Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: యెహోవా సేవకుడైన దావీదు కీర్తన.
36 “నేను దేవునికి భయపడను, గౌరవించను” అని దుర్మార్గుడు తనలో తాను చెప్పుకొన్నప్పుడు
అతడు చాలా చెడ్డ పని చేస్తున్నాడు.
2 ఆ మనిషి తనకు తానే అబద్ధం చెప్పుకొంటున్నాడు.
ఆ మనిషి తన సొంత తప్పులను చూడడు.
కనుక అతడు క్షమాపణ వేడుకోడు.
3 అతని మాటలు కేవలం పనికిమాలిన అబద్ధాలే.
అతడు తెలివిగలవాడు కాజాలడు, మేలు చేయడం నేర్చుకోలేడు.
4 రాత్రిపూట, అతడు పనికిమాలిన సంగతులు తలుస్తూంటాడు.
అతడు మేల్కొన్నప్పుడు, ఏ మేలూ చేయడు.
ఏ చెడు కార్యాం చేయటానికైనా అతడు నిరాకరించడు.
5 యెహోవా, నీ నిజమైన ప్రేమ ఆకాశాల కంటె ఉన్నతమైనది.
నీ నమ్మకత్వం మేఘాలకంటె ఉన్నతం.
6 యెహోవా, నీ నీతి “దేవతల పర్వతాల కంటె ఉన్నతమైనది.”
నీ న్యాయం లోతైన మహాసముద్రం కంటె లోతైనది.
యెహోవా, నీవు మానవులను, జంతువులను కాపాడుతావు.
7 ప్రేమగల నీ దయకంటె ఎక్కువ ప్రశస్తమైనది ఇంకేది లేదు.
కాపుదల కోసం మనుష్యులు, దేవ దూతలు నీ దగ్గరకు వస్తారు.
8 యెహోవా, నీ ఇంటిలోని సమృద్ధియైన ఆహారంనుండి వారు నూతన బలం పొందుతారు.
అధ్బుతమైన నీ నదిలోనుండి నీవు వారిని త్రాగనిస్తావు.
9 యెహోవా, జీవపు ఊట నీ నుండి ప్రవహిస్తుంది.
నీ వెలుగు మమ్మల్ని వెలుగు చూడనిస్తుంది.
10 యెహోవా, వాస్తవంగా నిన్ను ఎరిగినవారిని ప్రేమించటం కొనసాగించుము.
నీకు నమ్మకంగావుండే ప్రజలకు నీ మేలు కలుగనిమ్ము.
11 యెహోవా, గర్విష్ఠుల మూలంగా నన్ను పట్టుబడనివ్వకుము.
దుర్మార్గుల చేత తరుమబడనియ్యకుము.
12 వారి సమాధుల మీద ఈ మాటలు చెక్కుము.
“ఇక్కడే దుర్మార్గులు పడిపోయారు.
వారు చితుకగొట్టబడ్డారు.
వారు మళ్లీ ఎన్నటికీ లేచి నిలబడరు.”
బెన్యామీను వెళ్లటానికి యాకోబు ఒప్పుకొనుట
43 దేశంలో కరువు చాలా దారుణంగా ఉంది. అక్కడ ఎలాంటి ఆహారం పండటం లేదు. 2 ప్రజలు ఈజిప్టునుండి తెచ్చుకొన్న ధాన్యం అంతా తినేసారు. ధాన్యం అయిపోయినప్పుడు, “మళ్లీ ఈజిప్టుకు వెళ్లి, మనం తినేందుకు మరింత ధాన్యం కొనండి” అని యాకోబు తన కుమారులతో చెప్పాడు.
3 అయితే యాకోబుతో యూదా చెప్పాడు: “మీ సోదరుడ్ని మీరు నా దగ్గరకు తీసుకొని రాకపోతే నేను మీతో మాట్లాడను అని ఆ దేశ పాలకుడు మమ్మల్ని హెచ్చరించాడు. 4 బెన్యామీనును నీవు మాతో పంపిస్తేనే మేము వెళ్లి ధాన్యం కొంటాం. 5 కానీ బెన్యామీనును పంపించేందుకు నీవు ఒప్పుకొనకపోతే మేము వెళ్లం. అతడు లేకుండా తిరిగి రావద్దని ఆయన మమ్మల్ని హెచ్చరించాడు.”
6 “మీకు ఇంకో సోదరుడు ఉన్నాడని అసలు మీరెందుకు చెప్పారు? ఇంత కీడు మీరెందుకు నాకు చేశారు?” ఇశ్రాయేలు (యాకోబు) అడిగాడు.
7 ఆ సోదరులు జవాబు చెప్పారు: “ఆ మనిషి మమ్మల్ని అనేక ప్రశ్నలు వేశాడు. మా విషయం, మా కుటుంబం విషయం అతడు తెలుసుకోవాలనుకున్నాడు, ‘మీ తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడా? ఇంటి దగ్గర మీకు ఇంకో సోదరుడు ఉన్నాడా?’ అని అతడు మమ్మల్ని అడిగాడు. అతని ప్రశ్నలకు మాత్రమే మేము జవాబిచ్చాం. మా మిగిలిన సోదరుని కూడ తన దగ్గరకు తీసుకొని రమ్మంటాడని మాకు తెలియదు!”
8 అప్పుడు యూదా తన తండ్రి ఇశ్రాయేలుతో ఇలా చెప్పాడు: “బెన్యామీనును నాతో పంపించు. అతని విషయం నేను జాగ్రత్తగా చూసుకొంటాను. మేము మాత్రం ఈజిప్టుకు వెళ్లాలి, ఆహారం తీసుకురావాలి. మేము వెళ్లకపోతే మనమూ, మన పిల్లలూ అందరం చస్తాం. 9 అతని క్షేమం నేను చూసుకొంటాను. అతని భాద్యత నాది. అతణ్ణి నేను తిరిగి నీ దగ్గరకు తీసుకొని రాకపోతే శాశ్వతంగా నీవు నన్ను నిందించవచ్చు. 10 నీవు మమ్మల్ని వెళ్లనిచ్చి ఉంటే ఇప్పటికి రెండు సార్లు వెళ్లి వచ్చే వాళ్లం.”
11 అప్పుడు వారి తండ్రి ఇశ్రాయేలు అన్నాడు: “ఇదే గనుక నిజంగా సత్యమైతే, అలాగే బెన్యామీనును నీతో తీసుకొని వెళ్లు. అయితే ఆ పాలకునికి కానుకలు తీసుకొని వెళ్లు. మన దేశంలో మనం సంపాదించగలిగినవి కొన్ని తీసుకొని వెళ్లు. కొంచెం మస్తకి, కొంచెం తేనె, సుగంధద్రవ్యాలు, బోళం, పిస్తాచ కాయలు, బాదం కాయలు, అతనికి తీసుకొని వెళ్లండి. 12 ఈ సారి రెండంతల డబ్బు మీతో తీసుకు వెళ్లండి. పోయిన సారి మీరు చెల్లించగా తిరిగి మీకు ఇవ్వబడిన సొమ్ము మళ్లీ తీసుకు వెళ్లండి. ఒకవేళ ఆ పాలకుడు పొరబడ్డాడేమో. 13 బెన్యామీనును తీసుకొని ఆ మనిషి దగ్గరకు తిరిగి వెళ్లు. 14 మీరు ఆ పాలకుని ముందర నిలిచినప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు సహాయం చేయాలని నేను ప్రార్థన చేస్తాను. బెన్యామీను, షిమ్యోనులను అతడు క్షేమంగా తిరిగి వెళ్లనిచ్చేటట్లు నేను ప్రార్థన చేస్తాను. లేనట్లయితే నా కుమారుని పోగొట్టుకొని నేను మరల దుఃఖంలో మునిగిపోతాను.”
15 కనుక ఆ పాలకుని కోసం కానుకలన్నీ తీసుకొన్నారు ఆ సోదరులు. వారు మొదటిసారి తీసుకొని వెళ్లిన దానికి రెట్టింపు సొమ్ము వారితో కూడా తీసుకొని వెళ్లారు. బెన్యామీను ఆ సోదరులతో కలిసి ఈజిప్టుకు వెళ్లాడు.
ఏడుగురిని ఎన్నుకోవటం
6 యేసు అనుచరుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఆ రోజుల్లో గ్రీకు భాషలో మాట్లాడే యూదులు హీబ్రూ భాష మాట్లాడే యూదులతో, “మా వితంతువుల్ని ప్రతి రోజు చేసే దానాల విషయంలో సరిగ్గా చూడటం లేదు” అని తగువు పెట్టుకొన్నారు.
2 అందువల్ల ఆ పన్నెండుమంది అపొస్తలులు అనుచరులందర్ని సమావేశ పరిచి ఈ విధంగా అన్నారు: “అన్నదానాల విషయం చూడటానికోసం మేము దేవుని సందేశం యొక్క బోధ విషయంలో అశ్రద్ధ వహించటం మంచిది కాదు. 3 సోదరులారా! పవిత్రాత్మ సంపూర్ణంగా గలవాళ్ళను, పూర్ణ జ్ఞానం కలవాళ్ళను ఏడుగురిని మీలోనుండి ఎన్నుకోండి. ఈ బాధ్యత వాళ్ళకప్పగిస్తాం. 4 మేము మా కాలాన్ని ప్రార్థనలకు, దేవుని సందేశాన్ని ఉపదేశించటానికి వినియోగిస్తాము.”
5 అపొస్తలులు చెప్పింది వాళ్ళకందరికీ బాగా నచ్చింది. వాళ్ళు స్తెఫనును ఎన్నుకొన్నారు. స్తెఫను దేవుని పట్ల గొప్ప విశ్వాసం గలవాడు. అతనిలో పవిత్రాత్మ సంపూర్ణంగా ఉంది. అతణ్ణే కాక ఫిలిప్పును, ప్రొకొరును, నీకానోరును, తీమోనును, పర్మెనాసును, నీకొలాసును కూడా ఎన్నుకొన్నారు. ఈ నీకొలాసు అంతియొకయకు చెందినవాడు. పూర్వం యూదుల మతంలో చేరినవాడు. 6 ప్రజలు వీళ్ళను అపొస్తలుల ముందుకు పిలుచుకొని వచ్చారు. అపొస్తలులు ప్రార్థించి తమ చేతుల్ని వాళ్ళపై ఉంచారు.
7 దేవుని సందేశం ప్రచారమైంది. యెరూషలేములో శిష్యుల సంఖ్య బాగా పెరిగిపోయింది. చాలా మంది యాజకులు విశ్వసించారు.
© 1997 Bible League International