Revised Common Lectionary (Complementary)
116 యెహోవా నా ప్రార్థనలు విన్నప్పుడు
నాకు ఎంతో సంతోషం.
2 సహాయంకోసం నేను ఆయనకు చేసిన మొర
ఆయన విన్నప్పుడు నాకు ఇష్టం.
3 నేను దాదాపు చనిపోయాను. మరణ పాశాలు నన్ను చుట్టుకొన్నాయి.
సమాధి నా చుట్టూరా మూసికొంటుంది.
నేను భయపడి చింతపడ్డాను.
4 అప్పుడు నేను యెహోవా నామం స్మరించి,
“యెహోవా, నన్ను రక్షించుము.” అని అన్నాను.
5 యెహోవా మంచివాడు, జాలిగలవాడు.
యెహోవా దయగలవాడు.
6 నిస్సహాయ ప్రజలను గూర్చి యెహోవా శ్రద్ధ తీసుకొంటాడు.
నేను సహాయం లేకుండా ఉన్నాను, యెహోవా నన్ను రక్షించాడు.
7 నా ఆత్మా, విశ్రమించు!
యెహోవా నిన్ను గూర్చి శ్రద్ధ తీసుకొంటాడు.
8 దేవా, నా ఆత్మను నీవు మరణం నుండి రక్షించావు.
నా కన్నీళ్లను నీవు నిలిపివేశావు.
నేను పడిపోకుండా నీవు నన్ను పట్టుకొన్నావు.
9 సజీవుల దేశంలో నేను యెహోవాను సేవించటం కొనసాగిస్తాను.
యెరికో పట్టణంలో గూఢచారులు
2 నూను కుమారుడైన యెహోషువ, ప్రజలంతా ఆకాషియా దగ్గర గుడారాలు వేసుకున్నారు. యెహోషువ ఇద్దరు గూఢచారుల్ని పంపించాడు. వీళ్లను యెహోషువ పంపినట్టు మరెవ్వరికీ తెలియదు. “మీరు వెళ్లి ఆ దేశాన్ని చూడండి. ముఖ్యంగా యెరికో పట్టణాన్ని దగ్గరగా చూడండి” అని యెహోషువ ఆ మనుష్యులతో చెప్పాడు.
కనుక ఆ మనుష్యులు యెరికో పట్టణం వెళ్లారు. వాళ్లు ఒక వేశ్య ఇంటికి వెళ్లి, అక్కడ వుండిరి. ఆ స్త్రీ పేరు రాహాబు.
2 “మన ప్రజల బలహీనత తెలుసుకొనేందుకు కొందరు ఇశ్రాయేలు మనుష్యులు వచ్చారు” అని యెరికో రాజుతో ఎవరో చెప్పారు.
3 కనుక యెరికో రాజు రాహాబుకు ఇలా కబురంపాడు: “నీ ఇంటికి వచ్చిదాక్కొన్న ఆ మనుష్యుల్ని దాచిపెట్టకు. వాళ్లను బయటకు తీసుకొనిరా. వాళ్లు మన దేశాన్ని వేగు చూడటానికి వచ్చారు.”
4 ఆ స్త్రీ వాళ్లిద్దర్నీ దాచిపెట్టేసింది. అయితే ఆమె అంది: “ఆ ఇద్దరూ ఇక్కడికి వచ్చిన మాట నిజమే. అయితే వాళ్లు ఎక్కడ్నుండి వచ్చిందీ నాకు తెలియదు. 5 సాయంకాలం, పట్టణ ద్వారాలు మూసివేసే వేళ వాళ్లు వెళ్లిపోయారు. వాళ్లు ఎక్కడికి వెళ్లిందీ నాకు తెలియదు. కానీ ఒకవేళ మీరు త్వరగా వెళ్తే మీరు వాళ్లను పట్టుకోవచ్చేమో.” 6 అయితే నిజానికి వాళ్లను అటక[a] మీద జనుపకట్టెలో దాచిపెట్టింది.
7 కనుక రాజుగారి మనుష్యులు ఇశ్రాయేలు వాళ్లిద్దరి కోసం వెదుక్కుంటూ వెళ్లిపోయారు. యొర్దాను నది రేవుల దగ్గరకు వారు వెళ్లారు. రాజుగారి మనుష్యులు పట్టణం నుండి బయటకు వెళ్లిన ఆ సమయంలోనే పట్టణ ద్వారాలు మూసివేయబడ్డాయి.
8 ఆ ఇద్దరు మనుష్యులూ అప్పుడే నిద్రకు ఉపక్రమించబోతున్నారు. అయితే ఆమె అటక పైకి వెళ్లి వాళ్లతో మాట్లాడింది. 9 రాహాబు ఇలా అంది, “ఈ దేశాన్ని యెహోవా మీ ప్రజలకు ఇచ్చాడని నాకు తెలుసు. మీరంటే మాకు భయం. ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ మీరంటే భయమే. 10 యెహోవా మీకు సహాయం చేసిన విధానాల్ని గూర్చి విన్నాము గనుక మాకు భయం. మీరు ఈజిప్టునుండి వచ్చినప్పుడు ఎర్ర సముద్రం ఆరిపోయేటట్టు ఆయన చేసాడని మేము విన్నాము. అమోరీ రాజులైన సీహోను, ఓగులకు మీరు చేసినదాన్ని గూర్చి కూడ మేము విన్నాము. యొర్దాను నదికి తూర్పున ఉన్న ఆ రాజులను మీరు నాశనం చేసిన సంగతి మేము విన్నాము. 11 ఆ సంగతులు మేము విని చాల భయపడిపోయాము ఇప్పుడు మా వాళ్లెవరికీ మీతో పోరాడే ధైర్యంలేదు. ఎందుచేతనంటే పైన ఆకాశాన్ని క్రింద భూమిని మీ యెహోవా దేవుడే పాలిస్తున్నాడు గనుక. 12 ఇప్పుడు మీరు నాతో ఒడంబడిక చేస్తామని మాట ఇవ్వండి. నేను మీకు సహాయం చేసాను, దయ చూపించాను. కనుక మీరు నా కుటుంబానికి దయ చూపిస్తామని యెహోవా ఎదుట ప్రమాణం చేయండి. ఇలా మీరు చేస్తామని దయచేసి నాకు చెప్పండి. 13 నా తండ్రి, తల్లి, సోదరులు, సోదరీలు, వాళ్లందరి కుటుంబాల్ని, నా కుటుంబాన్ని మీరు బ్రతుకనిస్తామని నాకు మాట ఇవ్వండి. చావునుండి మీరు మమ్మల్ని రక్షిస్తామని ప్రమాణం చేయండి.”
14 ఆ మనుష్యలు ఒప్పుకున్నారు. “మీ ప్రాణాల కోసం మా ప్రాణాలు ఇస్తాము. మేము చేస్తున్న పని గూర్చి ఎవ్వరితో చెప్పకు. తర్వాత మీ దేశాన్ని యెహోవా మాకు ఇచ్చినప్పుడు మేము నీకు దయ చూపిస్తాము. నీవు మా మాట నమ్ము” అని వాళ్లు చెప్పారు.
17-18 దేవుడు అబ్రాహామును పరీక్షించినప్పుడు అతనిలో విశ్వాసముండటంవల్ల ఇస్సాకును బలిగా అర్పించటానికి సిద్ధం అయ్యాడు. దేవుడు ఇస్సాకు ద్వారా నీ వంశం అభివృద్ధి చెందుతుంది(A) అని యింతకు పూర్వం వాగ్దానం చేశాడు. అయినా అబ్రాహాము తన ఏకైక పుత్రుణ్ణి బలిగా అర్పించబోయాడు. 19 దేవుడు చనిపోయినవాళ్ళను బ్రతికించగలడని అబ్రాహాముకు తెలుసు. ఒక విధంగా చూస్తే దేవుడు ఇస్సాకును బ్రతికించి అబ్రాహాముకు ఇచ్చాడనే చెప్పుకోవచ్చు.
20 ఇస్సాకు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి, యాకోబును, ఏశావును వాళ్ళ భవిష్యత్తు ప్రకారం దీవించాడు. 21 దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి యాకోబు, తాను మరణించే ముందు యోసేపు కుమారుల్ని దీవించగలిగాడు. అంతేకాక తన చేతి కఱ్ఱపై వ్రాలి దేవుణ్ణి ప్రార్థించాడు.
22 యోసేపు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి తాను చనిపోయేముందు ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు దేశం నుండి వెళ్ళిపోతారని ముందుగానే చెప్పగలిగాడు. అంతే కాక, అప్పుడు తన ఎముకల్ని ఏమి చెయ్యాలో వాళ్ళకు చెప్పాడు.
© 1997 Bible League International