Revised Common Lectionary (Complementary)
యాత్ర కీర్తన.
123 దేవా, నేను నీవైపు చూచి ప్రార్థిస్తున్నాను.
నీవు పరలోకంలో రాజుగా కూర్చుని ఉన్నావు.
2 బానిసలు వారి అవసరాల కోసం వారి యజమానుల మీద ఆధారపడతారు.
బానిస స్త్రీలు వారి యజమానురాండ్ర మీద ఆధారపడతారు.
అదే విధంగా మేము మా దేవుడైన యెహోవా మీద ఆధారపడతాము.
దేవుడు మా మీద దయ చూపించాలని మేము ఎదురుచూస్తాము.
3 యెహోవా, మా మీద దయ చూపించుము.
మేము చాలాకాలంగా అవమానించబడ్డాము. కనుక దయ చూపించుము.
4 ఆ గర్విష్ఠుల ఎగతాళితో మా ప్రాణం అధిక భారాన్ని పొందింది.
మా హింసకుల తిరస్కారంతో వారు సుఖంగా వున్నారు.
27 “యిర్మీయా, నీవు ఇవన్నీ యూదా ప్రజలకు చెపుతావు. అయినా వారు నీమాట వినరు! నీవు వారిని పిలుస్తావు. కాని వారు పలుకరు. 28 అందువల్ల వారికి నీవీ మాటలు చెప్పాలి: తన యెహోవా దేవునికి విధేయతగా లేని దేశం ఇదే. దేవుని ఉపదేశములను ఈ ప్రజలు వినలేదు. సత్య ప్రవచనాలు ఈ ప్రజలు ఎరుగరు.
వధ లోయ
29 “యిర్మీయా, నీ జుట్టు కత్తిరించి పారవేయి[a] కొండమీదికి వెళ్లి దుఃఖించుము. ఎందుకంటావా? యెహోవా ఈ తరం ప్రజలను తిరస్కరించినాడు. ఈ ప్రజలకు యెహోవా విముఖుడైనాడు. కోపంతో ఆయన వారిని శిక్షిస్తాడు. 30 ఏడ్వండి, ఎందుకంటే యూదా ప్రజలు చెడుకార్యాలు చేయటం నేను చూసియున్నాను.” ఇది యెహోవా వాక్కు. “వారు విగ్రహాలను ప్రతిష్టించారు. నేనా విగ్రహాలను అసహ్యించుకుంటున్నాను! నా పేరుతో పిలువబడే ఆలయంలో వారు విగ్రహాలను పెట్టినారు. నా నివాసాన్ని వారు అపవిత్రపర్చారు. 31 యూదా ప్రజలు బెన్ హిన్నోము లోయలో తోఫెతు అనబడే ఉన్నత స్థలాలు[b] నిర్మించారు. వారక్కడ తమ కుమారులను, కమార్తెలను చంపి వారిని బలులుగా సమర్పించారు. ఇటువంటిది నేనెన్నడూ ఆజ్ఞాపించలేదు. ముందెన్నడూ ఈ రకమైన ఆలోచనే నా మనస్సుకు రాలేదు! 32 కావున నిన్ను హెచ్చరిస్తున్నాను. ప్రజలు ఈ స్థలాన్ని తోఫెతు అనిగాని, బెన్ హిన్నోములోయ అనిగాని పిలవకుండా వుండే రోజులు వస్తున్నాయి” ఇది యెహోవా వాక్కు. పైగా వారు దీనిని కసాయి లోయ[c] అని పిలుస్తారు. “వారు ఈ పేరు పెడతారు కారణమేమంటే తోఫెతులో ఏమాత్రం ఇంకెవ్వరినీ పాతిపెట్టేందుకు ఖాళీ లేకుండా చనిపోయిన వారిని పాతిపెడతారు. 33 తరువాత శవాలను వట్టి నేలపై పడవేస్తారు. అవి పక్షులకు ఆహారమవుతాయి. ఆ శవాలను అడవి జంతువులు పీక్కొని తింటాయి. శవాలను తినే పక్షులను, జంతువులను తోలి వేయటానికి అక్కడ బ్రతికి వున్న మనుష్యుడొక్కడూ మిగలడు. 34 యూదా పట్టణాలలోను, యెరూషలేము నగర వీధులలోను ఆనందోత్సాహాలు లేకుండా చేస్తాను. యూదాలోను, యెరూషలేములోను పెండ్లి సందడులు, వేడుకలు ఇక వుండవు. ఈ రాజ్యం పనికిరాని ఎడారిలా మారిపోతుంది.”
యేసును వెంబడించటం
(లూకా 9:57-62)
18 యేసు తన చుట్టూ ఉన్న ప్రజల గుంపును చూసి, తన శిష్యులతో సరస్సు అవతలి వైపుకు వెళ్ళండని అన్నాడు. 19 అప్పుడు శాస్త్రుడొకడు ఆయన దగ్గరకు వచ్చి, “బోధకుడా! మీరెక్కడికి వేళ్తే నేనక్కడికి వస్తాను” అని అన్నాడు.
20 యేసు, “నక్కలు దాక్కోవటానికి బిలములున్నాయి. గాలిలో ఎగిరే పక్షులు ఉండటానికి గూళ్ళున్నాయి. కాని మనుష్యకుమారుడు తల వాల్చటానికి కూడ స్థలం లేదు” అని అతనితో అన్నాడు.
21 మరొక శిష్యుడు, “ప్రభూ! మొదట నా తండ్రిని సమాధి చేసుకోనివ్వండి” అని అన్నాడు.
22 యేసు అతనితో, “చనిపోయిన తమ వాళ్ళను చనిపోయే వాళ్ళు సమాధి చేసుకోనిమ్ము! నీవు నన్ను అనుసరించు!” అని అన్నాడు.
© 1997 Bible League International