Revised Common Lectionary (Complementary)
23 ఒకడు జాగ్రత్తగా నడిచేందుకు యెహోవా సహాయం చేస్తాడు.
వాని నడవడియందు యెహోవా ఆనందిస్తాడు.
24 అతడు తొట్రుపడినా పడిపోడు,
ఎందుకంటే యెహోవా వాని చేయిపట్టుకొని పడిపోకుండా చేస్తాడు.
25 నేను యువకునిగా ఉండేవాడ్ని, ఇప్పుడు ముసలివాడినయ్యాను.
మంచి మనుష్యులకు దేవుడు సహాయం చేయకుండా విడిచిపెట్టడం నేను ఎన్నడూ చూడలేదు.
మంచి మనుష్యుల పిల్లలు భోజనం కోసం భిక్షం ఎత్తుకోవడం నేను ఎన్నడూ చూడలేదు.
26 మంచి మనిషి ఇతరులకు ఎల్లప్పుడూ ఉచితంగానే ఇస్తూంటాడు.
మంచి మనిషి పిల్లలు ఆశీర్వాదం పొందుతారు.
27 నీవు చెడు పనులు చేయటం మానివేసి మంచి పనులు చేస్తే
అప్పుడు నీవు శాశ్వతంగా జీవిస్తావు.
28 యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు.
ఆయన తన భక్తులకు సహాయం చేయకుండా విడిచిపెట్టడు.
యెహోవా తన భక్తులను ఎల్లప్పుడూ కాపాడతాడు.
కాని దుష్టులను ఆయన నాశనం చేస్తాడు.
29 మంచి మనుష్యులకు దేవుడు వాగ్దానం చేసిన భూమి దొరుకుతుంది.
వారు దానిమీద శాశ్వతంగా నివసిస్తారు.
30 మంచి మనిషి మంచి సలహా యిస్తాడు.
అతని నిర్ణయాలు ప్రతి ఒక్కరికి న్యాయంగా ఉంటాయి.
31 యెహోవా ఉపదేశాలు మంచి మనిషి హృదయంలో ఉంటాయి.
అతడు సరిగా జీవించే విధానాన్ని విడిచిపెట్టడు.
32 కాని చెడ్డవాళ్లు, మంచివాళ్లను బాధించే మార్గాలను వెదకుతారు.
మరియు చెడ్డవాళ్లు మంచివాళ్లను చంపటానికి ప్రయత్నిస్తారు.
33 యెహోవా దుష్టుల శక్తికి మంచివారిని వదిలి వేయడు.
మంచివారిని దోషులుగా ఆయన తీర్చబడనీయడు.
34 యెహోవా సహాయం కోసం కనిపెట్టుము. యెహోవాను అనుసరించుము.
దుర్మార్గులు నాశనం చేయబడతారు. కాని యెహోవా నిన్ను ప్రముఖునిగా చేస్తాడు,
మరియు దేవుడు వాగ్దానం చేసిన భూమిని నీవు పొందుతావు.
35 శక్తిమంతులైన దుర్మార్గులను నేను చూశాను.
వారి శక్తి ఒక బలమైన, ఆరోగ్యమైన వృక్షంలా పెరుగుతూ వచ్చింది.
36 కాని తర్వాత వారు లేకుండా పోయారు.
నేను వారికోసం చూశాను, కాని వారు నాకు కనబడలేదు.
37 నీతి, నిజాయితీ కలిగి ఉండి,
సమాధానపరచువారి సంతతి నిలుస్తుంది. అది శాంతి కలిగిస్తుంది.
38 అయితే చట్టాన్ని ఉల్లంఘించే వారందరు నాశనం చేయబడతారు.
వారి సంతానం భూమిని వదలవలసి వస్తుంది.
39 నీతిమంతులను యెహోవా రక్షిస్తాడు.
నీతిమంతులకు కష్టాలు వచ్చినప్పుడు యెహోవా వారికి బలంగా ఉంటాడు.
40 నీతిమంతులకు యెహోవా సహాయం చేస్తాడు. వారిని రక్షిస్తాడు.
నీతిమంతులు సహాయంకోసం యెహోవా దగ్గరకు వస్తారు, మరియు యెహోవా దుర్మార్గుల నుండి వారిని రక్షిస్తాడు.
సౌలును రాజుగా సమూయేలు ప్రకటించుట
17 మిస్పావద్ద యెహోవాను కలుసుకొనేందుకు ఇశ్రాయేలీయులంతా సమావేశం కావాలని సమూయేలు పిలుపునిచ్చాడు. 18 సమూయేలు ఇలా అన్నాడు: “నేను ఇశ్రాయేలును ఈజిప్టునుంచి బయటకు తీసుకుని వచ్చాను. ‘నేను మిమ్మల్ని ఈజిప్టు బంధంనుండి విడుదల చేశాను. మిమ్మల్ని బాధించటానికి ప్రయత్నించిన ఇతర రాజ్యాలనుండి కూడా మిమ్మల్ని రక్షించాను.’ అని ఇశ్రాయేలీయుల యెహోవా దేవుడు చెప్పాడు: 19 మళ్లీ ఇశ్రాయేలీయులతో సమూయేలు ఇలా అన్నాడు: ‘మీ అందరి కష్టనష్టాల నుండి మీ దేవుడు మిమ్మల్ని కాపాడుతూ వస్తూనే వున్నాడు. కానీ నేడు మీరు మీ దేవుని తిరస్కరించారు. మిమ్మల్ని పాలించటానికి మీకో రాజు కావాలని అడుగుతున్నారు.’ సరే. రండి! మీమీ వంశాల వారీగా, కుటుంబాల వారీగా దేవుని ముందర నిలబడండి.”
20 ఇశ్రాయేలు వంశాల వారినందరినీ సమూయేలు ఒక చోట చేర్చాడు. వారిలో బెన్యామీను వంశం ఎన్నుకోబడింది. 21 బెన్యామీను వంశంలో వున్న కుటుంబాల వారందరినీ గుంపు గుంపుగా వరుసగా నడిపించాడు. వాటిలో మథ్రీ కుటుంబం ఎన్నుకోబడింది. మరల మథ్రీ కుటుంబంలోని వారందరినీ వరుసుగా నడిపించాడు. వారిలో కీషు కుమారుడు సౌలు ఎంపిక చేయబడ్డాడు.
సౌలును చూడాలని వచ్చిన ప్రజలు అతనికోసం వెదకగా అతడు కనిపించలేదు. 22 “ఆ మనిషి ఇక్కడ ఉన్నాడా?” అని ప్రజలు అడిగారు.
“సౌలు సామానుల వెనుక దాగి ఉన్నాడని” యెహోవా చెప్పాడు.
23 జనం పరుగెత్తుకుంటూ పోయి సామాన్ల వెనుక దాగుకొని ఉన్న సౌలును తీసుకుని వచ్చారు. సౌలు వారందరిలో నిలబడి ఉన్నపుడు అతను అందరికంటె ఎత్తుగా, ఆజానుబాహుడుగా కనబడ్డాడు.
24 “ఇదిగో చూడండి, యెహోవా ఎంపిక చేసిన మనిషి, ప్రజలలో సౌలువంటివాడు ఒక్కడూ లేడు.” అని సమూయేలు ప్రజలందరితో అన్నాడు.
అప్పుడు ప్రజలు, “రాజు దీర్ఘకాలం జీవించునుగాక!” అని అరిచారు.
25 నూతన రాజ్యంలో నిబంధనావళిని సమూయేలు ప్రజలకు వివరించాడు. రాజ్యపరిపాలన నియమాలను, నిబంధనలను ఒక పుస్తకంలో వ్రాసి సమూయేలు యెహోవా ముందర ఉంచాడు. అలా చేసి సమూయేలు ప్రజలను తమ తమ ఇండ్లకు వెళ్లమన్నాడు.
13 దేవుడు అబ్రాహాముతో వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్పవాడెవ్వడూ లేనందు వలన స్వయంగా తన మీదే ప్రమాణం తీసుకొంటూ, 14 ఇలా అన్నాడు: “నేను నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాను. నీ సంతతిని అభివృద్ధి పరుస్తాను.” 15 అబ్రాహాము ఓర్పుతో కాచుకొన్నాడు. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు.
16 ప్రజలు తమకన్నా గొప్పవాళ్ళ మీద ప్రమాణం చేస్తారు. ఈ ప్రమాణాలు వివాదాలు సాగనీయకుండా చేసి మాటల్లో మీ సత్యాన్ని దృఢ పరుస్తాయి. 17 దేవుడు తన వాగ్దానం విషయంలో తన ఉద్దేశ్యాన్ని మార్చుకోనని వాగ్దానం పొందిన వారసులకు స్పష్టం చేయాలనుకున్నాడు. అందువల్ల ఆ వాగ్దానాన్ని తన మీద ప్రమాణం చేసి దృఢపరిచాడు. 18 అందువల్ల ఈ “రెండూ” మార్పు చెందలేవు. వీటివిషయంలో దేవుడు అసత్యమాడలేడు.
తానివ్వబోయేవాటికోసం ఆశాభావంతో పరుగెత్తుతున్నవాళ్ళకు ప్రోత్సాహం కలగాలని ఈ ప్రమాణం చేశాడు. 19 భద్రతను, దృఢత్వాన్ని కలిగించే ఈ నిరీక్షణ మన ఆత్మలకు లంగరు లాంటిది. ఈ నిరీక్షణ తెరవెనుక లోపలి భాగంలో స్థిరముగా ప్రవేశించగలదు. 20 యేసు మన కోసం, మనకన్నా ముందు ఆ తెరలోపలికి వెళ్ళాడు. మెల్కీసెదెకు క్రమంలో యేసు కూడా శాశ్వతంగా ప్రధాన యాజకుడుగా ఉంటాడు.
© 1997 Bible League International