Revised Common Lectionary (Complementary)
7 యెహోవా ఉపదేశాలు పరిపూర్ణం.
అవి దేవుని ప్రజలకు బలాన్నిస్తాయి.
యెహోవా ఒడంబడిక విశ్వసించదగింది.
జ్ఞానం లేని మనుష్యులకు అది జ్ఞానాన్ని ఇస్తుంది.
8 యెహోవా చట్టాలు సరియైనవి.
అవి మనుష్యులను సంతోషపెడ్తాయి.
యెహోవా ఆదేశాలు పరిశుద్ధమైనవి.
ప్రజలు జీవించుటకు సరైన మార్గాన్ని చూపడానికి అవి కన్నులకు వెలుగునిస్తాయి.
9 యెహోవాను ఆరాధించుట మంచిది.
అది నిరంతరము నిలుస్తుంది.
యెహోవా తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి.
అవి సంపూర్ణంగా సరియైనవి.
10 శ్రేష్ఠమైన బంగారంకంటె యెహోవా ఉపదేశాలను మనము ఎక్కువగా కోరుకోవాలి.
సాధారణ తేనె పట్టు నుండి వచ్చే శ్రేష్ఠమైన తేనె కంటె అవి మధురంగా ఉంటాయి.
11 యెహోవా ఉపదేశాలు నీ సేవకుణ్ణి చాలా తెలివిగలవాణ్ణిగా చేస్తాయి.
నీ చట్టాలు పాటించేవారు గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు.
12 యెహోవా, ఏ వ్యక్తీ, తన స్వంత తప్పులన్నింటినీ చూడలేడు.
కనుక నేను రహస్య పాపాలు చేయకుండా చూడుము.
13 యెహోవా, నేను చేయాలనుకొనే పాపాలు చేయకుండా నన్ను ఆపుచేయుము.
ఆ పాపాలు నా మీద అధికారం చెలాయించ నీయకుము.
నీవు నాకు సహాయం చేస్తే, అప్పుడు నేను గొప్ప పాపము నుండి, పవిత్రంగా దూరంగా ఉండగలను.
14 నా మాటలు, తలంపులు నిన్ను సంతోషపెడ్తాయని నేను ఆశిస్తున్నాను.
యెహోవా, నీవే నా ఆశ్రయ దుర్గం. నీవే నన్ను రక్షించేవాడవు.
ప్రజలకోసం రాళ్ల జ్ఞాపికలు
27 మోషే. ఇశ్రాయేలు నాయకులతో కలసి, ప్రజలకు ఇలా ఆజ్ఞాపించాడు: “నేడు నేను మీకు ఇచ్చే ఆజ్ఞలు అన్నింటికీ విధేయులుగా ఉండండి. 2 మీరు యొర్దాను నది దాటి, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు ప్రవేశించిన రోజున, మీరు పెద్ద బండలను నిలబెట్టాలి. ఈ రాళ్లకు సున్నము పూయండి. 3 ఈ ధర్మశాస్త్రంలోని మాటలు అన్నీ ఆ బండలమీద వ్రాయండి. మీరు యొర్దాను నది దాటి వెళ్లిన తర్వాత ఇది మీరు చేయాలి. తర్వాత మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న – పాలు, తేనెలు ప్రవహించుచున్న దేశంలోనికి మీరు వెళ్లాలి. మీ పూర్వీకుల దేవుడైన యెహోవా దీనిని మీకు వాగ్దానం చేసాడు.
4 “మీరు యొర్దాను నది దాటి వెళ్లిన తర్వాత, ఈ వేళ నేను మీకు ఆదేశించినట్టు ఏబాలు కొండ మీద మీరు ఈ బండలను నిలబెట్టాలి. ఈ బండలకు మీరు సున్నము పూయాలి. 5 మరియు అక్కడి రాళ్లు కొన్ని ఉపయోగించి మీ దేవుడైన యెహోవాకు మీరు ఒక బలిపీఠం కట్టాలి. రాళ్లను కోయటానికి యినుప పనిముట్లు ఉపయోగించవద్దు. 6 మీరు మీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టేటప్పుడు, పగులగొట్టని బండలనే మీరు ఉపయోగించాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవాకు ఆ బలిపీఠం మీద దహన బలులు అర్పించండి. 7 మరియు మీరు అక్కడ బలి అర్పణలు అర్పించి, సమాధాన బలులను అర్పించాలి. అక్కడ భోజనం చేసి, మీ దేవుడైన యెహోవాతో సంతోషంగా సమయం గడపండి. 8 మీరు నిలబెట్టే బండల మీద ఈ ధర్మశాస్త్రం అంతా చాలా తేటగా మీరు రాయాలి.”
దేవుని నియమాలకు ప్రజల సమ్మతి
9 లేవీ యాజకులతో కలసి మోషే ఇశ్రాయేలు ప్రజలందరితో మాట్లాడి ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలీయులారా, నిశ్శబ్దంగా ఉండి, వినండి. ఈ వేళ మీరు మీ దేవుడైన యెహోవా ప్రజలు అయ్యారు. 10 కనుక మీ దేవుడైన యెహోవా మీకు చెప్పేది అంతా మీరు చేయాలి. ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఆయన ఆదేశాలు, చట్టాలకు మీరు విధేయులు కావాలి.”
ఉప్పు—వెలుగు
(మార్కు 9:50; 4:21; లూకా 14:34-35; 8:16)
13 “మీరు ఈ ప్రపంచానికి ఉప్పులాంటి వాళ్ళు, కాని ఉప్పులోవున్న ఉప్పు గుణం పోతే మళ్ళీ దాన్ని ఉప్పుగా ఎలా చెయ్యగలం? అది దేనికీ పనికి రాకుండా పోతుంది. అంతేకాక, దాన్ని పార వేయవలసి వస్తుంది. ప్రజలు దాన్ని త్రొక్కుతూ నడుస్తారు.
14 “మీరు ఈ ప్రపంచానికి వెలుగులాంటి వాళ్ళు. కొండ మీద ఉన్న పట్టణాన్ని మరుగు పరచటం అసంభవం. 15 దీపాన్ని వెలిగించి దాన్ని ఎవ్వరూ గంప క్రింద దాచి ఉంచరు. దానికి మారుగా దాన్ని వెలిగించి ముక్కాలి పీటపై ఉంచుతారు. అప్పుడది యింట్లోని వాళ్ళందరికి వెలుగునిస్తుంది. 16 అదే విధంగా మీ జీవితం వెలుగులా ప్రకాశించాలి. అప్పుడు యితర్లు మీరు చేస్తున్న మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని స్తుతిస్తారు.
ధర్మశాస్త్రాన్ని గురించి ఉపదేశం
17 “నేను ధర్మశాస్త్రాన్ని కాని, ప్రవక్తల వచనాలను కాని రద్దు చేయటానికి వచ్చానని అనుకోవద్దు. నేను వాటిని రద్దుచేయటానికి రాలేదు. వాటిని పూర్తి చేయటానికి వచ్చాను. 18 ఇది సత్యం. భూమి, ఆకాశం గడచి పోయేలోపుల అన్ని సంగతులు, ధర్మశాస్త్రంలోని చిన్న అక్షరం, పొల్లుతో సహా నెరవేరుతాయి.
19 “ఒక చిన్న ఆజ్ఞనైనా సరే రద్దుచేసిన వాడును, తనలాగే చెయ్యమని బోధించిన వాడును దేవుని రాజ్యంలో తక్కువ వాడుగా ఎంచబడుతాడు. కాని ఈ ఆజ్ఞల్ని అనుసరిస్తూ వాటిని బోధించినవాడు దేవుని రాజ్యంలో గొప్పవానిగా ఎంచబడతాడు. 20 ఎందుకంటే, మీరు శాస్త్రులకన్నా, పరిసయ్యుల[a] కన్నా గొప్ప నీతిమంతులని గుర్తింపబడక పోతే దేవుని రాజ్యంలోకి ప్రవేశింపలేరని నేను చెబుతున్నాను.
© 1997 Bible League International