Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: గితీత్ రాగం. దావీదు కీర్తన.
8 యెహోవా నా ప్రభువా! నీ పేరు భూమి అంతా ప్రసిద్ధి పొందింది.
2 పరలోకమంతా నీ కీర్తి బాలురు, చంటి పిల్లల నోళ్లనుండి వెలికి వస్తున్నది.
నీ శత్రువుల నోరు మూయించడానికి నీవు యిలా చేస్తావు.
3 యెహోవా, నీవు నీ చేతులతో చేసిన ఆకాశాలవైపు నేను చూస్తున్నాను.
నీవు సృష్టించిన చంద్ర నక్షత్రాలను నేను చూచి ఆశ్చర్య పడుతున్నాను.
4 మానవుడు ఎందుకు నీకు అంత ప్రాముఖ్యుడు?
నీవు వానిని ఎందుకు జ్ఞాపకం చేసుకొంటావు?
మానవమాత్రుడు నీకెందుకు అంత ముఖ్యం?
నీవు వానిని గమనించటం ఎందుకు?
5 అయితే మానవుడు నీకు ముఖ్యం.
వానిని నీవు దాదాపు దేవుని అంతటి వానిగా చేశావు.
మరియు మహిమా ఘనతలు నీవు వానికి కిరీటంగా ధరింప జేసావు.
6 నీవు చేసిన సమస్తము మీద మనుష్యునికి అధికారమిచ్చియున్నావు.
ప్రతిదానిని నీవు వాని అధీనంలో ఉంచావు.
7 గొర్రెలు, పశువులు, అడవి మృగాలు అన్నింటిమీద ప్రజలు ఏలుబడి చేస్తారు.
8 ఆకాశంలోని పక్షుల మీద, మహా సముద్రంలో ఈదుచుండే
చేపల మీద వారు ఏలుబడి చేస్తారు.
9 మా దేవా, యెహోవా భూలోమంతటిలో కెల్లా నీ నామము మహా అద్భుతమైనది!
శారా మరణించింది
23 శారా 127 సంవత్సరాలు జీవించింది. 2 కనాను దేశంలోని కిర్యతర్బా (అనగా హెబ్రోను) పట్టణంలో ఆమె మరణించింది. అబ్రాహాము చాలా దుఃఖించి, ఆమె కోసం అక్కడ ఏడ్చాడు. 3 అప్పుడు మరణించిన తన భార్యను విడిచిపెట్టి, హిత్తీ ప్రజలతో మాట్లాడేందుకు అబ్రాహాము వెళ్లాడు. 4 “నేను ఈ దేశవాసిని కాను. ఇక్కడ నేను యాత్రికుడను మాత్రమే. అందుచేత నా భార్యను పాతిపెట్టుటకు నాకు స్థలము లేదు. నేను నా భార్యను పాతిపెట్టడానికి దయచేసి నాకు కొంత స్థలం ఇవ్వండి” అన్నాడు.
5 హిత్తీ ప్రజలు అబ్రాహాముకు ఇలా జవాబు చెప్పారు. 6 “అయ్యా, మా మధ్య మీరు దేవుని మహా నాయకులలో ఒకరు. చనిపోయిన మీ వాళ్లను పాతిపెట్టేందుకు మా శ్రేష్ఠమైన స్థలాన్ని మీరు తీసుకోవచ్చు. చనిపోయిన వాళ్లను పాతిపెట్టే మా స్థలాల్లో మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అక్కడ మీ భార్యను పాతిపెట్టడానికి మేము ఎవ్వరం అడ్డు చెప్పం.”
7 అబ్రాహాము లేచి ప్రజలకు నమస్కరించాడు. 8 అబ్రాహాము వాళ్లతో చెప్పాడు: “నేను నా భార్యను పాతిపెట్టడానికి మీరు నిజంగా నాకు సహాయం చేయగోరితే, సోహరు కుమారుడు ఎఫ్రోనుతో నా పక్షంగా మీరు మాట్లాడండి. 9 మక్పేలా గుహను నేను కొనాలని కోరుతున్నాను. ఇది ఎఫ్రోను స్వంతం. అది అతని పొలం చివరిలో ఉంది. దాని విలువ ఎంతో అంత మొత్తం నేను చెల్లిస్తాను. పాతిపెట్టే స్థలంగా దీనిని నేను కొంటున్నట్లు మీరంతా సాక్షులుగా ఉండాలని నేను కోరుతున్నాను.”
10 ఎఫ్రోను ఆ జనం మధ్యలో కూర్చొని ఉన్నాడు. ఎఫ్రోను అబ్రాహాముకు ఇలా జవాబిచ్చాడు: 11 “లేదయ్యా, నేను ఆ స్థలం ఇక్కడ మా అందరి ప్రజల సమక్షంలో నీకిచ్చేస్తాను. ఆ గుహను నేను నీకిస్తాను. నీవు నీ భార్యను పాతిపెట్టుకొనేందుకు ఆ స్థలం నేను నీకు ఇచ్చివేస్తాను.”
12 అప్పుడు అబ్రాహాము హిత్తీయుల ముందు వంగి నమస్కారం చేశాడు. 13 అబ్రాహాము, “ఆ పొలానికి పూర్తి ధర నేను చెల్లిస్తాను. నా డబ్బు స్వీకరించు. నా మృతులను నేను పాతిపెట్టుకొంటాను” అని ప్రజలందరి ముందు ఎఫ్రోనుతో చెప్పాడు.
14 అబ్రాహాముకు ఎఫ్రోను ఇలా జవాబు చెప్పాడు: 15 “అయ్యా, నా మాట వినండి. 400 తులాల వెండి మీకు గాని నాకు గాని ఏపాటి? భూమిని తీసుకొని, చనిపోయిన నీ భార్యను పాతిపెట్టుకో.”
16 తనతో ఆ పొలం వెల ఎఫ్రోను చెబుతున్నాడని గ్రహించి ఆ వెల 400 తులాల వెండి తూచి అబ్రాహాము అతనికి ఇచ్చాడు.
17-18 కనుక ఎఫ్రోను పొలానికి స్వంతదారులు మారిపోయారు. ఈ పొలం మమ్రేకు తూర్పున మక్పేలాలో ఉంది. ఆ పొలానికి, పొలంలో ఉన్న గుహకు, అందులోని చెట్లన్నిటికీ అబ్రాహాము స్వంతదారుడయ్యాడు. ఎఫ్రోను అబ్రాహాముల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఆ పట్టణ ప్రజలంతా చూశారు. 19 ఇది జరిగిన తర్వాత మమ్రే దగ్గర ఉన్న మక్పేలా గుహలో అబ్రాహాము తన భార్యను పాతిపెట్టాడు (అది కనానులోని హెబ్రోను). 20 ఆ పొలాన్ని, దానిలోని గుహను హిత్తీ ప్రజల దగ్గర అబ్రాహాము కొన్నాడు. ఇది అతని ఆస్తి అయ్యింది, దాన్ని అతడు పాతిపెట్టే స్థలంగా ఉపయోగించాడు.
ధర్మశాస్త్రము, దేవుని రాజ్యము
(మత్తయి 11:12-13)
14 పరిసయ్యులు ధనాన్ని ప్రేమించేవాళ్ళు కనుక వాళ్ళు ఇది విని యేసును హేళన చేశారు. 15 యేసు వాళ్ళతో, “మీరు ప్రజల ముందు నీతిమంతులుగా ప్రవర్తిస్తారు. కాని మీ హృదయాల్లో ఏముందో దేవునికి తెలుసు. మానవులు వేటికి అత్యధికమైన విలువనిస్తారో వాటిని దేవుడు తిరస్కరిస్తాడు.
16 “యోహాను కాలాందాకా ధర్మశాస్త్రము, ప్రవక్తలు వ్రాసిన విషయాలు ఆచరణలో ఉన్నాయి. యోహాను కాలం నుండి దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటింపబడుతోంది. ప్రతి ఒక్కరూ ఆ రాజ్యంలోకి వెళ్ళాలని తమ శక్త్యానుసారం కష్టపడుతున్నారు. 17 భూమి, ఆకాశము నశించిపోవచ్చు, కాని ధర్మశాస్త్రంలో ఉన్న ఒక్క అక్షరం కూడా పొల్లుపోదు.
విడాకులు మరియు పునర్వివాహము
18 “తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని వివాహం చేసుకొన్న ప్రతివాడు వ్యభిచారిగా పరిగణింపబడతాడు. విడాకులివ్వబడిన స్త్రీని వివాహం చేసుకొన్నవాడు కూడా వ్యభిచారిగా పరిగణింపబడతాడు” అని అన్నాడు.
© 1997 Bible League International