Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.
139 యెహోవా, నీవు నన్ను పరీక్షించావు.
నన్ను గూర్చి నీకు అంతా తెలుసు.
2 నేను ఎప్పుడు కూర్చునేది ఎప్పుడు లేచేది నీకు తెలుసు.
దూరంలో ఉన్నా, నా తలంపులు నీకు తెలుసు.
3 యెహోవా, నేను ఎక్కడికి వెళ్లుతున్నది, ఎప్పుడు పండుకొంటున్నది నీకు తెలుసు.
నేను చేసే ప్రతీది నీకు తెలుసు.
4 యెహోవా, నా మాటలు నా నోటిని దాటక ముందే
నేను ఏమి చెప్పాలనుకొన్నానో అది నీకు తెలుసు.
5 యెహోవా, నీవు నా ముందు, నా వెనుక, నా చుట్టూరా ఉన్నావు.
నీవు నెమ్మదిగా నీ చేయి నామీద వేస్తావు.
6 నీకు తెలిసిన విషయాలను గూర్చి నాకు ఆశ్చర్యంగా ఉంది.
గ్రహించటం నాకు కష్టతరం.
7 నేను వెళ్లే ప్రతీచోటా నీ ఆత్మ ఉంది.
యెహోవా, నేను నీ నుండి తప్పించుకోలేను.
8 నేను ఆకాశానికి ఎక్కితే, నీవు అక్కడ ఉన్నావు.
పాతాళానికి నేను దిగిపోతే నీవు అక్కడ కూడా ఉన్నావు.
9 యెహోవా, సూర్యుడు ఉదయించే తూర్పు దిశకు నేను వెళ్తే నీవు అక్కడ ఉన్నావు.
పశ్చిమంగా సముద్రం దగ్గరకు వెళ్తే, నీవు అక్కడ ఉన్నావు.
10 అక్కడ కూడ నీవు నీ కుడిచేయి చాచి,
ఆ చేతితో నన్ను నడిపిస్తావు.
11 యెహోవా, నేను నీకు కనబడకుండా దాగుకోవాలని ప్రయత్నిస్తే,
“పగలు రాత్రిగా మారిపోయింది.
తప్పక చీకటి నన్ను దాచిపెడుతుంది” అని చెప్పవచ్చు
12 కాని యెహోవా, చీకటి నీకు చీకటి కాదు.
రాత్రి నీకు పగటి వెలుగువలె ఉంటుంది.
13 యెహోవా, నా శరీరమంతటినీ[a] నీవు చేశావు.
నేను ఇంకా నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నీకు తెలుసు.
14 యెహోవా, నీవు నన్ను సృష్టించినప్పుడు నీవు చేసిన ఆశ్చర్యకరమైన కార్యాలు అన్నింటి కోసం నేను నీకు వందనాలు అర్పిస్తున్నాను.
నీవు చేసే పనులు ఆశ్చర్యం, అది నాకు నిజంగా తెలుసు.
15 నన్ను గూర్చి నీకు పూర్తిగా తెలుసు. నా తల్లి గర్భంలో దాగి ఉండి,
నా శరీరం రూపాన్ని దిద్దుకుంటున్నప్పుడు నా ఎముకలు పెరగటం నీవు గమనించావు.
16 యెహోవా, నా తల్లి గర్భంలో నా శరీరం పెరగటం నీవు చూశావు.
ఈ విషయాలన్నీ నీ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ప్రతిరోజు నీవు నన్ను మరువక గమనించావు.
17 దేవా, నీ తలంపులు గ్రహించటం ఎంతో కష్టతరం.
నీకు ఎంతో తెలుసు.
18 వాటిని లెక్కించగా అవి భూమి మీద ఉన్న యిసుక రేణువుల కంటే ఎక్కువగా ఉంటాయి.
కాని నేను వాటిని లెక్కిం చటం ముగించిన తర్వాత కూడా యింకా నీతోనే ఉంటాను.
21 యోవాషు రాజయినప్పుడు, అతను ఏడేండ్లవాడు.
యోవాషు పరిపాలన ప్రారంభించుట
12 ఇశ్రాయేలు రాజుగా యెహూ పాలన సాగించిన ఏడవ సంవత్సరంనుండి యోవాషు తన పరిపాలన ప్రారంభించాడు. యెరూషలేములో యోవాషు 40 సంవత్సరములు పాలించాడు. యోవాషు తల్లి బెయేర్షెబాకు చెందిన జిబ్యా. 2 యెహోవా దృష్టికి సరి అయిన పనులు యోవాషు జరిగించాడు. జీవితాంతమూ యోవాషు యెహోవా పట్ల విధేయుడై వుండెను. యాజకుడైన యెహోయాదా తనకు నేర్పించిన పనులు అతను చేశాడు. 3 కాని అతను ఉన్నత స్థానాలను నాశనం చెయ్యలేదు. ఆ ఆరాధనా స్థలాలలో ఆనాటికీ ప్రజలు బలులు అర్పిస్తున్నారు, ధూపం వేస్తున్నారు.
యోవాషు ఆలయ పునరుద్ధరణకు ఆజ్ఞాపించుట
4-5 “యెహోవా ఆలయంలో చాలా ధనం వున్నది. ప్రజలు ఆలయానికి కొన్ని వస్తువులు సమర్పించారు. వారిని లెక్కించినప్పుడు ప్రజలు ఆలయం పన్ను చెల్లించారు. డబ్బు ఇవ్వాలనే వుద్దేశ్యంతో వారు ఇచ్చారు. యాజకులైన మీరు ఆ ధనం తీసుకొని యెహోవా ఆలయాన్ని బాగు చేయండి. తాను సేవచేసే ప్రజలనుండి లభించే డబ్బును ప్రతి యాజకుడు వినియోగించాలి. యెహోవా ఆలయానికి ఆ డబ్బుతో మంచిపనులు చేయాలి” అని యాజకులకు యోవాషు చెప్పాడు.
6 కాని యాజకులు మరమ్మతులు చేయలేదు. యోవాషు రాజుగావున్న 23వ సంవత్సరమున, యాజకులు అప్పటికి మరమ్మతులు చేయలేదు. 7 అందువల్ల యోవాషు రాజు యెహోయాదా యాజకుని, ఇతర యాజకులను పిలిపించుకున్నాడు. యెవాషు, యెహోయాదా, ఇతర యాజకులతో, “మీరెందుకు ఆలయాన్ని మరమ్మతు చేయలేదు? మీరు సేవించే మనుష్యుల వద్దనుండి మీరు డబ్బును తీసుకోవడం నిలిపివేయండి. ఆ డబ్బును వాడకండి. ఆలయాన్ని మరమ్మతు చేయుటకే అది వినియోగించ బడాలి” అని చెప్పాడు.
8 ప్రజలవద్ద నుండి డబ్బు వసూలు చేయడాన్ని ఆపివేయడానికి యాజకులు సమ్మతించారు. అయితే ఆలయాన్ని బాగు చేయకూడదని నిర్ణయించుకున్నారు. 9 అందువల్ల యాజకుడైన యెహోయాదా ఒక పెట్టె తీసుకుని దానిమీద ఒక రంధ్రం చేశాడు. తర్వాత యెహోయాదా బలిపీఠపు దక్షిణ దిశగా పెట్టెను ఉంచాడు. ఈ పెట్టె యెహోవా ఆలయానికి ప్రజలు వచ్చే ద్వారానికి ప్రక్కగా వున్నది. కొందరు యాజకులు ఆలయంలోని ఆ ద్వారాన్ని కాపలా కాసారు. యెహోవాకి ప్రజలు సమర్పించిన డబ్బును ఆ యాజకులు తీసుకుని, ఆ పెట్టలో వేశారు.
10 తర్వాత ఆలయానికి వెళ్లినప్పుడల్లా ప్రజలు ఆ పెట్టెలో డబ్బు వేయడం మొదలుపెట్టారు. రాజుగారి కార్యదర్శి, ప్రధాన యాజకుడు ఆ పెట్టెలో డబ్బు చాలా ఉండడం చూసివప్పుడు, వారు ఆ పెట్టె నుండి డబ్బు తీసుకొని, ఆ డబ్బును సంచులలో వేసి లెక్కించారు. 11 యెహోవా ఆలయాన పనిచేసే వారికి వారు ఆ డబ్బు ఇచ్చి వేశారు. వడ్రంగులు మరి ఇతర ఆలయ కాపరులకు డబ్బు ఇచ్చారు. 12 రాళ్లు చెక్కే వారికి రాళ్లు మోసేవారికి ఇవ్వడానికి ఆ డబ్బు వినియోగించారు. మరియు కలపకొనడానికి, రాళ్లు ముక్కలు చేయడానికి, ఆలయ మరమ్మతు పనులకు వారు ఆ డబ్బు వినియోగించారు.
13-14 యెహోవా ఆలయానికి ప్రజలు డబ్బు ఇచ్చారు. కాని యాజకులు ఆ డబ్బును వెండి కప్పులు, దీపాలు వెలిగించేందుకు వుపయోగించే కప్పులు, గిన్నెలు, బూరలు, బంగారం, వెండి పాత్రలు చేసేందుకు వినియోగించలేక పోయారు. ఆ డబ్బు పనివారికి ఇవ్వబడింది. ఆ పని వారు యెహోవా ఆలయాన్ని బాగు చేశారు. 15 ఆ డబ్బునంతా ఎవ్వరూ లెక్కించలేదు. ఆ డబ్బు ఏమి చేయబడినదో చెప్పమని ఏ పనివానిని నిర్భంధించ లేదు. ఎందుకనగా పనివారు నమ్మకస్థులుగా ఉన్నారు.
16 అపరాధ పరిహారార్థ బలులు, పాపపరిహారార్థ బలులు సమర్పించు సమయములో ప్రజలు ఆ డబ్బు ఇచ్చారు. ఆ డబ్బు పనివారికి ఇవ్వబడడం జరిగేదికాదు. ఆ డబ్బు యాజకులకు చెందినది.
ధనికులకు హెచ్చరిక
5 ధనికులారా! వినండి. మీకు కష్టాలు కలుగనున్నవి. కనుక దుఃఖించండి. శోకిస్తూ కేకలు వేయండి. 2 మీ ధనం చెడిపోతుంది. మీ దుస్తులకు చెదలుపడ్తాయి. 3 మీ దగ్గరున్న వెండి బంగారాలకు త్రుప్పు పడుతుంది. వాటి త్రుప్పు మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి మీ శరీరాల్ని నిప్పులా కాల్చి వేస్తుంది. చివరి దినాలకు మీరు ధనాన్ని దాచుకొన్నారు. 4 మీ పొలాల్ని సాగుచేసిన పనివాళ్ళకు మీరు కూలి యివ్వలేదు. వాళ్ళు ఏడుస్తూ మీపై ఫిర్యాదు చేస్తున్నారు. ఆ కూలివాళ్ళ ఏడ్పులు సర్వశక్తి సంపన్నుడైన ప్రభువు చెవిలోపడ్డాయి.
5 మీరు ఐశ్వర్యంతో విలాసాలు చేసుకొంటూ ఈ ప్రపంచంలో జీవించారు. మీరు మీ హృదయాల్ని కొవ్వెక్క చేసి చివరి రోజు వధింపబడటానికి సిద్ధపరుస్తున్నారు. 6 తప్పు చేయని వాళ్ళపై మీరు శిక్ష విధించారు. వాళ్ళను చంపారు. అయినా వాళ్ళు మిమ్మల్ని ఎదిరించటం లేదు.
© 1997 Bible League International