Revised Common Lectionary (Complementary)
4 నిశ్చయంగా ఆయన మన వ్యాధులను భరించాడు. మన బాధలను మోశాడు. అయినా, ఆయన్ని కొట్టిన వానిగాను, హింసించిన వానిగాను, బాధించిన వానిగాను, మనం తలంచాం. 5 కాని మనం చేసిన చెడ్డ పనులకు ఆయన శ్రమపొందాల్సి వచ్చింది. మన దోషం మూలంగానే ఆయన నలుగగొట్టబడ్డాడు. మనకు సమాధాన మిచ్చిన శిక్ష ఆయన మీద పడింది. ఆయన గాయాల మూలంగా మనకు స్వస్థత కలిగింది. 6 కానీ ఆయన ఇలా చేసిన తర్వాత కూడా మనం అందరం గోర్రెలవలె త్రోవతప్పి పోయి తిరిగాం. మనం మనకు ఇష్టమైన దారిలో పోయాం. మన అందరి దోషాన్ని యెహోవా ఆయన మీద వేశాడు.
7 ఆయన భాధించబడ్డాడు, శిక్షించబడ్డాడు, కానీ ఎన్నడూ ఎదురు చెప్పలేదు. వధించబడుటకు తీసుకొని పొబడే గొర్రెవలె ఆయన మౌనంగా ఉన్నాడు. ఒక గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించేటప్పుడు ఎలా మౌనంగా ఉంటుందో అలా ఆయన మౌనంగా ఉన్నాడు. తనను తాను రక్షించుకోవటానికి ఆయన నోరు తెరవలేదు. 8 ఆయన అబద్ధపు తీర్పుపొంది, బంధించబడి తీసుకొని పోబడ్డాడు. ఆయన తరంలో ఈ విషయాలు ఎవరు మనస్సుకు తీసుకొన్నారు? ఆయన భూమిమీద నివసిస్తున్న వారిలో నుండి తొలగించబడ్డాడు. నా ప్రజల అపరాధాల కోసం ఆయన నలుగ కొట్టబడ్డాడు. 9 ఆయన చనిపోయి ధనికునితో పాతి పెట్టబడ్డాడు. దుష్టులతో పాటు ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన దౌర్జన్యం చేయలేదు. ఆయన ఎన్నడూ మోసం చేయలేదు.
10 అయినా ఆయన్ని నలుగ గొట్టాలని శ్రమకలిగించాలని, యెహోవాకు ఇష్టం. యెహోవా ఆయన ప్రాణాన్ని పాప పరిహర బలిగా అర్పించితే ఆయన బహుకాలం జీవించి తన సంతానాన్ని చూస్తాడు. ఆయనలో యెహోవా చిత్తం సఫలమవుతుంది. 11 ఆయన తన ఆత్మలో ఎన్నో శ్రమల పొందిన తర్వాత వెలుగును చూచి సంతృప్తి చెందుతాడు.
నీతిమంతుడైన నా సేవకుడు తన జ్ఞానం వల్ల అనేకులను నీతిమంతులుగా చేస్తాడు. 12 ఈ కారణం చేత నేను గొప్ప ప్రజలతో ఆయన్ని గొప్పవాడినిగా చేస్తాను. బలముగల ప్రజలందరిలో ఆయనకు అన్నింటిలోనూ భాగం ఉంటుంది. ఎందుకంటే మనుష్యుల కోసం ఆయన తన ప్రాణం ఇచ్చి మరణించాడు. ఆయన నేరస్థులలో ఒకనిగా లెక్కించబడ్డాడు. అనేకుల పాపాల్ని ఆయన మోసి అపరాదుల కోసం విజ్ఞాపన చేసాడు.
9 ఎందుకంటే నీవు యెహోవాను నమ్ముకొన్నావు గనుక.
సర్వోన్నతుడైన దేవుణ్ణి నీ క్షేమ స్థానంగా చేసుకొన్నావు గనుక.
10 కీడు ఏమీ నీకు జరగదు.
నీ ఇంట ఎలాంటి వ్యాధి ఉండదు.
11 ఎందుకంటే నిన్ను కనిపెట్టుకొని ఉండుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీవు ఎక్కడికి వెళ్లినా వారు నిన్ను కాపాడుతారు.
12 నీ పాదం రాయికి తగులకుండా
దేవదూతలు వారి చేతులతో నిన్ను పైకి ఎత్తుతారు.
13 సింహాల మీద, విషసర్పాల మీద
నడిచే శక్తి నీకు ఉంటుంది.
14 యెహోవా చెబుతున్నాడు: “ఒక వ్యక్తి నన్ను నమ్ముకొంటే, నేను అతన్ని రక్షిస్తాను.
నా పేరు అతనికి తెలుసు కనుక నేను కాపాడుతాను.
15 నా అనుచరులు సహాయంకోసం నాకు మొరపెడ్తారు.
నేను వారికి జవాబు ఇస్తాను.
వారికి కష్టం కలిగినప్పుడు నేను వారితో ఉంటాను. నేను వారిని తప్పించి, ఘనపరుస్తాను.
16 నా అనుచరులకు నేను దీర్ఘాయుష్షు యిస్తాను.
నేను వాళ్లను రక్షిస్తాను.”
5 ఆధ్యాత్మిక విషయాల్లో, తమ పక్షాన పని చెయ్యటానికి ప్రజలు తమ నుండి ప్రధాన యాజకుని ఎన్నుకొంటారు. పాప పరిహారార్థం అర్పించే కానుకల్ని, బలుల్ని దేవునికి యితడు సమర్పిస్తాడు. 2 ఇతనిలో కూడా ఎన్నో రకాల బలహీనతలు ఉంటాయి కనుక, అజ్ఞానంతో తప్పులు చేస్తున్న ప్రజల పట్ల యితడు సానుభూతి కనుబరుస్తాడు. 3 ఈ కారణంగానే, ప్రజల పాపాలకు బలిని అర్పించినట్లే తన పాపాలకు కూడా బలిని అర్పించవలసి వుంటుంది.
4 ప్రధాన యాజకుని స్థానం గౌరవనీయమైంది. ఆ స్థానాన్ని ఎవ్వరూ, స్వయంగా ఆక్రమించలేరు. దేవుడు అహరోనును పిలిచినట్లే ఈ స్థానాన్ని ఆక్రమించటానికి అర్హత గలవాణ్ణి పిలుస్తాడు. 5 క్రీస్తు ప్రధాన యాజకుని యొక్క గౌరవ స్థానాన్ని స్వయంగా ఆక్రమించలేదు. దేవుడాయనతో,
“నీవు నా కుమారుడవు.
నేడు నేను నీకు తండ్రినయ్యాను”(A)
అని చెప్పి మహిమ పరచాడు. 6 మరొక చోట, ఇలా అన్నాడు:
“నీవు మెల్కీసెదెకు వలె చిరకాలం
యాజకుడవై ఉంటావు.”(B)
7 యేసు తాను భూమ్మీద జీవించినప్పుడు తనను చావునుండి రక్షించగల దేవుణ్ణి కళ్ళనిండా నీళ్ళు పెట్టుకొని పెద్ద స్వరంతో ప్రార్థించి వేడుకొన్నాడు. ఆయనలో భక్తి, వినయం ఉండటంవల్ల దేవుడాయన విన్నపం విన్నాడు. 8 యేసు దేవుని కుమారుడైనా, తాననుభవించిన కష్టాల మూలంగా విధేయతతో ఉండటం నేర్చుకొన్నాడు. 9 పరిపూర్ణత పొందాక, తన పట్ల విధేయతగా ఉన్నవాళ్ళందరికీ శాశ్వతమైన రక్షణ ప్రసాదించ గలవాడయ్యాడు. 10 దేవుడు మెల్కీసెదెకు యొక్క క్రమంలో యేసును ప్రధాన యాజకునిగా నియమించాడు.
యాకోబు మరియు యోహానుల నివేదన
(మత్తయి 20:20-28)
35 జెబెదయి కుమారులు యాకోబు మరియు యోహానులు ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్ళు, “బోధకుడా! మేము అడిగింది చెయ్యమని కోరుతున్నాము” అని అన్నారు.
36 “ఏమి చెయ్యమంటారు?” అని యేసు అడిగాడు.
37 వాళ్ళు, “మీరు మహిమను పొందినప్పుడు మాలో ఒకరిని మీ కుడిచేతి వైపు, మరొకరిని మీ ఎడమచేతివైపు కూర్చోనివ్వండి” అని అడిగారు.
38 యేసు, “మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు. నేను త్రాగినదాన్ని మీరు త్రాగగలారా? నేను పొందిన బాప్తిస్మము మీరు పొందగలరా?” అని అడిగాడు.
39 “పొందగలము” అని వాళ్ళు సమాధానం చెప్పారు. యేసు వాళ్ళతో, “నేను త్రాగిన దాన్ని మీరు త్రాగుదురు, నేను పొందిన బాప్తిస్మము మీరు పొందుదురు. 40 కాని నా కుడివైపు, లేక నా ఎడమ వైపు కూర్చోమనటానికి అనుమతి యిచ్చేది నేను కాదు. ఈ స్థానాలు ఎవరి కోసం నియమించబడ్డాయో వాళ్ళు మాత్రమే కూర్చోగలరు” అని అన్నాడు.
41 ఇది విని మిగతా పది మందికి యాకోబు మరియు యోహానులపై కోపం వచ్చింది. 42 యేసు వాళ్ళను దగ్గరకు పిలిచి, “యూదులుకాని వాళ్ళను పాలించ వలసిన ప్రభువులు, వాళ్ళపై తమ అధికారం చూపుతూ ఉంటారు. ఇతర అధికారులు కూడా వాళ్ళపై అధికారం చూపుతూ ఉంటారు. ఇది మీకు తెలుసు. 43 మీ విషయంలో అలా కాదు. మీలో అందరి కన్నా గొప్ప కావాలనుకున్నవాడు మిగతా వాళ్ళందరికి సేవ చేయాలి. 44 మీలో ప్రాముఖ్యత పొందాలనుకొన్నవాడు మీ అందరికి బానిసగా ఉండాలి. 45 ఎందుకంటే మనుష్యకుమారుడు కూడా సేవ చేయించుకోవటానికి రాలేదు. కాని సేవ చేయటానికి, అందరి పక్షాన తన ప్రాణాన్ని క్రయధనంగా ధారపోయటానికి వచ్చాడు” అని అన్నాడు.
© 1997 Bible League International