Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 51

సంగీత నాయకునికి: దావీదు కీర్తన. బత్షెబతో దావీదు పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త దావీదు దగ్గరకి వెళ్లినప్పుడు వ్రాసిన కీర్తన.

51 దేవా, నీ నమ్మకమైన ప్రేమ మూలంగా
    నా మీద దయ చూపించుము.
నీ మహా దయ మూలంగా
    నా పాపాలన్నీ తుడిచివేయుము.
దేవా, నా దోషం అంతా తీసివేయుము.
    నా పాపాలు కడిగివేసి, నన్ను మరల శుద్ధి చేయుము.
నేను పాపం చేశానని నాకు తెలుసు.
    నేను ఎల్లప్పుడు నా పాపాన్ని ఎరిగియున్నాను.
తప్పు అని నీవు చెప్పే వాటినే నేను చేసాను.
    దేవా, నీకే వ్యతిరేకంగా నేను పాపం చేసాను.
కనుక నేను దోషినని నీవు అన్నప్పుడు నీ మాట నిజమే.
    నీవు నన్ను నిందించేటప్పుడు నీవు న్యాయవంతుడవే.
నేను పాపంలో పుట్టాను.
    పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన ధరించింది.
దేవా, సంపూర్ణ భక్తిని లేదా యదార్థతను నీవు కోరతావు.
    అందుచేత నా హృదయంలో నాకు జ్ఞానమును బోధించుము.
హిస్సోపు ముక్కను ప్రయోగించి నన్ను పవిత్రం చేసే క్రమం జరిగించుము.
    నేను హిమం కంటె తెల్లగా ఉండేంతవరకు నన్ను కడుగుము.
నీవు విరుగ గొట్టిన ఎముకలను సంతోషించనిమ్ము.
    నన్ను సంతోషపరచుము! మరల నన్ను సంతోషపరచుము.
నా పాపాలను చూడకుము!
    వాటన్నింటినీ తుడిచి వేయుము.
10 దేవా, నాలో పవిత్ర హృదయాన్ని కలిగించుము
    నా ఆత్మను నూతనపరచి బలపరచుము.
11 నన్ను త్రోసివేయకుము!
    నీ పవిత్ర ఆత్మను నాలోనుండి తీసివేయకుము.
12 నీచేత రక్షించబడుట మూలంగా
    కలిగే ఆనందం నాకు తిరిగి ఇమ్ము!
    నీకు విధేయత చూపుటకు నా ఆత్మను సిద్ధంగా, స్థిరంగా ఉంచుము.
13 నీ జీవిత మార్గాలను నేను పాపులకు నేర్పిస్తాను.
    వారు తిరిగి నీ దగ్గరకు వచ్చేస్తారు.
14 దేవా, నన్ను ఘోర మరణమునుండి రక్షించుము.
    నా దేవా, నీవే నా రక్షకుడవు.
నీవు ఎంత మంచివాడవో నన్ను పాడనిమ్ము.
15     నా ప్రభువా, నా నోరు తెరచి, నీ స్తుతులు పాడనిమ్ము.
16 నీవు బలులు కోరటం లేదు.
    లేనియెడల నేను వాటిని అర్పిస్తాను. దహనబలులను నీవు కోరవు.
17 దేవా, నా విరిగిన ఆత్మయే నీకు నా బలి అర్పణ.
    దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు త్రోసివేయవు.

18 దేవా, సీయోను యెడల మంచితనము, దయ కలిగి ఉండుము.
    యెరూషలేము గోడలను కట్టుము.
19 అప్పుడు నీవు సరియైన బలులను, సంపూర్ణ దహనబలులను అనుభవిస్తావు.
    మరియు ప్రజలు మరల నీ బలిపీఠం మీద ఎద్దులను అర్పిస్తారు.

ద్వితీయోపదేశకాండము 28:58-29:1

58 “ఈ గ్రంథంలో వ్రాయబడిన చట్టంలోని ఆదేశాలన్నింటికీ మీరు విధేయులు కావాలి. భయంకరమైన, అద్భుతమైన మీ దేవుడైన యెహోవా నామాన్ని మీరు గౌరవించాలి. మీరు విధేయులు కాకపోతే, అప్పుడు 59 యెహోవా మీకు దారుణమైన కష్టాలు కలిగిస్తాడు. మరియు మీ సంతతివారు గొప్ప కష్టాలు చాలకాలం కొనసాగే భయంకర రోగాలు అనుభవిస్తారు. 60 మీరు ఈజిప్టులో చాలా కష్టాలు, రోగాలు చూసారు. అవి మిమ్మల్ని భయస్తుల్నిగా చేసాయి. ప్రభువు ఆ చెడ్డ వాటన్నిటినీ మీ మీదికి రప్పిస్తాడు. 61 ఈ గ్రంథంలో వ్రాయబడని ప్రతి విధమైన ప్రతి రోగాన్ని, ప్రతి కష్టాన్నియెహోవా మీ మీదికి రప్పిస్తాడు. మీరు నాశనం అయ్యేంతవరకు ఆయన ఇలా చేస్తూనే ఉంటాడు. 62 మీరు ఆకాశ నక్షత్రాలు ఉన్నంత మంది ఉండవచ్చు. కానీ మీలో కొంచెంమంది మాత్రమే మిగులుతారు. ఎందుకు మీకు ఇలా జరుగుతుంది? మీరు మీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక.

63 “ఇదివరకు మీకు మేలు చేసి, మీ రాజ్యాన్ని విశాలపరచాలంటే. యెహోవాకు సంతోషం. అదే విధంగా మిమ్మల్ని పాడుచేసి, నాశనం చేయటానికి యెహోవా సంతోషిస్తాడు. మీరు మీ స్వంతంగా తీసుకొనేందుకు ప్రవేశిస్తున్న దేశంలోనుండి మీరు తొలగించివేయబడతారు. 64 భూమి ఈవైపునుండి ఆ వైపునకు గల ప్రపంచ ప్రజలందరి మధ్యకు యెహోవా మిమ్మల్ని చెదరగొట్టివేస్తాడు. మీరు గాని మీ పూర్వీకులు గాని ఎన్నడూ ఆరాధించని దేవుళ్లను, చెక్క, రాతితో చేసిన దేవుళ్లను మీరు సేవిస్తారు.

65 “ఈ రాజ్యాలలో మీకు ఏ మాత్రం శాంతి ఉండదు. మీరు విశ్రాంతి తీసుకొనే చోటు ఎక్కడా ఉండదు. యెహోవా మీ మనస్సులను చింతతో నింపేస్తాడు. మీ కళ్లు భారంగా ఉంటాయి. మీరు చాలా అల్లకల్లోలంగా ఉంటారు. 66 మీరు ప్రమాదంలో ఎల్లప్పుడూ అనుమానంగా జీవిస్తారు. రాత్రింబవళ్లు మీకు భయం కలుగుతూ ఉంటుంది. మీ జీవితాల విషయం మీకు ఎన్నడూ గట్టి నమ్మకం ఉండదు. 67 ‘ఇది సాయంత్రం అయితే బాగుండును’ అని ఉదయాన మీరంటారు. ‘ఇది ఉదయం అయితే బాగుండును’ అని సాయంత్రం అంటారు. ఎందుకంటే మీ హృదయంలో ఉండే భయంవల్ల, మీరు చూసే చెడు సంగతులవల్ల. 68 యెహోవా మళ్లీ మిమ్మల్ని ఓడల్లో ఈజిప్టుకు పంపిస్తాడు. మీరు మళ్లీ ఎన్నటికీ తిరిగి ఆ స్థలానికి తిరిగి వెళ్లనవసరం లేదని నేను మీతో చెప్పాను, కానీ యెహోవా మిమ్మల్ని అక్కడికి పంపిస్తాడు. అక్కడ మీరు మీ శత్రువులకు బానిసలుగా అమ్ముడుబోయేందుకు ప్రయత్నిస్తారు. కానీ మిమ్మల్ని ఎవరూ కొనరు.”

మోయాబులో ఒడంబడిక

29 మోయాబు దేశంలో మోషే ఇశ్రాయేలు ప్రజలతో చేయాల్సిందిగా. యెహోవా చెప్పిన ఒడంబడికలో భాగమే ఈ విషయాలు. హోరేబు (సీనాయి) కొండమీద ఇశ్రాయేలు ప్రజలతో యెహోవా చేసిన ఒడంబడిక గాక యిది ఆయన చేసిన మరో ఒడంబడిక.

అపొస్తలుల కార్యములు 7:17-29

17 “దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానం ఫలించే సమయం దగ్గరకు వచ్చింది. ఈజిప్టులో మన వాళ్ళ సంఖ్య బహుగా పెరిగింది. 18 కొంత కాలం తర్వాత యోసేపును గురించి ఏమీ తెలియనివాడు ఈజిప్టు దేశానికి పాలకుడయ్యాడు. 19 అతడు మన వాళ్ళను మోసం చేసాడు. మన వాళ్ళ సంతానం చనిపోవాలని, వాళ్ళకు పుట్టిన పసికందుల్ని బయట వేయించి వాళ్ళ పట్ల క్రూరంగా ప్రవర్తించాడు.

20 “ఆ కాలంలోనే మోషే జన్మించాడు. ఇతడు సామాన్యుడు కాడు. మోషే మూడు నెలల దాకా తన తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు. 21 ఇతణ్ణి యింటి బయట ఉంచగానే ఫరో కుమార్తె తీసుకెళ్ళి తన స్వంత కుమారునిగా పెంచుకుంది. 22 ఈజిప్టు దేశస్థుల జ్ఞానాన్నంతా అతనికి నేర్పించింది. మోషే గొప్ప విషయాలు చెప్పటంలో గొప్ప పనులు చేయటంలో ఆరితేరినవాడయ్యాడు.

23 “మోషేకు నలభై సంవత్సరాలు రాగానే అతడు తన తోటి ఇశ్రాయేలు ప్రజల్ని కలుసుకొన్నాడు. 24 ఒకసారి, మోషే ఈజిప్టు దేశస్థుడు ఇశ్రాయేలు వానితో అన్యాయంగా ప్రవర్తించటం చూసి ఇశ్రాయేలువానికి సహాయం చెయ్యాలనే ఉద్దేశ్యంతో, అతణ్ణి రక్షించటానికి వెళ్ళాడు. ఈజిప్టు దేశస్థుణ్ణి చంపి ఇశ్రాయేలు వాని పక్షాన పగ తీర్చుకున్నాడు. 25 ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించటానికి దేవుడు తనను ఉపయోగిస్తున్న విషయం వాళ్ళు తెలుసుకొంటారని మోషే ఆశించాడు. కాని వాళ్ళకది అర్థం కాలేదు.

26 “మరుసటి రోజు మోషే యిద్దరు ఇశ్రాయేలీయులు పోట్లాడటం చూసి, వాళ్ళను శాంత పరచాలనే ఉద్దేశ్యంతో, ‘అయ్యా! మీరు సోదరులు! పరస్పరం ఎందుకు పోట్లాడుతున్నారు?’ అని అడిగాడు. 27 ఏ ఇశ్రాయేలు వాడు తోటివాడికి అన్యాయం చేశాడో వాడు, మోషేను ప్రక్కకు త్రోసి, ‘మా మీద తీర్పు చెప్పటానికి, మమ్మల్ని పాలించటానికి నిన్నెవరు నియమించారు? 28 ఈజిప్టు దేశస్థుణ్ణి నిన్న చంపినట్లు నన్ను కూడా చంపాలని చూస్తున్నావా?’ అని అన్నాడు. 29 ఈ విమర్శ విని మోషే ఈజిప్టు దేశాన్ని వదిలి, మిద్యాను దేశానికి పారిపోయి అక్కడ పరదేశీయునిగా స్థిరపడ్డాడు. అక్కడ అతనికి యిద్దరు కుమారులు కలిగారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International