Revised Common Lectionary (Complementary)
9 యెహోవా పవిత్ర జనులు ఆయనను ఆరాధించాలి.
ఆయన్ని అనుసరించే వారికి సురక్షిత స్థలం ఆయన తప్ప మరేదీలేదు.
10 యౌవనసింహాలు[a] బలహీనమై, ఆకలిగొంటాయి.
అయితే సహాయం కోసం దేవుని ఆశ్రయించే వారికి ప్రతి మేలు కలుగుతుంది. మంచిదేదీ కొరతగా ఉండదు.
11 పిల్లలారా, నా మాట వినండి.
యెహోవాను ఎలా సేవించాలో నేను నేర్పిస్తాను.
12 ఒక వ్యక్తి జీవితాన్ని ప్రేమిస్తోంటే,
ఒక వ్యక్తి మంచి దీర్ఘకాల జీవితం జీవించాలనుకొంటే
13 అప్పుడు ఆ వ్యక్తి చెడ్డ మాటలు మాట్లాడకూడదు,
ఆ వ్యక్తి అబద్ధాలు పలుకకూడదు,
14 చెడ్డ పనులు చేయటం చాలించండి. మంచి పనులు చేయండి.
శాంతికోసం పని చేయండి. మీకు దొరికేంతవరకు శాంతికోసం వెంటాడండి.
తన స్నేహితులకు యోబు జవాబు
12 అప్పుడు యోబు జోఫరుకు ఇలా జవాబు ఇచ్చాడు:
2 “సందేహము లేకుండ, మీరు మాత్రమే
జ్ఞానం గల వాళ్లని మీరు తలస్తారు.
మీరు చనిపోయినప్పుడు మీతో బాటు
జ్ఞానం గతిస్తుందని మీరు తలస్తారు.
3 అయితే మీరు ఎంత జ్ఞానంగలవాళ్లో నేనూ అంత జ్ఞానంగలవాడిని.
నేను మీకంటే తక్కువేమి కాదు.
ఇది సత్యం అని ఇతరులకు కూడా తెలుసు.
4 “ఇప్పుడు నా స్నేహితులు నన్ను చూసి నవ్వుతారు.
వారిలా అంటారు: ‘వీడు దేవుణ్ణి ప్రార్థించాడు. వీనికి ఆయన జవాబు ఇచ్చాడు.’
కానీ నేను మంచివాణ్ణి, నిర్దోషిని.
అయినప్పటికీ ఇంకా నన్ను చూసి నా స్నేహితులు నవ్వుతూనే ఉన్నారు.
5 కష్టాలు లేని మనుష్యులు కష్టాలు ఉన్న వాళ్లను హేళన చేస్తారు.
అలాంటి వాళ్లు పడిపోతున్న వాళ్లను కొట్టేస్తారు.
6 దొంగల గుడారాలకు ఇబ్బంది లేదు.
దేవునికి కోపం రప్పించే వాళ్లు శాంతిగా జీవిస్తారు.
వారి ఒకే దేవుడు వారి స్వంత బలమే.
7 “అయితే జంతువుల్ని అడగండి,
అవి మీకు నేర్పిస్తాయి.
లేక ఆకాశ పక్షుల్ని అడగండి,
అవి మీకు నేర్పిస్తాయి.
8 లేక భూమితో మాట్లాడండి,
అది మీకు నేర్పిస్తుంది.
లేక సముద్రపు చేపలను వాటి జ్ఞానం గూర్చి
మీతో చెప్పనివ్వండి.
9 వాటిని యెహోవా సృష్టించాడని ప్రతి ఒక్కరికీ తెలుసు.
10 బ్రతికి ఉన్న ప్రతి జంతువూ శ్వాస పీల్చే
ప్రతి మనిషీ దేవుని శక్తి క్రిందనే.
11 భోజనం రుచి చూడడం నాలుకకు ఎంత ఆనందమో
చెవులు అవి వినే మాటలను పరీక్షించవా:
12 ముసలి వాళ్లకు కూడా జ్ఞానం ఉంది. దీర్ఘాయుష్షు అవగాహన కలిగిస్తుంది.
అని మేము అన్నాము.
13 జ్ఞానం, బలం దేవునికి చెందుతాయి.
మంచి సలహా మరియు గ్రహింపు ఆయనవే.
14 ఒక వేళ దేవుడు దేనినైనా పడగొడితే మనుష్యులు దాన్ని తిరిగి నిర్మించలేరు.
ఒక వేళ దేవుడు ఒక మనిషిని చెరసాలలో పెడితే మనుష్యులు అతనిని విడుదల చేయలేరు.
15 ఒక వేళ దేవుడు గాని వర్షాన్ని ఆపివేస్తే భూమి ఎండి పోతుంది.
ఒక వేళ దేవుడు గాని వర్షాన్నిరానిస్తే అది భూమిని వరదతో నింపివేస్తుంది.
16 దేవుడు బలవంతుడు, ఆయన ఎల్లప్పుడూ గెలుస్తాడు.
మోసపోయిన వాడు మోసం చేసిన వారూ ఇద్దరూ దేవునికి చెందిన వారే.
17 రాజుల జ్ఞానమును దేవుడు తీసి వేస్తాడు.
నాయకులు వెర్రిగా వ్రవర్తించేటట్టు చేస్తాడు.
18 రాజులు వారి బందీలకు గొలుసులు వేస్తారు. కాని దేవుడు వాటిని తీసివేస్తాడు.
అప్పుడు దేవుడు ఆ రాజుల మీద నడికట్టు వేస్తాడు.
19 తన వంశాన్ననుసరించి రక్షణ ఉందనుకొనే యాజకుల బలాన్ని దేవుడు అణచి,
వాళ్లను క్రిందికి దిగజారేటట్లు చేస్తాడు.
20 నమ్మకమైన సలహాదారులను దేవుడు నిశ్శబ్దం చేస్తాడు.
వృద్ధుల జ్ఞానమును ఆయన తీసివేస్తాడు.
21 నాయకులను అప్రముఖులనుగా చేస్తాడు.
పాలకుల బలాన్ని ఆయన తీసివేస్తాడు.
22 లోతైన అంధకారంలో నుండి రహస్య సత్యాలను దేవుడు చూపిస్తాడు.
మరణం లాంటి చీకటి గల స్థలాలలోనికి ఆయన వెలుగు పంపిస్తాడు.
23 దేవుడు రాజ్యాలను పెద్దవిగా, శక్తిగలవిగా విస్తరింపజేస్తాడు.
అప్పుడు ఆయన వాటిని నాశనం చేస్తాడు.
ఆయన రాజ్యాలను పెద్దవిగా పెరగనిస్తాడు.
అప్పుడు ఆ రాజ్యాల్లోని ప్రజలను ఆయన చెదరగొడతాడు.
24 భూలోక నాయకులను వెర్రివార్ని గాను అర్థం చేసుకోలేని వార్ని గాను దేవుడు చేస్తాడు.
మార్గం లేని అరణ్యంలో సంచరించేందుకు ఆయన వారిని పంపిస్తాడు.
25 ఆ నాయకులు చీకటిలో ముందుకు సాగుతారు. వారికి ఏ వెలుగూ లేదు.
వారు తాగుబోతుల్లా నడిచేటట్టు దేవుడు వారిని చేస్తాడు.”
17 సోదరులారా! నేను మిమ్మల్ని అర్థించేదేమిటంటే చీలికలు కలిగించేవాళ్ళను, మీ దారికి ఆటంకాలు కలిగించేవాళ్ళను, మీరు నేర్చుకొన్నవాటికి వ్యతిరేకంగా బోధించేవాళ్ళను గమనిస్తూ వాళ్ళకు దూరంగా ఉండండి. 18 అలాంటివాళ్ళు యేసు క్రీస్తు ప్రభువు సేవ చెయ్యరు. దానికి మారుగా వాళ్ళు తమ కడుపులు నింపుకొంటారు. మంచి మాటలు ఆడుతూ, ముఖస్తుతి చేస్తూ అమాయకుల్ని మోసం చేస్తూ ఉంటారు. 19 మీరు క్రీస్తును చాలా విధేయతతో అనుసరిస్తున్నారన్న విషయం అందరూ విన్నారు. అందువల్ల మీ విషయంలో చాలా ఆనందంగా ఉంది. మీరు మంచివాటిని గురించి జ్ఞానం సంపాదిస్తూ చెడు విషయంలో అజ్ఞానులుగా ఉండాలని నా కోరిక!
20 శాంతిదాత అయినటువంటి దేవుడు త్వరలోనే సాతాన్ను మీ కాళ్ళ క్రింద అణగ త్రొక్కుతాడు.
మన యేసు క్రీస్తు ప్రభువు యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉండుగాక!
© 1997 Bible League International