Revised Common Lectionary (Complementary)
దేవుని సేవకుడు దేవుని మీద ఆధారపడతాడు
4 ఉపదేశం చేయగల సామర్థ్యాన్ని నా ప్రభువైన యెహోవా నాకు ఇచ్చాడు. కనుక ఈ విచారగ్రస్థ ప్రజలకు ఇప్పుడు నేను ఉపదేశము చేస్తాను. ప్రతి ఉదయం ఆయన నన్ను మేల్కొలిపి, ఒక విద్యార్థిలా నాకు ఉపదేశిస్తాడు. 5 నేను నేర్చుకొనేందుకు నా ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తాడు. మరియు నేను ఆయన మీద తిరుగబడలేదు. నేను ఆయనను వెంబడించటం మానను. 6 నేను ఆ ప్రజల్ని నన్ను కొట్టనిస్తాను. వాళ్లను నా గడ్డం పీకనిస్తాను. వాళ్లు నన్ను చెడ్డ మాటలు తిట్టి, నా మీద ఉమ్మి వేసినప్పుడు నేను నా ముఖం దాచుకోను. 7 నా ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తాడు. కనుక వారు చెప్పే చెడ్డ మాటలు నాకు హాని కలిగించవు. నేను బలవంతుడనై ఉంటాను. నేను నిరాశ చెందనని నాకు తెలుసు.
8 యెహోవా నాతో ఉన్నాడు. నేను నిర్దోషినని ఆయనకు తెలుసును. కనుక నేను దోషినని ఎవరూ చూపించలేరు. నాదే తప్పు అని ఎవరైనా రుజువు చేయాలనుకొంటే, ఆ వ్యక్తి నా దగ్గరకు రావాలి. మేము ఒక తీర్పు జరిగిస్తాం. 9 అయితే చూడండి, నా ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తాడు. అందుచేత నేను చెడ్డవాడినని ఎవ్వరూ చూపించలేరు. అలాంటి వాళ్లంతా పనికిమాలిన గుడ్డల్లా అవుతారు. వాటిని చెదలు తినేస్తాయి.
116 యెహోవా నా ప్రార్థనలు విన్నప్పుడు
నాకు ఎంతో సంతోషం.
2 సహాయంకోసం నేను ఆయనకు చేసిన మొర
ఆయన విన్నప్పుడు నాకు ఇష్టం.
3 నేను దాదాపు చనిపోయాను. మరణ పాశాలు నన్ను చుట్టుకొన్నాయి.
సమాధి నా చుట్టూరా మూసికొంటుంది.
నేను భయపడి చింతపడ్డాను.
4 అప్పుడు నేను యెహోవా నామం స్మరించి,
“యెహోవా, నన్ను రక్షించుము.” అని అన్నాను.
5 యెహోవా మంచివాడు, జాలిగలవాడు.
యెహోవా దయగలవాడు.
6 నిస్సహాయ ప్రజలను గూర్చి యెహోవా శ్రద్ధ తీసుకొంటాడు.
నేను సహాయం లేకుండా ఉన్నాను, యెహోవా నన్ను రక్షించాడు.
7 నా ఆత్మా, విశ్రమించు!
యెహోవా నిన్ను గూర్చి శ్రద్ధ తీసుకొంటాడు.
8 దేవా, నా ఆత్మను నీవు మరణం నుండి రక్షించావు.
నా కన్నీళ్లను నీవు నిలిపివేశావు.
నేను పడిపోకుండా నీవు నన్ను పట్టుకొన్నావు.
9 సజీవుల దేశంలో నేను యెహోవాను సేవించటం కొనసాగిస్తాను.
నాలుకను మచ్చిక చేసుకొండి
3 నా సోదరులారా! దేవుడు మిగతావాళ్ళకన్నా, బోధించే మనల్ని కఠినంగా శిక్షస్తాడని మీకు తెలుసు. కనుక అందరూ బోధకులు కావాలని ఆశించకండి.
2 మనమంతా ఎన్నో తప్పులు చేస్తుంటాము. తాను ఆడే మాటల్లో ఏ తప్పూ చేయనివాడు పరిపూర్ణుడు. అలాంటివాడు కళ్ళెం వేసి తన శరీరాన్ని అదుపులో పెట్టుకోగలడు. 3 చెప్పినట్లు వినాలనే ఉద్దేశ్యంతో మనం గుఱ్ఱం నోటికి కళ్ళెం వేస్తాం. అలా చేస్తేనే మనం దాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకోగలము. 4 ఓడను ఉదాహరణగా తీసుకొండి. అది చాలా పెద్దగా ఉంటుంది. బలమైన గాలివల్ల అది నడుస్తుంటుంది. కాని దాన్ని నావికుడు చిన్న చుక్కానితో తన యిష్టం వచ్చిన చోటికి తీసుకు వెళ్ళగలడు. 5 అదేవిధంగా నాలుక శరీరంలో చిన్న భాగమైనా గొప్పలు పలుకుతుంది.
చిన్న నిప్పురవ్వ పెద్ద అడవిని ఏ విధంగా కాలుస్తుందో గమనించండి. 6 నాలుక నిప్పులాంటిది. అది చెడుతో నిండిన ప్రపంచానికి ప్రతినిధిగా మన శరీరంలో ఉంది. అది మన శరీరంలో ఒక భాగంగా ఉండి శరీరమంతా చెడును వ్యాపింపచేస్తుంది. మనిషి యొక్క జీవితానికే నిప్పంటిస్తుంది. నాలుక ఈ నిప్పును నరకం నుండి పొందుతుంది.
7 మానవుడు అన్ని రకాల జంతువుల్ని, పక్షుల్ని, ప్రాకే జీవుల్ని, సముద్రంలోని ప్రాణుల్ని మచ్చిక చేసుకొంటున్నాడు; ఇదివరకే మచ్చిక చేసుకొన్నాడు. 8 కాని నాలుకను ఎవ్వరూ మచ్చిక చేసుకోలేదు. అది ప్రాణాంతకమైన విషంతో కూడుకున్న ఒక అవయవం. అది చాలా చెడ్డది. విరామం లేకుండా ఉంటుంది. 9 మనం, మన నాలుకతో ప్రభువును, తండ్రిని స్తుతిస్తాము. అదే నాలుకతో దేవుని పోలికలో సృష్టింపబడిన మానవుణ్ణి శపిస్తాము. 10 స్తుతి, శాపము ఒకే నోటినుండి సంభవిస్తున్నాయి. నా సోదరులారా! ఇది తప్పు. 11 ఉప్పు నీళ్ళు, మంచి నీళ్ళు ఒకే ఊట నుండి పారుతున్నాయా? 12 నా సోదరులారా! అంజూరపు చెట్టుకు ఒలీవ పండ్లు, లేక ద్రాక్షతీగకు అంజూరపు పండ్లు కాస్తాయా? అలాగే ఉప్పునీటి ఊటనుండి మంచి నీళ్ళు ఊరవు.
పేతురు యేసును క్రీస్తు అని చెప్పటం
(మత్తయి 16:13-20; లూకా 9:18-21)
27 యేసు తన శిష్యులతో కలిసి, కైసరయ ఫిలిప్పి పట్టణానికి చుట్టూవున్న పల్లెలకు వెళ్ళాడు. దారిలో యేసు వాళ్ళతో, “ప్రజలు నేనెవరని అనుకొంటున్నారు?” అని అడిగాడు.
28 వాళ్ళు, “బాప్తిస్మము నిచ్చే యోహాను అని కొందరు, ఏలీయా అని కొందరు, ప్రవక్తలలో ఒకడై ఉండవచ్చని మరికొందరు అంటున్నారు” అని సమాధానం చెప్పారు.
29 “మరి మీ సంగతేమిటి? మీరేమంటారు?” అని అడిగాడు.
పేతురు, “మీరే క్రీస్తు”[a] అని సమాధానం చెప్పాడు.
30 తనను గురించి ఎవ్వరికి చెప్పవద్దని వాళ్ళను హెచ్చరించాడు.
యేసు తన మరణాన్ని గురించి చెప్పటం
(మత్తయి 16:21-28; లూకా 9:22-27)
31 ఆ తదుపరి యేసు వాళ్ళకు ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు: “మనుష్య కుమారుడు కష్టాలు అనుభవిస్తాడు. పెద్దలు, ప్రధానయాజకులు, శాస్త్రులు, ఆయన్ని తృణీకరిస్తారు. ఆయన చంపబడి మూడు రోజుల తర్వాత మళ్ళీ బ్రతికివస్తాడు.” 32 యేసు ఈ విషయాన్ని గురించి స్పష్టంగా మాట్లాడాడు.
పేతురు ఆయన చేయిపట్టుకొని వారించటం మొదలు పెట్టాడు. 33 కాని యేసు వెనక్కు తిరిగి తన శిష్యుల వైపు ఒకసారి చూసి, పేతురుతో “సైతానా! నాముందు నుండి వెళ్ళిపో! నీవు మానవరీతిగా ఆలోచిస్తున్నావు కాని, దేవుని రీతిగా కాదు” అని అన్నాడు.
34 ఆ తర్వాత తన శిష్యుల్ని, ప్రజల్ని దగ్గరకు పిలిచి, “మీరు నన్ను అనుసరింపదలిస్తే, తనను తాను విసర్జించుకొని తన సిలువను మోస్తూ అనుసరించాలి. 35 ఎందుకంటే, తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకొన్నవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. కాని నాకోసం, సువార్త కోసం ప్రాణాన్ని పోగొట్టుకొన్నవాడు దాన్ని కాపాడుకొంటాడు. 36 ప్రపంచాన్నంతా జయించి తన ప్రాణాన్ని వదులుకొన్న మనిషికి ఏంలాభం కలుగుతుంది? 37 తన ప్రాణాన్ని తిరిగి పొందటానికి మనిషి ఏంయివ్వగలడు? 38 ఈ తరం వ్యభిచారంతో, పాపంతో నిండివుంది. నా విషయంలో కాని, నా బోధనల విషయంలో కాని ఎవ్వడు సిగ్గుపడతాడో, మనుష్య కుమారుడు తండ్రి తేజస్సుతో, పవిత్రమైన దేవదూతలతో కలసి వచ్చినప్పుడు వాని విషయంలో సిగ్గుపడతాడు.”
© 1997 Bible League International