Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
23 యెహోవా నా కాపరి
నాకు కొరత ఉండదు
2 పచ్చటి పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పడుకో పెడతాడు.
ప్రశాంతమైన నీళ్లవద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు.
3 ఆయన తన నామ ఘనత కోసం నా ఆత్మకు నూతన బలం ప్రసాదిస్తాడు.
ఆయన నిజంగా మంచివాడని చూపించేందుకు ఆయన నన్ను మంచితనపు మార్గాల్లో నడిపిస్తాడు.
4 చివరికి మరణాంధకారపు లోయలో నడిచినప్పుడు కూడా
నేను భయపడను. ఎందుకంటే, యెహోవా, నీవు నాతో ఉన్నావు.
నీ చేతికర్ర, నీ దండం నన్ను ఆదరిస్తాయి కనుక.
5 యెహోవా, నా శత్రువుల ఎదుటనే నీవు నాకు భోజనం సిద్ధం చేశావు.
నూనెతో నా తలను నీవు అభిషేకిస్తావు.
నా పాత్ర నిండి, పొర్లిపోతుంది.
6 నా మిగిలిన జీవితం అంతా మేలు, కరుణ నాతో ఉంటాయి.
మరియు నేను ఎల్లకాలం యెహోవా ఆలయంలో నివసిస్తాను.
దేవుడు మరియు విగ్రహాలు
10 ఇశ్రాయేలు వంశీయులారా యెహోవా చెప్పే మాట వినుము! 2 యెహోవా ఇలా చెప్పుచున్నాడు:
“అన్యదేశ ప్రజలవలె నీవు జీవించవద్దు!
ఆకాశంలో వచ్చే ప్రత్యేక సంకేతాలకు[a] నీవు భయపడవద్దు!
అన్యదేశాలవారు ఆకాశంలో తాము చూచే కొన్ని సంకేతాలకు భయపడతారు.
కాని మీరు మాత్రం అలాంటి వాటికి భయపడరాదు.
3 ఇతర దేశ ప్రజల ఆచారాలు లెక్క చేయవలసినవికావు.
వారి విగ్రహాలు అడవిలో దొరికే కర్రముక్కల కంటే వేరేమీ కాదు.
వారి విగ్రహాలను ఒక పనివాడు తన ఉలితో చెక్కి మలుస్తాడు.
4 వెండి బంగారాలతో వారి విగ్రహాలను అందంగా తీర్చిదిద్దుతారు.
వాటిని పడిపోకుండా సుత్తులతో
మేకులు కొట్టి నిలబెడతారు.
5 బీర తోటలోని దిష్టి బొమ్మల్లా వారి విగ్రహాలుంటాయి.
వారి విగ్రహాలు మాట్లాడవు.
వారి విగ్రహాలు నడవలేవు.
ఆ విగ్రహాలను మనుష్యులు మోయాలి!
కావున ఆ విగ్రహాలకు భయపడకు.
అవి నిన్ను ఏమీ చేయలేవు.
పైగా అవి నీకసలు ఏ రకమైన సహాయమూ చేయలేవు!”
6 యెహోవా, నీవంటి దైవం మరొకరు లేరు!
నీవు గొప్పవాడవు!
నీ నామము గొప్పది మరియు శక్తి గలది.
7 ఓ దేవా, ప్రతివాడూ నిన్ను గౌరవించాలి. సర్వదేశాలకూ నీవు రాజువు.
వారందరి గౌరవానికి నీవు అర్హుడవు.
ప్రపంచ దేశాలలో చాలామంది జ్ఞానులున్నారు.
కాని వారిలో ఏ ఒక్కడు నీకు సాటిరాడు.
8 అన్యదేశవాసులు మందబుద్ధులు, మూర్ఖులు.
వారి బోధనలన్నీ పనికిరాని చెక్క బొమ్మల పేరుతో వచ్చినవి.
9 వారు తర్షీషు నగరంనుండి వెండిని,
ఉపాజు నగరం నుండి బంగారాన్ని తెచ్చి విగ్రహాలను చేస్తారు.
విగ్రహాలు వడ్రంగులచే, లోహపు పని వారిచే చేయబడతాయి.
ఈ విగ్రహాలను నీలి రంగు, ఊదారంగు బట్టలతో అలంకరిస్తారు.
“జ్ఞానులు” ఆ “దేవుళ్ల” ని చేస్తారు.
10 కాని యెహోవా నిజమైన దేవుడు.
ఆయన మాత్రమే నిజంగా జీవిస్తున్న దేవుడు!
శాశ్వతంగా పాలించే రాజు ఆయనే.
దేవునికి కోపం వచ్చినప్పుడు భూమి కంపిస్తుంది.
ప్రపంచ రాజ్యాల ప్రజలు ఆయన కోపాన్ని భరించలేరు.
11-12 “ఈ వర్తమానం ఆ ప్రజలకు తెలియజేయుము,
‘ఆ బూటకపు దేవతలు భూమిని, ఆకాశాన్ని సృష్టించలేదు. ఆ చిల్లర దేవుళ్లు నాశనం చేయబడతారు.
వారు భూమి నుండి, ఆకాశము నుండి మాయమవుతారు.’”[b]
తన శక్తితో భూమిని సృష్టించినది నిత్యుడగు దేవుడే.
దేవుడు తన జ్ఞాన సంపదచే ఈ ప్రపంచాన్ని సృష్టించినాడు.
తన అవగాహనతో దేవుడు
ఆకాశాన్ని భూమిపైన వ్యాపింపజేశాడు.
13 భయంకరమైన శబ్ధంగల పిడుగులను దేవుడే కలుగజేస్తాడు.
ఆకాశంనుండి ధారాపాతంగా వర్షం పడేలా కూడా దేవుడే చేస్తాడు.
భూమి నలుమూలల నుండీ ఆకాశంలోకి మేఘాలు లేచేలా ఆయన చేస్తాడు.
ఆయన ఉరుములు మెరుపులతో వానపడేలా చేస్తాడు.
ఆయన తన గిడ్డంగుల నుండి గాలి వీచేలా చేస్తాడు.
14 ప్రజలు మందబుద్ధి గలవారయ్యారు!
లోహపు పనివారు వారు చేసిన విగ్రహాల చేత మూర్ఖులయ్యారు.
వారి బొమ్మలు అబద్ధాలకు ప్రతీకలు.
అవి జడపదార్థములు[c]
15 ఆ విగ్రహాలు ఎందుకూ కొరగానివి.
అవి హాస్యాస్పదమైనవి.
తీర్పు తీర్చే కాలంలో
ఆ విగ్రహాలు నాశనం చేయబడతాయి.
16 కాని యాకోబు యొక్క దేవుడు[d] ఆ విగ్రహాలవంటి వాడు కాదు.
ఆయన సర్వసృష్టికి కారకుడు.
ఇశ్రాయేలు తన ప్రజగా వర్థిల్లటానికి ఆయన దానిని ఎంపిక చేసినాడు.
ఆయన పేరు “యెహోవా సర్వశక్తిమంతుడు.”
క్రీస్తు యొక్క గొప్పతనము
15 క్రీస్తు కనిపించని దేవుని ప్రతిబింబం. ఆయన
అన్నిటికన్నా పూర్వంనుండి అనగా జగత్తుకు
పునాది వేయుటకు ముందునుండి ఉన్నవాడు.
16 క్రీస్తు అన్నిటినీ సృష్టించాడు.
పరలోకంలో ఉన్న వాటిని, భూమ్మీద కనిపించే వాటిని, కనిపించని వాటిని,
సింహాసనాలను, ప్రభుత్వాలను, పాలకులను, అధికారులను, అన్నిటినీ ఆయనే సృష్టించాడు.
అన్నీ తన కోసం సృష్టించుకొన్నాడు.
17 క్రీస్తు ఆదినుండి ఉన్నాడు.
ఆయనలో అన్నీ ఐక్యమై ఉన్నాయి.
18 సంఘం ఆయన శరీరం. ఆయన సంఘానికి శిరస్సు.
ఆయనే అన్నిటికీ మూలం.
చనిపోయి తిరిగి బ్రతికినవాళ్ళలో ఆయన మొదటివాడు.
అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యత ఉండాలని దేవుడు యిలా చేసాడు.
19 దేవుడు తనలో ఉన్న పరిపూర్ణత ఆయనలో ఉండటానికి ఆనందంగా అంగీకరించాడు.
20 దేవుడు అన్నిటినీ, అంటే భూమ్మీద ఉన్నవాటినీ, పరలోకంలో ఉన్నవాటిని,
కుమారుని ద్వారా తిరిగి తనలో చేర్చుకోవాలనుకొన్నాడు.
తన కుమారుడు సిలువపై చిందించిన రక్తం ద్వారా ఈ సంధి కలగాలని ఆయన ఉద్దేశ్యం.
21 మీ దుష్ప్రవర్తనలవల్ల, మీ మనస్సులో ఉన్న దురాలోచనలవల్ల ఒకప్పుడు మీరు దేవునికి దూరంగా ఉండి, ఆయనకు శత్రువులుగా జీవించారు. 22 కాని ప్రస్తుతం తన కుమారుని భౌతిక మరణం ద్వారా మీతో సంధి చేసి, మిమ్మల్ని పవిత్రం చేసి, మిమ్మల్ని నిష్కళంకులుగా, నిరపరాధులుగా తన ముందు నిలబెట్టుకోవాలని ఆయన ఉద్దేశ్యం.
23 మీరు విన్న సువార్త వలన రక్షణ కలుగుతుందన్న ఆశ మీలో కలిగింది. దాన్ని పోగొట్టుకోకుండా, దృఢంగా, స్థిరంగా ఆయన్ని విశ్వసిస్తూ ఉంటేనే అది సంభవిస్తుంది. మీరు విన్న ఈ సువార్త ఆకాశం క్రింద ఉన్న ప్రతీ జీవికి ప్రకటింపబడింది. నేను ఈ సందేశానికి సేవకుణ్ణి అయ్యాను.
© 1997 Bible League International