Revised Common Lectionary (Complementary)
కృతజ్ఞత కీర్తన.
100 భూమీ, యెహోవాను గూర్చి పాడుము!
2 నీవు యెహోవాను సేవిస్తూ సంతోషంగా ఉండు!
ఆనంద గీతాలతో యెహోవా ఎదుటికి రమ్ము.
3 యెహోవా దేవుడని తెలుసుకొనుము.
ఆయనే మనలను సృజించాడు.
మనం ఆయన ప్రజలము. మనము ఆయన గొర్రెలము.
4 కృతజ్ఞతా కీర్తనలతో యెహోవా పట్టణంలోనికి రండి.
స్తుతి కీర్తనలతో ఆయన ఆలయంలోనికి రండి.
ఆయనను గౌరవించండి. ఆయన నామాన్ని స్తుతించండి.
5 యెహోవా మంచివాడు.
ఆయన ప్రేమ నిరంతరం ఉంటుంది.
ఆయన్ని శాశ్వతంగా నమ్ము కోవచ్చు.
ఇశ్రాయేలీయులు దావీదును రాజు చేయటం
5 అప్పుడు ఇశ్రాయేలు వంశాల వారందరూ హెబ్రోనులో దావీదు వద్దకు వచ్చి ఇలా అన్నారు: “చూడండి; మనమంతా ఒకే కుటుంబం![a] 2 గతంలో సౌలు రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల యుద్ధాలలో నీవు మమ్ములను నడిపించావు. మరియు ఇశ్రాయేలును యుద్ధము నుంచి ఇంటికి తిరిగి రప్పించావు. ‘ఇశ్రాయేలీయులైన నా ప్రజలకు నీవు కాపరివవుతావు. ఇశ్రాయేలుకు పాలకుడవవుతావు’ అని యెహోవా నీకు చెప్పాడు.”
3 ఇశ్రాయేలు నాయకులంతా హెబ్రోనులో ఉన్న దావీదు రాజు వద్దకు వచ్చారు. దావీదు రాజు హెబ్రోనులో ఆ వచ్చిన నాయకులతో యెహోవా సమక్షంలో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. అప్పుడా నాయకులంతా దావీదును ఇశ్రాయేలు రాజుగా అభిషేకించారు.
4 పరిపాలన చేపట్టే నాటికి దావీదు ముప్పది సంవత్సరాల వాడు. అతడు నలుబది సంవత్సరాలు పాలించాడు. 5 హెబ్రోనులో వుండి యూదా రాజ్యాన్ని ఏడు సంవత్సరాల, ఆరు నెలలు పాలించాడు. పిమ్మట యెరూషలేము నుంచి ఇశ్రాయేలు, యూదా రాజ్యాలను ముప్పదిమూడు సంవత్సరాలు పాలించాడు.
దావీదు యెరూషలేమును జయించుట
6 రాజు తన మనుష్యులతో యెబూసీయుల మీదికి దండెత్తి యెరూషలేముకు పోయెను. (యెబూసీయులుదేశంలో నివాసం ఏర్పరచుకొని స్థిరపడిపోయారు). యెబూసీయులు దావీదుతో, “నీవు మా నగరంలోకి రాలేవు.[b] ఒకవేళ వస్తే, కుంటి, గుడ్డివారు సహితం నిన్ను విరోధిస్తారు”[c] అని అన్నారు. 7 కాని దావీదు సీయోను కోటను[d] వశపర్చుకున్నాడు. తరువాత దానినే దావీదు నగరం అని పిలవటం మొదలు పెట్టారు.
8 ఆ రోజు దావీదు తన మనుష్యులతో, “మీరు యెబూసీయులను ఓడించాలంటే నీటి సొరంగం[e] ద్వారా ఆ ‘కుంటి మరియు గ్రుడ్డి’ శత్రువుల వద్దకు వెళ్లండి” అని అన్నాడు. అందువల్లనే, “కుంటి, గ్రుడ్డివారు ఇంట్లోకి[f] రాలేరని” అంటారు.
9 దావీదు కోటలో నివసించి, దానిని “దావీదు నగరం” అని పిలిచాడు. మిల్లో[g] నుండి చుట్టు పక్కల అనేక భవనాలను దావీదు కట్టించాడు. సీయోను నగరంలో కూడా అనేక కట్టడాలను చేపట్టి లోపల బాగా అభివృద్ధి చేశాడు. 10 సర్వశక్తిమంతుడైన దేవుడు అతనికి తోడైయున్నందున, దావీదు క్రమంగా బలపడి వర్థిల్లాడు.
11 తూరు రాజైన హీరాము కొందరు దూతలను దావీదు వద్దకు పంపాడు. వారితో పాటు దేవదారు కలపను, వడ్రంగులను, శిల్పులను పంపాడు. వారంతా దావీదుకు ఒక భవనం నిర్మించారు. 12 నిజంగా యెహోవా తనను ఇశ్రాయేలుకు రాజును చేసినట్లు దావీదుకు ఆ సమయంలో అర్థమయ్యింది. యెహోవా ప్రజలైన ఇశ్రాయేలీయులకు తన రాజ్యాన్ని చాలా ముఖ్యమైనదిగా దేవుడు చేసినాడని దావీదు తెలుసుకొన్నాడు.
తప్పిపోయిన గొఱ్ఱె ఉపమానం
(మత్తయి 18:12-14)
15 ఒక రోజు పన్నులు వసూలు చేసే వాళ్ళు, పాపులు ఆయన చెప్పినవి వినటానికాయన చుట్టూ సమావేశమయ్యారు. 2 కాని పరిసయ్యులు, శాస్త్రులు, “ఇతడు పాపుల్ని పిలిచి వాళ్ళతో కలిసి తింటాడు” అని గొణిగారు.
3 అప్పుడు యేసు వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: 4 “మీలో ఒకని దగ్గర వంద గొఱ్ఱెలు ఉన్నాయనుకోండి. అందులో ఒక గొఱ్ఱె తప్పిపోతే అతడు తన తొంబది తొమ్మిది గొఱ్ఱెల్ని అక్కడ బయల్లో వదిలేసి ఆ తప్పిపోయిన గొఱ్ఱె దొరికేదాకా వెతకడా? 5 అది దొరికిన వెంటనే దాన్ని భుజాలపై మోసికొని ఆనందంతో 6 యింటికి వెళ్ళి తన స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచి, ‘తప్పిపోయిన నా గొఱ్ఱె దొరికింది. మనమంతా ఆనందించుదాం’ అని అంటాడు. 7 నేను చెప్పేదేమిటంటే అదేవిధంగా మారుమనస్సు పొందనవసరం లేని తొంభైతొమ్మిది మంది నీతిమంతుల విషయంలో కలిగె ఆనందంకన్నా పాపం చేసిన ఒక్కడు మారుమనస్సు పొందితే పరలోకంలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఆనందిస్తారు.
© 1997 Bible League International