Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: యెహోవా సేవకుడైన దావీదు కీర్తన.
36 “నేను దేవునికి భయపడను, గౌరవించను” అని దుర్మార్గుడు తనలో తాను చెప్పుకొన్నప్పుడు
అతడు చాలా చెడ్డ పని చేస్తున్నాడు.
2 ఆ మనిషి తనకు తానే అబద్ధం చెప్పుకొంటున్నాడు.
ఆ మనిషి తన సొంత తప్పులను చూడడు.
కనుక అతడు క్షమాపణ వేడుకోడు.
3 అతని మాటలు కేవలం పనికిమాలిన అబద్ధాలే.
అతడు తెలివిగలవాడు కాజాలడు, మేలు చేయడం నేర్చుకోలేడు.
4 రాత్రిపూట, అతడు పనికిమాలిన సంగతులు తలుస్తూంటాడు.
అతడు మేల్కొన్నప్పుడు, ఏ మేలూ చేయడు.
ఏ చెడు కార్యాం చేయటానికైనా అతడు నిరాకరించడు.
5 యెహోవా, నీ నిజమైన ప్రేమ ఆకాశాల కంటె ఉన్నతమైనది.
నీ నమ్మకత్వం మేఘాలకంటె ఉన్నతం.
6 యెహోవా, నీ నీతి “దేవతల పర్వతాల కంటె ఉన్నతమైనది.”
నీ న్యాయం లోతైన మహాసముద్రం కంటె లోతైనది.
యెహోవా, నీవు మానవులను, జంతువులను కాపాడుతావు.
7 ప్రేమగల నీ దయకంటె ఎక్కువ ప్రశస్తమైనది ఇంకేది లేదు.
కాపుదల కోసం మనుష్యులు, దేవ దూతలు నీ దగ్గరకు వస్తారు.
8 యెహోవా, నీ ఇంటిలోని సమృద్ధియైన ఆహారంనుండి వారు నూతన బలం పొందుతారు.
అధ్బుతమైన నీ నదిలోనుండి నీవు వారిని త్రాగనిస్తావు.
9 యెహోవా, జీవపు ఊట నీ నుండి ప్రవహిస్తుంది.
నీ వెలుగు మమ్మల్ని వెలుగు చూడనిస్తుంది.
10 యెహోవా, వాస్తవంగా నిన్ను ఎరిగినవారిని ప్రేమించటం కొనసాగించుము.
నీకు నమ్మకంగావుండే ప్రజలకు నీ మేలు కలుగనిమ్ము.
11 యెహోవా, గర్విష్ఠుల మూలంగా నన్ను పట్టుబడనివ్వకుము.
దుర్మార్గుల చేత తరుమబడనియ్యకుము.
12 వారి సమాధుల మీద ఈ మాటలు చెక్కుము.
“ఇక్కడే దుర్మార్గులు పడిపోయారు.
వారు చితుకగొట్టబడ్డారు.
వారు మళ్లీ ఎన్నటికీ లేచి నిలబడరు.”
ఫరోకోసం యోసేపు భూమి కొనుట
13 కరవు కాలం మరీ తీవ్రం అయింది. దేశంలో ఎక్కడా ఆహారం లేదు. ఈ కష్టకాలం మూలంగా ఈజిప్టు, కనాను దేశాలు చాలా పేదవయ్యాయి. 14 ఆ దేశంలో ప్రజలు మరింత ధాన్యం కొన్నారు. యోసేపు ఆ ధనం ఆదా చేసి, దానిని ఫరో ఇంటికి తెచ్చాడు. 15 కొన్నాళ్లకు ఈజిప్టులోను, కనానులోను ప్రజల దగ్గర పైకం అయిపోయింది. ధాన్యం కొనేందుకే వారి డబ్బు అంతా ఖర్చు పెట్టారు. కనుక ప్రజలు యోసేపు దగ్గరకు వెళ్లి, “దయచేసి మాకు ధాన్యం ఇవ్వండి. మా డబ్బు అయిపోయింది. మేము భోజనం చేయకపోతే మీరు చూస్తుండగానే మేము మరణిస్తాం” అని చెప్పారు.
16 “మీ పశువుల్ని ఇవ్వండి, నేను మీకు ఆహారం ఇస్తాను” అని యోసేపు జవాబిచ్చాడు. 17 కనుక ప్రజలు ఆహారం కొనేందుకు వారి పశువులను, గుర్రాలను, మిగిలిన జంతువులన్నిటిని ఉపయోగించారు. ఆ సంవత్సరం యోసేపు వారికి ఆహారం ఇచ్చి, వారి పశువులను తీసుకున్నాడు.
18 అయితే ఆ తర్వాత సంవత్సరం ప్రజల దగ్గర జంతువులు లేవు, ఆహారం కొనేందుకు ఉపయోగించటానికి ఏమీ లేవు. కనుక ప్రజలు యోసేపు దగ్గరకు వెళ్లి “మా దగ్గర ఇంకేమీ డబ్బు లేదని మీకు తెలుసు. మా పశువులన్నీ ఇప్పుడు మీవే. మా దగ్గర నీవు చూస్తున్న మా శరీరాలు, మా భూమి తప్ప ఇంకేమి లేవు. 19 మీరు చూస్తుండగానే నిశ్చయంగా మేము చనిపోతాం. కానీ, మీరు మాకు ఆహారం ఇస్తే, మేము మా భూమిని ఫరోకు ఇస్తాం, మేము ఆయన బానిసలంగా ఉంటాము. మేము నాట్లు వేయటానికి మాకు విత్తనాలు ఇవ్వండి. అప్పుడు మేము చావక బ్రతుకుతాం. భూమి మా కోసం మరోసారి పంటను ఇస్తుంది” అని చెప్పారు.
20 కనుక యోసేపు ఈజిప్టులోని భూమి అంతటినీ ఫరోకోసం కొన్నాడు. ఈజిప్టులోని ప్రజలంతా వారి భూములను యోసేపుకు అమ్మివేశారు. వారు చాలా కరువుతో ఉన్నందుచేత ఇలా చేశారు. 21 మరియు ప్రజలందరు ఫరోకు బానిసలయ్యారు. ఈజిప్టు అంతటిలో ప్రజలు ఫరోకు బానిసలు. 22 యాజకుల స్వంత భూములను మాత్రమే యోసేపు కొనలేదు. యాజకుల పనికి ఫరో జీతం ఇచ్చాడు గనుక వారు వారి భూములను అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఆ డబ్బును ఆహారం కొనేందుకు వారు ఉపయోగించుకొనేవారు.
23 యోసేపు ప్రజలతో చెప్పాడు, “ఇప్పుడు మిమ్మల్ని, మీ భూముల్ని ఫరోకోసం నేను కొన్నాను. కనుక నేను విత్తనాలు ఇస్తాను, మీరు మీ భూముల్లో నాట్లు వేయవచ్చును. 24 కోతకాలంలో మీ పంటలో అయిదింట ఒక వంతు ఫరోకు ఇవ్వాలి. అయిదింట నాలుగు వంతులు మీకోసం మీరు ఉంచుకోవచ్చు. మీరు ఉంచుకొనే గింజలను మీ ఆహారం కోసమూ, వచ్చే సంవత్సరం విత్తనాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మీరు మీ కుటుంబాలను, పిల్లలను పోషించుకోవచ్చు.”
25 ప్రజలు, “మీరు మా ప్రాణాలు రక్షించారు. మేము సంతోషంగా మీకు, ఫరోకు బానిసలంగా ఉంటాం” అన్నారు.
26 కనుక ఈ సమయంలో యోసేపు ఆ దేశంలో చట్టం చేశాడు. ఆ చట్టం నేటికీ కొనసాగుతుంది. భూమిలోనుండి వచ్చే దిగుబడి అంతటిలోనూ అయిదింట ఒక వంతు ఫరోకు చెందుతుంది అనేది ఆ చట్టం. భూములన్నీ ఫరో స్వంతం. యాజకుల భూమి మాత్రమే ఫరో స్వంతం కాలేదు.
శిష్యులు యేసుని అపార్థము చేసికొనటం
(మత్తయి 16:5-12)
14 శిష్యులు రొట్టెలు తేవటం మరిచిపోయారు. వాళ్ళ దగ్గర ఒక రొట్టె మాత్రమే ఉంది. 15 యేసు, “జాగ్రత్తగా ఉండండి. పరిసయ్యుల పులుపును హేరోదు పులుపును[a] గమనిస్తూ ఉండండి” అని వాళ్ళను హెచ్చరించాడు.
16 ఇది వాళ్ళు పరస్పరం చర్చించుకొంటూ, “మన దగ్గర రొట్టెలు లేవని అలా అంటున్నాడా!” అని అనుకొన్నారు.
17 వాళ్ళు ఏమి చర్చించుకొంటున్నారో యేసు కనిపెట్టి, “రొట్టెలులేవని ఎందుకు చర్చించుకుంటున్నారు? మీకు యింకా అర్థంకాలేదా? మీరు చూడలేదా? మీ బుద్ధి మందగించిందా? 18 మీకు కళ్ళున్నాయి కాని చూడలేరు. చెవులున్నాయి కాని వినలేరు. మీకు జ్ఞాకపం లేదా? 19 నేను ఐదు రొట్టెల్ని విరిచి ఐదువేల మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కల్ని మీరెన్ని గంపలనిండా నింపారు?” అని అడిగాడు.
“పన్నెండు” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
20 “మరి ఏడు రొట్టెలు విరిచి నాలుగు వేలమందికి పంచినప్పుడు మిగిలిన ముక్కల్ని ఎన్ని గంపలనిండా నింపారు?” అని యేసు అన్నాడు.
“ఏడు” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
21 “యింకా మీకు అర్థం కాలేదా?” అని ఆయన వాళ్ళతో అన్నాడు.
© 1997 Bible League International