Revised Common Lectionary (Complementary)
దావీదు ధ్యాన గీతం. అతడు గుహలో ఉన్నప్పటి ప్రార్థన.
142 సహాయం కోసం నేను యెహోవాకు మొరపెడతాను.
యెహోవాను నేను ప్రార్థిస్తాను.
2 నా సమస్యలను గూర్చి నేను యెహోవాకు చెబుతాను.
నా కష్టాలను గూర్చి నేను యెహోవాకు చెబుతాను.
3 నా శత్రువులు నా కోసం ఉచ్చు పెట్టారు.
నా ప్రాణం నాలో మునిగిపోయింది.
అయితే నాకు ఏమి జరుగుతుందో యెహోవాకు తెలుసు.
4 నేను చుట్టూరా చూస్తే నా స్నేహితులు ఎవ్వరూ కనిపించలేదు.
పారిపోవుటకు నాకు స్థలం లేదు.
నన్ను రక్షించటానికి ఏ మనిషీ ప్రయత్నం చేయటం లేదు.
5 కనుక సహాయం కోసం నేను యెహోవాకు మొరపెడుతున్నాను.
యెహోవా, నీవే నా క్షేమ స్థానం.
యెహోవా, నీవు నన్ను జీవింపనియ్యగలవు.
6 యెహోవా, నా ప్రార్థన విను.
నీవు నాకు ఎంతో అవసరం.
నన్ను తరుముతున్న మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
నాకంటే ఆ మనుష్యులు చాలా బలంగల వాళ్లు.
7 ఈ ఉచ్చు తప్పించుకొనేందుకు నాకు సహాయం చేయుము.
యెహోవా, అప్పుడు నేను నీ నామాన్ని స్తుతిస్తాను.
నీవు నన్ను రక్షిస్తే మంచి మనుష్యులు సమావేశమై,
నిన్ను స్తుతిస్తారని నేను ప్రమాణం చేస్తాను.
ఇశ్రాయేలు కొరకు విషాద గీతిక
5 ఇశ్రాయేలు ప్రజలారా, ఈ పాట వినండి. ఈ విలాపగీతం మిమ్మల్ని గురించినదే.
2 ఇశ్రాయేలు కన్యక పతనమయింది.
ఆమె ఇక లేవలేదు.
మట్టిలోపడి ఆమె ఒంటరిగా వదిలి వేయబడింది.
ఆమెను లేవనెత్తే వ్యక్తే లేడు.
3 ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
“వెయ్యిమంది సైనికులతో నగరం వదిలివెళ్ళే
అధికారులు కేవలం వందమంది మనుష్యులతో తిరిగి వస్తారు
వందమంది సైనికులతో నగరం వదలి వెళ్లే
అధికారులు కేవలం పదిమంది మనుష్యులతో తిరిగి వస్తారు.”
తిరిగి రమ్మని ఇశ్రాయేలును యెహోవా ప్రోత్సహించుట.
4 ఇశ్రాయేలీయులతో యెహోవా ఇలా చెపుతున్నాడు:
“నన్ను వెదుక్కుంటూ వచ్చి జీవించండి.
5 కాని బేతేలులో వెదకవద్దు.
గిల్గాలుకు వెళ్లవద్దు.
సరిహద్దును దాటి బెయేర్షెబాకు వెళ్లకండి.
గిల్గాలు ప్రజలు బందీలుగా తీసుకుపోబడతారు.
బేతేలు నాశనం చేయబడుతుంది.
6 యెహోవా దరిచేరి జీవించండి.
మీరు యెహోవా వద్దకు వెళ్లకపోతే యోసేపు (పది వంశాలవారు) ఇంటిమీద నిప్పు పడుతుంది.
ఆ అగ్ని యోసేపు ఇంటిని దగ్ధం చేస్తుంది. బేతేలులో చెలరేగిన ఆ అగ్నిని ఎవ్వరూ ఆపలేరు.
7-9 మీరు యెహోవా కొరకు చూడండి.
సప్త ఋషీ నక్షత్రాలను, మృగశీర్ష నక్షత్రాన్ని సృష్టించింది ఆయనే.
చీకటిని ఉదయ కాంతిగా ఆయన మార్చుతాడు.
పగటిని చీకటిగా ఆయన మార్చుతాడు.
ఆయన సముద్ర జలాలను బయట నేలమీద కుమ్మరిస్తాడు.
ఆయన పేరు యెహోవా!
ఒక బలమైన నగరాన్ని ఆయన సురక్షితంగా ఉంచుతాడు.
మరో బలమైన నగరం నాశనమయ్యేలా ఆయన చేస్తాడు.”
ఇశ్రాయేలీయులు చేసిన చెడుపనులు
ప్రజలారా! ఇది మీకు తగని పని. మీరు మంచిని విషంగా మార్చుతారు.
న్యాయాన్ని హత్యచేసి నేలకు కూలేలా చేస్తారు.
27-28 ఏడు రోజులు పూర్తిగా గడవక ముందే ఆసియ ప్రాంతంనుండి వచ్చిన కొందరు యూదులు పౌలును మందిరంలో చూసారు. వాళ్ళు ప్రజల్ని పురికొలిపి పౌలును బంధించారు. ప్రజలతో, “ఇశ్రాయేలు ప్రజలారా! మాతో సహకరించండి. ఇతడు అన్ని ప్రాంతాలు తిరిగి ఇశ్రాయేలు ప్రజల్ని గురించి, మోషే ధర్మశాస్త్రాన్ని గురించి యెరూషలేములోని మందిరాన్ని గురించి విరుద్ధంగా అందరికీ బోధించాడు. ఇప్పుడు గ్రీకుల్ని కొందర్ని మందిరంలోకి పిలుచుకొని వెళ్ళి, ఈ పవిత్ర స్థానాన్ని అపవిత్రం చేసాడు” అని బిగ్గరగా అన్నారు. 29 ప్రజలు ఎఫెసుకు చెందిన త్రోఫిమును పౌలుతో కలిసి పట్టణంలో తిరగటం చూసారు. కనుక పౌలు అతణ్ణి మందిరంలోకి పిలుచుకెళ్ళాడనుకున్నారు.
30 పట్టణమంతా అల్లర్లు వ్యాపించాయి. ప్రజలు అన్ని వైపులనుండి పరుగెత్తికొంటూ వచ్చారు. పౌలును పట్టుకొని మందిరం అవతలికి లాగి వెంటనే మందిరం యొక్క తలుపులు మూసి వేసారు. 31 వాళ్ళు, అతణ్ణి చంపే ప్రయత్నంలో ఉన్నారు. యెరూషలేమంతా అల్లర్లతో నిండిపోయిందనే వార్త సైన్యాధిపతికి పంపబడింది. 32 ఆ సైన్యాధిపతి వెంటనే కొందరు సైనికుల్ని, సైన్యాధిపతుల్ని తన వెంట బెట్టుకొని ప్రజలు గుమి కూడిన చోటికి వెళ్ళాడు. వాళ్ళు సైన్యాధిపతిని, సైనికుల్ని చూసి, పౌలును కొట్టడం మానివేసారు.
33 సైన్యాధిపతి అతని దగ్గరకు వెళ్ళి, అతణ్ణి పట్టుకొని యినుప గొలుసులతో కట్టి వేయమని ఆజ్ఞాపిస్తూ సైనికులకు అప్పగించాడు. “అతడెవరు? ఏం చేసాడు?” అని తదుపరి ప్రజల్ని విచారించాడు. 34 ప్రజలు బిగ్గరగా కేకలు వేస్తూ, ఒకరొకటి, మరొకరు మరొకటి చెప్పారు. అల్లరిగా ఉండటం వల్ల సైన్యాధిపతికి జరిగిందేమిటో తెలియలేదు. పౌలును కోటలోకి తీసుకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. 35 పౌలు మెట్లు ఎక్కుతుండగా ప్రజలు అల్లరి చేసారు. అందువల్ల సైనికులు పౌలును మోసికొని కోటలోకి తీసుకు వెళ్ళారు. 36 ప్రజలు అతణ్ణి వెంటాడుతూ, “అతణ్ణి చంపాలి!” అని బిగ్గరగా నినాదం చేసారు.
37 సైనికులు పౌలును కోటలోకి తీసుకు వెళ్ళే ముందు, అతడు సైన్యాధిపతితో, “నేను మీతో కొద్దిగా మాట్లాడవచ్చా?” అని అడిగాడు.
సైన్యాధిపతి, “నీవు గ్రీకు భాష మాట్లాడుతున్నావే! 38 క్రితంలో ప్రభుత్వాన్ని ధిక్కరించి నాలుగు వేల మంది హంతకుల్ని ఎడారుల్లోకి పిలుచుకు వెళ్ళిన ఈజిప్టు దేశపువాడవు నీవే కదూ?” అని అడిగాడు.
39 పౌలు, “నేను యూదుణ్ణి, కిలికియ దేశంలోని తార్సు అనే ముఖ్య పట్టణానికి చెందిన పౌరుణ్ణి. నన్ను ప్రజలతో మాట్లాడనివ్వండి!” అని అడిగాడు.
© 1997 Bible League International