Revised Common Lectionary (Complementary)
తౌ
169 యెహోవా, నా సంతోష గీతం ఆలకించుము.
నీ వాగ్దాన ప్రకారం నన్ను జ్ఞానం గలవానిగా చేయుము.
170 యెహోవా, నా ప్రార్థన వినుము.
నీవు వాగ్దానం చేసినట్టే, నన్ను రక్షించుము.
171 నీవు నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించావు
కనుక నేను స్తుతి గీతాలతో ఉప్పొంగిపోతాను.
172 నీ మాటలకు నన్ను జవాబు చెప్పనిమ్ము.
నా పాట నన్ను పాడనిమ్ము. యెహోవా, నీ న్యాయచట్టాలన్నీ మంచివి.
173 నేను నీ ఆజ్ఞలను అనుసరించాలని నిర్ణయించుకొన్నాను
గనుక నన్ను ఆదుకొని, నాకు సహాయం చేయుము.
174 యెహోవా, నీవు నన్ను రక్షించాలని నేను కోరుతున్నాను.
కాని నీ ఉపదేశాలు నన్ను సంతోష పరుస్తాయి.
175 యెహోవా, నన్ను జీవించనిమ్ము. నిన్ను స్తుతించనిమ్ము.
నీ న్యాయ చట్టాలు నాకు సహాయం చేయనిమ్ము.
176 నేను తప్పిపోయిన గొర్రెలా తిరిగాను.
యెహోవా, నా కోసం వెదకుతూ రమ్ము.
నేను నీ సేవకుడను.
మరియు నేను నీ ఆజ్ఞలను మరువలేదు.
దేవుడు బేతేలుకు వ్యతిరేకంగా పలుకుట
13 ఒక రోజు యూదా దేశపువాడైన ఒక దైవజనుడ్ని బేతేలు నగరానికి వెళ్లమని యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు. ఆ దైవజనుడు అక్కడికి వెళ్లే సరికి రాజైన యరొబాము బలిపీఠం వద్ద నిలబడి ధూపం వేస్తూ వున్నాడు. 2 ఆ బలిపీఠానికి వ్యతిరేకంగా మాట్లాడమని యెహోవా దైవజనునికి ఆజ్ఞ ఇచ్చాడు. అతను ఇలా చెప్పాడు:
“బలిపీఠమా, నీకు యెహోవా ఇలా చెప్పుచున్నాడు: ‘దావీదు వంశంలో యోషీయా అనువాడొకడు జన్మిస్తాడు. ఈ యాజకులు ఇప్పుడు కొండలపై, గుట్టలపై ఆరాధిస్తున్నారు కాని ఓ బలిపీఠమా, యోషీయా ఈ యాజకులను నీ మీద పెట్టి, వారిని చంపుతాడు. ఇప్పుడా యాజకులు నీ మీద ధూపం వేస్తున్నారు. కాని యోషీయా నీమీద మానవుల అస్తికలను తగులబెడతాడు. అప్పుడు నీవు దేనికీ ఉపయోగపడవు.’”
3 ఇవి జరిగి తీరుతాయనటానికి దైవజనుడు ఒక సూచనఇచ్చాడు. “యెహోవా ఈ సూచన నాకు తెలియజెప్పాడు. ఈ బలిపీఠం నిలువునా పగిలిపోతుంది. దాని మీది బూడిద కిందికి పడి పోతుంది” అని ప్రవక్త అన్నాడు.
4 బేతేలులో వున్న బలిపీఠాన్ని గురించి దైవజనుడు చెప్పిన సమాచారాన్ని రాజైన యరొబాము విన్నాడు. అతడు తన చేతిని బలిపీఠం మీదినుంచి తీసి ప్రవక్తవైపు చూస్తూ, “అతనిని నిర్బంధించండి!” అని అన్నాడు. రాజు అలా అన్నదే తడవుగా అతని చేయి చచ్చుపడిపోయింది. దానిని అతడు కదల్చలేక పోయాడు. 5 అంతే గాకుండా, బలిపీఠం ముక్కలై పోయింది. దాని మీది బూడిద కిందికి పడిపోయింది. దేవుని సమాచారంగా ఆ దైవజనుడు దీనినే చెప్పాడు. 6 అప్పుడు యరొబాము దైవజనునితో, “దయచేసి నా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించు. నా చేతిని బాగు చేయమని యెహోవాను అడుగు” అంటూ ప్రాధేయపడ్డాడు. అందుకొరకు దైవజనుడు యెహోవాను ప్రార్థించాడు.
తక్షణమే రాజు చేయి స్వస్థపడింది. అది పూర్వపు చేయిలా ఆరోగ్యవంతంగా వుంది.
7 అప్పుడు రాజు ఆ దైవజ్ఞుడితో, “దయచేసి నాతో నా ఇంటికి వచ్చి, నాతో భోజనం చేయి. నేను నీకు ఒక కానుక సమర్పించదలిచాను” అని అన్నాడు.
8 అది విన్న ప్రవక్త రాజుతో, “నేను నీతో నీ ఇంటికి రాను! నీవు నీ రాజ్యంలో సగంభాగం నాకిచ్చినా నేను నీతో రాను! ఈ స్థలంలో నేనేదీ తినను, త్రాగను. 9 ఏదీ తినకూడదని త్రాగరాదని యెహోవా ఆజ్ఞ. నేనిక్కడికి వచ్చిన బాట వెంట మళ్లీ ప్రయాణం చేయవద్దని కూడా యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు” అని అన్నాడు. 10 అందువల్ల అతడు మరో మార్గాన తిరుగు ప్రయాణం సాగించాడు. బేతేలుకు వచ్చిన బాట వెంట తను తిరిగి వెళ్లలేదు.
నీతిమంతుడొక్కడూ లేడు
9 మరి ఇంతకూ ఏమని నిర్ణయం చేద్దాం? మనం వాళ్ళకంటే ఉత్తమమైనవాళ్ళమనా? ఎన్నటికి కాదు. యూదులు, యూదులుకానివాళ్ళు, అందరూ సమానంగా పాపం చేసారు. దీన్ని నేనిదివరకే రుజువు చేసాను. 10 ఈ విషయమై ఇలా వ్రాయబడి ఉంది:
“నీతిమంతుడు లేడు. ఒక్కడు కూడా లేడు!
11 అర్థం చేసుకొనేవాడొక్కడూ లేడు.
దేవుణ్ణి అన్వేషించే వాడెవ్వడూ లేడు.
12 అందరూ వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు.
అందరూ కలిసి పనికిరానివాళ్ళైపోయారు.
మంచి చేసే వాడొక్కడూ లేడు. ఒక్కడు కూడా లేడు!”(A)
13 “వాళ్ళ నోళ్ళు తెరుచుకొన్న సమాధుల్లా ఉన్నాయి.
వాళ్ళ నాలుకలు మోసాలు పలుకుతూ ఉంటాయి.”(B)
“వాళ్ళ పెదాలపై పాము విషం ఉంటుంది!”(C)
14 “వాళ్ళ నోటినిండా తిట్లూ, ద్వేషంతో కూడుకొన్న మాటలు ఉంటాయి!”(D)
15 “వాళ్ళ పాదాలు రక్తాన్ని చిందించటానికి తొందరపడ్తుంటాయి.
16 వాళ్ళు తాము నడిచిన దారుల్లో వినాశనాన్ని, దుఃఖాన్ని వదులుతుంటారు.
17 వాళ్ళకు శాంతి మార్గమేదో తెలియదు!”(E)
18 “వాళ్ళ కళ్ళలో దైవభీతి కనిపించదు.”(F)
19 ధర్మశాస్త్ర నియమాలు ధర్మశాస్త్రాన్ని అనుసరించవలసినవారికి వర్తిస్తాయని మనకు తెలుసు. తద్వారా ప్రపంచంలో ఉన్నవాళ్ళందరూ, అంటే యూదులు కానివాళ్ళేకాక, యూదులు కూడా దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది. ఎవ్వరూ తప్పించుకోలేరు. 20 ధర్మశాస్త్రం తెలిస్తే పాపాన్ని గురించి జ్ఞానం కలుగుతుంది. అంతేకాని, ధర్మశాస్త్రాన్ని అనుసరించినంత మాత్రాన దేవుని దృష్టిలో నీతిమంతులం కాలేము.
© 1997 Bible League International