Revised Common Lectionary (Complementary)
9 ఎందుకంటే నీవు యెహోవాను నమ్ముకొన్నావు గనుక.
సర్వోన్నతుడైన దేవుణ్ణి నీ క్షేమ స్థానంగా చేసుకొన్నావు గనుక.
10 కీడు ఏమీ నీకు జరగదు.
నీ ఇంట ఎలాంటి వ్యాధి ఉండదు.
11 ఎందుకంటే నిన్ను కనిపెట్టుకొని ఉండుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీవు ఎక్కడికి వెళ్లినా వారు నిన్ను కాపాడుతారు.
12 నీ పాదం రాయికి తగులకుండా
దేవదూతలు వారి చేతులతో నిన్ను పైకి ఎత్తుతారు.
13 సింహాల మీద, విషసర్పాల మీద
నడిచే శక్తి నీకు ఉంటుంది.
14 యెహోవా చెబుతున్నాడు: “ఒక వ్యక్తి నన్ను నమ్ముకొంటే, నేను అతన్ని రక్షిస్తాను.
నా పేరు అతనికి తెలుసు కనుక నేను కాపాడుతాను.
15 నా అనుచరులు సహాయంకోసం నాకు మొరపెడ్తారు.
నేను వారికి జవాబు ఇస్తాను.
వారికి కష్టం కలిగినప్పుడు నేను వారితో ఉంటాను. నేను వారిని తప్పించి, ఘనపరుస్తాను.
16 నా అనుచరులకు నేను దీర్ఘాయుష్షు యిస్తాను.
నేను వాళ్లను రక్షిస్తాను.”
బబులోనుకు దేవుని సందేశం
47 “కల్దీయుల కుమారీ, కన్యకా
మట్టిలో పడి, అక్కడే కూర్చో. నేల మీద కూర్చో.
ఇప్పుడు నీవు పరిపాలించటం లేదు.
ప్రజలు ఇంక నిన్ను చక్కనిదానా అని, అందగత్తె అని పిలువరు.
2 ఇప్పుడు నీవు కష్టపడి పనిచేయాలి. అందమైన నీపై వస్త్రాలు తీసివేయి. తిరుగటి రాళ్లు తీసుకొని పిండి విసురు. మనుష్యులకు నీ కాళ్లు కనబడేంతమట్టుకు నీ పైవస్త్రం లేపి నదులు దాటు. నీ దేశాన్ని విడిచిపెట్టు.
3 మనుష్యులు నీ శరీరాన్ని చూస్తారు.
మనుష్యులు నిన్ను లైంగికంగా వాడుకొంటారు. నీవు చేసిన చెడ్డ పనులకు నీచేత నేను విలువ కట్టిస్తాను. మరియు ఎవ్వడూ వచ్చి నీకు సహాయం చేయడు.
4 “‘దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు.
ఆయన పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా, ఇశ్రాయేలీయుల పరిశుద్దుడు’” అని నా ప్రజలు అంటారు.
5 “అందుచేత బబులోనూ, నీవు మౌనంగా కూర్చోవాలి.
కల్దీయుల కుమారీ[a] చీకట్లోనికి వెళ్లు
ఎందుకంటే నీవు ఇక మీదట ‘రాజ్యాలకు యజమానురాలివి’ కావు.
6 “నేను నా ప్రజల మీద కోపగించాను.
ఈ ప్రజలు నావాళ్లే కానీ నేను కోపగించాను, అందుచేత నేను వాళ్లకు ప్రాముఖ్యం లేకుండా చేశాను.
నేను వాళ్లను నీకు అప్పగించాను. నీవు వారిని శిక్షించావు.
నీవు వారికి ఎలాంటి దయా చూపించలేదు.
వాళ్లు ముసలి వాళ్ల కోసం
చాలా కష్టపడి పనిచేసేట్టు నీవు చేశావు.
7 ‘నేను శాశ్వతంగా జీవిస్తాను.
శాశ్వతంగా నేను రాణిగానే ఉంటాను’ అని నీవు చెప్పావు.
నీవు ఆ ప్రజలకు చేసిన చెడు కార్యాలను నీవు గమనించలేదు.
ఏమి జరుగుతుందో అని నీవు గమనించలేదు.
8 కనుక ‘అందమైన అమ్మాయీ’, ఇప్పుడు నా మాట విను.
నీవు క్షేమంగానే ఉన్నావు అనుకొంటున్నావు.
‘నేను ఒక్కదాన్నే ప్రాముఖ్యమైన దాన్ని, ఇంకెవ్వరూ నా అంతటి ప్రముఖులు కారు.
నేను ఎప్పటికీ విధవనుకాను. నాకు ఎల్లప్పుడూ పిల్లలు ఉంటారు’ అని నీలోనీవు అనుకొంటున్నావు.
9 నీకు ఈ రెండు సంగతులు జరుగుతాయి:
మొట్టమొదట నీవు నీ పిల్లలను (ప్రజలు) పోగొట్టుకొంటావు. తర్వాత నీవు నీ భర్తను (రాజ్యం) పోగొట్టుకొంటావు.
ఈ సంగతులు నీకు నిజంగా జరుగుతాయి. నీ మంత్రాలన్నీ, శక్తివంతమైన నీ ఉపాయాలన్నీ నిన్ను రక్షించవు.
మృగముపైనున్న స్త్రీ
17 ఏడు పాత్రలున్న ఏడుగురి దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో ఈ విధంగా అన్నాడు: “అది పేరుగాంచిన వేశ్య. బహు జనముల మీద కూర్చున్న ఆ వేశ్యకు యివ్వబడే శిక్షను నీకు చూపిస్తాను. నా వెంట రా. 2 దానితో భూపతులు వ్యభిచరించారు. ఈ భూమ్మీద నివసించే ప్రజలు అది అందించే వ్యభిచారమనే మద్యంతో మత్తెక్కిపోయారు.”
3 ఆ తర్వాత ఆ దేవదూత నన్ను ఆత్మద్వారా ఒక ఎడారి ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ ఎరుపు, ఊదా రంగుగల మృగం మీద కూర్చొని ఉండటం చూసాను. ఆ మృగం మీద దూషణలు వ్రాయబడి ఉన్నాయి. ఆ మృగానికి ఏడు తలలు, పది కొమ్ములు ఉన్నాయి. 4 ఆ స్త్రీ ఊదా, ఎరుపు రంగుగల వస్త్రాల్ని కట్టుకొని ఉంది. బంగారుతో, రత్నాలతో, ముత్యాలతో చేసిన మెరిసే ఆభరణాలను వేసుకొని ఉంది. అది తన చేతిలో ఒక బంగారు పాత్రను పట్టుకొని ఉంది. ఆ పాత్ర అసహ్యమైన వాటితో, అది చేసిన వ్యభిచార కల్మషంతో నిండి ఉంది. 5 ఈ పేరు దాని నుదుటి మీద వ్రాయబడి ఉన్నది:
మర్మము, మహా బాబిలోను
వేశ్యలకు తల్లి!
ప్రపంచంలోని కల్మషాలకు తల్లి!
6 ఆ స్త్రీ భక్తుల రక్తాన్ని త్రాగి, మత్తుగా ఉండటం చూసాను. ఆ రక్తం యేసును గురించి సాక్ష్యం చెప్పిన వాళ్ళది.
నేనా స్త్రీని చూసి ఆశ్చర్యపడ్డాను. 7 అప్పుడు ఆ దేవదూత నాతో ఈ విధంగా అన్నాడు: “నీవెందుకు అంత ఆశ్చర్యపడుతున్నావు? ఆ స్త్రీ యొక్క రహస్యం నీకు చెబుతాను. ఆమె స్వారీ చేసే ఏడుతలల, పది కొమ్ముల మృగాన్ని గురించి చెపుతాను. 8 నీవు చూసిన మృగం ప్రస్తుతం లేదు. ఒకప్పుడు ఉండింది. పాతాళం నుండి లేచి వచ్చి అది నాశనమౌతుంది. ఆ మృగం ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు లేదు. భవిష్యత్తులో వస్తుంది. కనుక ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఆ మృగాన్ని చూసి దిగ్ర్భాంతి చెందుతారు. సృష్టి మొదలైనప్పటి నుండి వీళ్ళ పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడలేదు.
9 “దీన్ని అర్థం చేసుకోవటానికి బుద్ధి అవసరం.” ఆ ఏడుతలలు ఆ స్త్రీ కూర్చొన్న ఏడుకొండలు. ఆ ఏడు తలలు ఏడుగురు రాజులతో పోల్చబడ్డాయి. 10 ఐదుగురు పడిపోయారు. ఒకడు ఉన్నాడు. ఇంకొకడు యింకా రాలేదు. అతడొచ్చాక కొద్దికాలం ఉంటాడు. 11 ఒకప్పుడు ఉండి ప్రస్తుతము లేని మృగము ఎనిమిదవ రాజు. అతడు ఏడుగురిలో ఒకడు. అతడు కూడా నాశనమౌతాడు.
12 “నీవు చూసిన ఆ పది కొమ్ములు పదిమంది రాజులు. వాళ్ళకు యింకా రాజ్యము లభించలేదు. కాని వాళ్ళకు రాజులకున్న అధికారము, మృగంతో పాటు ఒక గంట సమయం మాత్రమే లభిస్తుంది. 13 వాళ్ళందరి ఉద్దేశ్యం ఒకటి. దాని కోసం తమ శక్తిని, అధికారాన్ని ఆ మృగానికిచ్చారు. 14 వాళ్ళు గొఱ్ఱెపిల్లతో యుద్ధం చేస్తారు. కాని గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువు. రాజులకు రాజు. కనుక విజయం పొందుతాడు. ఆయన వెంట ఆయన పిలిచినవాళ్ళు, ఆయన ఎన్నుకొన్నవాళ్ళు, ఆయన్ని విశ్వసించేవాళ్ళు ఉంటారు.”
15 ఆ తర్వాత దూత నాతో ఈ విధంగా అన్నాడు: “నీవు ఆ వేశ్య కూర్చున్న నీళ్ళను చూసావు. ఆ నీళ్ళు ప్రజల గుంపుల్ని, జాతుల్ని, దేశాలను, భాషలను సూచిస్తోంది. 16 నీవు చూసిన మృగము, దాని పది కొమ్ములు ఆ వేశ్యను ద్వేషిస్తాయి. అవి ఆమె దగ్గర ఉన్నవన్నీ తీసుకొని ఆమెను నగ్నంగా వదిలేస్తాయి. ఆమె దేహాన్ని తిని, ఆమెను మంటల్లో కాల్చివేస్తాయి. 17 దేవుడు తన ఉద్దేశ్యం నెరవేర్చుమని వాటి హృదయాలకు చెప్పాడు. కనుక ఆ పది కొమ్ములు తమ రాజ్యాన్ని దేవుడు చెప్పిన మాట నెరవేరే వరకు ఆ మృగానికి యివ్వటానికి అంగీకరించాయి. 18 నీవు చూసిన ఆ స్త్రీ భూలోకంలోని రాజులను పాలించే మహానగరం.”
© 1997 Bible League International