాజ్యాలకు అప్పు ఇచ్చేంత ధనం మీకు ఉంటుంది. కాని మీరు మాత్రం ఇతరుల దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు అనేక రాజ్యలను పాలిస్తారు. కానీ ఆ రాజ్యాల్లో ఏదీ మిమ్మల్ని పాలించదు.
7 “మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు నివసించేటప్పుడు మీ ప్రజల మధ్య ఎవరైనా పేదవారు ఒకరు ఉండవచ్చును. మీరు స్వార్థపరులుగా ఉండకూడదు. ఆ పేద మనిషికి సహాయం చేసేందుకు మీరు నిరాకరించకూడదు. 8 మీరు అతనికి భాగం పంచిపెట్టేందుకు యిష్టపడాలి. ఆ వ్యక్తికి అవసరమైనవి అన్నీ అతనికి అప్పుగా ఇచ్చేందుకు మీరు ఇష్టపడాలి.
9 “ఏడవ సంవత్సరం అంటే అప్పులు రద్దుచేసే సంవత్సరం దగ్గర్లో ఉందని చెప్పి ఎవరికైనా అప్పు ఇచ్చేందుకు ఎన్నడూ తిరస్కరించవద్దు. అలాంటి చెడుతలంపు మీ మనసులో కలుగనియ్యవద్దు. సహాయం కావాల్సిన ఆ వ్యక్తిని గూర్చి నీవు ఎన్నడూ చెడుగా తలంచవద్దు. నీవు అతనికి సహాయం చేసేందుకు నిరాకరించకూడదు. ఆ పేదవానికి నీవు ఏమీ ఇవ్వకపోతే అతడు నీ మీద యెహోవాకు ఆరోపణ చేస్తాడు. మరియు యెహోవా నిన్ను పాపం చేసిన నేరస్థునిగా చూస్తాడు.
10 “పేదవానికి నీవు ఇవ్వగలిగినదంతా ఇవ్వు. అతనికి యిచ్చే విషయంలో చెడుగా భావించకు. ఎందుకంటే ఈ మంచి పని చేసినందుకు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదిస్తాడు. ఆయన నీ కార్యాలన్నిటిలోనూ, నీవు చేయు ప్రయత్నాలన్నిటిలోనూ, నిన్ను ఆశీర్వాదిస్తాడు. 11 దేశంలో పేద ప్రజలు ఎల్లప్పుడూ ఉంటారు. అందుకే మీ ప్రజలకు మీ దేశంలో అక్కరలో ఉండే పేద ప్రజలకు ఇచ్చేందుకు మీరు సిద్ధంగా ఉండాలని నేను మీకు ఆజ్ఞ యిస్తున్నాను.
15 ఈ కారణంగా క్రీస్తు క్రొత్త ఒడంబడికకు మధ్యవర్తి అయ్యాడు. ఈయన దేవుడు పిలిచినవాళ్ళకు దేవుడు వాగ్దానం చేసిన శాశ్వత వారసత్వం లభించేటట్లు చేస్తాడు. మొదటి ఒడంబడిక చెలామణిలో ఉండగా ప్రజలు చేసిన పాపాలకు తన ప్రాణాన్ని వెలగా చెల్లించి వాళ్ళకు స్వేచ్ఛ కలిగించాడు.
16 వీలునామా చెలామణిలోకి రావాలంటే, దాన్ని వ్రాసిన వ్యక్తి యొక్క మరణాన్ని నిరూపించటం అవసరం. 17 ఎందుకంటే, వ్రాసిన వాడు మరణిస్తే వీలునామా చెలామణిలోకి వస్తుంది. వీలునామా వ్రాసినవాడు జీవిస్తుంటే, అది ఎలా చెలామణిలోకి వస్తుంది? 18 ఈ కారణంగానే, మొదటి ఒడంబడిక కూడా రక్తాన్ని ఉపయోగించకుండా చెలామణి కాలేకపోయింది. 19 ధర్మశాస్త్రంలో ఉన్న నియమాల్ని మోషే ప్రజలకు ప్రకటించిన తర్వాత దూడల రక్తాన్ని నీళ్ళలో కలిపి, ఆ మిశ్రమాన్ని హిస్సోపు చెట్ల కొమ్మలతో, సింధూర వర్ణముగల గొఱ్ఱె బొచ్చుతో ధర్మశాస్త్ర గ్రంథం మీద, ప్రజల మీద చల్లాడు. 20 ఆ తర్వాత మోషే వాళ్ళతో, “దేవుడు తన ఒడంబడికను ఆచరించమని ఆజ్ఞాపించి ఈ ఒడంబడిక రక్తాన్ని మీకిచ్చాడు” అని అన్నాడు. 21 అదే విధంగా అతడు గుడారం మీద, సేవా సామగ్రి మీద ఆ రక్తాన్ని ప్రోక్షించాడు. 22 నిజానికి, యించుమించు అన్ని వస్తువుల్ని రక్తంతో పరిశుద్ధం చెయ్యాలని ధర్మశాస్త్రం ఆదేశిస్తుంది. రక్తం చిందించకపోతే పాపపరిహారం కలగదు.
యేసు క్రీస్తు మన పాపాలకు బలి
23 అందువల్ల పరలోకంలో ఉన్న వస్తువుల ప్రతిరూపాలను బలి యిచ్చి పరిశుద్ధం చేయవలసిన అవసరం ఏర్పడింది. కాని, పరలోకంలో ఉన్న వాటిని పవిత్రం చెయ్యటానికి యింకా మంచిరకమైన బలులు కావాలి. 24 భూమ్నీదవున్న ఈ పవిత్ర స్థానం నిజమైన దానికి ప్రతిరూపం మాత్రమే. క్రీస్తు మానవుడు నిర్మించిన ఈ పవిత్ర స్థానాన్ని కాదు ప్రవేశించింది. ఆయన మనకోసం పరలోకంలో ఉన్న దేవుని యొద్దకు వెళ్ళాడు.
© 1997 Bible League International