Revised Common Lectionary (Complementary)
2 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మళ్లీ ఫిర్యాదు చేయటం మొదలు పెట్టారు. ఆ ఎడారిలో వారు మోషే అహరోనులకు ఫిర్యాదు చేసారు. 3 “ఈజిప్టు దేశంలోనే యెహోవా మమ్మల్ని చంపేసి ఉంటే మాకు బాగుండేది. ఈజిప్టులో తినేందుకు మాకు సమృద్ధిగా ఉండేది. మాకు కావాల్సిన భోజనం అంతా మాకు ఉండేది. కానీ ఇప్పుడు నీవు మమ్మల్ని ఈ ఎడారిలోనికి తీసుకొచ్చావు. మేమంతా ఆకలితో ఇక్కడే చస్తాము” అంటూ ప్రజలు మోషే అహరోనులతో చెప్పారు.
4 అప్పుడు మోషేతో యెహోవా అన్నాడు, “ఆకాశం నుండి ఆహారం కురిపిస్తాను. ఈ ఆహారం మీరు తినేందుకే. ప్రతిరోజూ ప్రజలు బయటకు వెళ్లి ఆరోజు తాము తినేందుకు ఎంత భోజనం అవసరమో అంతే సమకూర్చు కోవాలి. నేను చెప్పినట్టు ప్రజలు చేస్తారో లేదో చూద్దామని నేను యిలా చేసాను.
9 ఆ తర్వాత మోషే అహరోనుతో, “నీవు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడు: ‘యెహోవా, మీ ఫిర్యాదులు విన్నాడు గనుక ఆయన ఎదుట సమావేశం అవ్వండి’ అని వారితో చెప్పు అన్నాడు.”
10 అహరోను ఇశ్రాయేలు ప్రజలందరితో మాట్లాడాడు. వాళ్లంతా ఒక్కచోట చేరారు. అహరోను మాట్లాడుతూ ఉండగా, ప్రజలంతా పక్కకు తిరిగి ఎడారిలోకి చూచారు. యెహోవా మహిమ ఒక మేఘంలా ప్రత్యక్షమవడం వారు చూశారు.
11 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: 12 “ఇశ్రాయేలు ప్రజల ఫిర్యాదులు నేను విన్నాను. కనుక నేను చెబుతున్న నా మాటలు వారికి చెప్పు. ‘రాత్రివేళ మాంసం మీరు తింటారు. ప్రతి ఉదయం మీకు కావాల్సినంత భోజనం మీరు తింటారు. అప్పుడు మీ యెహోవా దేవుణ్ణి నమ్ముకోవచ్చని మీరు తెలుసుకొంటారు.’”
13 ఆ రాత్రి వారి బస అంతటా పూరేళ్లు (పిట్టలు) వచ్చాయి. (మాంసం కోసం ప్రజలు ఈ పిట్టల్ని పట్టుకొన్నారు) ప్రతి ఉదయం బసకు దగ్గర్లో నేలమీద మంచు కురిసింది. 14 సూర్యోదయం కాగానే ఆ మంచు కరిగిపోయింది. అయితే మంచు పోగానే నేలమీద నూగుమంచు ఉండేది. 15 ఇశ్రాయేలు ప్రజలు అది చూసి “అది ఏమిటి?” అంటూ ఒకళ్లనొకళ్లు ప్రశ్నించుకొన్నారు. ఈ పదార్థం ఏమిటో వారికి అర్థం కాలేదు కనుక వాళ్లు ఈ ప్రశ్న అడిగారు. మోషే వాళ్లతో చెప్పాడు: “మీరు భోజనంచేయడానికి యెహోవా మీకు ఇచ్చిన భోజనం ఇది.
23-24 కాని అప్పుడు దేవుడు పైన మేఘాలను తెరిచాడు.
వారికి ఆహారంగా ఆయన మన్నాను కురిపించాడు.
అది ఆకాశపు ద్వారాలు తెరచినట్టు
ఆకాశంలోని ధాన్యాగారంనుండి ధాన్యం పోసినట్టు ఉంది.
25 ప్రజలు దేవదూతల ఆహారం తిన్నారు.
ఆ ప్రజలను తృప్తిపరచుటకు దేవుడు సమృద్ధిగా ఆహారం పంపించాడు.
26-27 అంతట దేవుడు తూర్పు నుండి ఒక బలమైన గాలి వీచేలా చేశాడు.
వర్షం కురిసినట్లుగా పూరేళ్లు[a] వారిమీద వచ్చి పడ్డాయి.
దేవుని మహా శక్తి తేమాను నుండి గాలి వీచేలా చేసింది.
ఆ పక్షులు చాలా విస్తారంగా ఉండినందుచేత నీలాకాశం నల్లగా మారిపోయింది.
28 ఆ ప్రజల గుడారాల చుట్టూరా, వారి ఇండ్ల మధ్యలో
ఆ పక్షులు వచ్చి పడ్డాయి.
29 తినేందుకు వారికి సమృద్ధిగా ఉంది.
కాని తమ ఆకలి తమని పాపం చేసేలా వారు చేసుకున్నారు.
క్రీస్తు దేహంలో ఐక్యత
4 ప్రభువు మిమ్మల్ని పిలిచిన పిలుపు సార్థకమయ్యేటట్లు జీవించమని ప్రభువు యొక్క ఖైదీనైన నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 2 అన్ని వేళలా విధేయతగా, శాంతంగా ఉండండి. వినయంతో, దయతో, సహనంతో జీవించండి. ఇతర్ల తప్పులను ప్రేమతో క్షమించండి. 3 శాంతి కలిగించిన బంధంతో పరిశుద్దాత్మ యిచ్చిన ఐక్యతను పొందటానికి అన్ని విధాలా ప్రయత్నం చెయ్యండి. 4 శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, నిరీక్షణ ఒక్కటే. 5 ఆ ఒకే నిరీక్షణ యందుండుటకే ఆయన మనలను పిలిచాడు. అదే విధముగా ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, దేవుడు ఒక్కడే. 6 ఆయనే అందరికి తండ్రి. అందరికి ప్రభువు. అందరిలో ఉన్నాడు. అందరి ద్వారా పని చేస్తున్నాడు.
7 క్రీస్తు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి కృప యివ్వబడింది. 8 అందువల్ల లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉంది:
“ఆయన పైకి వెళ్ళినప్పుడు బంధితుల్ని వరుసగా తనతో తీసుకు వెళ్ళాడు.
మానవులకు వరాలిచ్చాడు.”(A)
9 “ఆయన పైకి వెళ్ళాడు” అని అనటంలో అర్థమేమిటి? ఆయన క్రిందికి, అంటే భూమి క్రింది భాగాలకు దిగి నాడనే అర్థం కదా! 10 క్రిందికి దిగినవాడే ఆకాశములను దాటి పైకి వెళ్ళాడు. ఆ విధంగా పైకి వెళ్ళి సమస్తమును నింపి వేసాడు. 11 పవిత్రుల్ని సేవా కార్యాలకు సిద్ధం చేయాలనీ, దాని వల్ల క్రీస్తు శరీరం అభివృద్ధి చెందాలని ఆయన ఉద్దేశ్యం. 12 అప్పుడు మనము విశ్వాసంతో, దేవుని కుమారుణ్ణి గురించిన జ్ఞానంలో ఒకటిగా ఉంటాము. క్రీస్తులో ఉన్న పరిపూర్ణతను పొందేదాకా ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాము. 13 కొందరు అపొస్తలులు కావాలని, కొందరు ప్రవక్తలు కావాలని, కొందరు సువార్తికులు కావాలని, కొందరు సంఘ కాపరులు కావాలని, మరి కొందరు బోధకులు కావాలని ఆదేశించి వాళ్ళకు తగిన వరాలిచ్చాడు.
14 అప్పుడు మనము పసిపిల్లల వలె ఉండము. అలలకు ఇటు అటు కొట్టుకొనిపోము. గాలిలాంటి ప్రతి బోధనకు కదిలిపోము. కపటంతో, కుయుక్తితో పన్నిన మాయోపాయాలకు మోసపోకుండా ఉంటాము. 15 మనము ప్రేమతో నిజం చెబుతూ అన్ని విధాల అభివృద్ధి చెంది శిరస్సైన క్రీస్తును చేరుకోవాలి. 16 శరీరంలోని అన్ని భాగాలు ఆయన ఆధీనంలో ఉంటాయి. చక్కగా అమర్చబడిన ఆ భాగాలన్నీ కలిసి శరీరానికి ఆధారమిస్తాయి. ఇలా ప్రతీ భాగం తన పని చెయ్యటంవల్ల శరీరం ప్రేమతో పెరిగి అభివృద్ధి చెందుతుంది.
23-24 వాళ్ళు యేసు, ఆయన శిష్యులు అక్కడ లేరని గ్రహించిన వెంటనే, వెతకటానికి నిశ్చయించుకున్నారు. తిబెరియ నుండి కొన్ని పడవలు వచ్చి ఒడ్డు చేరాయి. ప్రభువు దేవునికి కృతజ్ఞత చెప్పి, రొట్టెల్ని ప్రజలకు పంచిన స్థలం దీని సమీపంలో ఉంది. వాళ్ళు ఆ పడవలెక్కి ఆయన్ని వెదుకుతూ కపెర్నహూము వెళ్ళారు.
యేసు మన జీవితానికి ఆహారం లాంటివాడు
25 యేసు అవతలి ఒడ్డున కనిపించగానే, వాళ్ళు ఆయనతో, “రబ్బీ! మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు?” అని అడిగారు.
26 యేసు, “ఇది నిజం. అద్భుతాల్ని చూసినందువలన నన్ను మీరు వెతకటం లేదు. రొట్టెలు తిని మీ కడుపులు నింపుకొన్నందుకు నా కోసం వెతుకుతున్నారు. 27 చెడిపోయే ఆహారం కోసం పాటు పడకండి. చిరకాలం ఉండే ఆహారం కోసం పాటు పడండి. దాన్ని మనుష్యకుమారుడు మీకిస్తాడు. ఆయన పై తండ్రి ఆయన దేవుడు తన అంగీకార ముద్రవేశాడు” అని చెప్పాడు.
28 వాళ్ళు ఆయన్ని, “దైవకార్యం చెయ్యాలంటే మేము ఏమి చెయ్యాలి?” అని అడిగారు.
29 యేసు, “ఆయన్నిపంపిన వాణ్ణి నమ్మటమే దైవకార్యం” అని సమాధానం చెప్పాడు.
30 కనుక వాళ్ళు ఆయనతో చెప్పారు, “అలాగైతే, మేము నమ్మేటట్లు ఏ అద్భుత కార్యాన్ని చేసి చూపిస్తారు? 31 మా ముత్తాతలు ఎడారుల్లో మన్నాను[a] తిన్నారు. దీన్ని గురించి గ్రంథాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది, ఆయన, వాళ్ళు తినటానికి పరలోకం నుండి ఆహారం యిచ్చాడు.”
32 యేసు జవాబు చెబుతూ, “ఇది నిజం. పరలోకం నుండి నిజమైన ఆహారం ఇచ్చింది మోషే కాదు. దాన్ని యిచ్చేవాడు నా తండ్రి. 33 ఆ జీవాహారం పరలోకం నుండి దిగి వచ్చిన క్రీస్తే. ఆయన లోకానికి జీవాన్నిస్తాడు” అని అన్నాడు.
34 వాళ్ళు, “అయ్యా! యికనుండి ఈ ఆహారం మాకివ్వండి!” అని అన్నారు.
35 యేసు ఈ విధంగా చెప్పాడు: “నేను జీవాన్నిచ్చే ఆహారాన్ని, నా దగ్గరకు వచ్చినవాడు ఆకలితో పోడు. నన్ను నమ్మినవానికి ఎన్నడూ దాహం కలుగదు.
© 1997 Bible League International