Revised Common Lectionary (Complementary)
8 దేవుడు చెప్పేది నేను వింటున్నాను.
తన ప్రజలకు శాంతి కలుగుతుందని యెహోవా చెబుతున్నాడు.
ఆయన అనుచరులు వారి అవివేక జీవిత విధానాలకు తిరిగి వెళ్లకపోతే వారికి శాంతి ఉంటుంది.
9 దేవుడు తన అనుచరులను త్వరలో రక్షిస్తాడు.
మేము త్వరలోనే మా దేశంలో గౌరవంగా బ్రతుకుతాము.
10 దేవుని నిజమైన ప్రేమ ఆయన అనుచరులకు లభిస్తుంది.
మంచితనం, శాంతి ఒకదానితో ఒకటి ముద్దు పెట్టుకొంటాయి.
11 భూమి మీద మనుష్యులు దేవునికి నమ్మకంగా ఉంటారు.
పరలోకపు దేవుడు వారికి మేలు అనుగ్రహిస్తాడు.
12 యెహోవా మనకు అనేకమైన మంచివాటిని ఇస్తాడు.
భూమి అనేక మంచి పంటలను ఇస్తుంది.
13 మంచితనం దేవునికి ముందర నడుస్తూ
ఆయన కోసం, దారి సిద్ధం చేస్తుంది.
6 “నిన్ను నా వద్దకు వచ్చేలా చేయటానికి నేను చాలా పనులు చేశాను. నేను, మీరు తినటానికి ఏమీ ఆహారం ఇవ్వలేదు. మీ నగరాలలో దేనిలోనూ ఆహారం ఇవ్వలేదు. అయినా నీవు నా వద్దకు తిరిగి రాలేదు. యెహోవా చెప్పేది ఇదే.
7 “నేను వర్షాన్ని కూడా నిలుపు చేశాను. పైగా అది పంట కోతకు మూడు నెలల ముందు సమయం. అందువల్ల పంటలు పండలేదు. పిమ్మట ఒక నగరంలో వర్షం కురిపించి, మరో నగరంలో వర్షం లేకుండా చేశాను. దేశంలో ఒక భాగంలో వర్షం పడింది. కాని దేశంలో మరొక ప్రాంతం వర్షాలు లేక పూర్తిగా ఎండిపోయింది. 8 కావున రెండు మూడు నగరాల ప్రజలు తడబడుతూ నీళ్లకోసం మరొక నగరానికి వెళ్లారు. కాని అక్కడ ప్రతి ఒక్కరికీ సరిపోయేటంత నీరు లేదు. అయినా మీరు సహాయం కొరకు నా వద్దకు రాలేదు. యెహోవా చెప్పేది ఇదే.
9 “ఎండ వేడిమివల్ల, తెగుళ్లవల్ల మీ పంటలు పాడైపోయేలా చేశాను. మీ ఉద్యానవనాలను, ద్రాక్షా తోటలను నేను నాశనం చేశాను. మీ అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను మిడుతలు తినివేశాయి. కాని మీరు మాత్రం సహాయం కొరకు నా వద్దకు రాలేదు. యెహోవా చెప్పేది ఇదే.
10 “ఈజిప్టు విషయంలో చేసినట్లు నేను మీ మీదికి రోగాలను పంపించాను. మీ యువకులను నేను కత్తులతో సంహరించాను. మీ గుర్రాలను నేను తీసుకున్నాను. మీ స్థావరం కుళ్లిన శవాలతో దుర్గంధ పూరితమయ్యేలా చేశాను. కాని, మీరు సహాయం కొరకు నావద్దకు తిరిగి రాలేదు.” యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
11 “సొదొమ, గొమొర్రా నగరాలను నేను నాశనం చేసినట్లు నేను నిన్ను నాశనం చేశాను. ఆ నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పొయ్యిలో నుండి లాగబడి కాలిన కట్టెలా మీరున్నారు. కాని, మీరు సహాయంకొరకు నా వద్దకు రాలేదు” అని యెహోవా చెపుతున్నాడు.
12 “కావున ఇశ్రాయేలూ, మీకు నేనీ విషయాలు కలుగజేస్తాను. ఇది మీకు నేను చేస్తాను. ఇశ్రాయేలూ, మీ దేవుని కలుసుకోటానికి సిద్ధమవ్వు.”
13 నేనెవరిని? పర్వతాలను ఏర్పాటు చేసింది నేనే.
మీ మనస్సులను[a] సృష్టించింది నేనే.
ఎలా మాట్లాడాలో ప్రజలకు నేర్పింది నేనే.
సంధ్యవేళను చీకటిగా మార్చేదీ నేనే. భూమిపైగల పర్వతాలపై నేను నడుస్తాను.
ఇట్టి నేను ఎవరిని?
సర్వశక్తిమంతుడగు దేవుడను. నా పేరు యెహోవా.
యోహాను జన్మ వృత్తాంతం
57 ఎలీసబేతుకు నెలలు నిండి మగశిశువును ప్రసవించింది. 58 బంధువులు మరియు ఇరుగు పొరుగు వాళ్ళు ప్రభువు ఆమెను కనికరించినందుకు ఆనందించారు.
59 ఎనిమిదవ రోజు వాళ్ళు పిల్లవానికి సున్నతి చేయటానికి వచ్చి అతనికి జెకర్యా అని అతని తండ్రి పేరే పెట్టబోయారు. 60 కాని తల్లి వారిస్తూ, “ఆ పేరు వద్దు! యోహాను అని పేరు పెట్టండి” అని అన్నది.
61 వాళ్ళు, “మీ బంధువుల్లో ఆ పేరున్న వాళ్ళు ఎవ్వరూ లేరే?” అని అన్నారు. 62 ఆ పిల్లవాని తండ్రికి సంజ్ఞలు చేసి అతడే పేరు పెట్టదలచాడో అని అడిగారు.
63 అతడు వ్రాయటానికి ఒక పలక నివ్వమని అడిగి దానిపై, “అతనికి యోహాను అని పేరు పెట్టండి” అని వ్రాసాడు. ఇది చూసి అంతా ఆశ్చర్యపోయారు. 64 వెంటనే అతని నోరు, నాలుక కదిలి బాగైపోయింది. అతడు దేవుణ్ణి స్తుతిస్తూ మాట్లాడటం మొదలు పెట్టాడు. 65 ఇరుగు పొరుగు వాళ్ళలో భక్తి, భయమూ నిండుకుపొయ్యాయి. యూదయ పర్వత ప్రాంతమంతా ఈ వార్త వ్యాపించింది. 66 ఈ విషయం విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడి, “ఈ పసివాడు ఎంతగొప్పవాడౌతాడో కదా!” అని అన్నారు. ఆ బాలునికి ప్రభువు హస్తం తోడుగా ఉంది.
జెకర్యా చెప్పిన భవిష్యం
67 ఆ బాలుని తండ్రి జెకర్యా పవిత్రాత్మతో నింపబడి దేవుని సందేశాన్ని ఈ విధంగా చెప్పాడు:
68 “తన ప్రజలకు స్వేచ్ఛ కలిగించి, రక్షించ వచ్చిన ప్రభువును స్తుతించండి!
ఇశ్రాయేలు ప్రజల దేవుణ్ణి స్తుతించండి!
69 మహాశక్తిగల రక్షకుణ్ణి తన సేవకుడైన దావీదు వంశం నుండి
మనకోసం పంపాడు.
70 గతంలో మహాత్ములైన ప్రవక్తల ద్వారా
ఈ విషయం చెప్పాడు.
71 దేవుడు శత్రువుల బారినుండి,
మనలను ద్వేషించేవారినుండి మనల్ని రక్షిస్తాడు.
72 మన తండ్రులను, తాత ముత్తాతలను కరుణిస్తానన్నాడు.
పవిత్రమైన ఒడంబడిక మరిచి పోనన్నాడు!
73 శత్రువుల బారినుండి రక్షిస్తానని మన తండ్రి అబ్రాహాముతో ప్రమాణం చేశాడు.
74 మనం ఏ భయం లేకుండా తనను సేవించాలి.
75 జీవితాంతం పవిత్రంగా, ధర్మంగా, తన కోసం జీవించాలని ఆయన ఉద్దేశ్యం!
76 “ఓ శిశువా! నీవు సర్వోన్నతుని ప్రవక్తవని పిలువబడతావు!
ప్రభువు కన్నా ముందు వెళ్ళి ప్రభువు రాకకు మార్గం వేస్తావు!
77 పాపక్షమాపణ ద్వారా రక్షణ కలుగుతుందన్న జ్ఞానాన్ని ఆయన ప్రజలకు బోధిస్తావు!
78 “మన దేవుడు తన కనికరంవల్ల పరలోకం నుండి
ఒక నీతిసూర్యుణ్ణి పంపించి,
79 మరణమనే చీకటి నీడలో నివసించే మనపై ప్రకాశించునట్లు చేసి
మనల్ని శాంతి మార్గంలో నడిపిస్తాడు!”
80 ఆ బాలుడు పెరిగి పెద్దవాడై ఆత్మలో బలం పొందాడు. ఇశ్రాయేలు ప్రజలకు బోధించే సమయం వచ్చే దాకా యోహాను ఎడారుల్లో జీవించాడు.
© 1997 Bible League International