Revised Common Lectionary (Complementary)
ప్రవక్తల బృందానికి ఎలీషా ఆహారమిచ్చుట
42 బయల్షాలిషా నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. అతడు మొదటి పంటవల్ల లభించిన ఇరవై యవల రొట్టెలు, క్రొత్త ధాన్యపు కంకులను, కొన్ని పండ్లను దైవజనునికి ఇచ్చాడు. ఎలీషా అప్పుడు, “వీటిని వారికి ఆహారంగా ఇవ్వండి” అన్నాడు.
43 ఎలీషా సేవకుడు, “ఏమిటి? ఇక్కడ వంద మంది ఉన్నారు. నేను వారందరికీ ఈ ఆహారం ఎలా ఇవ్వగలను?” అని అన్నాడు.
కాని ఎలీషా, “వారు తినడానికిగాను అది ఇమ్ము. వారది భుజిస్తారు. ఇంకా కొంచెం ఆహారం మిగులు తుంది అని యెహోవా చెప్పాడు” అన్నాడు.
44 అప్పుడు ఎలీషా సేవకుడు ఆ ఆహారమును ప్రవక్తల ముందుంచాడు. ప్రవక్తల బృందం తినడానికి తగినంత ఆహారం ఉండి, పైగా ఇంకా ఆహారం మిగిలి పోయింది. యెహోవా చెప్పినట్లుగానే ఇది జరిగింది.
10 యెహోవా, నీవు చేసే పనులు నీకు స్తుతి కలిగిస్తాయి.
నీ అనుచరులు నిన్ను స్తుతిస్తారు.
11 ఆ ప్రజలు నీ మహిమ రాజ్యం గూర్చి చెప్పుకొంటారు.
నీవు ఎంత గొప్పవాడవో ఆ ప్రజలు చెప్పుకొంటారు.
12 కనుక యెహోవా, నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ఇతర జనులు ఈ రీతిగా నేర్చుకొంటారు.
మహా ఘనమైన నీ మహిమ రాజ్యం గూర్చి ప్రజలు చెప్పుకొంటారు.
13 యెహోవా, నీ రాజ్యం శాశ్వతంగా ఉంటుంది.
నీవు శాశ్వతంగా పాలిస్తావు.
14 పడిపోయిన మనుష్యులను యెహోవా లేవనెత్తుతాడు.
కష్టంలో ఉన్న మనుష్యులకు యెహోవా సహాయం చేస్తాడు.
15 యెహోవా, జీవిస్తున్న సకల ప్రాణులూ వాటి ఆహారం కోసం నీవైపు చూస్తాయి.
సకాలంలో నీవు వాటికి ఆహారం యిస్తావు.
16 యెహోవా, నీవు నీ గుప్పిలి విప్పి,
జీవిస్తున్న సకల ప్రాణులకు కావాల్సినవన్నీ యిస్తావు.
17 యెహోవా చేసే ప్రతీదీ మంచిది.
యెహోవా చేసే ప్రతి దానిలోనూ ఆయన తన నిజప్రేమను చూపిస్తాడు.
18 యెహోవా సహాయం కోసం తనను పిలిచే ప్రతి యొక్కనికీ సమీపంగా ఉన్నాడు.
యెహోవాను యదార్థంగా ఆరాధించే ప్రతి వ్యక్తికీ ఆయన సమీపంగా ఉన్నాడు.
ఎఫెసీయుల కోసం ప్రార్థన
14 ఈ కారణాన నేను తండ్రి ముందు మోకరిల్లుచున్నాను. 15 కనుక భూలోకంలో, పరలోకంలో ఉన్న విశ్వాసులందరు ఆయన పేరులో ఒకే కుటుంబముగా జీవిస్తున్నారు. 16 ఆయన తన అనంతమైన మహిమతో పరిశుద్ధాత్మ ద్వారా శక్తినిచ్చి ఆత్మీయంగా బలపరచాలని వేడుకొంటున్నాను. 17 అప్పుడు క్రీస్తు మీలో విశ్వాసం ఉండటం వల్ల మీ హృదయాల్లో నివసిస్తాడు. మీ వేర్లు ప్రేమలో నాటుక పోయేటట్లు చేయమనీ, మీ పునాదులు ప్రేమలో ఉండేటట్లు చేయమనీ ప్రార్థిస్తున్నాను. 18 అప్పుడు మీరు పవిత్రులతో సహా క్రీస్తు ప్రేమ ఎంత అనంతమైనదో, ఎంత లోతైనదో అర్థం చేసుకోకలుగుతారు. 19 జ్ఞానాన్ని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలని దేవునిలో ఉన్న పరిపూర్ణత మీలో కలగాలని నా ప్రార్థన.
20 దేవుడు మనమడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఎక్కువే యివ్వగలడు. ఇది మనలో పని చేస్తున్న ఆయన శక్తి ద్వారా సంభవిస్తోంది. 21 సంఘంలో యేసు క్రీస్తు ద్వారా దేవునికి చిరకాలం శాశ్వతమైన మహిమ కలుగుగాక! ఆమేన్.
యేసు ఐదువేల మందికి పైగా భోజనం పెట్టటం
(మత్తయి 14:13-21; మార్కు 6:30-44; లూకా 9:10-17)
6 ఇది జరిగిన కొద్ది రోజులకు, యేసు గలిలయ సముద్రం (తిబెరియ సముద్రం) దాటి వెళ్ళాడు. 2 ఆయన అద్భుతమైన మహిమలతో రోగులకు బాగుచెయ్యటం చూసి, పెద్ద ప్రజల గుంపు ఒకటి ఆయన్ని అనుసరిస్తూవచ్చింది. 3 యేసు తన శిష్యులతో కలిసి కొండ మీదికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. 4 అవి పస్కా పండుగకు ముందు రోజులు. పస్కా యూదల పండుగ.
5 యేసు తలెత్తి పెద్ద ప్రజలగుంపు తన వైపు రావటం చూసి, ఫిలిప్పుతో, “వీళ్ళు తినటానికి ఆహారం ఎక్కడ కొందాం?” అని అడిగాడు. 6 అతణ్ణి పరీక్షించటానికి మాత్రమే ఈ ప్రశ్న అడిగాడు. యేసు తాను ఏమి చెయ్యాలో ముందే ఆలోచించుకొన్నాడు.
7 ప్రతి ఒక్కనికి ఒక్కొక్క ముక్క దొరకాలన్నా, రెండువందల దేనారాలు ఖర్చు చేయవలసి వస్తుంది. అయినా అది చాలదు.
8 యేసు శిష్యుల్లో ఒకడైన అంద్రెయ అక్కడున్నాడు. యితడు సీమోను పేతురు సోదరుడు. 9 “ఇక్కడ ఒక బాలుని దగ్గర యవలతో చేసిన ఐదు రొట్టెలు, రెండు కాల్చిన చేపలు ఉన్నాయి. కాని యింతమందికి అవి ఎట్లా సరిపోతాయి?” అని అన్నాడు.
10 యేసు, “ప్రజల్ని కూర్చోపెట్టండి!” అని అన్నాడు. అక్కడ చక్కటి పచ్చిక బయళ్ళు ఉన్నాయి. ప్రజలందరూ కూర్చున్నారు. అక్కడున్న పురుషుల సంఖ్య ఐదువేలు. 11 యేసు ఆ రొట్టెల్ని తీసుకొని, దేవునికి కృతజ్ఞత చెప్పి, అక్కడ కూర్చున్నవాళ్ళకు పంచిపెట్టాడు. అదే విధంగా చేపల్ని కూడా పంచి పెట్టాడు. అందరూ కావలసినంత తిన్నారు.
12 వాళ్ళు తృప్తిగాతిన్నాక, తన శిష్యులతో, “ఏదీ వృధా కాకుండా వాళ్ళు తినగా మిగిలిన ముక్కల్ని ఎత్తి పెట్టండి!” అని అన్నాడు. 13 ఐదు బార్లీ రొట్టెల్ని పంచగా మిగిలిన ముక్కల్ని శిష్యులు పండ్రెండు గంపలనిండా నింపారు.
14 ప్రజలు యేసు చేసిన ఆ మహాకార్యాన్ని చూసి, “లోకానికి రానున్న ప్రవక్త ఈయనే!” అని అనటం మొదలు పెట్టారు.
15 యేసు వాళ్ళు తనను బలవంతంగా రాజును చెయ్యాలనుకుంటున్నారని గ్రహించాడు. కనుక ఆయన ఏకాంతంగా కొండకు వెళ్ళిపోయ్యాడు.
యేసు నీళ్ళపై నడవటం
(మత్తయి 14:22-27; మార్కు 6:45-52)
16 సాయంకాలమైంది. ఆయన శిష్యులు సముద్రం దగ్గరకు వెళ్ళారు. 17 వాళ్ళు ఒక పడవనెక్కి సముద్రంకు అవతలి వైపుననున్న కపెర్నహూము అనే పట్టణం వైపు వెళ్ళసాగారు. అప్పటికే చీకటి పడింది. యేసు వాళ్ళనింకా కలుసుకోలేదు. 18 గాలి తీవ్రంగా వీయటంవల్ల అలలు అధికమయ్యాయి. 19 మూడు నాలుగుమైళ్ళ దూరందాకా తెడ్లు వేసాక, యేసు నీళ్ళ పై నడుస్తూ పడవ దగ్గరకు రావటం వాళ్ళు చూసారు. వాళ్ళకు బాగా భయం వేసింది. 20 కాని, యేసు వాళ్ళతో, “నేనే! భయపడకండి!” అని అన్నాడు. 21 ఈ మాట అన్న తర్వాత ఆయన పడవలోకి రావటానికి వాళ్ళు అంగీకరించారు. ఆ తదుపరి వాళ్ళు, తాము వెళ్ళదలచిన తీరాన్ని త్వరలోనే చేరుకున్నారు.
© 1997 Bible League International