Revised Common Lectionary (Complementary)
9 ఎందుకంటే నీవు యెహోవాను నమ్ముకొన్నావు గనుక.
సర్వోన్నతుడైన దేవుణ్ణి నీ క్షేమ స్థానంగా చేసుకొన్నావు గనుక.
10 కీడు ఏమీ నీకు జరగదు.
నీ ఇంట ఎలాంటి వ్యాధి ఉండదు.
11 ఎందుకంటే నిన్ను కనిపెట్టుకొని ఉండుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీవు ఎక్కడికి వెళ్లినా వారు నిన్ను కాపాడుతారు.
12 నీ పాదం రాయికి తగులకుండా
దేవదూతలు వారి చేతులతో నిన్ను పైకి ఎత్తుతారు.
13 సింహాల మీద, విషసర్పాల మీద
నడిచే శక్తి నీకు ఉంటుంది.
14 యెహోవా చెబుతున్నాడు: “ఒక వ్యక్తి నన్ను నమ్ముకొంటే, నేను అతన్ని రక్షిస్తాను.
నా పేరు అతనికి తెలుసు కనుక నేను కాపాడుతాను.
15 నా అనుచరులు సహాయంకోసం నాకు మొరపెడ్తారు.
నేను వారికి జవాబు ఇస్తాను.
వారికి కష్టం కలిగినప్పుడు నేను వారితో ఉంటాను. నేను వారిని తప్పించి, ఘనపరుస్తాను.
16 నా అనుచరులకు నేను దీర్ఘాయుష్షు యిస్తాను.
నేను వాళ్లను రక్షిస్తాను.”
10 నీవు చెడ్డ పనులు చేసి కూడ క్షేమంగా ఉన్నానని అనుకొంటున్నావు.
‘నేను చేసే తప్పు పనులు ఎవరూ చూడటం లేదు’ అని నీవు అనుకొంటావు.
నీవు తప్పు చేస్తావు. కానీ నీ జ్ఞానం, నీ తెలివి నిన్ను రక్షిస్తాయి అనుకొంటావు.
‘నేను ఒక్క దాన్ని తప్ప నా అంతటి ప్రముఖులు ఇంకెవరూ లేరు’ అని నీవు అంటావు.
11 “అయితే నీకు కష్టాలు వస్తాయి.
అది ఎప్పుడు జరుగుతుందో నీకు తెలియదు. కాని నాశనం వచ్చేస్తుంది.
ఆ కష్టాలను ఆపుజేసేందుకు నీవు ఏమీ చేయలేవు. నీవు త్వరగా నాశనం చేయబడతావు.
నీకు ఏమి జరిగిపోయిందో కూడా నీకు తెలియదు.
12 నీ జీవితాంతం నీవు కష్టపడి పనిచేశావు.
ఉపాయాలు, మంత్రాలు నేర్చుకొన్నావు.
కనుక నీ ఉపాయాలు, మంత్రాలు ప్రయోగించటం ప్రారంభించు.
ఒకవేళ ఆ ఉపాయాలు నీకు సహాయపడతాయేమో!
ఒకవేళ నీవు ఎవరినైనా భయపెట్టగలుగుతావేమో.
13 నీకు ఎంతెంతో మంది సలహాదారులు
వాళ్లు నీకిచ్చే సలహాలతో నీవు విసిగిపోయావా?
నక్షత్ర శాస్త్రం తెలిసిన నీ మనుష్యులను వాళ్లు బయటకు పంపిస్తారు.
నెల ప్రారంభం ఎప్పుడో వాళ్లు చెప్పగలుగుతారు.
ఒకవేళ నీ కష్టాలు ఎప్పుడు మొదలవుతాయో వాళ్లు చెప్పగలుగుతారేమో.
14 అయితే ఆ మనుష్యులు కనీసం వాళ్లనే వాళ్లు రక్షించుకోలేరు.
వాళ్లు గడ్డిలా కాలిపోతారు.
వాళ్లు త్వరగా కాలిపోయినందుచేత రొట్టె కాల్చుకొనేందుకు గూడ నిప్పులు మిగులవు.
వెచ్చగా కాచుకొనేందుకు మంటగూడా మిగలదు.
15 నీవు కష్టపడి సంపాదించిన దానంతటికీ అలా జరుగుతుంది.
నీవు చిన్న పిల్లగా ఉన్నప్పట్నుంచీ నీతో వ్యాపారం చేసిన వారు నిన్ను వదిలివేస్తారు
ప్రతివాడూ వాని వాని దారిన పోతాడు.
నిన్ను రక్షించేందుకు ఒక్క మనిషి కూడా ఉండడు.”
ఎవరు గొప్ప
24 ఆ తర్వాత వాళ్ళలో, “ఎవరు గొప్ప” అన్న విషయంపై వాదన మొదలైంది. 25 యేసు వాళ్ళతో, “యూదులుకాని వాళ్ళను, వాళ్ళ రాజులు క్రూరంగా పాలిస్తారు. అధికారంలో ఉన్నవాళ్ళు తమను పొగడమని ప్రజల్ని ఒత్తిడి చేస్తారు. 26 కాని మీరు అలా ఉండకూడదు. మీలో అందరికన్నా గొప్పవాడు అందరికన్నా చిన్నవానిలా మెలగాలి. నాయకుడు సేవకునిలా ఉండాలి. 27 ఎవరు గొప్ప? భోజనానికి కూర్చొన్నవాడా లేక భోజనం వడ్డించేవాడా? భోజనానికి కూర్చొన్న వాడేకదా! కాని నేను మీ సేవకునిలా ఉంటున్నాను.
28 “మీరు నా కష్టసమయాల్లో నా వెంట ఉన్నవాళ్ళు. 29 కనుక నా తండ్రి నాకు రాజ్యాన్ని అప్పగించి నట్లు నేను మీకు రాజ్యాన్ని అప్పగిస్తాను. 30 అప్పుడు మీరు నా రాజ్యంలో నాతో కలిసి కూర్చొని తింటారు. సింహాసనాలపై కూర్చుని పండ్రెండు వంశాల వారిపై తీర్పు చేస్తారు.
© 1997 Bible League International