Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.
65 సీయోను మీద ఉన్న దేవా, నేను నిన్ను స్తుతిస్తాను.
నేను వాగ్దానం చేసిన వాటిని నేను నీకు ఇస్తాను.
2 నీవు చేసిన వాటిని గూర్చి మేము చెబుతాము మరియు నీవు మా ప్రార్థనలు వింటావు.
నీ దగ్గరకు వచ్చే ప్రతి మనిషి యొక్క ప్రార్థనలూ నీవు వింటావు.
3 మా పాపాలు మేము భరించలేనంత భారమైనప్పుడు,
ఆ పాపాలను నీవు తీసివేస్తావు.
4 దేవా, నీ ప్రజలను నీవు ఏర్పరచుకొన్నావు.
నీ ఆలయానికి వచ్చి నిన్ను ఆరాధించుటకు నీవు మమ్మల్ని ఏర్పాటు చేసికొన్నావు.
మాకు చాలా సంతోషంగా ఉంది!
నీ ఆలయంలో నీ పరిశుద్ధ ఇంటిలో మాకన్నీ అద్భుత విషయాలే ఉన్నాయి.
5 దేవా, నీవు మమ్మల్ని రక్షించుము. మంచి మనుష్యులు నిన్ను ప్రార్థిస్తారు.
నీవు వారి ప్రార్థనలకు జవాబిస్తావు.
వారి కోసం నీవు ఆశ్చర్య కార్యాలు చేస్తావు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నిన్ను నమ్ముకొంటారు.
6 దేవుడు తన మహాశక్తిని ఉపయోగించి పర్వతాలను చేశాడు.
మనచుట్టూరా ఆయన శక్తిని చూడగలము.
7 ఘోషించే సముద్రాలను దేవుడు నిమ్మళింప చేస్తాడు.
మరియు ప్రపంచంలో ఉన్న మనుష్యులందరినీ దేవుడు సంతోషంతో స్తుతింప చేస్తాడు.
8 దేవుడు చేసే శక్తివంతమైన విషయాలకు భూమిమీద ప్రతి మనిషీ భయపడతాడు.
దేవా, నీవు సూర్యుని ఉదయింపజేసే, అస్తమింపజేసే ప్రతి చోటా ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
9 నీవు భూమిని గూర్చి శ్రద్ధ తీసుకొంటావు.
నీవు దానికి నీరు పోస్తావు, అది దాని పంటలు పండించేలా నీవు చేస్తావు.
దేవా, నీవు కాలువలను ఎల్లప్పుడూ నీళ్లతో నింపుతావు.
నీవు ఇలా చేసి పంటలు పండింపచేస్తావు.
10 దున్నబడిన భూమి మీద వర్షం కురిసేటట్టు నీవు చేస్తావు.
భూములను నీవు నీళ్లతో నానబెడతావు.
నేలను నీవు వర్షంతో మెత్తపరుస్తావు.
అప్పుడు నీవు మొలకలను ఎదిగింపచేస్తావు.
11 కొత్త సంవత్సరాన్ని మంచి పంటతో నీవు ప్రారంభింప చేస్తావు.
బండ్లను నీవు అనేక పంటలతో నింపుతావు.
12 అరణ్యము, కొండలు పచ్చగడ్డితో నిండిపోయాయి.
13 పచ్చిక బయళ్లు గొర్రెలతో నిండిపోయాయి.
లోయలు ధాన్యంతో నిండిపోయాయి.
పచ్చిక బయళ్లు, లోయలు సంతోషంతో పాడుతున్నట్లున్నాయి.
సూర్యుడు కదలక నిలచిన రోజు
10 అప్పట్లో అదోనీసెదెకు యెరూషలేము రాజు. యెహోషువ హాయిని ఓడించి, దానిని సర్వ నాశనం చేసాడని ఈ రాజు విన్నాడు. యెరికోకు, దాని రాజుకుకూడా యెహోషువ అలానే చేసాడని ఆ రాజు తెలుసుకొన్నాడు. గిబియోను ప్రజలు ఇశ్రాయేలీయులతో శాంతి ఒడంబడిక చేసుకొన్నారని, ఆ ప్రజలు యెరూషలేంకు సమీపంగానే నివసిస్తున్నారని కూడా ఆ రాజు తెలుసుకొన్నాడు. 2 అందుచేత ఈ విషయాల మూలంగా అదోనీసెదెకు, అతని ప్రజలు చాలా భయపడ్డారు. హాయివలె గిబియోను చిన్న పట్టణం కాదు. ఏ రాజధాని పట్టణమైనా ఎంత పెద్దగా ఉంటుందో, గిబియోను అంత పెద్ద పట్టణం. మరియు ఆ పట్టణంలోని పురుషులంతా మంచి శూరులు. కనుక వారు భయపడ్డారు. 3 యెరూషలేము రాజు అదోనీసెదెక్, హెబ్రోను రాజైన హోహంతో మాట్లాడాడు. యార్మూత్ రాజైన పిరాముతో, లాకీషు రాజు యాఫీయతో, ఎగ్లోన్ రాజైన దెబీరుతో కూడా అతడు మాట్లాడాడు. 4 “మీరు నాతో కూడా గిబియోను మీద దాడి చేసేందుకు వచ్చి సహాయం చేయండి. యెహోషువతో, ఇశ్రాయేలు ప్రజలతో గిబియోను శాంతి ఒడంబడిక కుదుర్చు కొంది” అని యెరూషలేము రాజు వీళ్లను బ్రతిమిలాడాడు.
5 అందుచేత ఈ అయిదుగురు ఆమోరీ రాజులు వారి సైన్యాలను ఏకం చేసారు. (అయిదుగురు రాజులు ఎవరనగా, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యార్మూత్ రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు) మరియు వారి సైన్యాలు గిబియోను మీదికి వెళ్లాయి. ఆ సైన్యాలు పట్టణాన్ని చుట్టు ముట్టడించి, దానిమీద పోరాటం మొదలు పెట్టాయి.
6 గిల్గాలులో తన పాళెములో ఉన్న యెహోషువ దగ్గరకు గిబియోను పట్టణం లోని ప్రజలు సందేశం పంపించారు. “మేము నీ సేవకులము. మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టకు. వచ్చి మాకు సహాయంచేయి. త్వరపడు. మమ్మల్ని రక్షించు. కొండ దేశంలోని అమోరీ రాజులంతా వారి సైన్యాలను ఏకంచేసారు. మామీద వాళ్లు యుద్ధం చేస్తున్నారు” ఇదీ ఆ సందేశం.
7 కనుక యెహోషువ తన సైన్యం అంతటితో గిల్గాలునుండి బయల్దేరాడు. యెహోషువ యొక్క మంచి శూరులంతా అతనితో ఉన్నారు. 8 యెహోవా, “ఆ సైన్యాల విషయమై భయపడకు. నీవు వాళ్లను జయించేటట్టు నేను చేస్తాను. ఆ సైన్యాల్లో ఏదీ నిన్ను జయించజాలదు” అని యెహోషువతో చెప్పాడు.
9 యెహోషువ, అతని సైన్యం రాత్రంతా గిబియోనుకు ప్రయాణం చేసారు. (యెహోషువ వస్తున్నట్టు శత్రువుకు తెలియదు.) అందుచేత యెహోషువ వారిమీద దాడి చేసి వాళ్లకు ఆశ్చర్యం కలిగించాడు.
10 ఇశ్రాయేలీయులు దాడి చేసినప్పుడు అవతలి సైన్యాలను యెహోవా చాల గలిబిలి చేసాడు. కనుక ఇశ్రాయేలీయులు గొప్ప విజయంతో వారిని ఓడించారు. ఇశ్రాయేలీయులు గిబియోనునుండి వారిని తరిమివేసారు. బేత్‌హోరోను మార్గంవరకు ఇశ్రాయేలీయులు వారిని తరిమివేసారు. అజెకా, మక్కెదా వరకు ఇశ్రాయేలు సైన్యం ఆ మనుష్యుల్ని చంపారు. 11 ఇశ్రాయేలు సైన్యం వారి శత్రువుల్ని బెత్‌హోరోను నుండి అజెకావరకు దారి పొడవునా తరిమారు. వారు శత్రువును తరుముతూ ఉండగా, యెహోవా ఆకాశంనుండి పెద్ద వడగండ్లు కురిపించాడు. ఈ పెద్ద వడగండ్ల మూలంగా శత్రువులు అనేకమంది చనిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు ఖడ్గంతో చంపిన వారికంటె ఈ వడగండ్ల మూలంగానే చాల ఎక్కువమంది మరణించారు.
12 ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు అమోరీ ప్రజలను ఓడించేటట్టుగా యెహోవా చేసాడు. మరియు ఆ రోజు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట నిలిచి యెహోవాతో ఇలా చెప్పాడు:
“ఓ సూర్యుడా, గిబియోనుకు పైగా ఆకాశంలో నిలిచి ఉండు,
ఓ చంద్రుడా, అయ్యాలోను లోయలో నిలిచి ఉండు.”
13 కనుక సూర్యుడు కదలలేదు. ప్రజలు తమ శత్రువులను ఓడించేంతవరకు చంద్రుడు కూడ నిలిచిపోయాడు. ఇది యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆకాశం మధ్యలో సూర్యుడు స్తంభించిపోయాడు. ఒక రోజంతా అది కదల్లేదు. 14 ఆ రోజుకు ముందు ఎన్నడూ అలా జరుగలేదు. ఆ తర్వాత కూడ ఎన్నడూ మళ్లీ అలా జరుగలేదు. ఆ రోజు మనిషి మాట యెహోవా విన్నరోజు. నిజంగా ఇశ్రాయేలీయుల పక్షంగా యెహోవా యుద్ధం చేసాడు!
యేసు నీళ్ళపై నడవటం
(మత్తయి 14:22-33; యోహాను 6:16-21)
45 ఆ తదుపరి యేసు తన శిష్యులతో, పడవనెక్కి, తనకన్నాముందు బేత్సయిదాకు వెళ్ళమని గట్టిగా చెప్పాడు. బేత్సాయిదా సముద్రంకు ఆవలివైపున ఉంది. యేసు ప్రజల్ని తమ తమ యిండ్లకు వెళ్ళమని చెప్పాడు. 46 వాళ్ళను వదిలి ప్రార్థించటానికి కొండ మీదికి వెళ్ళాడు.
47 అర్ధరాత్రికి శిష్యులున్న పడవ సముద్రం మధ్యవుంది. యేసు మాత్రం యింకా గట్టునే ఉన్నాడు. 48 ఎదురు గాలి వీయటంవల్ల శిష్యులు కష్టంగా తెడ్లు వేయటం ఆయన చూసాడు. తెల్లవారు ఝామున యేసు నీళ్ళ మీదుగా నడిచి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళను దాటి ముందుకు వెళ్తుంటే 49 ఆయన శిష్యులు ఆయన నీళ్ళమీద నడవటం చూసి, దయ్యం అనుకొని భయపడి బిగ్గరగా కేకలు వేసారు. 50 వెంటనే ఆయన వాళ్ళతో మాట్లాడుతూ, “ధైర్యంగా ఉండండి. నేనే! భయపడకండి!” అని అన్నాడు. 51 ఆయన పడవనెక్కగానే గాలి తీవ్రత పూర్తిగా తగ్గి పోయింది. వాళ్ళు ఇది చూసి దిగ్భ్రాంతి చెందారు. రొట్టెలు పంచిన అద్భుతాన్ని వాళ్ళు చూశారు. 52 కాని దానిని అర్థం చేసుకోలేక పోయారు.
© 1997 Bible League International