Revised Common Lectionary (Complementary)
కోరహు కుమారుల స్తుతి కీర్తన. సంగీత నాయకునికి: బాధాకరమైన ఒక వ్యాధిని గూర్చి ఎజ్రాహివాడైన హేమాను ధ్యాన గీతం.
88 యెహోవా దేవా, నీవు నా రక్షకుడవు.
రాత్రింబగళ్లు నేను నిన్ను ప్రార్థిస్తున్నాను.
2 దయచేసి నా ప్రార్థనలను గమనించుము.
కరుణకోసం నేను చేస్తున్న ప్రార్థనలు ఆలకించుము.
3 నా కష్టాలు అన్నింటితో నేను విసిగిపోయాను.
మరణించుటకు నేను సిద్ధంగా ఉన్నాను.
4 జీవించుటకు బహు బలహీనుడివలె, చనిపోయిన మనిషివలె
ప్రజలు నాతో వ్యవహరిస్తున్నారు.
5 మరణించుటకు నేను ఒంటరిగా విడువబడ్డాను.
నేను సమాధిలో ఉన్న శవంలా ఉన్నాను.
నీనుండీ, నీ కాపుదలనుండి నీవు వేరుచేసిన మృతులలో ఒకనివలె నేనున్నాను.
మనుష్యులు వారిని పూర్తిగా మరచిపోతారు.
6 యెహోవా, నీవు నన్ను భూమి క్రింద సమాధిలో ఉంచావు.
నీవు నన్ను ఆ చీకటి స్థలంలో ఉంచావు.
7 నీవు నా మీద కోపగించావు.
నీవు నన్ను శిక్షించావు.
8 నా స్నేహితులు నన్ను విడిచిపెట్టేశారు.
అంటరాని మనిషిలా వారంతా నన్ను తప్పించి వేస్తారు.
నేను యింటిలో బంధించబడ్డాను, నేను బయటకు వెళ్లలేను.
9 నా బాధ అంతటిని గూర్చి ఏడ్చి నా కళ్లు నొప్పిగా ఉన్నాయి.
యెహోవా, నేను ఎడతెగకుండా నిన్ను ప్రార్థిస్తున్నాను.
ప్రార్థనలో నేను నీకు నా చేతులు జోడిస్తున్నాను.
10 యెహోవా, చనిపోయినవారి కోసం నీవు అద్భుతాలు చేస్తావా? లేదు!
దురాత్మలు లేచి నిన్ను స్తుతిస్తాయా? లేదు!
11 చనిపోయినవాళ్లు వారి సమాధుల్లో నీ ప్రేమను గూర్చి మాట్లాడలేరు.
చనిపోయినవారు మృతుల లోకంలో ఉండి నీ నమ్మకత్వం గూర్చి మాట్లాడలేరు.
12 చీకటిలో పడివున్న మృతులు నీవు చేసే అద్భుత కార్యాలు చూడలేరు.
మరచిపోయిన వారి లోకంలో ఉన్న మృతులు నీ మంచితనం గూర్చి మాట్లాడలేరు.
13 యెహోవా, నాకు సహాయం చేయుమని నేను నిన్ను అడుగుతున్నాను.
ప్రతి వేకువ జామునా నేను నిన్ను ప్రార్థిస్తాను.
14 యెహోవా, నీవెందుకు నన్ను విడిచిపెట్టేశావు?
నానుండి నీ ముఖాన్ని ఎందుకు దాచుకొంటున్నావు?
15 నేను బాలుడిగా ఉన్నప్పటినుండి నేను బలహీనుడను, రోగిని.
నేను నీ కోపాన్ని అనుభవించాను, నేను నిస్సహాయుడను.
16 యెహోవా, నీవు నా మీద చాలా కోపగించావు.
శిక్ష నన్ను చంపేస్తుంది.
17 నాకు నొప్పులు, బాధలు ఎల్లప్పుడూ ఉన్నాయి.
నా నొప్పులు, బాధల్లో నేను మునిగిపోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది.
18 మరియు యెహోవా, నా స్నేహితులు, నా ప్రియులు అంతా నన్ను విడిచిపెట్టివేసేటట్టుగా నీవు చేశావు.
చీకటి మాత్రమే నాకు మిగిలింది.
యాజకుల నియమాలు
21 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 2 “యాజకులైన అహరోను కుమారులతో ఈ విషయాలు చెప్పు: అహరోను కుమారులు, యాజకులు. చనిపోయినవారి శవాల్ని తాకి యాజకుడు అపవిత్రుడు కాకూడదు. 3 అయితే చనిపోయిన వ్యక్తి గనుక తన రక్త సంబంధీకుడైతే. అప్పుడు అతడు ఆ శవాన్ని తాకవచ్చు. చనిపోయిన వ్యక్తి యాజకుని తల్లి లేక తండ్రి, కుమారుడు లేక కుమార్తె, సోదరుడు లేక అవివాహిత సోదరి అయితే యాజకుడు అపవిత్రం కావచ్చు. (ఈ సోదరికి భర్త లేడు గనుక ఆమె అతనికి చాలా దగ్గర అవుతుంది. కనుక ఆమె మరణిస్తే, ఆమెకోసం యాజకుడు మైల పడవచ్చు). 4 కానీ చనిపోయిన వ్యక్తి యాజకుని బానిసల్లో ఒక వ్యక్తి అయితే మాత్రం యాజకుడు మైలపడకూడదు.
5 “యాజకులు వారి తలలు గుండు గీసికోగూడదు. యాజకులు వారి గడ్డాల కొనలు కత్తిరించగూడదు. యాజకులు వారి దేహాల్లో ఎక్కడా కోసుకోగూడదు. 6 యాజకులు వారి దేవుని కోసం పవిత్రంగా ఉండాలి. దేవుని పేరంటే వారు భక్తి చూపించాలి. ఎందుచేతనంటే వారు నైవేద్యం, హోమం దేవునికి అర్పించువారు. కనుక వారు పవిత్రంగా ఉండాలి.
7 “యాజకుడు దేవుణ్ణి ప్రత్యేకంగా సేవించేవాడు. అందుచేత మరో మగవాడితో లైంగిక సంబంధం ఉన్న స్త్రీని యాజకుడు వివాహం చేసుకోగూడదు. వేశ్యనుగాని, విడువబడిన స్త్రీనిగాని యాజకుడు వివాహం చేసుకోగూడదు. 8 యాజకుడు ప్రత్యేక విధానంలో దేవుణ్ణి సేవించేవాడు. కనుక మీరు అతణ్ణి ప్రత్యేక విధానంలో చూసుకోవాలి. ఎందుచేతనంటే అతడు పవిత్ర వస్తువుల్ని మోసేవాడు, పవిత్ర రొట్టెల్ని అతడు దేవునికి తీసుకొనివస్తాడు గనుక. నేను పరిశుద్ధుడను. నేను యెహోవాను, మరియు నేను మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాను.
9 “ఒక యాజకుని కుమార్తె వేశ్య అయితే ఆమె తన పేరును నాశనం చేసికొంటుంది, తన తండ్రికి అవమానం కలిగిస్తుంది. కనుక ఆమెను కాల్చివేయాలి.
10 “ప్రధాన యాజకుడు తన సోదరుల్లోనుంచి ఎంపిక చేయబడినవాడు. అతని తలమీద అభిషేకతైలం పోయబడింది. ఈ విధంగా అతడు ప్రధాన యాజకునిగా ప్రత్యేక పనికి నియమించబడ్డాడు. ప్రత్యేక వస్త్రాలు ధరించేందుకు అతడు ఏర్పాటు చేయబడ్డాడు. కనుక అతడు తన విచారాన్ని బాహాటంగా చూపించే పనులు చేయకూడదు. అతడు తన తల వెంట్రుకలను చింపిరిజుట్టుగా పెరగ నివ్వకూడదు. అతడు తన బట్టలు చింపుకోగూడదు. 11 మృత దేహాన్ని తాకి అతడు అపవిత్రుడు కాకూడదు. అతని స్వంత తండ్రి, తల్లి చనిపోయినా సరే అతడు ఆ శవాన్ని తాకగూడదు. 12 ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలంనుండి బయటకు వెళ్లగూడదు. అతడు అలా గనుకచేస్తే, అతడు అపవిత్రుడై, తర్వాత దేవుని పరిశుద్ధ స్థలాన్ని అతడు అపవిత్రం చేయవచ్చు. ప్రధాన యాజకుని తలమీద ప్రత్యేక తైలం పోయబడింది. ఇదే అతణ్ణి మిగిలిన ప్రజలకంటే ప్రత్యేకం చేసింది. నేను పరిశుద్ధుడైన యెహోవాను.
13 “ప్రధాన యాజకుడు కన్యగా ఉన్న స్త్రీని వివాహం చేసుకోవాలి. 14 ఇదివరకే మరొకనితో లైంగిక సంబంధాలు కలిగి ఉన్న స్త్రీని ప్రధాన యాజకుడు వివాహం చేసుకోగూడదు. ఒక వేశ్యనుగాని, విడువబడిన స్త్రీనిగాని, లేక విధవరాలిని గాని ప్రధాన యాజకుడు వివాహం చేసుకోగూడదు. ప్రధాన యాజకుడు తన స్వంత ప్రజల్లోనే ఒక కన్యను వివాహం చేసుకోవాలి. 15 ఈ విధంగా ప్రజలు అతని పిల్లలకు మర్యాదనిస్తారు. ప్రధాన యాజకుణ్ణి అతని ప్రత్యేక పని నిమిత్తం యెహోవానగు నేనే ప్రత్యేకించాను.”
తీతును కొరింథుకు పంపటం
16 మీపట్ల నాకున్న చింతనే, దేవుడు తీతు హృదయంలో కూడా పెట్టాడు. అందుకు నేను దేవునికి కృతజ్ఞుణ్ణి. 17 తీతు మా నివేదన అంగీకరించాడు. అంతేకాక, చాలా ఉత్సాహంతో స్వయంగా మీ దగ్గరకు వస్తున్నాడు. 18 అతని వెంట యింకొక సోదరుణ్ణి పంపుతున్నాము. ఈ సోదరుడు సువార్త ప్రకటించి చేసిన సేవను అన్ని సంఘాలు అభినందిస్తున్నాయి. 19 పైగా, అతడు మా వెంట ఉండి, మాతో సహా ఈ కానుకను తీసుకు వెళ్ళాలని సంఘాలు అతణ్ణి ఎన్నుకొన్నాయి. మేమీకానుక ప్రభువు మహిమ కోసం తీసుకు వెళ్తున్నాము. సహాయం చేయాలన్న మా ఉత్సాహాన్ని చూపాలని మా ఉద్దేశ్యం.
20 ఈ గొప్ప విరాళాలు విమర్శకు గురి కాకుండా జాగ్రత్తగా యిస్తాము. 21 ప్రభువు దృష్టిలోనే కాకుండా ప్రజల దృష్టిలో కూడా ఏది ధర్మమో అది చెయ్యాలని మేము శ్రద్ధతో కష్టపడుతున్నాము.
22 అందువల్ల మా సోదరుణ్ణి కూడా వాళ్ళతో పంపుతున్నాము. ఇతన్ని మేము చాలా సార్లు పరీక్షించాము. సేవ చెయ్యాలనే ఉత్సాహం అతనిలో ఉన్నట్లు గ్రహించాము. ఇక అతనికి మీ పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉండటంవల్ల అతని ఉత్సాహం ఇంకా ఎక్కువైంది.
23 ఇక తీతు విషయమా! అతడు నేను మీకోసం చేస్తున్న సేవలో భాగస్థుడు. నాతో కలిసి పని చేసేవాడు. ఇక మేము పంపిన సోదరులు, సంఘాల ప్రతినిధులు, క్రీస్తుకు గౌరవం కలిగించేవాళ్ళు. 24 అందువల్ల, మీకు ప్రేమ ఉన్నట్లు వాళ్ళకు రుజువు చెయ్యండి. మేము మీ విషయంలో ఎందుకు గర్విస్తున్నామో వాళ్ళకు చూపండి. అలా చెయ్యటం వల్ల సంఘాలన్నీ దీన్ని గమనిస్తాయి.
© 1997 Bible League International