Revised Common Lectionary (Complementary)
తౌ
169 యెహోవా, నా సంతోష గీతం ఆలకించుము.
నీ వాగ్దాన ప్రకారం నన్ను జ్ఞానం గలవానిగా చేయుము.
170 యెహోవా, నా ప్రార్థన వినుము.
నీవు వాగ్దానం చేసినట్టే, నన్ను రక్షించుము.
171 నీవు నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించావు
కనుక నేను స్తుతి గీతాలతో ఉప్పొంగిపోతాను.
172 నీ మాటలకు నన్ను జవాబు చెప్పనిమ్ము.
నా పాట నన్ను పాడనిమ్ము. యెహోవా, నీ న్యాయచట్టాలన్నీ మంచివి.
173 నేను నీ ఆజ్ఞలను అనుసరించాలని నిర్ణయించుకొన్నాను
గనుక నన్ను ఆదుకొని, నాకు సహాయం చేయుము.
174 యెహోవా, నీవు నన్ను రక్షించాలని నేను కోరుతున్నాను.
కాని నీ ఉపదేశాలు నన్ను సంతోష పరుస్తాయి.
175 యెహోవా, నన్ను జీవించనిమ్ము. నిన్ను స్తుతించనిమ్ము.
నీ న్యాయ చట్టాలు నాకు సహాయం చేయనిమ్ము.
176 నేను తప్పిపోయిన గొర్రెలా తిరిగాను.
యెహోవా, నా కోసం వెదకుతూ రమ్ము.
నేను నీ సేవకుడను.
మరియు నేను నీ ఆజ్ఞలను మరువలేదు.
12 యెరూషలేముకు, సీయోను కొండకు నా ప్రభువు చేయదలచిన వాటిని చేయటం ముగిస్తాడు. అప్పుడు యెహోవా అష్షూరును శిక్షిస్తాడు. అష్షూరు రాజు చాలా గర్విష్ఠి. అతడు గర్వం చేత చాలా చెడ్డ పనులు చేశాడు. అందుచేత దేవుడు అతణ్ణి శిక్షిస్తాడు.
13 అష్షూరు రాజు అంటున్నాడు: “నేను చాలా తెలివిగలవాడ్ని. నా స్వంత జ్ఞానం, శక్తి మూలంగా నేను ఎన్నోగొప్ప కార్యాలు చేశాను. అనేక రాజ్యాల్ని నేను ఓడించాను. వారి ఐశ్వర్యం నేను దోచుకొన్నాను. వారి ప్రజలను నేను బానిసలుగా చేసుకొన్నాను. నేను చాలా శక్తిగలవాణ్ణి. 14 ఒకడు పక్షి గూటిలోనుండి గుడ్లు తీసినట్టుగా, నేను నా స్వంత చేతుల్తో ఈ ప్రజలందరి సంపదలు తీసుకొన్నాను. ఒక పక్షి తన గూడును, గుడ్లను తరచు విడిచిపెడ్తుంటుంది. ఆ గూటిని కాపాడేందుకు ఏమీ లేదు. కిచకిచలాడ్తూ, తన రెక్కలతో, ముక్కుతో కొట్లాడేందుకు అక్కడ ఏ పక్షి లేదు. అందుచేత మనుష్యులు ఆ గుడ్లు తీసుకొంటారు. ఆదే విధంగా భూలోకంలోని మనుష్యులందరినీ నేను తీసుకొనకుండా నన్ను ఆపగలిగిన వాడు ఎవడూ లేడు.”
15 గొడ్డలి, దానిని ప్రయోగించే వానికంటె గొప్పదేంకాదు. రంపం, దానితో కోసే వానికంటె గొప్పదేంకాదు. కాని అష్షూరు తాను దేవునికంటే ముఖ్యం అనుకొంటుంది. ఎవరినైనా శిక్షించేందకు ఒకడు బెత్తం తీసుకొని ప్రయోగిస్తే, అతనికంటె ఆ బెత్తం ఎక్కువ శక్తి గలది, ముఖ్యమయింది అన్నట్టు ఉంటుంది. 16 అష్షూరు చాల గొప్పవాడ్ని అని అనుకొంటాడు. కానీ సర్వశక్తిమంతుడైన యెహోవా అష్షూరు మీదికి గొప్ప రోగం పంపిస్తాడు. ఒక రోగి బరువు కోల్పోయినట్టు అష్షూరు తన ఐశ్వర్యాన్ని, శక్తిని పోగొట్టుకొంటాడు. అప్పుడు అష్షూరు మహిమ నాశనం అవుతుంది. సర్వం పోయేవరకు మండుతూ ఉండే అగ్నిలా అది ఉంటుంది. 17 ఇశ్రాయేలు వెలుగు (దేవుడు) అగ్నిలా ఉంటాడు. ఆ పరిశుద్ధుడు ఒక జ్వాలలా ఉంటాడు. మొట్టమొదట పొదలను, ముళ్లకంపలను కాల్చేసే అగ్నిలా ఆయన ఉంటాడు. 18 ఆ తర్వాత అగ్ని మహా వృక్షాలను, ద్రాక్షాతోటలను కాల్చివేస్తుంది. చివరికి సర్వం, ప్రజలతో సహా నాశనం చేయబడుతుంది. దేవుడు అష్షూరును నాశనం చేసినప్పుడు అలా ఉంటుంది. అష్షూరు కుళ్లిపోతున్న మొద్దులా ఉంటుంది. 19 అరణ్యంలో కొన్ని చెట్లు మాత్రం నిలిచి ఉండవచ్చు. కానీ అవి ఒక పిల్లవాడు కూడ లెక్కబెట్ట గలిగినన్ని ఉంటాయి.
20 ఆ సమయంలో ఇశ్రాయేలులో ఇంకా బ్రతికి ఉన్నవారు, యాకోబు వంశ ప్రజలు, వారిని కొట్టేవాని మీద ఆధారపడరు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడైన యెహోవా మీద నిజంగా ఆధారపడటం వారు నేర్చుకొంటారు.
యేసు, “క్రీస్తా”?
25 అదే క్షణాన కొందరు యెరూషలేము ప్రజలు ఈ విధంగా అనటం మొదలుపెట్టారు: “వాళ్ళు చంపాలని ప్రయత్నిస్తున్నది ఈయనే కదా! 26 ఆయనిక్కడ బహిరంగంగా మాట్లాడుతున్నా వాళ్ళు ఆయన్ని ఒక్క మాట కూడా అనటం లేదే! అధికారులు కూడా ఈయన నిజంగా క్రీస్తు అని తలంచారా ఏమి? 27 కాని క్రీస్తు వచ్చేటప్పుడు ఎక్కడనుండి వస్తాడో ఎవ్వరికీ తెలియదు. మరి ఈయనెక్కడి నుండి వచ్చాడో మనకందరికి తెలుసు!”
28 అప్పుడు యేసు మందిరంలో ఇంకను మాట్లాడుతూ ఉండినాడు. ఆయన బిగ్గరగా, “ఔను! నేనెవరినో మీకు తెలుసు. నేను స్వతహాగా యిక్కడికి రాలేదు నన్ను పంపించినవాడు సత్యవంతుడు. ఆయనెవరో మీకు తెలియదు. 29 కాని ఆయన నన్ను పంపాడు కాబట్టి ఆయన దగ్గర నుండి నేను యిక్కడికీ వచ్చాను. కాబట్టి ఆయనెవరో నాకు తెలుసు” అని అన్నాడు.
30 ఇది విని వాళ్ళు ఆయన్ని బంధించాలని ప్రయత్నించారు. కాని ఆయన సమయం యింకా రాలేదు కనుక ఆయన మీద ఎవ్వరూ చేయి వేయలేదు. 31 అక్కడున్న వాళ్ళలో చాలా మంది ఆయన్ని విశ్వసించారు. వాళ్ళు, “క్రీస్తు వచ్చినప్పుడు ఈయన కన్నా గొప్ప అద్భుతాలు చేస్తాడా?” అని అన్నారు.
యూదా నాయకులు యేసును బంధించుటకు ప్రయత్నించటం
32 ప్రజలు ఆయన్ని గురించి యిలా మాట్లాడు కోవటం పరిసయ్యులు విన్నారు. వాళ్ళు, ప్రధాన యాజకులు కలిసి ఆయన్ని బంధించటానికి భటుల్ని పంపారు. 33 కనుక యేసు ప్రజలతో, “నేను మీతో కొద్దికాలమే ఉంటాను. ఆ తర్వాత నన్ను పంపిన వాని దగ్గరకు వెళ్తాను. 34 నా కోసం మీరు వెతుకుతారు. కాని నన్ను కనుక్కోలేరు. నేనున్న చోటికి మీరు రాలేరు” అని అన్నాడు.
35 యూదులు తమలో తాము, “మనం కనుక్కోకుండా ఉండేటట్లు ఇతడు ఎక్కడికి వెళ్ళదలిచాడు? గ్రీకుల మధ్య నివసిస్తున్న మనవాళ్ళ దగ్గరకు వెళ్ళి గ్రీకులకు బోధిస్తాడా? 36 ‘నా కోసం వెతుకుతారు, కాని కనుక్కోలేరు. నేనున్న చోటికి మీరు రాలేరు’ అని అతడు అనటంలో అర్థమేమిటి?” అని మాట్లాడుకున్నారు.
© 1997 Bible League International