Revised Common Lectionary (Complementary)
8 దేవుడు చెప్పేది నేను వింటున్నాను.
తన ప్రజలకు శాంతి కలుగుతుందని యెహోవా చెబుతున్నాడు.
ఆయన అనుచరులు వారి అవివేక జీవిత విధానాలకు తిరిగి వెళ్లకపోతే వారికి శాంతి ఉంటుంది.
9 దేవుడు తన అనుచరులను త్వరలో రక్షిస్తాడు.
మేము త్వరలోనే మా దేశంలో గౌరవంగా బ్రతుకుతాము.
10 దేవుని నిజమైన ప్రేమ ఆయన అనుచరులకు లభిస్తుంది.
మంచితనం, శాంతి ఒకదానితో ఒకటి ముద్దు పెట్టుకొంటాయి.
11 భూమి మీద మనుష్యులు దేవునికి నమ్మకంగా ఉంటారు.
పరలోకపు దేవుడు వారికి మేలు అనుగ్రహిస్తాడు.
12 యెహోవా మనకు అనేకమైన మంచివాటిని ఇస్తాడు.
భూమి అనేక మంచి పంటలను ఇస్తుంది.
13 మంచితనం దేవునికి ముందర నడుస్తూ
ఆయన కోసం, దారి సిద్ధం చేస్తుంది.
ఇశ్రాయేలుకు హెచ్చరిక
3 ఇశ్రాయేలు ప్రజలారా, ఈ వర్తమానం వినండి! ఇశ్రాయేలూ, నిన్ను గురించి యెహోవా ఈ విషయాలు చెప్పాడు. ఈజిప్టునుండి ఆయన తీసుకొని వచ్చిన ఇశ్రాయేలు వంశాల వారందరిని గూర్చినదే ఈ వర్తమానం. 2 “భూమిమీద అనేక వంశాలున్నాయి. కాని మిమ్మల్ని మాత్రమే నేను ఎంపికచేసి ప్రత్యేకంగా ఎరిగియున్నాను. అయితే, మీరు నాపై తిరుగుబాటు చేశారు. కావున మీ పాపాలన్నిటికీ నేను మిమ్మల్ని శిక్షిస్తాను.”
ఇశ్రాయేలు శిక్షకు కారణం
3 అంగీకారం లేకుండా
ఇద్దరు వ్యక్తులు కలిసి నడవలేరు.
4 అడవిలో ఉన్న సింహం ఒక జంతువును
పట్టుకున్న తరువాతనే గర్జిస్తుంది.
తన గుహలో వున్న ఒక యువ కిశోరం గర్జిస్తూ ఉందంటే,
అది ఏదో ఒక దానిని పట్టుకున్నదని అర్థం.
5 బోనులో ఆహారం లేకపోతే ఒక పక్షి ఆ బోనులోకి ఎగిరిరాదు.
బోను మూసుకుపోతే, అది అందులో చిక్కుతుంది.
6 హెచ్చరిక చేసే బూరనాదం వినబడితే
ప్రజలు భయంతో వణుకుతారు.
ఒక నగరానికి ఏదైనా ముప్పు వాటిల్లిందంటే,
దానిని యెహోవాయే కలుగ జేసినట్లు.
7 నా ప్రభువైన యెహోవా ఏదైనా చేయటానికి నిర్ణయించవచ్చు. కాని ఆయన ఏదైనా చేసేముందు ఆయన తన పథకాలను తన, సేవకులైన ప్రవక్తలకు తెలియజేస్తాడు. 8 ఒక సింహం గర్జిస్తే ప్రజలు భయపడతారు. యెహోవా మాట్లాడితే, ప్రవక్తలు దానిని ప్రవచిస్తారు.
9-10 అష్డోదు, ఈజిప్టులలో ఉన్న ఎత్తయిన బురుజులు ఎక్కి ఈ వర్తమానం ప్రకటించండి: “మీరు సమరయ (షోమ్రోను) పర్వతాల మీదికి రండి. అక్కడ మీరు ఒక పెద్ద గందరగోళ పరిస్థితిని చూస్తారు. ఎందుకంటే, సవ్యమైన జీవితం ఎలా గడపాలో ఆ ప్రజలకు తెలియదు. సాటి ప్రజలపట్ల వారు క్రూరంగా వ్యవహరించారు. అన్యజనులనుండి వారు వస్తువులను తీసుకొని వాటిని ఎత్తయిన బురుజులలో దాచివేశారు. యుద్ధంలో తీసుకున్న వస్తువులతో వారి ఖజానాలు నిండివున్నాయి.”
11 కావున యెహోవా చెపుతున్నదేమంటే: “దేశంమీదికి ఒక శత్రువు వస్తాడు. ఆ శత్రువు మీ బలాన్ని హరిస్తాడు. మీ ఎత్తయిన బురుజులలో దాచిన వస్తువులన్నీ అతడు తీసుకుంటాడు.”
12 యెహోవా ఇది చెపుతున్నాడు:
“ఒక సింహం ఒక గొర్రెపిల్ల మీద పడవచ్చు.
ఆ గొర్రెపిల్లలో కొంత భాగాన్నే కాపరి రక్షించగలడు.
సింహం నోటినుండి అతడు రెండు కాళ్లను గాని,
చెవిలో కొంత భాగాన్నిగాని బయటకు లాగవచ్చు.
అదే మాదిరి, ఇశ్రాయేలు ప్రజలలో ఎక్కువ మంది రక్షింపబడరు.
సమరయ (షోమ్రోను)లో నివసిస్తున్న ప్రజలు మంచంలో కేవలం ఒక మూలనుగాని,
లేక తమ పాన్పులో ఒక గుడ్డముక్కనుగాని రక్షించుకుంటారు.”
మరికొన్ని ఉపదేశములు
2 మనస్సు నిమగ్నం చేసి, భక్తితో దేవుణ్ణి ప్రార్థించండి. దేవునికి మీ కృతజ్ఞత తెలుపుకోండి. 3 మా సందేశానికి దేవుడు దారి చూపాలని, ఆయన క్రీస్తును గురించి తెలియ చేసిన రహస్య సత్యాన్ని మేము ప్రకటించగలగాలని మాకోసం కూడా ప్రార్థించండి. నేను దాని కోసమే సంకెళ్ళలో ఉన్నాను. 4 నేను ఆ సందేశాన్ని స్పష్టంగా, యితరులకు అర్థమయ్యేలా ప్రకటించగలగాలని కూడా ప్రార్థించండి. ఇది నా కర్తవ్యం.
5 అవిశ్వాసులతో తెలివిగా ప్రవర్తించండి. వచ్చిన ప్రతి అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. 6 మీరు మర్యాదగా, తెలివిగా మాట్లాడాలి. మీ మాటలు అందరి ప్రశ్నలకు సమాధానం యిచ్చేటట్లు ఉండాలి.
చివరి మాట
7 “తుకికు” నా గురించి అన్ని విషయాలు మీకు చెబుతాడు. అతడు విశ్వాసం గల పరిచారకుడు. ప్రభువు సేవ చేయటంలో నా సహచరుడు. 8 మా పరిస్థితులు మీకు తెలియాలనీ, అతడు మీ మనస్సుకు శాంతి కలిగించాలనే ముఖ్యోద్దేశంతో అతణ్ణి మీ దగ్గరకు పంపుతున్నాను. 9 మనకు ప్రియ సోదరుడు, విశ్వాసం కలవాడు అయినటువంటి ఒనేసిముతో కలిసి అతడు వస్తున్నాడు. “ఒనేసిము” మీ వద్దనుండి వచ్చినవాడే. ఇక్కడ జరుగుతున్నవన్నీ వాళ్ళు చెబుతారు.
10 నాతో కారాగారంలో ఉన్న “అరిస్తార్కు”, “మార్కు” మీకు వందనములు తెలుపుతున్నారు. మార్కు బర్నబాకు మేనల్లుడు. మార్కు కోసం మీరు చేయవలసినవాటిని గురించి యిదివరకే చెప్పాను. అతడక్కడికి వస్తే అతనికి స్వాగతం చెప్పండి. 11 “యూస్తు” అని పిలువబడే యేసు కూడా మీకు వందనములు చెప్పమన్నాడు. దేవుని రాజ్యం కొరకు నాతో కలిసి పని చేస్తున్నవాళ్ళలో ఈ ముగ్గురు మాత్రమే యూదా మతము నుండి మనలో చేరినవారు. నా ఈ కృషిలో వాళ్ళు నాకు చాలా ఆదరణగా ఉన్నారు.
12 మీలో ఒకడైన “ఎపఫ్రా” మీకు వందనములు తెలుపుతున్నాడు. ఇతడు యేసు క్రీస్తు సేవకుడు. మీకు దైవేచ్ఛపై పూర్తిగా విశ్వాసం ఉండాలనీ, మీరు ఆత్మీయంగా పరిపూర్ణత పొందాలనీ, మీ కొరకు అతడు దేవుణ్ణి పట్టుదలతో ప్రార్థిస్తూ ఉన్నాడు. 13 ఇతడు మీకోసం “లవొదికయ” “హియెరాపొలి” గ్రామాలలోనివాళ్ళ కోసం కష్టపడి పని చేస్తున్నాడని నేను గట్టిగా చెప్పగలను. 14 మన ప్రియమిత్రుడు, వైద్యుడైన “లూకా” మరియు “దేమాయు” మీకు వందనములు చెపుతున్నారు.
15 లవొదికయలోని సోదరులకు, “నుంఫా” కు, ఆమె యింట్లోని క్రీస్తు సంఘానికి నా శుభాకాంక్షలు. 16 ఈ లేఖను మీ సంఘంలో చదివాక, లవొదికయలోనున్న సంఘంలో కూడా చదివేటట్లు చూడండి. ఆ తర్వాత లవొదికయ నుండి వచ్చిన లేఖను మీ సంఘంలో చదవండి. 17 ప్రభువు అప్పగించిన కార్యాన్ని పూర్తి చెయ్యమని “అర్ఖిప్పు” తో చెప్పండి.
18 ఈ శుభాకాంక్షలు పౌలను నేను స్వయంగా నా చేతులతో వ్రాస్తున్నాను. నా “సంకెళ్ళను” జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని యొక్క అనుగ్రహం మీపై ఉండుగాక!
© 1997 Bible League International