Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 26

దావీదు కీర్తన.

26 యెహోవా, నాకు తీర్పు తీర్చుము, నేను పవిత్ర జీవితం జీవించినట్టు రుజువు చేయుము.
    యెహోవాను నమ్మకోవటం నేనెన్నడూ మానలేదు.
యెహోవా, నన్ను పరిశోధించి, నన్ను పరీక్షించి.
    నా హృదయంలోనికి, నా మనసులోనికి నిశితంగా చూడుము.
నేను ఎల్లప్పుడూ నీ ప్రేమను చూస్తాను.
    నీ సత్యాల ప్రకారం నేను జీవిస్తాను.
పనికిమాలిన ఆ మనుష్యుల్లో
    నేను ఒకడ్ని కాను.
ఆ దుర్మార్గపు ముఠాలంటే నాకు అసహ్యం.
    ఆ దుష్టుల ముఠాలలో నేను చేరను.

యెహోవా, నేను నా చేతులు కడుగుకొంటాను.
    నేను నీ బలిపీఠం దగ్గరకు వస్తాను.
యెహోవా, నేను నీకు స్తుతి కీర్తనలు పాడుతాను.
    నీవు చేసిన అద్భుత విషయాలను గూర్చి నేను పాడుతాను.
యెహోవా, నీ గుడారం అంటే నాకు ప్రేమ.
    మహిమగల నీ గుడారాన్ని నేను ప్రేమిస్తున్నాను.

యెహోవా, ఆ పాపులతో నన్ను జత చేయకుము.
    ఆ హంతకులను నీవు చంపేటప్పుడు, నన్ను చంపకుము.
10 ఆ మనుష్యులకు దుష్ట పథకాలున్నాయి.
    చెడుకార్యాలు చేయటానికి ఆ మనుష్యులు లంచం తీసుకొంటారు.
11 కాని నేను నిర్దోషిని.
    కనుక దేవా, నన్ను కరుణించి, రక్షించుము.
12 నేను సురక్షితమైన స్థలాల్లో నిలుస్తాను.
    యెహోవా, నీ అనుచరులు సమావేశమైనప్పుడు నేను నిన్ను స్తుతిస్తాను.

ఓబద్యా 1-9

ఎదోముకు శిక్ష

ఇది ఓబద్యాకు వచ్చిన దర్శనం. నా ప్రభువైన యెహోవా ఎదోమును[a] గురించి ఈ విషయం చెప్పాడు:

దేవుడైన యెహోవా నుండి ఒక సమాచారం మేము విన్నాము.
    వివిధ దేశాలకు ఒక దూత పంపబడ్డాడు.
“మనం వెళ్లి ఎదోము మీద యుద్ధం చేద్దాం” అని అతడన్నాడు.

ఎదోముతో యెహోవా మాట్లాడటం

“చూడు, సాటి దేశాలలో నిన్ను అల్పునిగా చేస్తాను.
    ప్రజలు నిన్ను మిక్కిలి అసహ్యించుకుంటారు.
నీ గర్వం నిన్ను మోసపుచ్చింది. కొండశిఖరంమీద గుహలలో నీవు నివసిస్తున్నావు.
    నీ ఇల్లు కొండల్లో ఎత్తున ఉంది.
అందువల్ల, ‘నన్నెవరూ కిందికి తేలేరు’
    అని, నీకు నీవు మనస్సులో అనుకుంటున్నావు.”

ఎదోము తగ్గంచబడుతుంది

దేవుడైన యెహోవా ఇది చెప్పాడు:
“నీవు గ్రద్దలా ఎత్తుగా ఎగిరినా,
    నీ గూటిని నీవు నక్షత్రాల్లో కట్టుకున్నా,
    అక్కడనుండి నిన్ను కిందికి దించుతాను
నీవు నిశ్చయంగా నాశనమవుతావు!
    దొంగలు నీవద్దకు వస్తారు!
రాత్రిపూట దోపిడిగాండ్రు వస్తారు!
    ఆ దొంగలు వారికి కావలసినవన్నీ ఎత్తుకు పోతారు!
ద్రాక్షాపండ్లు ఏరటానికి పనివారు నీ పొలాలకు వచ్చినప్పుడు,
    వారు కొన్ని పండ్లు పరిగె ఏరుకొనేవారుకు వదిలిపెడతారు.
ఏశావు[b] రహస్య ధనసంపద కొరకు శత్రువులు వెదకుతారు.
    వాటిని వారు కనుగొంటారు!
నీ స్నేహితులైన ప్రజలంతా
    నిన్ను దేశంనుండి పంపివేస్తారు.
నీతో సంధి చేసుకొన్నవారు
    నిన్ను మోసగించి, ఓడిస్తారు.
నీ వద్దనే రొట్టెలు తిన్న మనుష్యులు,
    నిన్ను పట్టటానికి వల పన్నుతున్నారు.
వారు ఇలా అంటున్నారు: ‘ఇలా అవుతుందని అతడు అనుమానించడు’”

యెహోవా ఇలా చెపుతున్నాడు: “ఆ రోజున
    ఎదోము జ్ఞానులను ఎదోము పర్వతాలలోనున్న వివేకులను నేను నాశనం చేయగోరుదును.
తేమానూ, నీ యోధులు భయపడతారు.
    ఏశావు పర్వతంమీద ప్రతి ఒక్కడూ చంపబడతాడు.
    అనేక మంది చంపబడతారు.

ప్రకటన 7:9-17

ఒక పెద్ద ప్రజల గుంపు

దీని తర్వాత ఎవ్వరూ లెక్క వెయ్యలేని ఒక పెద్ద ప్రజల గుంపు నా ముందు కనిపించింది. వాళ్ళలో ప్రతి దేశానికి చెందినవాళ్ళు ఉన్నారు. ప్రతి భాషకు చెందినవాళ్ళు ఉన్నారు. వాళ్ళు తెల్లటి దుస్తులు వేసుకొని, చేతుల్లో ఖర్జూర మట్టలు పట్టుకొని ఉన్నారు. వాళ్ళు సింహాసనం ముందు, గొఱ్ఱెపిల్ల ముందు నిలబడి ఉండటం నాకు కనిపించింది. 10 వాళ్ళందరు, “సింహాసనంపై కూర్చున్న మన దేవునికి, గొఱ్ఱెపిల్లకు రక్షణ చెందుగాక!” అని బిగ్గరగా అన్నారు.

11 సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూ, ఆ నాలుగు ప్రాణుల చుట్టూ దేవదూతలు నిలబడి ఉన్నారు. వాళ్ళు సింహాసనం ముందు సాష్టాంగపడి దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టారు. 12 “ఆమేన్! మన దేవుణ్ణి స్తుతించుదాం! ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొందాం. ఆయనలో తేజస్సు, జ్ఞానము, గౌరవము, అధికారము, శక్తి చిరకాలం ఉండుగాక! ఆమేన్!”

13 పెద్దల్లో ఒకడు నాతో, “తెల్లటి దుస్తులు వేసుకొన్న వాళ్ళెవరు? ఎక్కడి నుండి వచ్చారు?” అని అడిగాడు.

14 “అయ్యా! మీకే తెలియాలి!” అని నేను సమాధానం చెప్పాను.

“మహా శ్రమలనుండి వచ్చినవాళ్ళు వీళ్ళే. తమ దుస్తుల్ని గొఱ్ఱెపిల్ల రక్తంలో ఉతికి శుభ్రం చేసుకొన్నారు. 15 అందువల్ల వాళ్ళు దేవుని సింహాసనం ముందున్నారు. రాత్రింబగళ్ళు ఆయన మందిరంలో ఉండి ఆయన సేవ చేస్తారు. ఆ సింహాసనంపై కూర్చొన్నవాడు వాళ్ళందరిపై తన గుడారం కప్పుతాడు. 16 వాళ్ళకిక మీదట ఆకలి కలుగదు. దాహం కలుగదు. సూర్యుడు తన ఎండతో వాళ్ళను మాడ్చడు. వాళ్ళకు ఏ వేడీ తగులదు. 17 సింహాసనంపై కూర్చొన్న గొఱ్ఱెపిల్ల వాళ్ళ కాపరిగా ఉంటాడు. ఆయన సజీవమైన నీటి ఊటల దగ్గరకు వాళ్ళను పిలుచుకు వెళతాడు. దేవుడు వాళ్ళ కళ్ళనుండి కారే ప్రతి కన్నీటి బొట్టును తుడిచి వేస్తాడు.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International