Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
26 యెహోవా, నాకు తీర్పు తీర్చుము, నేను పవిత్ర జీవితం జీవించినట్టు రుజువు చేయుము.
యెహోవాను నమ్మకోవటం నేనెన్నడూ మానలేదు.
2 యెహోవా, నన్ను పరిశోధించి, నన్ను పరీక్షించి.
నా హృదయంలోనికి, నా మనసులోనికి నిశితంగా చూడుము.
3 నేను ఎల్లప్పుడూ నీ ప్రేమను చూస్తాను.
నీ సత్యాల ప్రకారం నేను జీవిస్తాను.
4 పనికిమాలిన ఆ మనుష్యుల్లో
నేను ఒకడ్ని కాను.
5 ఆ దుర్మార్గపు ముఠాలంటే నాకు అసహ్యం.
ఆ దుష్టుల ముఠాలలో నేను చేరను.
6 యెహోవా, నేను నా చేతులు కడుగుకొంటాను.
నేను నీ బలిపీఠం దగ్గరకు వస్తాను.
7 యెహోవా, నేను నీకు స్తుతి కీర్తనలు పాడుతాను.
నీవు చేసిన అద్భుత విషయాలను గూర్చి నేను పాడుతాను.
8 యెహోవా, నీ గుడారం అంటే నాకు ప్రేమ.
మహిమగల నీ గుడారాన్ని నేను ప్రేమిస్తున్నాను.
9 యెహోవా, ఆ పాపులతో నన్ను జత చేయకుము.
ఆ హంతకులను నీవు చంపేటప్పుడు, నన్ను చంపకుము.
10 ఆ మనుష్యులకు దుష్ట పథకాలున్నాయి.
చెడుకార్యాలు చేయటానికి ఆ మనుష్యులు లంచం తీసుకొంటారు.
11 కాని నేను నిర్దోషిని.
కనుక దేవా, నన్ను కరుణించి, రక్షించుము.
12 నేను సురక్షితమైన స్థలాల్లో నిలుస్తాను.
యెహోవా, నీ అనుచరులు సమావేశమైనప్పుడు నేను నిన్ను స్తుతిస్తాను.
10 అవమానం నిన్ను ఆవరిస్తుంది.
నీవు శాశ్వతంగా నాశనమవుతావు.
ఎందుకంటే, నీవు నీ సోదరుడైన యాకోబుపట్ల చాలా క్రూరంగా ఉన్నావు.
11 పరదేశీయులు ఇశ్రాయేలు ధనరాశులను ఎత్తుకుపోయినప్పుడు
ఇశ్రాయేలు శత్రువులతో నీవు చేతులు కలిపావు.
పరదేశీయులు ఇశ్రాయేలు నగర ద్వారంలోకి వచ్చి,
యెరూషలేములో ఎవరు ఏ భాగాన్ని ఆక్రమించుకోవాలనే విషయంలో చీట్లు వేశారు.
ఆ సమయంలో, ఆ వచ్చిన వారిలో ఒకనిమాదిరిగా నీవు ఉన్నావు.
12 నీ సోదరుని కష్టకాలం చూసి నీవు నవ్వావు.
నీవాపని చేసియుండకూడదు.
ఆ జనులు యూదాను నాశనం చేసినప్పుడు నీవు సంతోషించావు.
నీవలా చేసియుండకూడదు.
యూదా ప్రజల కష్టకాలంలో నీవు గొప్పలు చెప్పుకున్నావు.
నీవది చేసియుండకూడదు.
13 నా ప్రజల నగరద్వారాన ప్రవేశం చేసి,
నీవు వారి సమస్యలను చూసి నవ్వావు.
నీవది చేసియుండకూడదు.
వారికి కష్టకాలం వచ్చినప్పుడు.
నీవు వారి ఆస్తిని దోచుకున్నావు.
నీవాపని చేసియుండకూడదు.
14 నీవు నాలుగు బాటలు కలిసిన స్థానంలో నిలబడి తప్పించుకొని పారిపోయే ప్రజలను చంపివేశావు.
నీవాపని చేయకుండా ఉండవలసింది. తప్పించుకునేవారిలో కొందరిని సజీవంగా పట్టుకున్నావు.
నీవాపని చేయకుండా ఉండవలసింది.
15 అన్ని దేశాలపై యెహోవా తీర్పురోజు త్వరలో వస్తూ ఉంది.
నీవు ఇతర ప్రజలకు కీడు చేశావు.
అదే కీడు నీకూ జరుగుతుంది.
అవే చెడ్డపనులు నీ తలమీదికి వచ్చి పడతాయి.
16 ఎందుకంటే, నా పవిత్ర పర్వతంమీద నీవు రక్తాన్ని చిందించావు.
అలాగే ఇతర జనులు నీ రక్తాన్ని చిందిస్తారు.
నువ్వు అంతరిస్తావు
నువ్వెప్పుడూ లేనట్లుగా ఉంటుంది.
ఏడవ ముద్ర
8 ఆయన ఏడవ ముద్ర విప్పినప్పుడు పరలోకంలో అరగంటదాకా నిశ్శబ్దంగా ఉండెను. 2 దేవుని ముందు నిలబడి ఉన్న ఆ ఏడుగురు దేవదూతల్ని చూసాను. వాళ్ళకు ఏడు బూరలు యివ్వబడ్డాయి.
3 బంగారు ధూపార్తి పట్టుకొన్న మరొక దూత వచ్చి ధూప వేదిక ముందు నిలుచున్నాడు. సింహాసనం ముందున్న ధూప వేదికలో ధూపం వేయటానికి అతనికి ఎన్నో ధూపద్రవ్యాలు యివ్వబడ్డాయి. పవిత్రుల ప్రార్థనలతో ధూపం వేయబడింది. 4 దూత వేసిన సుగంధ ధూపము, పవిత్రుల ప్రార్థనలతో పాటు దేవునికి అందింది. 5 దూత ధూపార్తిని తీసుకొని ధూప వేదికలో ఉన్న నిప్పు అందులో ఉంచి దాన్ని భూమ్మీదకు విసిరివేసాడు. దాంతో ఉరుములు, పెద్దగర్జనలు, మెరుపులు, భూకంపాలు కలిగాయి.
© 1997 Bible League International