Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెషయా 38:10-20

10 నేను వృద్ధుడనయ్యేంత వరకు బ్రతుకుతానని నాలో నేను అనుకొన్నాను.
    కానీ నేను పాతాళ ద్వారాలగుండా వెళ్లాల్సిన సమయం అది. ఇప్పుడు నేను నా సమయమంతా అక్కడే గడపాలి.
11 కనుక నేను చెప్పాను: “సజీవుల దేశంలో ప్రభువైన యెహోవాను నేను మరల చూడను.
    భూమిమీద మనుష్యులు జీవించుట నేను మరల చూడను.
12 నా ఇల్లు, నా గొర్రెల కాపరి గుడారం లాగివేయబడి నానుండి తీసివేయబడుతుంది.
    మగ్గమునుండి ఒకడు బట్టను చుట్టి కత్తిరించినట్టు నా పని అయిపోయింది.
    ఒక్క రోజులో ఉదయంనుండి రాత్రి వరకు నీవు నన్ను ఇంతవరకు తీసుకొనివచ్చావు.
13 రాత్రి అంతా నేను సింహంలా గట్టిగా అరిచాను.
    అయితే సింహం ఎముకలు నమిలినట్టు నా ఆశలు అణగ ద్రొక్కబడ్డాయి.
ఒక్క రోజులో ఉదయంనుండి రాత్రి వరకు నీవు నన్ను ఇంతవరకు తీసుకొని వచ్చావు.
14 నేను గువ్వలా మూల్గాను.
    నేను పక్షిలా ఏడ్చాను.
నా కళ్లు క్షీణించాయి
    కానీ నేను ఆకాశం తట్టు చూస్తూనే ఉన్నాను.
నా ప్రభువా, నాకు కష్టాలు ఉన్నాయి.
    నాకు సహాయం చేస్తానని వాగ్దానం చేయుము.”
15 నేనేం చెప్పగలను?
    జరిగేదేమిటో నా ప్రభువు నాకు చెప్పాడు.
    నా యజమాని దానిని జరిగిస్తాడు.
నా ఆత్మలో నాకు ఈ కష్టాలు కలిగాయి.
    కనుక ఇప్పుడు నేను జీవితాంతం దీనుడనుగా ఉంటాను.
16 నా ప్రభూ, నా ఆత్మ మరల జీవించేట్టుగా ఈ కష్ట సమయాన్ని ఉపయోగించు
    నా ఆత్మ బలపడి, ఆరోగ్యంగా ఉండేందుకు సహాయం చేయుము.
    నేను బాగుపడేందుకు సహాయం చేయి.
    మరల జీవించేందుకు నాకు సహాయం చేయుము.

17 చూడండి, నా కష్టాలు తొలగి పోయాయి.
    ఇప్పుడు నాకు శాంతి ఉంది.
నీవు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు.
    నీవు నన్ను సమాధిలో మురిగి పోనివ్వలేదు.
నీవు నా పాపాలన్నీ క్షమించావు.
    నీవు నా పాపాలను దూరంగా పారవేశావు.
18 చచ్చినవాళ్లు నీకు స్తుతులు పాడరు.
    పాతాళంలోని ప్రజలు నిన్ను స్తుతించరు.
చచ్చినవాళ్లు సహాయం కోసం నిన్ను నమ్ముకోరు. వారు భూగర్భంలోనికి వెళ్తారు, మరల ఎన్నటికీ మాట్లాడరు.
19 నేడు నాలాగే బ్రతికి ఉన్న మనుష్యులే
    నిన్ను స్తుతించేవారు.
    నీవు నమ్మదగిన వాడవని ఒక తండ్రి తన పిల్లలతో చెప్పాలి.
20 కనుక నేను అంటాను: “యెహోవా నన్ను రక్షించాడు
    కనుక మా జీవిత కాలమంతా మేము యెహోవా ఆలయంలో పాటలు పాడి, వాయిద్యాలు వాయిస్తాం.”

యెహోషువ 6:1-21

యెరికో పట్టణం మూసివేయబడింది. ఇశ్రాయేలు ప్రజలు దగ్గర్లోనే ఉన్నందువల్ల ఆ పట్టణం లోని ప్రజలు భయపడ్డారు. ఎవరూ పట్టణంలోనికి గాని, బయటకు గాని వెళ్లలేదు.

అప్పుడు యెహోషువతో యెహోవా చెప్పాడు: “చూడు, యెరికో పట్టణాన్ని నేను నీ స్వాధీనంలో ఉంచాను. దాని రాజు, పట్టణంలోని యుద్ధ వీరులు నీ స్వాధీనంలో ఉన్నారు. నీ సైన్యంతో పట్టణం చుట్టూ రోజుకు ఒక్కసారి ప్రదక్షిణం చేయి. ఇలా ఆరు రోజులు చేయి. పొట్టేలు కొమ్ములతో చేసిన బూరలు ఊదేందుకు ఏడుగురు యాజకులను నియమించుము. పవిత్ర పెట్టెకు ముందుగా నడువుమని యాజకులతో చెప్పు. ఏడో రోజున ఏడుసార్లు పట్టణం చుట్టూ ప్రదక్షిణం చేయండి. ఏడోరోజున వారు ముందడుగు వేయగానే బూరలు ఊదాలని యాజకులతో చెప్పు. యాజకులు బూరలతో పెద్ద శబ్దం చేయాలి. ఆ శబ్దం నీవు వినగానే ప్రజలందర్నీ కేకలు వేయమని చెప్పు. మీరు ఇలా చేయగానే పట్టణం యొక్క గోడలు కూలిపోతాయి. అప్పుడు మీ ప్రజలు సరాసరి పట్టణం లోనికి వెళ్లిపోవాలి.”

యెరికోతో యుద్ధం

కనుక నూను కుమారుడైన యెహోషువ యాజకులందర్నీ సమావేశపర్చాడు. “యెహోవా పవిత్ర పెట్టెను మోయండి. ఏడుగురు యాజకులు బూరలు మోయాలని చెప్పండి. ఆ యాజకులు పవిత్ర పెట్టెకు ముందుగా నడవాలి” అని యెహోషువ వారితో చెప్పాడు.

“ఇప్పుడు బయల్దేరండి. పట్టణం చుట్టూ నడవండి. ఆయుధాలు ధరించిన సైనికులు యెహోవా పవిత్ర పెట్టె ఎదుట నడవాలి” అని యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించాడు.

యెహోషువ ప్రజలతో మాట్లాడటం ముగించగానే, ఏడుగురు యాజకులు యెహోవా సన్నిధిని నడవటం మొదలుబెట్టారు. ఏడు బూరలను వారు మోసుకొని వెళ్లారు. వారు నడుస్తూ ఉన్నప్పుడు బూరలు ఊదారు. యెహోవా పవిత్ర పెట్టెను మోసే వారు వారి వెనుక నడిచారు. ఆయుధాలు ధరించిన సైనికులు యాజకులకు ముందుగా నడిచారు. పవిత్ర పెట్టె వెనుక నడుస్తున్నవాళ్లు బూరలు ఊదారు. 10 అయితే యుద్ధనాదం చేయవద్దని యెహోషువ ప్రజలతో చెప్పాడు. “కేకలు వేయకండి. నేను మీతో చెప్పే రోజు వరకు ఒక్క మాటకూడ పలుకకండి. తరువాత మీరు కేకలు వేయవచ్చు” అన్నాడు యోహోషువ.

11 కనుక యెహోవా పవిత్ర పెట్టెను పట్టణంచుట్టూ ఒక్కసారి యాజకులచేత యెహోషువ మోయించాడు. తర్వాత వారు వారి బసకు వెళ్లి ఆ రాత్రి అక్కడే గడిపారు.

12 మర్నాటి ఉదయాన్నే యెహోషువ లేచాడు. యాజకులు యెహోవా పవిత్ర పెట్టెను మరలా మోసారు. 13 మరియు యాజకులు ఏడుగురు ఏడు బూరలు మోసారు. యెహోవా పవిత్ర పెట్టె ఎదుట వారు నడుస్తూ బూరలు ఊదారు. ఆయుధాలు ధరించిన సైనికులు వారికి ముందుగా నడిచారు. యెహోవా పవిత్ర పెట్టె వెనుక నడిచే యాజకులు నడుస్తూ, బూరలు ఊదారు. 14 కనుక రెండో రోజున వాళ్లంతా పట్టణం చుట్టూ ఒక మారు ప్రదక్షిణం చేసారు. ఆ తర్వాత వాళ్లు తిరిగి వారి బసకు వెళ్లిపోయారు. ఆరు రోజులపాటు వారు ఇలానే ప్రతిరోజూ చేసారు.

15 ఏడో రోజు సూర్యోదయాన్నే వారు మేల్కొన్నారు. వారు పట్టణం చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణాలు చేసారు. అంతకు ముందు రోజులలో నడచినట్టే నడిచారు, కాని ఆ రోజు పట్టణం చుట్టూ ఏడుసార్లు తిరిగారు. 16 పట్టణం చుట్టూ వారు ఏడోసారి తిరుగగానే, యాజకులు వారి బూరలు ఊదారు. సరిగ్గా అప్పుడే యెహోషువ ఆజ్ఞ యిచ్చాడు: “ఇప్పుడు కేకలు వేయండి! యెహోవా ఈ పట్టణాన్ని మీకు ఇచ్చేస్తున్నాడు! 17 ఈ పట్టణం, ఇందులో ఉన్న సమస్తం యెహోవాదే.[a] వేశ్య రాహాబు, ఆమె ఇంటిలో ఉన్న వారు మాత్రమే బ్రతకాలి. మనం పంపిన ఇద్దరికీ రాహాబు సహాయం చేసింది గనుక వారిని చంపకూడదు. 18 మరియు మిగిలిన వాటన్నింటినీ మనం నాశనం చేసివేయాలని జ్ఞాపకం ఉంచుకోండి. వాటిని తీసుకోవద్దు. మీరు వాటిని తీసుకొని, మన పాళెములోనికి గనుక తీసుకొని వస్తే మిమ్మల్ని మీరే నాశనం చేసుకొంటారు. పైగా మీరు మొత్తం ఇశ్రాయేలు ప్రజలందరికీ కష్టం తెచ్చి పెడ్తారు. 19 వెండి, బంగారం మరియు ఇత్తడి, ఇనుముతో చేసిన వస్తువులన్నీ మొత్తం యెహోవాకే చెందుతాయి. వాటన్నింటినీ ఆయన కోసం దాచిపెట్టాలి.”

20 యాజకులు బూరలు ఊదారు. ప్రజలు బూరలువిని కేకలు వేయటం మొదలుబెట్టారు. గోడలు కూలి పోయాయి. ప్రజలు ఏకంగా పట్టణంలో జొరబడి పోయారు. అందుచేత ఇశ్రాయేలు ప్రజలు ఆ పట్టణాన్ని ఓడించేసారు. 21 ఆ పట్టణంలో ఉన్న సమస్తాన్ని ప్రజలు నాశనం చేసారు. అక్కడ ప్రాణంతో ఉన్న సమస్తాన్ని వాళ్లు నాశనం చేసారు. పడుచు కుర్రాళ్లను పెద్ద మగవాళ్లను, పడుచు పిల్లల్ని, స్త్రీలను పశువుల్ని, గొర్రెల్ని, గాడిదల్ని వారు చంపేశారు.

హెబ్రీయులకు 11:29-12:2

29 దేవుణ్ణి విశ్వసించినందుకే ప్రజలు ఎఱ్ఱ సముద్రంలో ఏర్పడిన ఆరిన నేల మీద నడిచారు. కాని ఈజిప్టు దేశస్థులు అలా చెయ్యాలని ప్రయత్నించి సముద్రంలో మునిగిపొయ్యారు.

30 ప్రజలు యెరికో కోట చుట్టు ఏడు రోజులు విశ్వాసంతో తిరగటం వల్ల ఆ కోట గోడలు పడిపొయ్యాయి.

31 దేవుణ్ణి విశ్వసించటం వల్లనే, వేశ్య అయినటువంటి రాహాబు యెహోషువ పంపిన గూఢచారులకు తన యింట్లో ఆతిథ్యమిచ్చింది. ఆ కారణంగానే, అవిశ్వాసులతోసహా ఆమె మరణించలేదు.

32 ఇంకేం చెప్పమంటారు? గిద్యోనును గురించి, బారాకును గురించి, సమ్సోనును గురించి, యెఫ్తాను గురించి, దావీదును గురించి, సమూయేలును గురించి మరియు ప్రవక్తల గురించి చెప్పటానికి నాకు వ్యవధి లేదు. 33 వీళ్ళు దేవుణ్ణి విశ్వసించటంవల్ల రాజ్యాలు జయించారు. న్యాయాన్ని స్థాపించారు. దేవుడు వాగ్దానం చేసినదాన్ని పొందారు. సింహాల నోళ్ళు మూయించారు. 34 భయంకరమైన మంటల్ని ఆర్పివేశారు. కత్తి పోట్లనుండి తమను తాము రక్షించుకొన్నారు. వాళ్ళ బలహీనత బలంగా మారిపోయింది. వాళ్ళు యుద్ధాలలో గొప్ప శక్తి కనబరుస్తూ పరదేశ సైన్యాలను ఓడించారు. 35 దేవుణ్ణి విశ్వసించటం వల్లనే కొందరు స్త్రీలు చనిపోయిన తమవాళ్ళను తిరిగి సజీవంగా పొందారు. కొందరు చావునుండి బ్రతికి వచ్చాక ఉత్తమ జీవితం గడపాలనే ఉద్దేశ్యముతో చిత్రహింసలనుండి విడుదల కోరలేదు. 36 భక్తిహీనులు వీళ్ళలో కొందర్ని పరిహాసం చేస్తూ కొరడా దెబ్బలు కొట్టారు. మరి కొందర్ని సంకెళ్ళతో బంధించి చెరసాలలో వేశారు. 37 కొందర్ని రాళ్ళతో కొట్టారు; రంపంతో కోసారు; కత్తితో పొడిచి చంపారు. ఆ భక్తులు మేకల చర్మాలను, గొఱ్ఱెల చర్మాలను ధరించి అనాధలై తిరిగారు. అంతేకాక హింసను, దుష్ప్రవర్తనను సహించారు. 38 ఎడారుల్లో, పర్వత ప్రాంతాల్లో, గుహల్లో, సొరంగాల్లో నివసించారు. ఈ ప్రపంచం వాళ్ళకు తగిందికాదు.

39 వాళ్ళ విశ్వాసాన్ని దేవుడు మెచ్చుకొన్నాడు. కాని దేవుడు వాగ్దానం చేసింది వాళ్ళకు యింకా లభించలేదు. 40 దేవుడు మనకివ్వటానికి ఉత్తమమైనదాన్ని దాచి ఉంచాడు. మనతో కలిసి మాత్రమే వాళ్ళకు పరిపూర్ణత కలగాలని యిలా చేసాడు.

కుమారులు, క్రమశిక్షణ

12 అందువల్ల మన పక్షాన కూడా ఇందరు సాక్షులున్నారు గనుక మన దారికి అడ్డం వచ్చిన వాటన్నిటిని తీసిపారవేద్దాం. మనల్ని అంటుకొంటున్న పాపాల్ని వదిలించుకొందాం. మనం పరుగెత్తవలసిన పరుగు పందెంలో పట్టుదలతో పరుగెడదాం. మన దృష్టిని యేసుపై ఉంచుదాం. మనలో విశ్వాసం పుట్టించినవాడు, ఆ విశ్వాసంతో పరిపూర్ణత కలుగ చేయువాడు ఆయనే. తనకు లభింపనున్న ఆనందం కోసం ఆయన సిలువను భరించాడు. సిలువను భరించినప్పుడు కలిగిన అవమానాల్ని ఆయన లెక్క చెయ్యలేదు. ఇప్పుడాయన దేవుని సింహాసనానికి కుడివైపున కూర్చొని ఉన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International