Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 34:9-14

యెహోవా పవిత్ర జనులు ఆయనను ఆరాధించాలి.
    ఆయన్ని అనుసరించే వారికి సురక్షిత స్థలం ఆయన తప్ప మరేదీలేదు.
10 యౌవనసింహాలు[a] బలహీనమై, ఆకలిగొంటాయి.
    అయితే సహాయం కోసం దేవుని ఆశ్రయించే వారికి ప్రతి మేలు కలుగుతుంది. మంచిదేదీ కొరతగా ఉండదు.
11 పిల్లలారా, నా మాట వినండి.
    యెహోవాను ఎలా సేవించాలో నేను నేర్పిస్తాను.
12 ఒక వ్యక్తి జీవితాన్ని ప్రేమిస్తోంటే,
    ఒక వ్యక్తి మంచి దీర్ఘకాల జీవితం జీవించాలనుకొంటే
13 అప్పుడు ఆ వ్యక్తి చెడ్డ మాటలు మాట్లాడకూడదు,
    ఆ వ్యక్తి అబద్ధాలు పలుకకూడదు,
14 చెడ్డ పనులు చేయటం చాలించండి. మంచి పనులు చేయండి.
    శాంతికోసం పని చేయండి. మీకు దొరికేంతవరకు శాంతికోసం వెంటాడండి.

యోబు 11

జోఫరు యోబుతో మాట్లాడటం

11 అప్పుడు నయమాతీ వాడైన జోఫరు యోబుకు జవాబిచ్చాడు:

“ఈ మాటల ప్రవాహానికి జవాబు ఇచ్చి తీరాల్సిందే!
    ఈ వాగుడు అంతా కలిసి, యోబు చెప్పింది సరే అనిపిస్తుందా? లేదు.
యోబూ, నీకు చెప్పేందుకు
    మా వద్ద జవాబు లేదనుకొంటున్నావా?
నీవు దేవునిగూర్చి నవ్వినప్పుడు,
    నిన్ను ఎవ్వరూ హెచ్చరించరు అనుకొంటున్నావా?
యోబూ! నీవు దేవునితో,
    ‘నా నమ్మకాలు సరియైనవే,
    కనుక చూడు నేను పరిశుద్ధమైన వాడినే’ అని చెబుతున్నావు.
యోబూ! దేవుడే నీకు జవాబిచ్చి,
    నీవు చేసేది తప్పు అని చెబితే బాగుండును అని నేను ఆశిస్తున్నాను.
అప్పుడు జ్ఞాన రహస్యాలు దేవుడు నీతో చెప్పగలడు.
    ప్రతి విషయానికీ, నిజంగా రెండు వైపులు ఉంటాయని ఆయన నీతో చెబుతాడు.
అది నిజమైన జ్ఞానం! యోబూ! ఇది తెలుసుకో:
    దేవుడు నిన్ను నిజంగా శిక్షించాల్సిన దానికంటె తక్కువగానే శిక్షిస్తున్నాడు.

“యోబూ, దేవుని రహస్య సత్యాలను నీవు గ్రహించగలవా?
    సర్వశక్తిమంతుడైన దేవుని గొప్పదనాన్నీ, శక్తినీ చూపించే హద్దులను నీవు గ్రహించలేవు.
అతని జ్ఞానం ఆకాశమంత ఎత్తైనది!
    ఆ హద్దులు సమాధి లోతులకంటె లోతైనవి.
కానీ, అది నీవు గ్రహించలేవు!
దేవుడు భూమికంటే గొప్పవాడు,
    సముద్రంకంటే పెద్దవాడు.

10 “దేవుడు ఒకవేళ నిన్ను బంధిస్తే, నిన్ను న్యాయ స్థానానికి తీసుకొనివస్తే,
    ఏ మనిషీ ఆయనను వారించలేడు.
11 నిజంగా, ఎవరు పనికిమాలిన వాళ్లో దేవునికి తెలుసు.
    దేవుడు దుర్మార్గాన్ని చూసినప్పుడు, ఆయన దానిని జ్ఞాపకం ఉంచుకొంటాడు.
12 ఒక అడవి గాడిద ఎలాగైతే ఒక మనిషికి జన్మ ఇవ్వలేదో,
    అలాగే బుద్ధిహీనుడు ఎన్నటికీ జ్ఞాని కాజాలడు.
13 అయితే యోబూ! దేవుణ్ణి మాత్రమే సేవించటానికి, నీవు నీ హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి.
    ఆయన తట్టు నీవు నీ చేతులు ఎత్తి ఆరాధించాలి.
14 నీ ఇంట్లో ఉన్న పాపం నీవు తొలగించి వేయాలి.
    నీ గుడారంలో చెడు నివాసం చేయనియ్యకు.
15 అప్పుడు నీవు సిగ్గుపడకుండా దేవుని తట్టు నిశ్చలంగా చూడగలుగుతావు.
    నీవు బలంగా నిలబడతావు. భయపడవు.
16 యోబూ! అప్పుడు నీవు నీ కష్టం మరచిపోగలవు.
    నీ కష్టాలను దొర్లిపోయిన నీళ్లలా నీవు జ్ఞాపకం చేసుకొంటావు.
17 అప్పుడు మధ్యాహ్నపు సూర్యకాంతి కంటె నీ జీవితం ఎక్కువ ప్రకాశమానంగా ఉంటుంది.
    జీవితపు గాఢాంధకార ఘడియలు సూర్యోదయంలా ప్రకాశిస్తాయి.
18 యోబూ! నిరీక్షణ ఉంది గనుక నీవు క్షేమంగా ఉంటావు.
    దేవుడు నిన్ను సురక్షితంగా వుంచి నీకు విశ్రాంతినిస్తాడు.
19 నీవు విశ్రాంతిగా పండుకొంటావు. నిన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు, బాధించరు.
    మరియు అనేక మంది నీ సహాయం వేడుకొంటారు.
20 కానీ, చెడ్డవాళ్లు సహాయం కోసం చూస్తారు,
    అయితే ఆశ ఏమి ఉండదు. వారు వారి కష్టాలు తప్పించుకోలేరు.
    వారు చస్తారు అనేది ఒక్కటే వారికి ఉన్న ఆశ.”

అపొస్తలుల కార్యములు 6:8-15

స్తెఫనును బంధించటం

దేవునినుండి సంపూర్ణమైన శక్తిని, అనుగ్రహాన్ని పొందిన స్తెఫను ప్రజల సమక్షంలో గొప్ప అద్భుతాలు చేసాడు. అద్భుతమైన చిహ్నాలు చూపాడు. కాని స్వతంత్రుల సమాజమని పిలువబడే సమాజానికి చెందిన కొందరు యూదులు స్తెఫనుతో వాదన పెట్టుకొన్నారు. వీళ్ళలో కురేనీ, అలెక్సంద్రియ పట్టణాలకు చెందిన యూదులు, కిలికియ, ఆసియ ప్రాంతాలకు చెందిన యూదులు కూడా ఉన్నారు. 10 కాని మాట్లాడటానికి పవిత్రాత్మ అతనికి తెలివినిచ్చాడు. కనుక అతని మాటలకు వాళ్ళు ఎదురు చెప్పలేకపోయారు.

11 ఆ తర్వాత యూదులు కొందరిని పురికొలిపి, “ఈ స్తెఫను మోషేను, దేవుణ్ణి దూషిస్తూ మాట్లాడటం మేము విన్నాము” అని చెప్పమన్నారు. 12 అదే విధంగా ప్రజల్ని, పెద్దల్ని, పండితుల్నికూడా పురికొలిపి పంపారు. ఆ తదుపరి స్తెఫన్ను బంధించి మహాసభ ముందుకు తెచ్చారు.

13-14 తప్పుడు సాక్ష్యాలు తెచ్చి, “యితడు ఈ పవిత్ర స్థానాన్ని గురించి, ధర్మశాస్త్రాన్ని గురించి ఎదిరిస్తూ మాట్లాడటం మానుకోడు. ఎందుకంటే, నజరేతు నివాసి యేసు ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తాడని, మోషే మనకందించిన ఆచారాన్ని మారుస్తాడని చెప్పటం మేము విన్నాము” అని వాళ్ళతో చెప్పించారు. 15 సభలో కూర్చొన్నవాళ్ళంతా స్తెఫను వైపు శ్రద్ధగా చూసారు. వాళ్ళకు అతని ముఖం ఒక దేవదూత ముఖంలా కనిపించింది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International