Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
15 యెహోవా, నీ పవిత్ర గుడారంలో ఎవరు నివసించగలరు?
నీ పవిత్ర పర్వతం మీద ఎవరు నివసించగలరు?
2 ఎవరైతే పరిశుద్ధ జీవితం జీవించగలరో, మంచి కార్యాలు చేయగలరో తమ హృదయంలో నుండి సత్యం మాత్రమే మాట్లాడుతారో
అలాంటి వ్యక్తులు మాత్రమే నీ పర్వతం మీద నివసించగలరు.
3 అలాంటి వ్యక్తి ఇతరులను గూర్చి చెడు సంగతులు మాట్లాడడు.
ఆ మనిషి తన పొరుగు వారికి కీడు చేయడు.
ఆ మనిషి తన స్వంత కుటుంబం గూర్చి సిగ్గుకరమైన విషయాలు చెప్పడు.
4 ఆ మనిషి దేవుని చేత నిరాకరింపబడిన ప్రజలను గౌరవించడు.
అయితే యెహోవాను సేవించేవారందరినీ ఆ మనిషి గౌరవిస్తాడు.
ఆ మనిషి గనుక తన పొరుగువానికి ఒక వాగ్దానం చేస్తే
అతడు ఏమి చేస్తానన్నాడో దాన్ని నెరవేరుస్తాడు.
5 ఆ మనిషి ఎవరికైనా అప్పిస్తే
అతడు దాని మీద వడ్డీ తీసుకోడు.
నిర్దోషులకు కీడు చేయుటకుగాను అతడు డబ్బు తీసుకోడు.
ఒక మనిషి ఆ మంచి వ్యక్తిలాగ జీవిస్తే, అప్పుడు ఆ మనిషి ఎల్లప్పుడూ దేవునికి సన్నిహితంగా ఉంటాడు.
బంగారు దూడ
32 చాలాకాలం గడిచిపోయినా, మోషే పర్వతం దిగి రాకపోవడం ప్రజలు గమనించారు. కనుక ప్రజలు అహరోను చుట్టూ చేరారు, “చూడు, ఈజిప్టు దేశం నుండి మోషే మమ్మల్ని బయటకు నడిపించాడు. అయితే అతనికి ఏమయిందో మాకు తెలియదు. అందుచేత మా ముందర నడవడానికి ఒక దేవతను చేసి మమ్మల్ని నడిపించు” అని వారతనితో చెప్పారు.
2 “మీ భార్యలు, కుమారులు, కుమార్తెలకు చెందిన బంగారు వస్తువులను తీసుకురండి” అని అహరోను ప్రజలతో అన్నాడు.
3 కాబట్టి ప్రజలంతా వారి బంగారు వస్తువులను పోగుచేసి వాటిని అహరోను దగ్గరకు తెచ్చారు. 4 ప్రజల దగ్గర నుండి అహరోను బంగారం తీసుకున్నాడు. అప్పుడు వాటితో ఒక దూడ విగ్రహం చేసాడు. విగ్రహం చెక్కడానికి అహరోను ఉలి ఉపయోగించాడు. (తర్వాత దానికి బంగారం పొదిగించాడు.)
అప్పుడు ప్రజలు, “ఓ ఇశ్రాయేలూ, ఈజిప్టు నుండి మిమ్మల్ని బయటకు నడిపించింది ఈ దేవుడే” అన్నారు.
5 అహరోను వీటన్నింటినీ చూసాడు. కనుక ఆ దూడ ఎదుట ఒక బలిపీఠం నిర్మించాడు. అప్పుడు అహరోను ఒక ప్రకటన చేసాడు. “రేపు యెహోవాకు ప్రత్యేక పండుగ” అని చెప్పాడు.
6 మర్నాడు ఉదయం పెందలాడే ప్రజలు మేల్కొన్నారు. వాళ్లు జంతువులను చంపి దహన బలులుగాను, సమాధాన బలులుగాను అర్పించారు. తిని, తాగేందుకు ప్రజలు కూర్చున్నారు. అప్పుడు వాళ్లు విచ్చలవిడిగా సంబరం చేసుకున్నారు.
7 అదే సమయంలో మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ఈ పర్వతం దిగి వెళ్లు. నీ ప్రజలు, ఈజిప్టు దేశం నుండి నీవు బయటకు తీసుకు వచ్చిన ప్రజలు భయంకర పాపం చేసారు. 8 వాళ్లు చేయాలని నేను ఆజ్ఞాపించిన సంగతుల నుండి వాళ్లు చాల త్వరగా తప్పి పోయారు. కరిగించిన బంగారంతో వాళ్లు ఒక దూడను చేసుకొన్నారు. వాళ్లు ఆ దూడను పూజిస్తూ దానికి బలులు చెల్లిస్తున్నారు. ‘ఇశ్రాయేలూ, ఈజిప్టు నుండి నిన్ను బయటకు రప్పించిన దేవుడు ఇదే, అని ప్రజలు చెప్పుకొనుచున్నారు.’”
9 “ఈ ప్రజలను నేను చూశాను. వీళ్లు ఎప్పుడూ నన్ను వ్యతిరేకించే మొండి ప్రజలని నాకు తెలుసు. 10 కనుక కోపంతో వాళ్లను నాశనం చేయనివ్వు, అప్పుడు నీలోనుండి ఒక జనాన్ని నేను తయారు చేస్తాను” అని మోషేతో యెహోవా అన్నాడు.
11 అయితే, మోషే తన దేవుడైన యెహవాను బ్రతిమాలుకొని: “ప్రభూ! నీ కోపం చేత నీ ప్రజలను నాశనం చేయకు. నీవే నీ మహాశక్తితో బలంతో ఈ ప్రజలను ఈజిప్టు నుండి తీసుకువచ్చావు. 12 అయితే, నీవే నీ ప్రజలను నాశనం చేస్తే, ‘యెహోవా తన ప్రజలకు చెడ్డకార్యాలను చేయాలని తలపెట్టాడు. అందుకే ఆయన వాళ్లను ఈజిప్టు నుండి బయటకు రప్పించాడు. పర్వతాల్లోనే వాళ్లను చంపాలని ఆయన అనుకున్నాడు. భూమి మీద తన ప్రజల్ని నాశనం చేయాలని ఆయన అనుకొంటున్నాడు’ అని ఈజిప్టు ప్రజలు చెప్పవచ్చు. కనుక నీ ప్రజల మీద కోపగించవద్దు. నీ కోపం విడిచిపెట్టేయి. నీ ప్రజల్ని నాశనం చేయకు. 13 నిన్ను సేవించిన మనుష్యులు అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలును (యాకోబు) జ్ఞాపకం చేసుకో. నీవు నీ పేరు ప్రయోగించి ఆ మనుష్యులకు వాగ్దానం చేసావు. ‘నీ ప్రజలను ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంతగా చేస్తాను. నేను వారికి వాగ్దానం చేసిన ఈ దేశం అంతా నీ ప్రజలకు ఇస్తాను. ఈ దేశం శాశ్వతంగా వారిదే అవుతుంది’ అని నీవు చెప్పావు.”
14 కనుక యెహోవా తన ప్రజలను గూర్చి సంతాపపడ్డాడు. ఆయన చేస్తానన్న కీడును వారికి చేయలేదు. అంటే, ప్రజలను ఆయన నాశనం చేయలేదు.
1 దేవునికి, యేసుక్రీస్తు ప్రభువుకు సేవకుడైన యాకోబునైన నేను, చెదరిపోయి, పలు ప్రాంతాలలో నివసిస్తున్న పన్నెండు గోత్రాల వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వ్రాయునదేమనగా:
విశ్వాసము, జ్ఞానము
2-3 నా సోదరులారా! మీకు పరీక్షలు కలిగినప్పుడు పరమానందంగా భావించండి. విశ్వాసం పరీక్షింపబడటం వల్ల సహనం కలుగుతుందని మీకు తెలుసు. 4 మీరు చేసే పనిలో పూర్తిగా సహనం చూపండి. అలా చేస్తే మీరు బాగా అభివృద్ధి చెంది పరిపూర్ణత పొందుతారు. అప్పుడు మీలో ఏ లోపం ఉండదు.
5 మీలో జ్ఞానం లేనివాడు ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి. దేవుడు కోపగించుకోకుండా అందరికీ ధారాళంగా యిస్తాడు. కనుక మీకు కూడా యిస్తాడు. 6 కాని దేవుణ్ణి అడిగినప్పుడు సంశయించకుండా విశ్వాసంతో అడగండి. సంశయించేవాడు గాలికి ఎగిరి కొట్టుకొను సముద్రం మీది తరంగంతో సమానము. 7 అలాంటివాడు ప్రభువు నుండి తనకు ఏదైనా లభిస్తుందని ఆశించకూడదు. 8 అలాంటివాడు ద్వంద్వాలోచనలు చేస్తూ అన్ని విషయాల్లో చంచలంగా ఉంటాడు.
© 1997 Bible League International