Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన. అబీమెలెకు తనని పంపించి వేయాలని దావీదు వెర్రివానిలా నటించినప్పుడు అతడు దావీదును పంపించివేసినప్పటిది.
34 నేను యెహోవాను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.
ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా పెదాల మీద ఉంటుంది.
2 దీన జనులారా, విని సంతోషించండి.
నా ఆత్మ యెహోవాను గూర్చి ఘనంగా కీర్తిస్తుంది.
3 యెహోవా మహాత్మ్యం గూర్చి నాతో పాటు చెప్పండి.
మనం ఆయన నామాన్ని కీర్తిద్దాం.
4 సహాయం కోసం నేను దేవుణ్ణి ఆశ్రయించాను. ఆయన విన్నాడు.
నేను భయపడే వాటన్నింటి నుండి ఆయన నన్ను రక్షించాడు.
5 సహాయం కోసం దేవుని తట్టు చూడండి.
మీరు స్వీకరించబడుతారు. సిగ్గుపడవద్దు.
6 ఈ దీనుడు సహాయంకోసం యెహోవాను వేడుకొన్నాడు.
యెహోవా నా మొర విన్నాడు.
నా కష్టాలన్నింటినుండి ఆయన నన్ను రక్షించాడు.
7 యెహోవాను వెంబడించే ప్రజల చుట్టూ ఆయన దూత కావలి ఉంటాడు.
ఆ ప్రజలను యెహోవా దూత కాపాడి, వారికి బలాన్ని ఇస్తాడు.
8 యెహోవా ఎంత మంచివాడో రుచిచూచి తెలుసుకోండి.
యెహోవా మీద ఆధారపడే వ్యక్తి ధన్యుడు.
హూషై దావీదుకు హెచ్చరిక పంపటం
15 హూషై ఈ విషయాలన్నీ యాజకులైన సాదోకు మరియు అబ్యాతారుకు చెప్పాడు. అబ్షాలోముకు, ఇశ్రాయేలు నాయకులకు అహీతోపెలు యిచ్చిన సలహాను కూడ హూషై వారికి చెప్పాడు. అంతే గాకుండా తను ఏ సలహా ఇచ్చినది కూడా సాదోకు, అబ్యాతారులకు హూషై వివరించాడు. హూషై ఇలా అన్నాడు: 16 “త్వరగా దావీదుకు ఒక వర్తమానం పంపండి. ప్రజలు ఎక్కడెక్కడైతే ఎడారిలోకి ప్రవేశిస్తారో ఆయా ప్రాంతాలలో దావీదును ఈ రాత్రికి వుండవద్దని చెప్పండి. కాని యొర్దాను నదిని తక్షణమే దాటి వెళ్లమనండి. వారు నదిని గనుక దాటినట్లయితే రాజు, ఆయన అనుచరులు పట్టుబడరు.”
17 యాజకుల కుమారులైన యోనాతాను మరియు అహిమయస్సు కలిసి ఏన్ రోగేలు దగ్గర వేచివున్నారు. వాళ్లు నగరంలోకి వెళ్తున్నట్లు ఎవరూ చూడ కూడదనుకున్నారు. కావున ఒక పనిపిల్ల వారి వద్దకు వచ్చింది. ఆమె వారికి ఒక సమాచారం అందజేసింది. తరువాత యోనాతాను, అహీమయస్సులు ఇరువురూ రాజైన దావీదు వద్దకు వెళ్లి అన్ని విషయాలూ చెప్పారు.
18 అయినా ఒక బాలుడు యోనాతానును, అహిమయస్సును చూశాడు. వాడు అబ్షాలోముకు చెప్పటానికి పరుగున పోయాడు. ఇది గమనించిన యోనాతాను, అహిమయస్సు వెంటనే పారిపోయారు. వారు బహురీములో ఒకని ఇంటికి వెళ్లారు. ఆ ఇంటివాని ఆవరణలో[a] ఒక బావి వున్నది. యోనాతాను, అహిమయస్సు ఆ బావిలోకి దిగారు. 19 ఇంటివాని భార్య బావి మీద ఒక దుప్పటి కప్పి వేసింది. ఆమె మళ్లీ దాని మీద ధాన్యం పోసింది. అప్పుడా బావి ఒక ధాన్యపు రాశిలా కన్పించింది. అందువల్ల యోనాతాను, అహిమయస్సు అందులో దాగి వున్నారని ఎవరూ అనుకోరు. 20 అబ్షాలోము సైనికులు ఆ ఇంటి యజమానురాలి వద్దకు వచ్చి “అహిమయస్సు, యోనాతాను ఎక్కడ వున్నారు?” అని అడిగారు.
“వాళ్లు అప్పుడే వాగు దాటి పోయారని” ఆ స్త్రీ అబ్షాలోము మనుష్యులకు చెప్పింది.
అబ్షాలోము మనుష్యులు యోనాతాను, అహిమయస్సులను వెదుక్కుంటూపోయారు. కాని వారిద్దరినీ వారు కనుగొనలేదు. అందుచే అబ్షాలోము సైనికులు యెరూషలేముకు తిరిగి వెళ్లిపోయారు.
21 అబ్షాలోము మనుష్యులు వెళ్లిపోయిన తరువాత యోనాతాను, అహిమయస్సు బావిలో నుండి బయటికి వచ్చారు. జరిగినదంతా రాజైన దావీదుకు వారు చెప్పారు. వారు దావీదుతో, “త్వరపడండి. నదిని దాటి వెళ్లండి! మీకు వ్యతిరేకంగా అహీతోపెలు ఇవన్నీ చేస్తున్నాడు” అని అన్నారు.
22 దావీదు, అతని మనుష్యులు యొర్దాను నదిని దాటి వెళ్లారు. సూర్యోదయానికి ముందే దావీదు, అతని అనుచరులు యొర్దాను నదిని దాటారు.
అహీతోపెలు ఆత్మహత్య చేసుకోవటం
23 ఇశ్రాయేలీయులు తన సలహా పాటించలేదని అహీతోపెలు గమనించాడు. అహీతోపెలు తన గాడిదపై గంతవేసి దానిపై తన నగరానికి వెళ్లాడు. తన కుటుంబపోషణకు తగిన ఏర్పాట్లు చేసి అహీతోపెలు ఉరిపోసుకొని చనిపోయాడు. అహీతోపెలు చనిపోయినాక అతని శవాన్ని అతని తండ్రి సమాధిలో పాతిపెట్టారు.
అబ్షాలోము యొర్దాను నదిని దాటటం
24 దావీదు మహనయీముకు చేరాడు. అబ్షాలోము, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులు యొర్దాను నదిని దాటారు. 25 అబ్షాలోము తన సైన్యాధికారిగా అమాశాను నియమించాడు. అంటే యోవాబు స్థానాన్ని అమాశా ఆక్రమించాడు.[b] ఇత్రా అనేవాని కుమారుడు అమాశా. ఇత్రా ఇష్మాయేలీయుడు[c] అమాశా తల్లి పేరు అబీగయీలు. ఈమె సెరూయా[d] సోదరియగు నాహాషు కుమార్తె. (సెరూయా యోవాబు తల్లి) 26 అబ్షాలోము, ఇశ్రాయేలీయులు గిలాదు రాజ్యంలో గుడారాలు వేసుకున్నారు.
షోబీ, మాకీరు, బర్జిల్లయి
27 దావీదు మహనయీముకు చేరాడు. షోబీ, మాకీరు మరియు బర్జిల్లయి అక్కడ వున్నారు. (నాహాషు కుమారుడైన షోబీ అమ్మోనీయుల రాజధానియగు రబ్బాకు చెందినవాడు. అమ్మీయేలు కుమారుడైన మాకీరు లోదెబారుకు చెందినవాడు. బర్జిల్లయి అనువాడు గిలాదులోని రోగెలీము పట్టణవాసి) 28-29 “ఎడారిలోవున్న ప్రజలు అలసిపోయి ఆకలిదప్పులు గొనియున్నారు” అని వారు చెప్పినారు. అందువల్ల దావీదు, అతని మనుష్యులు తినటానికి వారు అనేక పదార్థాలు పట్టుకువచ్చారు. వారు పరుపులు, పాత్రలు, కుండలు తెచ్చారు. వారింకా గోధుమలు, యవలు, పిండి, వేపిన ధాన్యం, కాయగూరలు, ఎండబెట్టిన గింజలు, తేనె, వెన్న, గొర్రెలు, ఆవుపాల మీగడ మొదలైనవన్నీ తెచ్చారు.
అందరికీ మంచి చెయ్యండి
6 నా సోదరులారా! మీలో ఎవరైనా పాపం చేస్తే, మీలో ఆత్మీయంగా జీవిస్తున్నవాళ్ళు అతన్ని సరిదిద్దాలి. ఇది వినయంగా చెయ్యాలి. కాని మీరు స్వతహాగా ఆ పాపంలో చిక్కుకుపోకుండా జాగ్రత్త పడండి. 2 పరస్పరం కష్టాలు పంచుకోండి. అప్పుడే క్రీస్తు ఆజ్ఞను పాటించినవాళ్ళౌతారు. 3 తనలో ఏ గొప్పతనమూ లేనివాడు, తాను గొప్ప అని అనుకొంటే తనను తాను మోసం చేసుకొన్నవాడౌతాడు. 4 ప్రతి ఒక్కడూ తన నడవడికను స్వయంగా పరీక్షించుకోవాలి. అప్పుడు తాను మరొకరితో పోల్చుకోకుండా తన నడతను గురించి గర్వించవచ్చు. 5 ప్రతి ఒక్కడూ తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
మంచి చేయుట ఎన్నడూ మానవద్దు
6 దేవుణ్ణి గురించి బోధన పొందినవాడు, బోధించిన వానికి అన్ని విధాల సహాయం చెయ్యాలి.
7 మోసపోకండి, ప్రతి ఒక్కడూ తాను నాటిన చెట్టు ఫలాన్నే పొందుతాడు. ఈ విషయంలో దేవుణ్ణి మోసం చెయ్యలేము. 8 శారీరిక వాంఛలు అనే పొలంలో విత్తనం నాటితే మరణాన్ని ఫలంగా పొందుతాడు. పరిశుద్ధాత్మను మెప్పించే విధంగా నాటితే పరిశుద్ధాత్మ నుండి అనంతజీవితం అనే ఫలం పొందుతాడు. 9 కనుక మనం విశ్రాంతి తీసుకోకుండా మంచి చేద్దాం. మనము విడువకుండా మంచి చేస్తే సరియైన సమయానికి మంచి అనే పంట కోయగలుగుతాము. 10 మనకు మంచి చేసే అవకాశం ఉంది కనుక అందరికీ మంచి చేద్దాం. ముఖ్యంగా విశ్వాసులకు మంచి చేద్దాం.
© 1997 Bible League International