Revised Common Lectionary (Complementary)
మేమ్
97 నీ ధర్మశాస్త్రాన్ని నేనెంతగా ప్రేమిస్తానో!
దినమంతా అదే నా ధ్యానం.
98 నీ ఆజ్ఞ నన్ను నా శత్రువులకంటే
జ్ఞానవంతునిగా చేస్తుంది.
99 నా గురువులందరికంటే నాకు ఎక్కువ గ్రహింపు ఉన్నది.
ఎందుకంటే నీ ఉపదేశాలే నా ధ్యానం కాబట్టి.
100 ముసలివారి కంటే నేనెక్కువ అర్థం చేసుకొంటాను.
కారణం ఏమిటంటే, నేను నీ శాసనాలను అనుసరిస్తాను.
101 నీ వాక్కు ప్రకారం నడుచుకోటానికి
ప్రతి చెడు మార్గంనుండి నేను తప్పించుకొంటాను.
102 యెహోవా, నీవు నా ఉపాధ్యాయుడవు
కనుక నేను నీ న్యాయ చట్టాలకు విధేయుడనవటం మానను.
103 నీ మాటలు నా నోటికి తేనెకంటే మధురం.
104 నీ ఉపదేశాలు నన్ను తెలివిగలవాణ్ణి చేస్తాయి,
అందుచేత తప్పుడు ఉపదేశాలు నాకు అసహ్యము.
ఇశ్రాయేలీయులు తమ పాపాలను ఒప్పుకొనటం
9 తర్వాత అదే నెల 24 వ రోజున, ఇశ్రాయేలీయులు ఒక చోట చేరి సామూహిక ఉపవాసం చేశారు. వాళ్లు విచార సూచకమైన దుస్తులు ధరించారు. (తమ విచారాన్ని చూపేందుకు గాను) నెత్తిన బూడిద పోసుకున్నారు. 2 నిజంగా ఇశ్రాయేలీయులైన వాళ్లు అన్య జనులనుంచి వేరుపడి, ఆలయంలో నిలబడి, తమ పాపాలనూ, తమ పూర్వీకుల పాపాలనూ ఒప్పుకొన్నారు. 3 వాళ్లక్కడ సుమారు మూడు గంటలసేపు నిలబడ్డారు, తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రాన్ని చదివారు, తర్వాత మరో మూడు గంటలు తమ పాపాలు ఒప్పుకొని, యెహోవా ముంగిట సాగిల పడ్డారు.
4 అటు తర్వాత, ఈ క్రింది లేవీయులు మెట్లపైన నిలబడ్డారు: యేషూవా, బానీ, కద్మీయేలు, షెబన్యా, బున్నీ, షేరేబ్యా, బానీ, కెనానీ. వాళ్లు ఉచ్చ స్వరాల్లో యెహోవాను పిలిచారు. 5 తర్వాత ఈ లేవీయులు మళ్వీ ప్రసంగించారు: యేషువా, బానీ, కద్మీయేలు, హషబ్నెయా, షెరేబ్యా, హోదీయా, షబన్యా, పెతహాయా, వాళ్లు, “లేచి నిలబడి, ప్రభువైన దేవుణ్ణి స్తుతించండి” అని చెప్పారు.
“దేవుడు ఎల్లప్పుడు ఉండును. ఆయన ఎల్లప్పుడూ జీవించును!
నీ ఘననామం స్తుతించబడాలి.
నీ ఘనమైన నామం సకలాశీర్వచన స్తోత్రాలనూ అధిగమించి పోవాలి!
6 యెహోవా నీవే దేవుడివి!,
యెహోవా ఆకాశం, అత్యున్నత పరలోకాలు,
వాటిలోవున్న సమస్తాన్ని నీవే సృజించావు!
భూమినీ, దానిపైనున్న సమస్తాన్నీ
నీవే సృజించావు!
సముద్రాలను సృజించింది నీవే.
వాటిలో ఉన్న సమస్తాన్నీ సృజించింది నీవే!
ప్రతిదానికీ ప్రాణంపోసింది నీవే,
దేవదూతలు నీకు నమస్కరిస్తారు. నీ సన్నిధియందు సాగిలపడతారు నిన్ను ఆరాధిస్తారు!
7 యెహోవా, నీవే దేవుడివి.
అబ్రామును ఎంచుకున్నది నీవే.
అతన్ని బబులోనులోని ఊరునుంచి నడిపించింది నీవే.
అబ్రాహాముగా అతని పేరు మార్చింది నీవే.
8 అతడు నీకు నమ్మకంగా, విశ్వాసంగా ఉండేలా చూసుకున్నావు.
అతనితో నీవొక ఒడంబడిక చేసుకున్నావు.
అతని సంతతి వారికి వాగ్దానం చేశావు
నీవు కనాను, హిత్తీ, అమోరీ, పెరిజ్జీ, యెబూసీ, గిర్గాషి జాతుల దేశాన్ని ఇస్తానన్న.
నీ మాటను నీవు నిలుపుకున్నావు!
నీవు నిజాయితీగలవాడవు, మాట నిలుపుకున్నావు!
9 మా పూర్వీకులు ఈజిప్టులో బాధలు పడటం చూశావు!
సహాయార్థం ఎర్ర సముద్ర తీరాన వారి మొరలు ఆలకించావు.
10 నీవు ఫరోకి అద్భుతాలు ప్రదర్శించావు
అతని ఉద్యోగులకీ, ప్రజలకీ దిగ్ర్భాంతికరమైన పనులు చేసి చూపావు.
మా పూర్వీకుల కంటె తాము గొప్ప అని
ఈజిప్టీయులు అనుకోవడం నీకు తెలుసు.
అయితే నీవు, నీ వెంత గొప్పవాడివో నిరూపించుకొన్నావు!
ఈనాటికీ అది వాళ్లు జ్ఞాపకం ఉంచుకొంటారు.
11 నీవు వాళ్ల కళ్ల ముందు ఎర్ర సముద్రాన్ని విభాగించావు.
వాళ్లు పొడినేల మీద నడిచి పోయారు!
ఈజిప్టు సైనికులు వాళ్లని తరుముతున్నారు కాని, నీవు ఆ శత్రువుని సముద్రంలో ముంచేశావు.
మరి వాళ్లు ఒక రాయిలా నీటిలో మునిగారు.
12 పగటి పూట మేఘస్థంభంలో వుండి వాళ్లని నడిపించావు,
రాత్రివేళ దీపస్ధంభంలో వుండి వాళ్లని నడిపించావు,
ఆ విధంగా నీవు వారి మార్గాన్ని వెలిగించితివి.
వాళ్లు చేరవలసిన గమ్యాన్ని చూపావు.
13 అప్పుడిక సీనాయి పర్వతం మీదికి దిగి
ఆకాశంనుంచి వాళ్లతో మాట్లాడాపు.
వాళ్లకి చక్కటి. ధర్మనియమాలిచ్చావు.
వాళ్లకి సదుపదేశాలిచ్చావు.
మంచి ఆజ్ఞలిచ్చావు, చక్కటి ఆదేశాలిచ్చావు!
14 నీ ప్రత్యేక విశ్రాంతి దినమైన సబ్బాతుని గురించి వాళ్లకి చెప్పావు.
వాళ్లకి ఆజ్ఞలు, చట్టాలు, ఉపదేశాలు ఇచ్చేందుకు నీ సేవకుడు మోషేని వినియోగించావు.
15 వాళ్లు ఆకలిగొన్నప్పుడు
వాళ్లకి నీవు ఆకాశంనుంచి తిండినిచ్చావు.
వాళ్లు దప్పి గొన్నప్పుడు
వాళ్లకి నీవు బండ నుంచి మంచి నీళ్లిచ్చావు.
వాళ్లకి చెప్పావు,
‘రండి, ఈ భూమి తీసుకోండని’
నీవు నీ శక్తిని వినియోగించి
వారికోసం ఆ భూమిని తీసుకున్నావు!
భార్యాభర్తలు
21 మీకు క్రీస్తు పట్ల భయభక్తులు ఉన్నాయి. కనుక ఒకరికొకరు లోబడి ఉండండి.
22 స్త్రీలు మీరు ప్రభువుపట్ల విశ్వాసం కనబరచండి. అలాగే మీ భర్తలపట్ల కూడా గౌరవము కనబరుస్తూ జీవించండి. 23 క్రీస్తు సంఘానికి శిరస్సు. సంఘము ఆయనకు శరీరంలాంటిది. ఆయన దాన్ని రక్షిస్తున్నాడు. అదే విధంగా భర్త భార్యకు శిరస్సులాంటివాడు. 24 సంఘం క్రీస్తుకు విధేయతగా ఉన్నట్లే భార్య తన భర్తకు అన్ని విషయాల్లో విధేయతగా ఉండాలి.
25 క్రీస్తు తన సంఘాన్ని ప్రేమించి దాని కోసం తనను అర్పించుకున్నట్లే భర్త తన భార్యను ప్రేమించి తనను అర్పించుకోవటానికి సిద్ధంగా ఉండాలి. 26 క్రీస్తు తన సంఘాన్ని పవిత్రం చేయాలని తనను తాను అర్పించుకున్నాడు. ఆ సంఘాన్ని దేవుని వాక్యమను నీళ్ళతో కడిగాడు; సువార్త సందేశంతో దాన్ని శుద్ధీకరించాడు. 27 దాన్ని తేజోవంతంగా, పవిత్రంగా మరకా మచ్చా లేకుండా, మరే తప్పూ లేకుండా, అపకీర్తి లేకుండా చేసేందుకు ఆ సంఘం కోసం తనకు తానే అర్పించుకొన్నాడు.
28 అదే విధంగా భర్త తన భార్యను తన శరీరంగా భావించి ప్రేమించాలి. తన భార్యను ప్రేమిస్తే తనను తాను ప్రేమించుకొన్నదానితో సమానము. 29 సహజంగా ఎవ్వరూ తమ శరీరాన్ని ద్వేషించరు. అందరూ తమ శరీరాన్ని పోషించుకొంటూ రక్షించుకొంటారు. 30 అదే విధంగా మనము క్రీస్తు శరీరంలో భాగాలము. కనుక ఆయన సంఘంగా ఉన్న మనల్ని ఆయన పోషించి రక్షిస్తాడు. 31 “ఈ కారణంగా పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి తన భార్యతో కలిసి జీవిస్తాడు. వాళ్ళిద్దరూ ఒకే శరీరంగా జీవిస్తారు.”(A) 32 ఇది గొప్ప రహస్యం. కాని నేను క్రీస్తును గురించి, ఆయన సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాను. 33 ఏది ఏమైనా ప్రతి ఒక్కడూ తనను తాను ప్రేమించుకొన్నంతగా తన భార్యను ప్రేమించాలి. భార్య తన భర్తను గౌరవించాలి.
తల్లిదండ్రుల్ని గౌరవించండి
6 బిడ్డలారా! ప్రభువు ఆజ్ఞాపించిన విధంగా మీరు మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి. ఇది మంచిపని, 2 “మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి”(B) అన్న దేవుని ఆజ్ఞ వాగ్దానముతో కూడినవాటిలో మొదటిది. 3 “మీకు శుభం కలుగుతుంది. భూలోకంలో మీ ఆయువు అభివృద్ధి చెంది ఆనందంగా జీవిస్తారు.”(C)
4 తండ్రులు తమ పిల్లలకు కోపం కలిగించరాదు. దానికి మారుగా ప్రభువు చెప్పిన మార్గాన్ని వాళ్ళకు బోధించి, అందులో శిక్షణనిచ్చి వాళ్ళను పెంచాలి.
బానిసలు, యజమానులు
5 బానిసలు తమ యజమానుల పట్ల విధేయతతో ఉండాలి. వాళ్ళకు మనస్ఫూర్తిగా క్రీస్తుకు విధేయులైనట్లు సేవ చెయ్యాలి. 6 వాళ్ళ అభిమానం సంపాదించాలనే ఉద్దేశ్యంతో వాళ్ళు గమనిస్తున్నప్పుడు మాత్రమే కాక అన్ని వేళలా మీ పనులు మీరు చెయ్యాలి. మీరు క్రీస్తు బానిసలు. కనుక మనస్ఫూర్తిగా దైవేచ్ఛానుసారం చెయ్యండి. 7 సంతోషంగా సేవ చెయ్యండి. మానవుల సేవ చేస్తున్నామని అనుకోకుండా ప్రభువు సేవ చేస్తున్నట్లు భావించండి. 8 ప్రభువు మనిషి చేసిన సేవను బట్టి ప్రతిఫలం ఇస్తాడు. అతడు బానిస అయినా సరే. లేక యజమాని అయినా సరే. ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోండి.
9 యజమానులు బానిసలపట్ల మంచిగా ఉండాలి. యజమానులు బానిసలను భయపెట్టరాదు. మీ యజమాని, వాళ్ళ యజమాని పరలోకంలో ఉన్నాడు. ఆయన పక్షపాతం చూపడు.
© 1997 Bible League International