Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 54

సంగీత నాయకునికి: వాయిద్యాలతో పాడునది. దావీదు ధ్యానము. జిఫీయులు సౌలు దగ్గరకు వెళ్లి “దావీదు మా ప్రజల వద్ద దాక్కొన్నాడని తలస్తున్నాము” అని అతనితో చెప్పినప్పటిది.

54 దేవా, నీ నామం ద్వారా నన్ను రక్షించుము.
    నన్ను విడుదల చేయుటకు నీ శక్తి ఉపయోగించుము.
దేవా, నా ప్రార్థనను,
    నేను చెప్పే సంగతులను ఆలకించుము.
పరదేశీయులు నాకు విరోధంగా తిరిగారు.
    బలాఢ్యులైన మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. దేవా, ఆ మనుష్యులు నిన్ను కనీసం ఆరాధించరు.

చూడండి, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు.
    నా ప్రభువు నన్ను బలపరుస్తాడు.
తమ స్వంత దుష్టత్వముతో నాపై గూఢచారత్వము చేసే జనులను దేవుడు శిక్షిస్తాడు.
    దేవా, నీవు నాకు నమ్మకస్థుడవై ఉండుటనుబట్టి ఆ జనులను నాశనం చేయుము.

దేవా, నేను నీకు స్వేచ్ఛార్పణలు ఇస్తాను.
    యెహోవా, నేను నీకు వందనాలు చెల్లిస్తాను. ఎందుకంటే నీవు మంచివాడవు.
నీవు నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించావు.
    మరియు నా శత్రువులు ఓడిపోవటం నేను చూసాను.

1 రాజులు 22:24-40

24 తరువాత ప్రవక్తయగు సిద్కియా, మీకాయా వద్దకు వెళ్లాడు. సిద్కియా మీకాయాను చెంప మీదకొట్టి, “యెహోవా శక్తి నన్ను వదిలి నీద్వారా మాట్లాడుతున్నదని నీవు నిజంగా నమ్ముతున్నావా?” అని అడిగాడు.

25 “నీవు వెంటనే వెళ్లి ఒక చిన్న గదిలో దాగివుండు. అప్పుడు నేను నిజం చెబుతున్నట్లు నీకు తెలుస్తుంది” అన్నాడు మీకాయా.

26 మీకాయాను బంధించమని అహాబు తన అధికారులకు ఆజ్ఞ ఇచ్చాడు. “ఇతనిని బంధించి నగరపాలకుడగు ఆమోను వద్దకు తీసుకుని వెళ్లండి. రాజకుమారుడైన యెవాషును ఇతనిపై తీర్పు చెప్పనీయండి. 27 మీకాయాను కారాగారంలో వుంచమని అతనికి చెప్పండి. వీనికి కేవలం రొట్టె, నీరు మాత్రం ఇవ్వండి. నేను యుద్ధంనుండి ఇంటికి తిరిగి వచ్చేవరకు ఇతనిని అక్కడే వుంచండి” అని రాజైన అహాబు అన్నాడు.

28 అది విన్న మీకాయా ఇలా ప్రకటించాడు: “సర్వప్రజలారా, నే చెప్పేది సావధానంగా వినండి! అహాబు రాజా, యుద్ధం నుండి నీవు క్షేమంగా ఇంటికి తిరిగివస్తే, యెహోవా నా ద్వారా మాట్లాడి యుండనట్లే.”

రామోతు గిలాదు వద్ద యుద్ధం

29 తరువాత రాజైన అహాబు, మరియు రాజైన యెహోషాపాతు కలిసి రామోత్గిలాదు వద్ద అరాము సైన్యంతో యుద్ధం చేయటానికి వెళ్లారు. గిలాదు అనే ప్రాంతంలో ఇది వుంది. 30 అహాబు యెహోషాపాతుతో ఇలా అన్నాడు: “మనం యుద్ధానికి సిద్ధమవుదాం. నేను రాజునని తెలియకుండా వుండేలాగున తగిన దుస్తులు వేసుకుంటాను. కాని నీవు మాత్రం రాజఠీవి ఉట్టిపడే నీ యొక్క ప్రత్యేక దుస్తులు ధరించు.” ఇశ్రాయేలు రాజు మారువేషం వేసుకున్నాడు. యుద్ధం మొదలయింది.

31 అరాము రాజుకు ముప్పది యిద్దరు రథాధిపతులున్నారు. ఈ ముప్పది యిద్దరు రథాధిపతులకూ ఇశ్రాయేలు రాజు ఎక్కడ వున్నాడో చూడమని చెప్పాడు. ఇశ్రాయేలు రాజును చంపేయమని అరాము రాజు అధిపతులకు ఆజ్ఞ ఇచ్చాడు. 32 యుద్దం సాగుతూవుండగా ఈ అధిపతులు రాజైన యెహోషాపాతును చూశారు. వారు అతనినే ఇశ్రాయేలు రాజుగా భావించారు. అందుచే వారతనిని చంపటానికి వెళ్లారు. యెహోషాపాతు తను రాజు కాదన్నట్లు అరవటం ప్రారంభించాడు. 33 దానితో అతడు రాజైన అహాబుకాదని తెలుసుకున్నారు. అందుచేత వారతనిని చంపలేదు.

34 కాని ఒక సైనికుడు తన బాణాన్ని గాలిలోకి వదిలాడు. అతడు కావాలని దానిని ఎవరిపైకీ గురిచూసి వదలలేదు. కాని ఆ బాణం ఇశ్రాయేలు రాజైన అహాబుకు తగిలింది. రాజు కవచం అతని శరీరాన్ని కప్పని చోట బాణం తగిలింది. రాజైన అహాబు తనసారధితో, “నాకు ఒక బాణం తగిలింది. త్వరగా రథాన్ని ఈ ప్రదేశంనుండి బయటికి నడిపించు. యుద్ధంనుండి మనం వెళ్లిపోవాలి” అని అన్నాడు.

35 సైన్యాలు మాత్రం యుద్ధాన్ని కొనసాగించాయి. రాజైన ఆహాబు తన రథం మీదే వుండిపోయాడు. రథంలో ఒక పక్కగా ఆనుకొని వున్నాడు. అతడు అరాము సైన్యంవైపు చూస్తూ వుండిపోయాడు. అతని గాయం నుండి కారిన రక్తం రథంలో పేరుకుపోయింది. బాగా సాయంత్ర మయ్యేసరికి రాజు చనిపోయాడు. 36 సూర్యాస్తమయసమయంలో ఇశ్రాయేలు సైన్యం తమ స్వదేశానికి, నగరానికి తిరిగి వెళ్లటానికి ఆజ్ఞ ఇవ్వబడింది.

37 రాజైన అహాబు ఆ విధంగా చనిపోయాడు. అతని భౌతిక కాయాన్ని కొందరు షోమ్రోనుకు తీసుకొని వెళ్లారు. వారు దానిని అక్కడ సమాధి చేశారు. 38 అహాబు రథాన్ని సైనికులు షోమ్రోనులో ఒక చెరువు వద్ద కడిగారు. అక్కడ కొన్ని కుక్కలు రథం చుట్టూ చేరి రథంలో పేరుకు పోయిన రాజైన అహాబు రక్తాన్ని నాకాయి. పైగా ఆ నీటిలో వేశ్యలు స్నానం చేశారు. ఇవన్నీ ఎలా జరుగుతాయని యెహోవా చెప్పియున్నాడో అలానే జరిగాయి.

39 రాజైన అహాబు తన పరిపాలనాకాలంలో చేసిన పనులన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో పొందు పర్చబడ్డాయి. రాజు తన భవనాన్ని అందంగా తీర్చిదిద్దటానికి ఉపయోగించిన దంతాన్ని గూర్చి కూడ ఆ గ్రంథం వివరిస్తుంది. అందులో రాజు నిర్మించిన నగరాన్ని గూర్చి కూడా వుంది. 40 అహాబు చనిపోయిన పిమ్మట అతని కుమారుడైన అహజ్యా అతని స్థానంలో రాజు అయ్యాడు.

రోమీయులకు 11:25-32

25 సోదరులారా! మీరు తెలుసుకోవాలని మీకీ రహస్యం చెప్పాలనుకొంటున్నాను. మీరు అజ్ఞానులుగా ఉండటం నాకిష్టం లేదు. కొందరు ఇశ్రాయేలు ప్రజలు మూర్ఖత్వంతో ఉన్నారు. నాటబడాలని కోరుకొంటున్న యూదులుకాని ప్రజలు నాటబడే వరకు ఈ మూర్ఖత్వం వీళ్ళలో ఉంటుంది. 26 శాస్త్రాల్లో వ్రాసినట్లు ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా రక్షింపబడతారు:

“రక్షకుడు సీయోను నుండి వస్తాడు;
    అతడు యాకోబు వంశీయుల్లో ఉన్న చెడును తొలగిస్తాడు.
27 నేను వాళ్ళ పాపాలను తొలగించినప్పుడు,
    వాళ్ళతో ఈ ఒడంబడిక చేస్తాను.”(A)

28 ఒక విధంగా చూస్తే వాళ్ళు సువార్తను బట్టి మీకు శత్రువులు. మరొక విధంగా చూస్తే వాళ్ళు దేవుడు ఎన్నుకొన్నవాళ్ళు కనుక, వాళ్ళ మూలపురుషుల్ని బట్టి వాళ్ళు ప్రేమించబడ్డారు. 29 ఎందుకంటే, దేవుడు “వరాల” విషయంలో, “పిలుపు” విషయంలో మనస్సు మార్చుకోడు. 30 యూదులు కాని మీరు ఒకప్పుడు దేవుణ్ణి నిరాకరించారు. కాని ఇప్పుడు యూదులు సువార్తను నిరాకరించటం వల్ల దైవానుగ్రహం మీకు లభించింది. 31 అదే విధంగా ఇప్పుడు యూదులు దేవుణ్ణి నిరాకరిస్తున్నారు. అందువల్ల, మీకు లభించిన అనుగ్రహం ద్వారా వాళ్ళకు కూడా దైవానుగ్రహం లభిస్తుంది. 32 ఎందుకంటే, దేవుడు అందరిపై అనుగ్రహం చూపాలని అందర్ని కలిపి అవిధేయతకు బంధించి వేసాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International