Revised Common Lectionary (Complementary)
106 యెహోవాను స్తుతించండి!
యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి.
దేవుని ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
2 యెహోవా నిజంగా ఎంత గొప్పవాడో ఏ ఒక్కరూ వర్ణించలేరు.
ఏ ఒక్కరూ సరిపడినంతగా దేవుని స్తుతించలేరు.
3 దేవుని ఆదేశాలకు విధేయులయ్యేవారు సంతోషంగా ఉంటారు.
ఆ ప్రజలు ఎల్లప్పుడూ మంచిపనులు చేస్తూంటారు.
4 యెహోవా, నీవు నీ ప్రజల యెడల దయ చూపేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము.
నన్ను కూడా రక్షించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము.
5 యెహోవా, నీ జనులకు నీవు చేసే మంచివాటిలో
నన్ను పాలుపొందనిమ్ము
నీ ప్రజలతో నన్ను సంతోషంగా ఉండనిమ్ము.
నీ జనంతో నన్ను నీ విషయమై అతిశయించనిమ్ము.
6 మా పూర్వీకుల్లా మేము కూడా పాపం చేసాము.
మేము తప్పులు చెడుకార్యాలు చేసాము.
13 కాని దేవుడు చేసిన వాటిని మన పూర్వీకులు వెంటనే మరచిపోయారు.
వారు దేవుని సలహా వినలేదు.
14 మన పూర్వీకులు ఎడారిలో ఆకలిగొన్నారు.
అరణ్యంలో వారు దేవుణ్ణి పరీక్షించారు.
15 కాని మన పూర్వీకులు అడిగిన వాటిని దేవుడు వారికి ఇచ్చాడు.
అయితే దేవుడు వారికి ఒక భయంకర రోగాన్ని కూడా ఇచ్చాడు.
16 ప్రజలు మోషే మీద అసూయ పడ్డారు.
యెహోవా పవిత్ర యాజకుడు అహరోను మీద వారు అసూయపడ్డారు.
17 కనుక ఆ అసూయపరులను దేవుడు శిక్షించాడు. భూమి తెరచుకొని దాతానును మింగివేసింది.
తరువాత భూమి మూసుకొంటూ అబీరాము సహచరులను కప్పేసింది.
18 అప్పుడు ఒక అగ్ని ఆ ప్రజాసమూహాన్ని కాల్చివేసింది.
ఆ అగ్ని ఆ దుర్మార్గులను కాల్చివేసింది.
19 హోరేబు కొండవద్ద ప్రజలు ఒక బంగారు దూడను చేశారు.
వారు ఆ విగ్రహాన్ని ఆరాధించారు.
20 ఆ ప్రజలు గడ్డి తినే ఒక ఎద్దు విగ్రహాన్ని
వారి మహిమ గల దేవునిగా మార్చేశారు.
21 మన పూర్వీకులు వారిని రక్షించిన దేవుణ్ణి గూర్చి మర్చిపోయారు.
ఈజిప్టులో అద్భుతాలు చేసిన దేవుణ్ణి గూర్చి వారు మర్చిపోయారు.
22 హాము దేశంలొ[a] దేవుడు అద్భుత కార్యాలు చేశాడు.
దేవుడు ఎర్ర సముద్రం దగ్గర భీకర కార్యాలు చేశాడు.
23 దేవుడు ఆ ప్రజలను నాశనం చేయాలని కోరాడు.
కాని దేవుడు ఏర్పరచుకొన్న సేవకుడు మోషే ఆయనను నివారించాడు.
దేవునికి చాలా కోపం వచ్చింది.
కాని దేవుడు ఆ ప్రజలను నాశనం చేయకుండా మోషే అడ్డుపడ్డాడు.
47 మా దేవుడవైన యెహోవా, మమ్ములను రక్షించు.
నీ పవిత్ర నామాన్ని స్తుతించగలిగేలా
ఈ జనముల మధ్యనుండి మమ్మల్ని సమీకరించుము.
అప్పుడు నీకు మేము స్తుతులు పాడగలం.
48 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించండి.
దేవుడు ఎల్లప్పుడూ జీవిస్తున్నాడు, ఆయన శాశ్వతంగా జీవిస్తాడు.
మరియు ప్రజలందరూ, “ఆమేన్! యెహోవాను స్తుతించండి!” అని చెప్పారు.
9 కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మీరు చూసిన సంగతులను మీరు బ్రతికి ఉన్నంతకాలం మరచి పోకుండా జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలకు, మీ పిల్లలపిల్లలకు మీరు ఈ సంగతులను ప్రబోధించాలి. 10 హోరేబు కొండ దగ్గర మీరు మీ దోవుడైన యెహోవా యెదుట నిలిచిన రోజును జ్ఞాపకం చేసుకోండి. ‘నేను చెప్పే సంగతులు వినడానికి ప్రజలందరినీ సమావేశపర్చు. అప్పుడు భూమి మీద వారు జీవించినంతకాలం వారు గౌరవించటం నేర్చుకొంటారు. మరియు వారు ఈ సంగతులను వారి పిల్లలకు ప్రబోధిస్తారు’ అని యెహోవా నాతో చెప్పాడు. 11 మీరు దగ్గరకు వచ్చి కొండ దిగువ నిలబడ్డారు. ఆకాశంవరకు ఎగసిన అగ్నితో ఆ కొండ మండింది. దట్టమైన కారుమబ్బులు, కటిక చీకటి. 12 అప్పుడు అగ్నిలోనుండి యెహోవా మీతో మాట్లాడాడు. ఎవరో మాట్లాడుతున్న స్వరం మీరు విన్నారు కాని, ఏ ఆకారాన్నీ మీరు చూడలేదు. స్వరం మాత్రమే వినబడింది. 13 యెహోవా తన ఒడంబడికను మీతో చెప్పాడు. పది ఆజ్ఞలను ఆయన మీతో చెప్పి, వాటిని పాటించ మని మీకు ఆజ్ఞాపించాడు. ఆ ఒడంబడిక ఆజ్ఞలను ఆయన రెండు రాతి పలకలమీద రాసాడు. 14 ఆ సమయంలో నేను మీకు ఆజ్ఞలను, నియమాలను ప్రబోధించాలనికూడ యెహోవా నాకు ఆజ్ఞాపించాడు. మీరు స్వాధీనం చేసుకొని, నివసించబోతున్న దేశంలో మీరు పాటించాల్సిన చట్టాలు ఇవి.
మంచి సేవకునిగా ఉండుము
6 నీవీ బోధలు సోదరులకు చెబితే యేసు క్రీస్తు యొక్క మంచి సేవకునిగా పరిగణింపబడతావు. నీవు విశ్వసించిన సత్యాలను, సుబోధలను నీవు అనుసరిస్తున్నావు కనుక నీకు అభివృద్ధి కల్గుతుంది. 7 ఆత్మీయత లేని కాకమ్మ కథలకు, ముసలమ్మ కథలకు దూరంగా ఉండు. భక్తితో ఉండటానికి అభ్యాసం చెయ్యి. 8 శారీరక శిక్షణ వల్ల కొంత ఉపయోగం ఉంది. దైవభక్తివల్ల ప్రస్తుత జీవితంలోనూ, రానున్న జీవితంలోనూ మంచి కల్గుతుంది. కనుక అది అన్ని విషయాల్లో ఉపయోగపడుతుంది. 9 ఇది నమ్మదగిన విషయం. సంపూర్ణంగా అంగీకరించదగినది. 10 మానవ జాతి రక్షకుడైన దేవుణ్ణి, ముఖ్యంగా తనను నమ్మినవాళ్ళను రక్షించే సజీవుడైన దేవుణ్ణి మనం విశ్వసించాము. కనుకనే మనము సహనంతో కష్టించి పని చేస్తున్నాము.
11 ఈ విషయాలు మిగతావాళ్ళకు బోధించి, వాటిని ఆచరించుని ఆజ్ఞాపించు. 12 నీవు వయస్సులో చిన్నవాడైనందుకు నిన్నెవ్వడూ చులకన చెయ్యకుండా జాగ్రత్త పడు. క్రీస్తును విశ్వసించేవాళ్ళకు మాటల్లో, జీవిత విధానంలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో ఆదర్శంగా ఉండు.
13 నేను వచ్చేవరకు నీ కాలాన్ని దైవవాక్యాలు బహిరంగంగా చదవటానికి, వాటిని ఉపదేశించటానికి ఉపయోగించు. ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందింప చేయి. 14 పెద్దలు తమ చేతుల్ని నీపై ఉంచినప్పుడు ప్రవక్తలు చెప్పిన భవిష్యత్తు ప్రకారం నీకు వరం లభించింది. దాన్ని నిర్లక్ష్యం చెయ్యవద్దు. 15 నేను చెప్పిన విషయాలపై నీ మనస్సు లగ్నం చేయి. అప్పుడు అందరూ నీ అభివృద్ధిని గమనిస్తారు. 16 నీ వ్యక్తిగత జీవితాన్నీ, నీవు బోధించే వాటినీ జాగ్రత్తగా గమనించు. వాటిని పట్టుదలతో సాధించు. అలా చేస్తే నిన్ను నీవు రక్షించుకొన్నవాడవౌతావు. నీ బోధన విన్నవాళ్ళను రక్షించినవాడవౌతావు.
© 1997 Bible League International