Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన. ఆలయ ప్రతిష్ఠ కీర్తన.
30 యెహోవా, నా కష్టాల్లో నుంచి నీవు నన్ను పైకి ఎత్తావు.
నా శత్రువులు నన్ను ఓడించి, నన్ను చూచి నవ్వకుండా నీవు చేశావు. కనుక నేను నిన్ను ఘనపరుస్తాను.
2 యెహోవా, నా దేవా నేను నిన్ను ప్రార్థించాను.
నీవు నన్ను స్వస్థపరచావు.
3 సమాధిలో నుండి నీవు నన్ను పైకి లేపావు.
నీవు నన్ను బ్రతకనిచ్చావు. చచ్చిన వాళ్లతోబాటు నేను గోతిలొ[a] ఉండవలసిన పనిలేదు.
4 దేవుని అనుచరులారా! యెహోవాకు స్తుతులు పాడండి.
ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
5 దేవునికి కోపం వచ్చింది కనుక “మరణం” నిర్ణయం చేయబడింది. కాని ఆయన తన ప్రేమను చూపించాడు.
నాకు “జీవం” ప్రసాదించాడు.
రాత్రి పూట, నేను ఏడుస్తూ పండుకొంటాను.
మర్నాటి ఉదయం నేను సంతోషంగా పాడుతూ ఉంటాను.
6 ఇప్పుడు నేను ఇది చెప్పగలను, ఇది సత్యం అని నాకు గట్టిగా తెలుసు.
నేను ఎన్నటికీ ఓడించబడను.
7 యెహోవా, నీవు నామీద దయ చూపావు.
బలమైన పర్వతంలా నీవు నన్ను నిలువబెట్టావు.
కొద్దికాలంపాటు, నీవు నా నుండి తిరిగిపోయావు.
మరి నేను చాలా భయపడిపోయాను.
8 దేవా, నేను మరల, నిన్ను ప్రార్థించాను.
నామీద దయ చూపించమని నేను నిన్ను అడిగాను.
9 “దేవా, నేను మరణించి,
సమాధిలోకి దిగిపోతే ఏమి లాభం?
ధూళి నిన్ను స్తుతిస్తుందా?
అది నీ నమ్మకమును గూర్చి చెబుతుందా?
10 యెహోవా, నా ప్రార్థన విని నామీద దయ చూపించుము.
యెహోవా, నాకు సహాయం చేయుము” అని అడిగాను.
11 నేను ప్రార్థించినప్పుడు, నీవు నాకు సహాయం చేశావు.
నా ఏడ్పును నీవు నాట్యంగా మార్చావు. నా దుఃఖ వస్త్రాలను నీవు తీసివేశావు.
నీవు నాకు సంతోషమనే వస్త్రాలు ధరింపజేశావు.
12 యెహోవా, నా దేవా, నిన్ను నేను శాశ్వతంగా స్తుతిస్తాను.
ఎన్నటికీ మౌనంగా ఉండను. నా దేవా! నిన్ను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.
యెహోవా యెరూషలేమును నాశనం చేయుట
2 సీయోను కుమార్తెను (యెరూషలేము) యెహోవా మేఘముతో కప్పి
ఎలా మరుగు పర్చినాడో చూడుము.
ఇశ్రాయేలు వైభవాన్ని ఆయన ఆకాశాన్నుండి
భూమికి త్రోసివేశాడు.
యెహోవాకు కోపం వచ్చిన రోజున ఇశ్రాయేలు
ఆయన కాలిపీట అని కూడా ఆయన గుర్తు పెట్టు కోలేదు.
2 యాకోబు (ఇశ్రాయేలు) ఇండ్లను యెహోవా మింగివేశాడు.
కనికరం లేకుండా ఆయన వాటిని మింగివేశాడు.
ఆయన తన కోపంలో యూదా కుమార్తె (యూదా రాజ్యం) కోటలను నాశనం చేశాడు.
యూదా రాజ్యాన్ని, దాని పాలకులను యెహోవా నేలకు పడదోసినాడు.
ఆయన రాజ్యాన్ని నాశనం చేశాడు.
3 యెహోవా తన కోపంతో ఇశ్రాయేలు
బలాన్ని క్షయం చేశాడు.
ఆయన తన కుడిచేతిని ఇశ్రాయేలు మీదినుండి తీసివేశాడు.
శత్రువు వచ్చినప్పుడు ఆయన అలా చేశాడు.
యాకోబు (ఇశ్రాయేలు) లో ఆయన అగ్నిశిలలా మండినాడు.
ప్రళయాగ్నిలా ఆయన ఉన్నాడు.
4 ఒక శత్రువులా యెహోవా తన విల్లు వంచాడు.
అయన కుడిచేయి తన ఖడ్గం ఒరమీద వుంది.
బాగా కన్పించే యూదా మనుష్యులందరినీ ఆయన చంపివేశాడు.
యెహోవా ఒక శత్రువులా వారిని హతమార్చినాడు.
యెహోవా తన కోపాన్ని కుమ్మరించాడు.
ఆయన దానిని సీయోను గుడారాలపై కుమ్మరించాడు.
5 యెహోవా ఒక శత్రువులా అయ్యాడు.
ఆయన ఇశ్రాయేలును మింగేశాడు.
ఆయన దాని స్థలాలన్నిటినీ మింగేశాడు.
ఆయన దాని కోటలన్నిటినీ మింగేశాడు.
మృతుల కొరకు యూదా కుమార్తెలో మిక్కిలి దుఃఖాన్ని,
బాధను కలుగ జేశాడు.
6 యెహోవా తన స్వంత గుడారాన్నే
ఒక తోట మాదిరి నాశనం చేసినాడు.
ప్రజలు ఎక్కడ సమావేశమై తనను ఆరాధిస్తారో
ఆ ప్రదేశాన్నే ఆయన పాడుజేశాడు.
సీయోనులో ప్రత్యక సమావేశాలు, ప్రత్యేక విశ్రాంతి దినాలను
ప్రజలు మర్చిపోయేలా యెహోవా చేశాడు.
యెహోవా రాజును, యాజకుని తిరస్కరించాడు.
తన కోపంలో ఆయన వారిని తిరస్కరించాడు.
7 యెహోవా తన బలిపీఠాన్ని తిరస్కరించాడు.
ఆయన తన పవిత్ర ఆరాధనా స్థలాన్ని తిరస్కరించాడు.
యెరూషలేము కోట గోడలను
ఆయన శత్రువులకు అప్పజెప్పాడు.
యెహోవా ఆలయంలో శత్రువు అల్లరి చేశాడు.
అది ఒక సెలవు రోజు అన్నట్లు వారు అల్లరి చేశారు.
8 సీయోను కుమార్తె (ఇశ్రాయేలు) కోట గోడలను
కూల దోయటానికి యెహోవా పథకం నిర్ణయించాడు.
ఒక కొలబద్దతో అతడు గోడకు గుర్తులు పెట్టాడు.
దానిని నాశనం చేయటంలో తనను తాను నిగ్రహించుకోలేదు.
కావున బయటి ప్రాకారం, ఇతర గోడలు ధుఃఖ భారంతో కూలి పోయేలా చేశాడు.
అవి ఒక్కుమ్మడిగా శిథిలమై పోయాయి.
9 యోరూషలేము ద్వారాలు భూమిలోకి క్రుంగి పోయాయి.
ద్వారాల కడ్డీలను ఆయన నుగ్గు నుగ్గు చేశాడు.
ఆమె యొక్క రాజు, యువరాజులు పరదేశాలకు పోయి ఉన్నారు.
వారికి ఇక ఎంత మాత్రం ఉపదేశం లేదు.
యెరూషలేము ప్రవక్తలకు కూడా యెహోవా నుండి
దర్శనాలు ఏమీలేవు.
10 సీయోను పెద్దలు నేలపై కూర్చున్నారు.
వారు కింద కూర్చుండి మౌనం వహించారు.
వారు తమ తలలపై దుమ్ము జల్లుకున్నారు.
వారు గోనెపట్ట కట్టుకున్నారు.
యెరూషలేము యువతులు దుఃఖంతో
తమ తలలు కిందికి వంచుకున్నారు.
11 కన్నీళ్లతో నా కళ్లు నీరసించాయి!
నా అంత రంగంలో గందరగోళం చెలరేగుతూవుంది!
నా గుండె జారి కిందపడినట్లు భావన కలుగుతూ ఉంది!
నా ప్రజల నాశనం చూసిన నాకు ఆ భావన కలుగుతూ ఉంది.
పిల్లలు, పసికందులు నగర రహదారి స్థలాలలో
మూర్ఛపోతున్నారు.
12 “రొట్టె, ద్రాక్షారసం ఏవి?”
అని ఆ పిల్లలు తమ తల్లులను అడుగుతున్నారు.
వారు చనిపోతూ ఈ ప్రశ్న అడుగుతున్నారు.
వారు తమ తల్లుల ఒడిలో పడుకొని ఉండగా చనిపోతున్నారు.
చందాలు సేకరించటం
8 సోదరులారా! మాసిదోనియ దేశంలోని సంఘాల పట్ల దేవుడు చూపిన అనుగ్రహాన్ని గురించి మీకు తెలపాలని మా అభిప్రాయం. 2 వాళ్ళ కష్టాలు వాళ్ళను తీవ్రంగా పరీక్షించాయి. వాళ్ళు చాలా పేదరికం అనుభవించారు. అయినా వాళ్ళలో చాలా ఆనందం కలిగి, వాళ్ళు యివ్వటంలో మిక్కిలి ఔదార్యం చూపారు. 3 వాళ్ళు యివ్వగలిగింది స్వయంగా యిచ్చారు. అంతే కాదు, తాము యివ్వగలిగినదానికన్నా ఇంకా ఎక్కువే యిచ్చారని నేను ఖచ్చితంగా చెప్పగలను. 4 విశ్వాసులైనవారికి చేసే సహాయంలో తాము కూడా చేరుతామని వాళ్ళు మమ్మల్ని ప్రాధేయపడ్డారు. 5 మేము ఆశించినంతగా చేయలేదు. అయినా వాళ్ళు మొదట తమను తాము ప్రభువుకు అర్పించుకొన్నారు. తర్వాత దేవుని చిత్తానుసారంగా మాకును అప్పగించుకున్నారు.
6 ఈ కార్యాన్ని ప్రారంభించిన తీతును దీన్ని కొనసాగించమని వేడుకొన్నాము. మీరు చేయాలనుకొన్న ఈ సేవాకార్యాన్ని అతడు పూర్తిచేసాడు. 7 మీరు విశ్వాసంలో, మాటలో, జ్ఞానంలో, సంపూర్ణ ఆసక్తిలో, మా పట్ల వ్యక్తపరుస్తున్న ప్రేమలో అందరిని మించిపోయారు. మీ దాతృత్వంలో కూడా అందరిని మించిపోవాలని మిమ్మల్ని అడుగుతున్నాను.
© 1997 Bible League International