Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన. ఆలయ ప్రతిష్ఠ కీర్తన.
30 యెహోవా, నా కష్టాల్లో నుంచి నీవు నన్ను పైకి ఎత్తావు.
నా శత్రువులు నన్ను ఓడించి, నన్ను చూచి నవ్వకుండా నీవు చేశావు. కనుక నేను నిన్ను ఘనపరుస్తాను.
2 యెహోవా, నా దేవా నేను నిన్ను ప్రార్థించాను.
నీవు నన్ను స్వస్థపరచావు.
3 సమాధిలో నుండి నీవు నన్ను పైకి లేపావు.
నీవు నన్ను బ్రతకనిచ్చావు. చచ్చిన వాళ్లతోబాటు నేను గోతిలొ[a] ఉండవలసిన పనిలేదు.
4 దేవుని అనుచరులారా! యెహోవాకు స్తుతులు పాడండి.
ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
5 దేవునికి కోపం వచ్చింది కనుక “మరణం” నిర్ణయం చేయబడింది. కాని ఆయన తన ప్రేమను చూపించాడు.
నాకు “జీవం” ప్రసాదించాడు.
రాత్రి పూట, నేను ఏడుస్తూ పండుకొంటాను.
మర్నాటి ఉదయం నేను సంతోషంగా పాడుతూ ఉంటాను.
6 ఇప్పుడు నేను ఇది చెప్పగలను, ఇది సత్యం అని నాకు గట్టిగా తెలుసు.
నేను ఎన్నటికీ ఓడించబడను.
7 యెహోవా, నీవు నామీద దయ చూపావు.
బలమైన పర్వతంలా నీవు నన్ను నిలువబెట్టావు.
కొద్దికాలంపాటు, నీవు నా నుండి తిరిగిపోయావు.
మరి నేను చాలా భయపడిపోయాను.
8 దేవా, నేను మరల, నిన్ను ప్రార్థించాను.
నామీద దయ చూపించమని నేను నిన్ను అడిగాను.
9 “దేవా, నేను మరణించి,
సమాధిలోకి దిగిపోతే ఏమి లాభం?
ధూళి నిన్ను స్తుతిస్తుందా?
అది నీ నమ్మకమును గూర్చి చెబుతుందా?
10 యెహోవా, నా ప్రార్థన విని నామీద దయ చూపించుము.
యెహోవా, నాకు సహాయం చేయుము” అని అడిగాను.
11 నేను ప్రార్థించినప్పుడు, నీవు నాకు సహాయం చేశావు.
నా ఏడ్పును నీవు నాట్యంగా మార్చావు. నా దుఃఖ వస్త్రాలను నీవు తీసివేశావు.
నీవు నాకు సంతోషమనే వస్త్రాలు ధరింపజేశావు.
12 యెహోవా, నా దేవా, నిన్ను నేను శాశ్వతంగా స్తుతిస్తాను.
ఎన్నటికీ మౌనంగా ఉండను. నా దేవా! నిన్ను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.
18 ఓ సీయోను కుమార్తె ప్రాకారమా, నీ గుండెలు పగిలేలా యెహోవాకు మొరపెట్టుకో!
నీ కన్నీరు వాగులా పారనీ!
నీ కన్నీరు మున్నీరై పారనీ!
నీ కన్నీరు రాత్రింబవళ్లు కారనీ! వాటిని ఆపకు!
నీ కండ్లకు విశ్రాంతి నివ్వకు!
19 లెమ్ము! రాత్రిళ్లు రోదించు!
రాత్రిళ్లు ప్రతి ఝామున దుఃఖించు!
ఒక జలరాశిలా నీ గుండె కుమ్మరించు!
యెహోవా ముందు నీ గుండె కుమ్మరించు!
నీ చేతులెత్తి యెహోవాకు ప్రార్థన చేయుము.
నీ పిల్లలు బ్రతికేలా చేయుమని ఆయనను ప్రాధేయపడుము.
ఆకలితో అలమటించి సొమ్మసిల్లే నీ పిల్లలను బతికించుమని ఆయనను అర్థించుము.
ఆకలితో మాడి నగర వీధుల్లో వారు సొమ్మసిల్లి పడిపోతున్నారు.
20 యెహోవా, నావైపు చూడుము!
నీవు ఈ రకంగా శిక్షించినది ఎవ్వరినో చూడు!
నన్ను ఈ ప్రశ్న అడుగనిమ్ము:
తాము కన్న బిడ్డలనే స్త్రీలు తినవలెనా?
తాము పెంచి పోషించిన బిడ్డలనే స్త్రీలు తినవలెనా?
యాజకుడు, ప్రవక్త యెహోవా ఆలయంలో చంపబడాలా?
21 యువకులు, ముసలివారు
నగర వీధుల్లో దుమ్ములో పడివున్నారు.
నా యువతీ యువకులు
కత్తి వేటుకు గురియైనారు.
యెహోవా, నీవు కోపగించిన రోజున నీవు వారిని చంపేశావు!
దయ లేకుండా నీవు వారిని చంపివేశావు!
22 నలుమూలల నుండి నా మీదికి భయాన్ని ఆహ్వానించావు.
ఏదో విందుకు ఆహ్వానించినట్లు నీవు భయాన్ని ఆహ్వానించావు.
యెహోవాకు కోపం వచ్చిన రోజున తప్పించుకున్నవాడుగాని, దానిని తట్టుకున్నవాడుగాని ఒక్కడూ లేడు.
నేను పెంచి పోషించిన వారందరినీ నా శత్రువు చంపివేశాడు.
యేసు ఒక మనుష్యుని దయ్యంనుండి విడిపించటం
(మార్కు 1:21-28)
31 అక్కడి నుండి ఆయన గలిలయలోని కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ విశ్రాంతి రోజున బోధించటం మొదలు పెట్టాడు. 32 ఆయన అధికారమున్న వానిలా బోధించటం వల్ల వాళ్ళు ఆశ్చర్యపోయారు.
33 అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజ మందిరంలోకి వచ్చాడు. ఆ దయ్యం బిగ్గరగా, 34 “ఓ నజరేయుడైన యేసూ! మాతో నీకేంపని? మమ్మల్ని నాశనం చెయ్యటానికి వచ్చావా? నీవెవరో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడవు” అని అన్నది. 35 యేసు, “నోరు మూసుకొని అతని నుండి బయటకు రా!” అని గద్దించాడు. ఆ దయ్యం తాను పట్టిన వాణ్ణి క్రింద పడవేసి ఏ హానీ చెయ్యకుండా ఆ దయ్యం వెలుపలికి వచ్చింది.
36 అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు పరస్పరం, “ఏమిటిది? దయ్యాలను కూడా ఆయన అధికారంతో ఆజ్ఞాపిస్తున్నాడే? అవి బయటికి రావటానికి ఈయన మాటల్లో ఎంత శక్తి ఉందో కదా?” అని మాట్లాడుకున్నారు. 37 ఆ చుట్టు ఉన్న ప్రాంతాల్లో ఈయన్ని గురించి అందరికి తెలిసింది.
© 1997 Bible League International