Revised Common Lectionary (Complementary)
9 యెహోవా పవిత్ర జనులు ఆయనను ఆరాధించాలి.
ఆయన్ని అనుసరించే వారికి సురక్షిత స్థలం ఆయన తప్ప మరేదీలేదు.
10 యౌవనసింహాలు[a] బలహీనమై, ఆకలిగొంటాయి.
అయితే సహాయం కోసం దేవుని ఆశ్రయించే వారికి ప్రతి మేలు కలుగుతుంది. మంచిదేదీ కొరతగా ఉండదు.
11 పిల్లలారా, నా మాట వినండి.
యెహోవాను ఎలా సేవించాలో నేను నేర్పిస్తాను.
12 ఒక వ్యక్తి జీవితాన్ని ప్రేమిస్తోంటే,
ఒక వ్యక్తి మంచి దీర్ఘకాల జీవితం జీవించాలనుకొంటే
13 అప్పుడు ఆ వ్యక్తి చెడ్డ మాటలు మాట్లాడకూడదు,
ఆ వ్యక్తి అబద్ధాలు పలుకకూడదు,
14 చెడ్డ పనులు చేయటం చాలించండి. మంచి పనులు చేయండి.
శాంతికోసం పని చేయండి. మీకు దొరికేంతవరకు శాంతికోసం వెంటాడండి.
13 యోబు ఇలా అన్నాడు:
“ఇదంతా ఇదివరకే నా కళ్లు చూశాయి.
మీరు చెప్పేది అంతా నేను ఇదివరకే విన్నాను.
అదంతా నేను గ్రహించాను.
2 మీకు తెలిసింది అంతా నాకు తెలుసు.
నేను మీకంటే తక్కువ కాదు.
3 కానీ (మీతో వాదించటం నాకు ఇష్టం లేదు)
సర్వశక్తిమంతుడైన దేవునితో మాట్లాడాలని నేను కోరుతున్నాను.
నా కష్టాలను గూర్చి నేను దేవునితో వాదించాలని కోరుతున్నాను.
4 కానీ, మీరు ముగ్గురూ మీ అజ్ఞానాన్ని అబద్ధాలతో కప్పిపుచ్చాలని ప్రయత్నిస్తున్నారు.
ఎవరినీ బాగుచేయలేని పనికిమాలిన వైద్యుల్లా మీరు ఉన్నారు.
5 మీరు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటే బాగుండేది.
అది మీరు చేయగలిగిన అతి జ్ఞానంగల పని.
6 “ఇప్పుడు, నా వాదం వినండి.
నేను నా విన్నపం చెబుతుండగా, వినండి
7 మీరు దేవుని కోసం అబద్ధాలు చెబుతున్నారా?
మీరు చెప్పాలని దేవుడు కోరుతున్నవి అబద్ధాలే అని మీరు నిజంగా నమ్ముచున్నారా?
8 మీరు నాకు విరోధంగా దేవుని ఆదుకొనేందుకు ప్రయత్నిస్తున్నారా?
న్యాయస్థానంలో మీరు దేవుని ఆదుకొంటారా?
9 దేవుడు మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలిస్తే
ఆయనకు మంచి ఏమైనా కనబడుతుందా?
మీరు మనుష్యులను మోసం చేసినట్టే దేవునిని కూడా మోసం చేయగలమని
నిజంగా అనుకొంటున్నారా?
10 మీరు కనుక న్యాయస్థానంలో ఒకరి పక్షం వహించాలని
రహస్యంగా నిర్ణయిస్తే దేవుడు విజంగా మిమ్మల్ని గద్దిస్తాడు.
11 దేవుని ప్రభావం మిమ్మల్ని భయపెట్టేస్తుంది.
ఆయన్ని చూచి మీరు భయపడతారు.
12 (మీరు తెలివిగానూ, జ్ఞానంగానూ మాట్లాడుతున్నాం అనుకొంటారు).
కానీ మీ మాటలు బూడిదలా పనికిమాలినవే. మీ వాదాలు మట్టిలా బలహీనమైనవే.
13 “నిశ్శబ్దంగా ఉండి, నన్ను మాట్లాడనివ్వండి. నివ్వండి.
14 నాకు నేను అపాయంలో చిక్కుకొనుచున్నాను,
నా ప్రాణం నా చేతుల్లోకి తీసుకొంటున్నాను.
15 దేవుడు నన్ను చంపివేసినా సరే నేనాయన్ని నమ్ముతూనే వుంటాను.
ముఖాముఖిగా, ఆయన ముందు నా విధానాలను రుజువు చేస్తాను.
16 కాని దేవుని ఎదుట నేను ధైర్యంగా ఉన్నాను, గనుక ఒక వేళ ఆయన నన్ను రక్షిస్తాడేమో.
చెడ్డ మనిషి ఎవ్వడూ దేవుణ్ణి ముఖాముఖిగా కలుసుకోడానికి సాహసించడు.
17 నేను చెప్పేది జాగ్రత్తగా వినండి.
నేను వివరిస్తూండగా మీ చెవులను విననివ్వండి.
18 ఇప్పుడు నన్ను నేను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాను.
నేను జాగ్రత్తగా నా వాదనలను మీ ముందు ఉంచుతాను.
నాదే సరి అని నాకు చూపించబడుతుంది అని నాకు తెలుసు.
19 నాది తప్పు అని ఏ మనిషీ రుజువు చేయలేడు.
అలా ఎవరైనా చేయగలిగితే నేను మౌనంగా ఉండి మరణిస్తాను.
7 ఒక సమరయ స్త్రీ నీళ్ళు తోడుకొని వెళ్ళటానికి వచ్చింది. యేసు ఆమెతో, “అమ్మా! నాకు త్రాగటానికి నీళ్ళిస్తావా?” అని అడిగాడు. 8 ఆయన శిష్యులు ఆహారం కొనుక్కొని రావటానికి పట్టణంలోకి వెళ్ళారు.
9 ఆ సమరయ స్త్రీ ఆయనతో, “మీరు యూదులు, నేను సమరయ స్త్రీని, నన్ను నీళ్ళివ్వమని అడుగుతున్నారే?” అని అన్నది. యూదులు సమరయులతో స్నేహంగా ఉండరు.
10 యేసు సమాధానం చెబుతూ, “దేవుడు ఏమివ్వగలడో నీకు తెలియదు. నిన్ను నీళ్ళు ఎవరు అడుగుతున్నారో నీకు తెలియదు. అది నీకు తెలిసివుంటే నేను అడగటానికి బదులు నీవు నన్ను నీళ్ళు అడిగేదానివి. నేను నీకు జీవజలాన్నీ యిచ్చేవాణ్ణి” అని అన్నాడు.
11 ఆ స్త్రీ, “అయ్యా! బావి లోతుగా ఉంది. పైగా మీ దగ్గర చేదటానికి ఏమిలేదు. ఈ జీవజలం మీకెట్లాలభిస్తుంది? 12 మీరు మా తండ్రి యాకోబు కన్నా గొప్పవారా? అతడు ఈ బావి మాకిచ్చాడు. ఈ బావి నీళ్ళు అతడు, అతని కుమారులు, అతని గొఱ్ఱెలు త్రాగాయి” అని అన్నది.
13 యేసు, “ఈ నీళ్ళు త్రాగినా మళ్ళీ దాహం వేస్తుంది! 14 కాని నేనిచ్చే నీళ్ళు త్రాగినవానికి మళ్ళీ దాహం కాదు. నేనిచ్చిన నీళ్ళు అతనిలో ఒక సజీవమైన ఊటగా మారి అతనికి అనంత జీవితాన్నిస్తుంది” అని సమాధానం చెప్పాడు.
15 ఆ స్త్రీ, “అయ్యా! నాకు మళ్ళీ దాహం కలుగకుండా, నేను నీళ్ళు చేదటానికి ఇక్కడికి ప్రతిరోజూ రాకుండా ఉండేటట్లు నాకా జలాన్ని ప్రసాదించండి” అని అడిగింది.
16 ఆయన, “వెళ్ళి నీ భర్తను పిలుచుకొని రా!” అని ఆమెతో అన్నాడు.
17 “నాకు భర్తలేడు” అని ఆమె తెలియచెప్పింది.
యేసు, “నీకు భర్త లేడని సరిగ్గా సమాధానం చెప్పావు. 18 నిజానికి నీకు ఐదుగురు భర్తలుండిరి. ప్రస్తుతం నీవు ఎవరితో నివసిస్తున్నావో అతడు నీ భర్తకాడు. నీవు నిజం చెప్పావు” అని అన్నాడు.
19 ఆమె, “అయ్యా! మీరు ప్రవక్తలా కనిపిస్తున్నారు. 20 మా పూర్వులు ఈ కొండ మీద పూజించారు. కాని మీ యూదులు, ‘మేము పూజించవలసింది యిక్కడ కాదు, యెరూషలేములో పూజించాలి’ అని అంటున్నారు” అని అన్నది.
21 యేసు, “నన్ను నమ్మమ్మా! తండ్రిని ఆరాధించటానికి ఈ కొండ మీదికి గాని లేక యెరూషలేముకు గాని వెళ్ళవలసిన అవసరం తీరిపోయే సమయం వస్తుంది. 22 మీ సమరయ దేశస్థులు తెలియనిదాన్ని ఆరాదిస్తారు. రక్షణ యూదుల నుండి రానున్నది కనుక మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తాము. 23 నిజమైన ఆరాధికులు తండ్రిని ఆత్మతోను, సత్యముతోను ఆరాధించే సమయం రానున్నది. ఆ సమయం ఇప్పుడే వచ్చింది కూడా. ఎందుకంటే తండ్రి అటువంటి ఆరాధికుల కోసమే ఎదురు చుస్తున్నాడు. 24 దేవుడు ఆత్మ అయివున్నాడు. కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధించాలి” అని అన్నాడు.
25 ఆ స్త్రీ, “క్రీస్తు అనబడే మెస్సీయ రానున్నాడని నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు మాకన్నీ విశదంగా చెబుతాడు” అని అన్నది.
26 యేసు, “నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే!” అని అన్నాడు.
© 1997 Bible League International