Revised Common Lectionary (Complementary)
కృతజ్ఞత కీర్తన.
100 భూమీ, యెహోవాను గూర్చి పాడుము!
2 నీవు యెహోవాను సేవిస్తూ సంతోషంగా ఉండు!
ఆనంద గీతాలతో యెహోవా ఎదుటికి రమ్ము.
3 యెహోవా దేవుడని తెలుసుకొనుము.
ఆయనే మనలను సృజించాడు.
మనం ఆయన ప్రజలము. మనము ఆయన గొర్రెలము.
4 కృతజ్ఞతా కీర్తనలతో యెహోవా పట్టణంలోనికి రండి.
స్తుతి కీర్తనలతో ఆయన ఆలయంలోనికి రండి.
ఆయనను గౌరవించండి. ఆయన నామాన్ని స్తుతించండి.
5 యెహోవా మంచివాడు.
ఆయన ప్రేమ నిరంతరం ఉంటుంది.
ఆయన్ని శాశ్వతంగా నమ్ము కోవచ్చు.
బబులోనుకు సంబంధించిన సందేశం
50 బబులోను దేశానికి, కల్దీయులను ఉద్దేశించి యెహోవా ఈ సందేశాన్ని ఇచ్చాడు. యెహోవా ఈ వర్తమానాన్ని యిర్మీయా ద్వారా చెప్పాడు.
2 “అన్ని దేశాల వారికి ఈ వర్తమానం ప్రకటించండి!
జెండా ఎగురవేసి ఈ సందేశం ప్రకటించండి!
పూర్తి సమాచారాన్ని ప్రకటిస్తూ ఇలా చెప్పండి,
‘బబులోను రాజ్యం వశపర్చుకోబడుతుంది.
బేలు[a] దైవం అవమానపర్చబడుతుంది.
మర్దూక్ మిక్కిలి భీతిల్లుతుంది.
బబులోను విగ్రహాలు అవమానపర్చబడతాయి.
దాని విగ్రహ దేవతలు భయంతో నిండిపోతాయి.’
3 ఉత్తర దేశమొకటి బబులోనును ఎదుర్కొంటుంది.
ఆ దేశం బబులోనును వట్టి ఎడారివలె మార్చివేస్తుంది.
ప్రజలెవ్వరూ అక్కడ నివసించరు.
మనుష్యులు, జంతువులు అంతా అక్కడ నుండి పారిపోతారు”
4 యెహోవా ఇలా చెపుతున్నాడు, “ఆ సమయంలో
ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు కలిసి ఒక్కరీతిగా రోదిస్తారు.
వారంతా కలిసి వారి దేవుడైన
యెహోవాను వెతుక్కుంటూ వెళతారు.
5 ఆ ప్రజలు సియోనుకు ఎలా వెళ్లాలి అని దారి అడుగుతారు.
వారు ఆ దిశగా వెళ్లటానికి బయలు దేరుతారు.
ప్రజలు యిలా అంటారు. ‘రండి, మనల్ని మనము యెహోవాకు కలుపుకొందాం.
శాశ్వతమైన ఒక నిబంధన చేసికొందాము.
మన మెన్నటికీ మరువలేని ఒక నిబంధన చేసికొందాం.’
6 “నా ప్రజలు తప్పిపోయిన గొర్రెలవలె ఉన్నారు.
వారి కాపరులు (నాయకులు) వారిని తప్పుదారి పట్టించారు.
వారి నాయకులు వారిని కొండల్లో, కోనల్లో తిరిగేలా చేశారు.
వారి విశ్రాంతి స్థలమెక్కడో వారు మర్చిపోయారు.
7 నా ప్రజలను చూచిన వారంతా వారిని గాయపర్చారు.
పైగా వారి శత్రువులు, ‘మేము ఏ నేరమూ చేయలేదన్నారు.’
ఆ ప్రజలు యెహోవా పట్ల పాపం చేశారు. యెహోవాయే వారి అసలైన విశ్రాంతి స్థలం.
వారి తండ్రులు నమ్మిన యెహోవాయే వారి దేవుడు.
17 మీ నాయకుల పట్ల విధేయతగా ఉంటూ, వాళ్ళు చెప్పినట్లు చెయ్యండి. మీ ఆత్మల్ని కాపాడవలసిన పని వాళ్ళది. వాళ్ళు దేవుని ముందు లెక్క చెప్పవలసివుంటుంది. వాళ్ళకు మీరు విధేయులైవుంటే, వాళ్ళు తాము చేయవలసిన పనిని ఆనందంగా చేయగలుగుతారు. అది వాళ్ళకు భారంగా వుండదు. వాళ్ళకు భారం కలగటం మీకు మంచిది కాదు.
18 మా కోసం ప్రార్థించండి. మా అంతరాత్మలు నిర్మలమైనవనే విశ్వాసం మాకు ఉంది. మేము అన్ని విధాలా గౌరవప్రదంగా జీవించాలనుకొంటున్నాము. 19 నేను ముఖ్యంగా వేడుకునేదేమిటంటే, నేను త్వరలోనే మిమ్మల్ని కలుసుకోవాలని దేవుణ్ణి ప్రార్థించండి.
20 శాంతిని స్థాపించే దేవుడు, గొఱ్ఱెల గొప్ప కాపరి అయిన మన యేసు ప్రభువును తిరిగి బ్రతికించాడు. ఈ కార్యాన్ని దేవుడు శాశ్వతమైన ఒడంబడిక రక్తం ద్వారా జరిగించాడు. 21 ఆ దేవుడు మీరు ఆయన యిష్టానుసారం నడుచుకునేటట్లు మీకు కావలసినవి సమకూర్చు గాక! ఆయన మనలో ఉండి, యేసు క్రీస్తు ద్వారా తన యిష్టాన్ని నెరవేర్చుగాక! ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక! ఆమేన్.
22 సోదరులారా! నేనీ లేఖను క్లుప్తంగా వ్రాసాను. ప్రోత్సాహం కలుగ చేసే ఈ సందేశాన్ని సహృదయంతో చదవమని వేడుకుంటున్నాను. 23 మన సోదరుడైన తిమోతిని విడుదల చేసినట్లు మీకు తెలియజేస్తున్నాను. అతడు నా వద్దకు త్వరలో వస్తే అతనితో కలిసి మిమ్మల్ని చూడటానికి వస్తాను.
24 మీలోవున్న పెద్దలకు, దేవుని ప్రజలకు వందనాలు తెలుపండి. ఇటలీ దేశానికి చెందిన విశ్వాసులు మీకు వందనాలు తెలుపుతున్నారు.
25 మీ అందరికి దేవుని ప్రేమానుగ్రహము తోడుగా వుండునుగాక!
© 1997 Bible League International