Revised Common Lectionary (Complementary)
12 మాకు జ్ఞానోదయం కలిగేలా మా జీవితాలు
నిజంగా ఎంత కొద్దిపాటివో మాకు నేర్పించుము.
13 యెహోవా, ఎల్లప్పుడూ మా దగ్గరకు తిరిగి రమ్ము.
నీ సేవకులకు దయ చూపించుము.
14 ప్రతి ఉదయం నీ ప్రేమతో మమ్మల్ని నింపుము.
మేము సంతోషించి, మా జీవితాలు అనుభవించగలిగేలా చేయుము.
15 మా జీవితాల్లో చాలా దుఃఖం, కష్టాలు నీవు కలిగించావు.
ఇప్పుడు మమ్మల్ని సంతోషింపచేయుము.
16 వారి కోసం నీవు చేయగల ఆశ్చర్య కార్యాలను నీ సేవకులను చూడనిమ్ము.
వారి సంతానాన్ని నీ ప్రకాశమును చూడనిమ్ము.
17 మా దేవా, మా ప్రభూ, మా యెడల దయచూపించుము.
మేము చేసే ప్రతిదానిలో మాకు సఫలత అనుగ్రహించుము.
పది ఆజ్ఞలు
5 మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ సమావేశపరచి, వారితో యిలా చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలారా, నేడు మీకు నేను చెప్పే ఆజ్ఞలను, నియమాలను వినండి. ఈ ఆజ్ఞలను నేర్చుకొని, తప్పక వాటికి విధేయులవ్వండి. 2 హోరేబు (సీనాయి) కొండ దగ్గర మన దేవుడైన యెహోవా మనతో ఒక ఒడంబడిక చేసాడు. 3 యెహోవా ఈ ఒడంబడికను మన పూర్వీకులతో చేయలేదుగాని మనతో, అవును నేడు సజీవులుగా ఇక్కడ ఉన్న మన అందరితో చేసాడు. 4 ఆ కొండ దగ్గర యెహోవా మీతో ముఖాముఖిగా మాట్లాడాడు. అగ్నిలో నుండి ఆయన మీతో మాట్లడాడు. 5 ఎందుకంటే మీరు ఆ అగ్నికి భయపడి. కొండమీదికి వెళ్లేందుకు నిరాకరించారు. కనుక ఆ సమయంలో యెహోవా చెప్పిన దానిని మీతో చెప్పడానికి నేను యెహోవాకు, మీకు మధ్య నిలబడ్డాను. యెహోవా ఇలా చెప్పాడు:
6 “మీరు బానిసలుగా జీవించిన ఈజిప్టు దేశంనుండి మిమ్మల్ని బయటకు రప్పించిన మీ దేవుణ్ణి యెహోవాను నేనే. కనుక మీరు ఈ ఆజ్ఞలకు విధేయలుగా ఉండండి.
7 “నన్ను తప్ప మరి ఏ దేవుళ్లనూ ఆరాధించవద్దు.
8 “పైన ఆకాశంలోగాని, క్రింద భూమిమీదగాని, ఆ క్రింద సముద్రంలోగాని దేని విగ్రహమైనా, రూపం అయినా చేసుకోవద్దు. 9 ఎలాంటి విగ్రహాలను కూడా పూజించవద్దు, సేవించవద్దు. ఎందుకంటే నేనే మీ దేవుడైన యెహోవాను. మరియు వాళ్ల పిల్లలను, పిల్లల పిల్లలను, ఆ పిల్లల పిల్లలను నేను శిక్షిస్తాను. 10 అయితే నన్ను ప్రేమించి, నా ఆజ్ఞలకు విధేయు లయ్యే ప్రజలయెడల నేను చాలా దయ చూపిస్తాను. అలాంటివారి వంశీయుల్లో వెయ్యితరాల వారివరకు నేను దయ చూపిస్తాను.
11 “మీ దేవుడైన యెహోవా పేరును వ్యర్థంగా పలుకవద్దు. ఒక వ్యక్తి యెహోవా పేరును వ్యర్థంగా పలికితే ఆతడు దోషి. యెహోవా ఆతణ్ణి నిర్దోషిగా ఎంచడు.
12 “సబ్బాతు రోజుకు ప్రత్యేక ప్రాముఖ్యతను ఇచ్చేందుకు జ్ఞాపకం ఉంచుకోవాలి. వారం లోని ఇతర దినాలకంటే విశ్రాంతి దినాన్ని వేరుగా ఉంచమని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞ యిచ్చాడు. 13 మొదటి ఆరు రోజులు మీ పని చేసుకొనేందుకు. 14 అయితే ఏడో రోజు మీ దేవుడైన యెహోవా గౌరవార్థం విశ్రాంతి రోజు అవుతుంది. కనుక విశ్రాంతి రోజున ఏ వ్యక్తీ పనిచేయకూడదు. అంటే మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ ఆడ, మగ బానిసలు, మీ ఆవులు, మీ గాడిదలు, ఏ ఇతర జంతువులు, మీ పట్టణాల్లో నివసిస్తున్న విదేశీయులు, మీ బానిసలు కూడ మీవలెనే విశ్రాంతి తీసుకోగలగాలి. 15 ఈజిప్టులో ఉన్నప్పుడు మీరూ బానిసలే అని మరచిపోవద్దు. మీ దేవుడైన యెహోవా తన మహా శక్తితో ఈజిప్టునుండి మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాడు. ఆయన మిమ్మల్ని స్వతంత్రులుగా చేసాడు. అందుచేతనే ఎల్లప్పుడూ సబ్బాతు రోజును ఒక ప్రత్యేక రోజుగా ఆచరించాలని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపిస్తున్నాడు.
16 “నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించు. నీవు యిలా చేయాలని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞ యిచ్చాడు. నీవు ఈ ఆజ్ఞను పాటిస్తే, నీవు చాలాకాలం బ్రతుకుతావు. నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న దేశంలో అంతా శుభం అవుతుంది.
17 “ఎవరినీ హత్య చేయవద్దు.
18 “వ్యభిచార పాపం చేయవద్దు.
19 “ఏమీ దొంగిలించకు.
20 “మరో వ్యక్తి చేసిన దాన్నిగూర్చి అబద్ధసాక్ష్యము చెప్పకు.
21 “మరొకరికి చెందినవి నీవై యుంటే బాగుండునని ఆశించకు. ఇంకో వ్యక్తి భార్యను, అతని యింటిని, అతని పొలాలను, అతని మగ లేక ఆడ పనివారిని, అతని ఆవులను, అతని గాడిదలనుగాని ఇతరులకు చెందిన దేనినిగాని నీవు ఆశించకూడదు.”
దేవుని ప్రజలకు విశ్రాంతి
7-8 అందువల్ల పరిశుద్ధాత్మ ఈ విధంగా అంటున్నాడు:
“ఆనాడు ఎడారిలో మూర్ఖులై మీరాయనకు ఎదురు తిరిగారు.
ఆయన సహనాన్ని పరీక్షించారు.
కాని నేడు మీరాయన మాట వింటే మీ హృదయాలు కఠిన పర్చుకోవద్దు.
9 నేను నలభై సంవత్సరాలు చేసినదంతా చూసి కూడా
మీ పూర్వికులు నన్నూ, నా సహనాన్ని పరీక్షించారు.
10 ఆ కారణంగానే, ఆ ప్రజలంటే నాకు కోపం వచ్చింది,
‘వాళ్ళ హృదయాలు పెడదారులు పట్టాయి,
నేను చూపిన దారుల్ని వాళ్ళు చూడ లేదు’ అని అన్నాను.
11 అందుకే, ‘నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వనని
కోపంతో ప్రమాణం చేశాను.’”(A)
12 సోదరులారా! సజీవంగా ఉన్న దేవునికి దూరమైపోయే హృదయంకాని, విశ్వాసంలేని హృదయంకాని, మీలో ఉండకుండా జాగ్రత్త పడండి. 13 ఆ “నేడు” అనేది యింకా ఉంది గనుక, పరస్పరం ప్రతి రోజు ప్రోత్సాహపరచుకొంటూ ఉండండి. అప్పుడు పాపం మిమ్మల్ని మోసం చెయ్యలేదు. మీలో మూర్ఖత్వం ఉండదు. 14 మనలో మొదటినుండి ఉన్న విశ్వాసాన్ని చివరిదాకా గట్టిగా పట్టుకొనివుంటే, మనం క్రీస్తుతో కలిసి భాగం పంచుకొంటాం. 15 ఇంతకు ముందు చెప్పబడినట్లు:
“ఆనాడు మూర్ఖులై మీరాయనకు ఎదురు తిరిగారు
కాని, నేడు మీరాయన మాట వింటే అలా చెయ్యకండి.”(B)
16 వీళ్ళందరూ ఈజిప్టు దేశంనుండి మోషే పిలిచుకొని వచ్చిన ప్రజలే కదా! దేవుని స్వరం విని ఎదురు తిరిగింది వీళ్ళే కదా! 17 నలభై సంవత్సరాలు దేవుడు కోపగించుకొన్నది ఎవరిమీద? పాపం చేసి ఎడారిలో పడి చనిపోయినవాళ్ళమీదనే కదా! 18 “నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను” అని, అవిధేయతగా ప్రవర్తించినవాళ్ళ విషయంలో దేవుడు ప్రమాణం చేయలేదా? 19 వాళ్ళు విశ్వసించలేదు గనుక ఆ విశ్రాంతిలో ప్రవేశించలేకపొయ్యారు. ఇది మనం గమనిస్తూనే ఉన్నాము.
© 1997 Bible League International