Revised Common Lectionary (Complementary)
10 యెహోవా, నీవు చేసే పనులు నీకు స్తుతి కలిగిస్తాయి.
నీ అనుచరులు నిన్ను స్తుతిస్తారు.
11 ఆ ప్రజలు నీ మహిమ రాజ్యం గూర్చి చెప్పుకొంటారు.
నీవు ఎంత గొప్పవాడవో ఆ ప్రజలు చెప్పుకొంటారు.
12 కనుక యెహోవా, నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ఇతర జనులు ఈ రీతిగా నేర్చుకొంటారు.
మహా ఘనమైన నీ మహిమ రాజ్యం గూర్చి ప్రజలు చెప్పుకొంటారు.
13 యెహోవా, నీ రాజ్యం శాశ్వతంగా ఉంటుంది.
నీవు శాశ్వతంగా పాలిస్తావు.
14 పడిపోయిన మనుష్యులను యెహోవా లేవనెత్తుతాడు.
కష్టంలో ఉన్న మనుష్యులకు యెహోవా సహాయం చేస్తాడు.
15 యెహోవా, జీవిస్తున్న సకల ప్రాణులూ వాటి ఆహారం కోసం నీవైపు చూస్తాయి.
సకాలంలో నీవు వాటికి ఆహారం యిస్తావు.
16 యెహోవా, నీవు నీ గుప్పిలి విప్పి,
జీవిస్తున్న సకల ప్రాణులకు కావాల్సినవన్నీ యిస్తావు.
17 యెహోవా చేసే ప్రతీదీ మంచిది.
యెహోవా చేసే ప్రతి దానిలోనూ ఆయన తన నిజప్రేమను చూపిస్తాడు.
18 యెహోవా సహాయం కోసం తనను పిలిచే ప్రతి యొక్కనికీ సమీపంగా ఉన్నాడు.
యెహోవాను యదార్థంగా ఆరాధించే ప్రతి వ్యక్తికీ ఆయన సమీపంగా ఉన్నాడు.
ఎలీషా మరియు విషం కలిసిన కూర
38 ఎలీషా మరల గిల్గాలుకు వెళ్లాడు. అప్పుడా ప్రదేశంలో ఆకలి ఎక్కువగా వుంది. ప్రవక్తల బృందం ఎలీషా ముందు కూర్చున్నారు. ఎలీషా తన సేవకునితో, “పెద్ద కుండను నిప్పుమీద ఉంచుము. ప్రవక్తల బృందానికి కూర తయారు చేయి” అని చెప్పాడు.
39 ఒక వ్యక్తి మూలికలు తీసుకు వచ్చేందుకు పొలం వెళ్లాడు. అతను పిచ్చి ద్రాక్ష చూసి దాని కాయలు తీసుకు వచ్చాడు. ఆ కాయలు తన ఒడిలో కట్టుకుని తీసుకుని వచ్చాడు. అతను ఆ కాయలను ముక్కలు చేసి కుండలో వేశాడు. కాని అది ఏరకపు ఫలమో ప్రవక్తల బృందానికి తెలియదు.
40 తర్వాత వారు మనష్యులకు కొంచెం కూర తినడానికి వడ్డించారు. కాని వారు కూర తినడానికి ప్రారంభించగా, ఎలీషాని పిలిచి, “దైవజనుడా! కుండలో విషం ఉన్నది” అని అన్నారు. ఆ కూర విషంలా వుంది. అందువల్ల అది వారు తినలేకపోయారు.
41 అప్పుడు ఎలీషా, “కొంచెం పిండి తీసుకురండి” అన్నాడు. వారు పిండిని ఎలీషా వద్దకు తీసుకు వచ్చారు. దాన్ని అతను కుండలో వేసి. “మనుష్యులకు ఆ కూర వడ్డించండి. వారు భుజిస్తారు” అని ఎలీషా చెప్పాడు.
ఆ కూరలో ఎలాంటి దోషం లేదు.
31 ఇంతలో ఆయన శిష్యులు, “రబ్బీ! భోజనం చెయ్యండి” అని వేడుకున్నారు.
32 కాని ఆయన వాళ్ళతో, “నా దగ్గర తినటానికి ఆహారం ఉంది. కాని ఆ ఆహారాన్ని గురించి మీకేమీ తెలియదు” అని అన్నాడు.
33 ఆయన శిష్యులు, “ఆయన కోసం ఎవరో భోజనం తెచ్చివుంటారు!” అని పరస్పరం మాట్లాడుకున్నారు.
34 యేసు, “నన్ను పంపిన వాని కోరిక తీర్చటం, ఆయన కార్యాన్ని పూర్తి చేయటమే, నా భోజనం. 35 ‘విత్తిన తర్వాత నాలుగు నెలల్లో పంట వస్తుంది!’ అని మీరంటున్నారు. కాని నేను చెప్పేదేమిటంటే కళ్ళు తెరచి పొలాల వైపు చూడండి. పంట కోయటానికి సిద్ధంగా ఉంది. 36 దాన్ని విత్తినవాడు, కోసేవాడు ఫలం పొందుతున్నారు. అనంత జీవితం కోసం, అతడు ఆ పంటను కోస్తున్నాడు. తద్వారా విత్తనం నాటినవాడు, పంట కోసే వాడు, యిద్దరూ ఆనందిస్తారు. 37 ‘విత్తనం ఒకడు నాటితె ఫలం ఇంకొకడు పొందుతాడు’ అన్న సామెత ఈ సందర్భంలో వర్తిస్తుంది. 38 మీరు కష్టపడి పని చెయ్యని పంట కోయటానికి మిమ్మల్ని పంపాను, దాని కోసం యితర్లు చాలా కష్టించి పని చేసారు. వాళ్ళ కష్టానికి మీరు ఫలం పొందుతున్నారు” అని చెప్పాడు.
© 1997 Bible League International