Revised Common Lectionary (Complementary)
మట్టపుగుండు దర్శనం
7 యెహోవా దీనిని నాకు చూపించాడు: మట్టపుగుండు[a] (మట్టపు గోడ నిటారుగా వచ్చేలా సరి చూడబడుతుంది)ను చేతబట్టుకొని యెహోవా ఒక గోడవద్ద నిలబడ్డాడు. 8 “ఆమోసూ, నీవు ఏమి చూస్తున్నావు?” అని యెహోవా నన్ను అడిగాడు.
“ఒక మట్టపు గుండును” అని నేనన్నాను.
అప్పుడు నా ప్రభువు ఇలా అన్నాడు: “చూడు, నా ప్రజలైన ఇశ్రాయేలీయులమధ్య ఒక మట్టపుగుండు పెడతాను. వారి ‘దుష్టత్వాన్ని’ ఇక ఎంత మాత్రం నేను చూసి చూడనట్లు వదలను. (ఆ దుష్ట భాగాలను నేను తొలగిస్తాను). 9 ఇస్సాకు వంశస్థులు ఏర్పాటు చేసిన ఉన్నత ప్రదేశాలు నాశనం చేయబడతాయి. ఇశ్రాయేలు పవిత్ర స్థలాలన్నీ రాళ్ల గుట్టల్లా మార్చబడతాయి. నేను యరొబాము వంశంమీద పడి వారిని కత్తులతో చంపుతాను.”
ఆమోసు ప్రకటనలను అమజ్యా ఆపజూడటం
10 బేతేలులో ఒక యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యరొబాముకు ఈ వర్తమానం పంపాడు: “ఆమోసు నీమీద కుట్ర పన్నుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నీ మీదకు తిరగబడేలా చేయటానికి అతడు ప్రయత్నిస్తున్నాడు. అతడు ఎంతగా మాట్లాడుతున్నాడంటే, ఈ దేశం అతని మాటల్ని సహించలేదు. 11 యరొబాము కత్తిచే చంపబడతాడనీ, ఇశ్రాయేలీయులు తమ దేశంనుండి బందీలుగా కొనిపోబడతారనీ ఆమోసు ప్రచారం చేస్తున్నాడు.”
12 ఆమోసుతో కూడ అమజ్యా ఇలా చెప్పాడు: “ఓ దీర్ఘదర్శీ (ప్రవక్తా), నీవు యూదాకు పారిపోయి అక్కడనే తిను. నీ బోధన అక్కడనే చేయి. 13 అంతేగాని, ఇక్కడ బేతేలులో ఎంతమాత్రమూ నీవు ప్రకటనలు చేయవద్దు. ఇది యరొబాము పవిత్ర స్థలం (రాజధాని). ఇది ఇశ్రాయేలు ఆలయం!”
14 అప్పుడు అమజ్యాకు ఆమోసు ఇలా సమాధానాం చెప్పాడు: “నేను వృత్తిరీత్యా ప్రవక్తను గాను. పైగా నేను ప్రవక్త వంశంనుండి వచ్చినవాడినీ కాను. నేను పశువులను కాస్తూ ఉంటాను. మేడి పండ్ల వృక్షాలను రక్షిస్తూ వుంటాను. 15 నేనొక గొర్రెల కాపరిని. అయితే యెహోవా నన్ను గొర్రెలను అనుసరించనీయకుండా పిలిచాడు. ‘నీవు వెళ్లి, నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు ప్రకటనలు చేయి’ అని యెహోవా నాతోచెప్పాడు.
8 దేవుడు చెప్పేది నేను వింటున్నాను.
తన ప్రజలకు శాంతి కలుగుతుందని యెహోవా చెబుతున్నాడు.
ఆయన అనుచరులు వారి అవివేక జీవిత విధానాలకు తిరిగి వెళ్లకపోతే వారికి శాంతి ఉంటుంది.
9 దేవుడు తన అనుచరులను త్వరలో రక్షిస్తాడు.
మేము త్వరలోనే మా దేశంలో గౌరవంగా బ్రతుకుతాము.
10 దేవుని నిజమైన ప్రేమ ఆయన అనుచరులకు లభిస్తుంది.
మంచితనం, శాంతి ఒకదానితో ఒకటి ముద్దు పెట్టుకొంటాయి.
11 భూమి మీద మనుష్యులు దేవునికి నమ్మకంగా ఉంటారు.
పరలోకపు దేవుడు వారికి మేలు అనుగ్రహిస్తాడు.
12 యెహోవా మనకు అనేకమైన మంచివాటిని ఇస్తాడు.
భూమి అనేక మంచి పంటలను ఇస్తుంది.
13 మంచితనం దేవునికి ముందర నడుస్తూ
ఆయన కోసం, దారి సిద్ధం చేస్తుంది.
క్రీస్తులో ఆత్మీయ దీవెనలు
3 మన యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రి అయినటువంటి దేవునికి స్తుతి కలుగుగాక! దేవుడు పరలోకానికి చెందిన మనకు ఆత్మీయతకు కావలసినవన్నీ మనలో క్రీస్తు ద్వారా సమకూర్చి మనల్ని దీవించాడు. 4 మనము తన దృష్టియందు పవిత్రంగా ఏ తప్పూ చెయ్యకుండా ఉండాలని ప్రపంచాన్ని సృష్టించక ముందే క్రీస్తులో మనల్ని తన ప్రేమవల్ల ఎన్నుకొన్నాడు. 5 యేసు క్రీస్తు ద్వారా మనల్ని తన కుమారులుగా ప్రేమతో దగ్గరకు చేర్చుకోవాలని సృష్టికి ముందే నిర్ణయించాడు. ఇదే ఆయన ఉద్దేశ్యము. ఇలా చేయటమే ఆయన ఆనందం! 6 కనుక ఈ అద్భుతమైన అనుగ్రహాన్ని తాను ప్రేమిస్తున్న క్రీస్తులో ఉన్న మనకు ఉచితంగా యిచ్చిన దేవుణ్ణి మనము స్తుతించుదాం.
7 ఆయన రక్తం వల్ల మనకు విడుదల కలిగింది. మన పాపాలు క్షమించబడ్డాయి. ఆయన అనుగ్రహం ఎంతో గొప్పది. 8 ఆ అనుగ్రహాన్ని దేవుడు మనపై ధారాళంగా కురిపించాడు. ఇది బాగా ఆలోచించి దివ్య జ్ఞానంతో చేసాడు. 9 ఆయన తాను క్రీస్తు ద్వారా ఆనందముతో చెయ్యదలచిన మర్మాన్ని తన యిచ్ఛానుసారం మనకు తెలియచేసాడు. 10 సరియైన సమయం రాగానే తాను పూర్తి చేయదలచినదాన్ని పూర్తి చేస్తాడు. సృష్టినంతటిని, అంటే భూలోకాన్ని, పరలోకాన్ని ఒకటిగా చేసి దానికి క్రీస్తును అధిపతిగా నియమిస్తాడు.
11 అన్నీ ఆయన ఉద్దేశ్యానుసారం, ఆయన నిర్ణయించిన విధంగా సంభవిస్తాయి. తాను సృష్టికి ముందు నిర్ణయించిన విధంగా తన ఉద్దేశ్యం ప్రకారం మనము క్రీస్తులో ఐక్యత పొంది ఆయన ప్రజలుగా ఉండేటట్లు ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. 12 క్రీస్తు మనకు రక్షణ యిస్తాడని విశ్వసించినవాళ్ళలో మనము మొదటివాళ్ళము. మనము ఆయన మహిమకు కీర్తి కలిగించాలని ఆయన ఉద్దేశ్యము. ఆయన మహిమను బట్టి ఆయన్ను స్తుతించుదాం. 13 మీరు రక్షణను గురించి చెప్పబడిన సువార్త విన్నారు. ఆ గొప్ప సత్యం మీకు లభించింది. కనుక మీకు కూడా క్రీస్తులో ఐక్యత కలిగింది. ఆయన్ని మీరు విశ్వసించినప్పుడు మీపై ముద్ర వేయబడింది. ఆ ముద్రే దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ. 14 తన ప్రజలందరికీ రక్షణ కలిగే వరకూ వారసత్వానికి హామీగా ఆయన పరిశుద్ధాత్మను మన దగ్గర ఉంచాడు. ఇది ఆయన మహిమ కోసం జరిగింది.
హెరోదు యేసును స్నానికుడైన యోహానని తలంచటం
(మత్తయి 14:1-12; లూకా 9:7-9)
14 యేసుకు పేరు ప్రఖ్యాతులు రావడంతో హేరోదు రాజుకు వీటిని గురించి తెలిసింది. బాప్తిస్మము[a] నిచ్చే యోహాను బ్రతికివచ్చాడని, కనుకనే మహత్వపూర్వకమైన కార్యాలు చేసేశక్తి అతనిలో ఉన్నదని అన్నాడు.
15 “ఆయన ఏలియా” అని కొందరన్నారు.
“ఆయన ప్రవక్త, పూర్వకాలపు ప్రవక్తల్లాంటివాడు” అని మరికొందరన్నారు.
16 కాని హేరోదు వీటిని గురించి విని, “నేను తల నరికించిన యోహాను బ్రతికి వచ్చాడు” అని అన్నాడు.
బాప్తిస్మము నిచ్చే యోహాను మరణం
17 క్రితంలో హేరోదు, స్వయంగా యోహానును బంధించి కారాగారంలో వేయమని ఆజ్ఞాపించాడు. తాను వివాహం చేసుకొన్న హేరోదియ కారణంగా ఈ పని చేయవలసి వచ్చింది. ఈమె హేరోదు సోదరుడైన ఫిలిప్పు భార్య. 18 పైగా యోహాను హేరోదుతో, “నీ సహోదరుని భార్యను చేసుకోవటం అన్యాయం” అంటూ ఉండేవాడు. 19 అందువల్ల హేరోదియకు యోహాను అంటే యిష్టం వుండేదికాదు. అంతేకాక, ఆమె అతణ్ణి చంపి వేయాలని ఆశించింది. కాని యోహాను అంటే హేరోదు భయపడేవాడు. కనుక అలాచెయ్య లేక పొయ్యాడు. 20 పైగా యోహాను నీతిమంతుడని, పవిత్రమైనవాడని హేరోదుకు తెలుసు. కనుక అతణ్ణి కాపాడుతూ వుండేవాడు. హేరోదు యోహాను మాటలు విన్నప్పుడు ఎంతో కలవరం చెందేవాడు, అయినా అతని మాటలు వినటానికి యిష్టపడేవాడు.
21 చివరకు హేరోదియకు అవకాశం లభించింది. హేరోదు తన రాజ్యంలోని ప్రముఖ అధికారులను, సైన్యాధిపతులను గలిలయలోని ప్రముఖులను పిలిచి తన పుట్టినరోజు పండుగ చేసాడు. 22 హేరోదియ కూతురు వచ్చి నాట్యం చేసింది. ఆమె హేరోదును, అతని అతిథుల్ని మెప్పించింది.
హేరోదు ఆమెతో, “నీకు కావలసింది ఏదైనా కోరుకో! యిస్తాను!” అని అన్నాడు. 23 “నీవేదడిగినా యిస్తాను, అర్ధ రాజ్యాన్నైనా సరే!” అని ప్రమాణం చేసాడు.
24 ఆమె వెళ్ళి తన తల్లితో, “నన్నేమి కోరుకోమంటావు?” అని అడిగింది.
“బాప్తిస్మము నిచ్చే యోహాను తల కోరుకో!” అని ఆమె సమాధానం చెప్పింది.
25 వెంటనే ఆమె రాజు దగ్గరకు పరుగెత్తి, “బాప్తిస్మము నిచ్చే యోహాను తలను ఒక పళ్ళెంలో పెట్టి తక్షణమే యిప్పించమని మిమ్మల్ని వేడుకొంటున్నాను” అని అన్నది.
26 రాజుకు చాలా దుఃఖం కలిగింది. కాని తాను ప్రమాణం చేసాడు. పైగా అతిథులక్కడే ఉన్నారు. కనుక ఆమె కోరికను నిరాకరించ దలచుకోలేదు. 27 అందువల్ల అతడు వెంటనే యోహాను తల తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తూ ఒక భటుణ్ణి పంపాడు. ఆ భటుడు వెళ్ళి యోహాను తలను కారాగారంలోనే నరికి వేసి, 28 దాన్ని ఒక పళ్ళెంలో పెట్టి తీసుకు వచ్చి ఆమెకు బహూకరించాడు. ఆమె దాన్ని తన తల్లికి ఇచ్చింది. 29 యోహాను శిష్యులు ఇది విని అక్కడికి వెళ్ళి అతని దేహాన్ని తీసుకువెళ్ళి సమాధిచేసారు.
© 1997 Bible League International