Revised Common Lectionary (Complementary)
70 మంది వృద్ధనాయకులు
4 ఇశ్రాయేలీయులతో చేరిన విదేశీయులు తినేందుకు ఇంకా ఏవేవో కావాలనికోరటం మొదలు పెట్టారు. త్వరలోనే మొత్తం ఇశ్రాయేలీయులంతా మళ్లీ ఫిర్యాదు చేయటం మొదలు పెట్టారు. ప్రజలు ఇలా అన్నారు, “తినటానికి మాకు మాంసం కావాలి! 5 ఈజిప్టులో మేము తిన్న చేపలు మాకు జ్ఞాపకం వస్తున్నాయి. చేపలు మాకు ఉచితంగా దొరికేవి. మంచి కూరగాయలు – దోసకాయలు, పుచ్చకాయలు, ఆకు కూరలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి పాయలు మాకు దొరికేవి. 6 కానీ ఇప్పుడు మాకు బలంలేదు. మేము, ఈ మన్నా తప్ప ఇంకేమి తినటంలేదు!”
10 ప్రతి కుటుంబం వాళ్లు ఫిర్యాదు చేయటం మోషే విన్నాడు. ప్రజలంతా వారివారి గుడారాల్లో గొణుగుతున్నారు. యెహోవాకు చాల కోపం వచ్చింది. దానితో మోషేకు చాలా చికాకు కలిగింది. 11 మోషే యెహోవాను అడిగాడు, “యెహోవా, నీ సేవకుడనైన నాకు ఇంత కష్టం ఎందుకు కలిగించావు? నేనేమి పొరబాటు చేసాను? నీకు సంతోషం లేకుండేటట్టు నేను చేసింది ఏమిటి? ఈ ప్రజలందరి బాధ్యత నీవు నాకెందుకు ఇచ్చావు? 12 ఈ ప్రజలందరికీ నేను తండ్రిని కానని నీకు తెలుసు. నేను వీరికి జన్మ ఇవ్వలేదనీ నీకు తెలుసు. కానీ పాలిచ్చి పెంచే దాదిలా నేనే వీరిని నా చేతుల్లో ఎత్తుకొని పోవాల్సినట్టు కనబడుతుంది. నేను ఇలా చేసేటట్టుగా నీవెందుకు నన్ను బలవంతం చేస్తున్నావు? నీవు మా పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశానికి నేను వారిని మోసుకొని వెళ్లాలని నీవెందుకు నన్ను బలవంతం చేస్తున్నావు? 13 ఈ ప్రజలందరికీ మాంసం నాదగ్గర లేదు. కానీ వారు నాకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ‘తినటానికి మాంసం ఇవ్వు’ అంటున్నారు వారు. 14 ఈ ప్రజలందరినీ గూర్చి నేను ఒక్కడినే బాధ్యత వహించలేను. ఈ భారం నాకు చాల బరువుగా ఉంది. 15 వారి కష్టాలన్నీ నీవు నా మీదే పెట్టాలనుకొంటే, ఇప్పుడే నన్ను చంపేయి. నన్ను నీ సేవకునిగా నీవు అంగీకరిస్తే, నన్ను ఇప్పుడే చావనివ్వు. అప్పుడు నా కష్టాలన్నీ తీరిపోతాయి.”
16 మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయుల పెద్దలను (నాయకులను) 70 మందిని నాదగ్గరకు తీసుకొనిరా. వీరు ప్రజలలో నాయకులు. సన్నిధి గుడారం దగ్గరకు వారిని తీసుకొనిరా. అక్కడ నీతోబాటు వారిని నిలబెట్టు.
24 కనుక మోషే ప్రజలతో మాట్లాడటానికి బయటకు వెళ్లాడు. యెహోవా చెప్పినది మోషే వారితో చెప్పాడు. అప్పుడు మోషే 70 మంది పెద్దలను సమావేశ పరచాడు. గుడారం చుట్టూ నిలబడమని మోషే వారితో చెప్పాడు. 25 అప్పుడు యెహోవా ఒక మేఘంలో దిగివచ్చి, మోషేతో మాట్లాడాడు. మోషే మీద ఉన్న దేవుని ఆత్మను ఆ 70 మంది పెద్దల మీద ఉంచాడు యెహోవా.[a] ఆత్మ వారిమీదికి దిగిరాగానే వారు ప్రవచించటం మొదలు పెట్టారు. అయితే ఈ ఒక్కసారి మాత్రమే ఆ మనుష్యులు ఇలా చేసారు.
26 ఎల్దాదు, మేదాదు అనే అద్దరు పెద్దలు బయట గుడారం దగ్గరకు వెళ్లలేదు. వారి పేర్లు పెద్దల జాబితాలో ఉన్నాయి గాని వారు వారి గుడారంలోనే ఉండిపోయారు. కానీ దేవుని ఆత్మ వారిమీదకి కూడ వచ్చినందుచేత, వారుకూడ వారి గుడారంలోనే ప్రవచించటం మొదలుపెట్టారు. 27 ఒక యువకుడు పరుగెత్తి వెళ్లి మోషేతో చెప్పాడు. “ఎల్దాదు, మేదాదు గుడారంలోనే ప్రవచిస్తున్నారు” అని అతడు చెప్పాడు.
28 అయితే నూను కుమారుడైన యెహోషువ “అయ్యా మోషే, నీవు వారిని ఆపివేయాలి” అని మోషేతో చెప్పాడు. (యెహోషువ చిన్నతనం నుండి మోషేకు సహాయకుడుగా ఉన్నాడు.)
29 కాని మోషే, “ఇప్పుడు నేను నాయకుడ్ని కానని ప్రజలు తలుస్తారేమోనని నీవు భయపడుతున్నావా? యెహోవా ప్రజలు అందరూ ప్రవచిస్తే బాగుటుందని నా ఆశ. వారందరి మీద యెహోవా తన ఆత్మను ఉంచితే బాగుండునని నా ఆశ” అని బదులు చెప్పాడు.
7 యెహోవా ఉపదేశాలు పరిపూర్ణం.
అవి దేవుని ప్రజలకు బలాన్నిస్తాయి.
యెహోవా ఒడంబడిక విశ్వసించదగింది.
జ్ఞానం లేని మనుష్యులకు అది జ్ఞానాన్ని ఇస్తుంది.
8 యెహోవా చట్టాలు సరియైనవి.
అవి మనుష్యులను సంతోషపెడ్తాయి.
యెహోవా ఆదేశాలు పరిశుద్ధమైనవి.
ప్రజలు జీవించుటకు సరైన మార్గాన్ని చూపడానికి అవి కన్నులకు వెలుగునిస్తాయి.
9 యెహోవాను ఆరాధించుట మంచిది.
అది నిరంతరము నిలుస్తుంది.
యెహోవా తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి.
అవి సంపూర్ణంగా సరియైనవి.
10 శ్రేష్ఠమైన బంగారంకంటె యెహోవా ఉపదేశాలను మనము ఎక్కువగా కోరుకోవాలి.
సాధారణ తేనె పట్టు నుండి వచ్చే శ్రేష్ఠమైన తేనె కంటె అవి మధురంగా ఉంటాయి.
11 యెహోవా ఉపదేశాలు నీ సేవకుణ్ణి చాలా తెలివిగలవాణ్ణిగా చేస్తాయి.
నీ చట్టాలు పాటించేవారు గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు.
12 యెహోవా, ఏ వ్యక్తీ, తన స్వంత తప్పులన్నింటినీ చూడలేడు.
కనుక నేను రహస్య పాపాలు చేయకుండా చూడుము.
13 యెహోవా, నేను చేయాలనుకొనే పాపాలు చేయకుండా నన్ను ఆపుచేయుము.
ఆ పాపాలు నా మీద అధికారం చెలాయించ నీయకుము.
నీవు నాకు సహాయం చేస్తే, అప్పుడు నేను గొప్ప పాపము నుండి, పవిత్రంగా దూరంగా ఉండగలను.
14 నా మాటలు, తలంపులు నిన్ను సంతోషపెడ్తాయని నేను ఆశిస్తున్నాను.
యెహోవా, నీవే నా ఆశ్రయ దుర్గం. నీవే నన్ను రక్షించేవాడవు.
ప్రార్థనాశక్తి
13 మీలో ఎవరైనా కష్టాల్లో ఉంటే అలాంటి వాడు ప్రార్థించాలి. ఆనందంగా ఉన్నవాడు దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడాలి. 14 అనారోగ్యంగా ఉన్నవాడు సంఘ పెద్దల్ని పిలవాలి. ఆ పెద్దలు వచ్చి, ప్రార్థించి ప్రభువు పేరిట అతనికి నూనె రాయాలి. 15 విశ్వాసంతో చేసిన ప్రార్థన ఆ రోగికి ఆరోగ్యం కలుగచేస్తుంది. ప్రభువు అతనికి ఆరోగ్యం కలుగచేస్తాడు పాపం చేసి ఉంటె అతన్ని క్షమిస్తాడు.
16 అందువల్ల చేసిన తప్పుల్ని పరస్పరం ఒప్పుకోండి. ఒకరికొకరు ప్రార్థించండి. తద్వారా ఆరోగ్యం చేకూరుతుంది. నీతిమంతుని ప్రార్థన బహు బలముగలది. కనుక ఎంతో మేలు చేయగలదు. 17 ఏలీయా మనలాంటి మనిషే. ఒకప్పుడు వర్షాలు కురియరాదని అతడు ఆసక్తితో ప్రార్థించాడు. మూడున్నర సంవత్సరాల దాకా వర్షాలు కురియలేదు. 18 ఆ తర్వాత మళ్ళీ ప్రార్థించాడు. ఆకాశం నుండి వర్షాలు కురిసాయి. భూమి నుండి పంటలు పండాయి.
పాపిని నీతికి మళ్ళించటం
19 నా సోదరులారా! మీలో ఎవరైనా నీతిమార్గానికి దూరంగా పోయిన వాణ్ణి వెనక్కు పిలుచుకు వస్తే యిది గమనించండి. 20 పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్ళించినవాడు అతని ఆత్మను పాపాలన్నిటి నుండి రక్షించినవాడౌతాడు. అదీగాక అతన్ని చావు నుండి తప్పించినవాడౌతాడు.
మనకు విరోధికానివాడు మనవాడే
(లూకా 9:49-50)
38 “బోధకుడా! ఒకడు, మీ పేరిట దయ్యాల్ని వదిలించటం మేము చూశాము. అతడు మనవాడు కానందువల్ల అలా చెయ్యటం మానెయ్యమని అతనికి చెప్పాము” అని యోహాను అన్నాడు.
39 యేసు ఈ విధంగా అన్నాడు: “అతణ్ణి ఆపకండి, నా పేరిట అద్భుతం చేసినవాడు నాకు వ్యతిరేకంగా మాట్లాడలేడు. 40 ఎందుకంటే, మనకు వ్యతిరేకంగా లేనివాడు మన పక్షాన ఉన్న వానితో సమానము. 41 ఇది నిజం, మీరు క్రీస్తుకు చెందిన వాళ్ళని గమనించి నా పేరిట ఒక గిన్నెడు నీళ్ళు మీకు త్రాగటానికి యిచ్చినవాడు తప్పక ప్రతిఫలం పొందుతాడు.
పాపకారకుల గురించి యేసు హెచ్చరించటం
(మత్తయి 18:6-9; లూకా 17:1-2)
42 “నన్ను విశ్వసించే ఈ పసివాళ్ళు పాపం చేయటానికి కారకులు అవటంకన్నా మెడకు ఒక పెద్ద తిరుగటిరాయి కట్టుకొని సముద్రంలో పడటం మేలు. 43 మీరు పాపం చెయ్యటానికి మీ చేయి కారణమైతే దాన్ని నరికి వేయండి. ఆరని మంటలు మండే నరకానికి రెండు చేతులతో వెళ్ళటం కన్నా, అవిటివానిగా నిత్య జీవంపొందటం ఉత్తమం. 44 [a] 45 పాపం చెయ్యటానికి మీ కాలు కారణమైతే దాన్ని నరికివేయండి. రెండు కాళ్ళుండి నరకంలో పడటంకన్నా కుంటివానిగా నిత్య జీవం పొందటం ఉత్తమం. 46-47 [b] పాపం చెయ్యటానికి మీ కన్ను కారణమైతే దాన్ని పీకివేయండి. రెండు కళ్ళతో నరకంలో పడటంకన్నా ఒక కన్నుతో దేవుని రాజ్యాన్ని ప్రవేశించటం ఉత్తమం. 48 అక్కడ నరకంలో పడ్డవాళ్ళు చావరు. వాళ్ళను కరుస్తున్న పురుగులు చావవు! ఆ మంటలు ఆరిపోవు(A)
49 “ప్రతి వాడు ఈ అగ్నిలో శిక్షననుభవిస్తాడు.
50 “ఉప్పు మంచిదే. కాని దానిలో ఉన్న ఉప్పు గుణం పోతే ఆ గుణం మళ్ళీ ఏవిధంగా తేగలరు? కాబట్టి మీరు మంచివారై ఉండండి. ఒకరితో ఒకరు శాంతంగా ఉండండి.”
© 1997 Bible League International